జ‌గ‌న్‌కు ప‌నికొచ్చే నేత‌లెక్క‌డ‌?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ప‌నికొచ్చే సొంత పార్టీ నేత‌లెక్క‌డ‌?…ఈ ప్ర‌శ్న‌కు వైసీపీ నుంచి స‌మాధానం దొర‌క‌డం లేదు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు రోజురోజుకూ చెల‌రేగిపోతున్నాయి. విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టాయి. వీటికి దీటుగా స‌మాధానం చెప్పే మంత్రులు,…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ప‌నికొచ్చే సొంత పార్టీ నేత‌లెక్క‌డ‌?…ఈ ప్ర‌శ్న‌కు వైసీపీ నుంచి స‌మాధానం దొర‌క‌డం లేదు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు రోజురోజుకూ చెల‌రేగిపోతున్నాయి. విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టాయి. వీటికి దీటుగా స‌మాధానం చెప్పే మంత్రులు, ఇత‌ర నాయ‌కులు కొర‌వ‌డ్డారు. 

ఎంత‌సేపూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్ర‌మే అడ‌పాద‌డ‌పా కౌంట‌ర్ ఇవ్వాల్సిన దుస్థితి. అధికార పార్టీలో ఎందుకు ఈ దుస్థితి? పార్టీలో ఏమిటీ నైరాశ్యం? అధికార పార్టీ నుంచి దీటైన కౌంట‌ర్లు కొర‌వ‌డ‌డంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఉత్సాహం పెరుగుతోంది. దీంతో అధికార పార్టీపై దుమ్మెత్తిపోసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

మంత్రివ‌ర్గ మార్పు త‌ర్వాత ప్ర‌తిప‌క్షాల‌ను ఎదుర్కోవ‌డంలో స్ప‌ష్ట‌త‌మైన వెలితి క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సెటైర్స్‌తో ద‌డ‌ద‌డ‌లాడించే వాళ్లు. ఇప్పుడు అధికార పార్టీ నేత‌ల మాట‌ల్లో ఆ వేడి, వాడి ఏవి? మంత్రి అంబ‌టి రాంబాబు మాట్లాడ‌క‌పోతేనే మంచిద‌నే ప‌రిస్థితి.

‘ముఖ్యమంత్రి జగన్‌కు సిగ్గులేదు.. పరిపాలన చేతగాని దద్దమ్మ. ఒక బీసీ మంత్రి బహిరంగ వేదికపైనే మోకరిల్లి వైసీపీ నేతల కాళ్లకు మొక్కుతుంటే, ఛీ ఎందుకురా వీళ్లు బతుకులు? అనిపిస్తోంది ’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర‌స్థాయిలో విమర్శించారు. అలాగే జ‌గ‌న్‌రెడ్డి 11 కేసుల‌తో 16 నెల‌లు జైల్లో ఉండ‌డానికి విజ‌య‌మ్మ పెంప‌క‌మే కార‌ణ‌మా అని తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత ఘాటుగా ప్ర‌శ్నిస్తే, అధికార పార్టీ నుంచి స‌రైన స‌మాధాన‌మే లేదు. ఇవి మ‌చ్చుకు రెండు ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే.

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, ఎల్లో మీడియా అధికార పార్టీని, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను చుట్టుముట్టి విమ‌ర్శ‌లు సంధిస్తుంటే అన్ని వ‌న‌రులున్నా దీటుగా స్పందించ‌లేని నిస్స‌హాయ స్థితి వైసీపీకి ఎందుకో ఎవ‌రికీ అర్థం కాదు. ప‌ద‌వులు ద‌క్కిన వాళ్లు జ‌గ‌న్‌ను పొగ‌డ‌డానికి మిన‌హా, ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించడానికి ప‌నికొచ్చేలా లేరు. 

త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా కీర్తించే వాళ్ల‌కే జ‌గ‌న్ ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్ల ఎదుర‌వుతున్న ఇబ్బందిగా పార్టీ నాయ‌కులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లున్నాయ‌ని, కేవ‌లం టీడీపీనే కాదు, ద‌త్త‌పుత్రుడు, దుష్ట‌చ‌తుష్ట‌యాన్ని ఎదుర్కోవాల్సి వుంద‌ని మీడియా గురించి కూడా జ‌గ‌న్ ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మాట‌ల్లో పంచ్‌, ప‌వ‌ర్ లేని నేత‌ల‌తో జ‌గ‌న్ యుద్ధం చేయ‌డం ఎలా సాధ్యం? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.