''లగాన్'' సినిమాలో ఇంగ్లీషు క్రికెట్ టీముతో అనుభవం లేని పల్లెటూరి భారతీయులు తలపడి గెలిచినట్లు చూపించారు. కానీ అది కల్పన. 1911లో బ్రిటన్‌లో కల్లా మేటి ఫుట్‌బాల్ జట్టయిన ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్ టీమును బెంగాలీ ఫుట్‌బాల్ జట్టయిన మోహన్ బగాన్ అథ్లెటిక్ టీము ఓడించింది. ఆ చారిత్రాత్మక విజయాన్ని తెర కెక్కించాలని సంకల్పించాడు – దర్శకుడు సుజిత్ సర్కార్. దీనిలో మోహన బగాన్ టీము కోచ్‌గా, ఆటగాడిగా జాన్ అబ్రహామ్ నటిస్తున్నాడు. అతను యింతకుముందే ''ధన్ ధనా ధన్ గోల్'' అనే ఫుట్‌బాల్ కథాంశంతో తీసిన సినిమాలో నటించాడు. ఇటీవలే 'ఢిల్లీ వేవ్‌రైడర్స్' అనే హాకీ టీముపై పెట్టుబడి పెట్టాడు కూడా. సినిమా పేరు ''1911'' అని వుండవచ్చు.
తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుండి తరలి రావడం కారణంగా హైదరాబాదు ఎంత లాభపడిందో మనందరికీ తెలుసు. కన్నడ పరిశ్రమ తరలి రావడం వలన బెంగుళూరు బాగుపడింది. కర్ణాటకలో ఇంజనీరింగు చదువుకున్న అఖిలేష్ యాదవ్‌కు యీ విషయం అర్థమైనట్టుంది. అతని సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ వర్ధిల్లాలని కోరుకుంటూ అక్కడ తీసిన సినిమాలకు రాయితీలు ప్రకటిస్తోంది. సినిమాలో ఎక్కువభాగం ఉత్తరప్రదేశ్‌లో తీస్తే సినిమా ఖర్చులో 25% కానీ రూ. 1 కోటి కానీ ఏది తక్కువైతే అది గ్రాంటుగా యిస్తోంది. ఈ పథకానికి 'ఫిల్మ్ బంధు' అని పేరు పెట్టారు. మాధురీ దీక్షిత్ నటించిన ''డేఢ్ ఇష్కియా'', సైఫ్ ఆలీ ఖాన్ నటించిన ''బుల్లెట్ రాజా'' చిత్రాలకు తలొక కోటి రూపాయలు యిచ్చారు. భోజపురి, అవధీ భాషల్లో తీసిన సినిమాలకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు కూడా.
''అత్తారింటికి దారేది'' సినిమాలో నటించిన హిందీ నటుడు బోమన్ ఇరానీపై, అతని కొడుకు దనేష్‌పై ఒకతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ జరుపుతున్న క్యూనెట్ అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా తనను వీళ్లిద్దరూ మోసం చేశారని అతని అభియోగం. బోమన్ దీనిపై వివరణ యిస్తూ ''ఆ కంపెనీ వారు నిర్వహించిన ఒక ఫంక్షన్‌కు హాజరై ఫోటోలు దిగడం కంటె నాకూ, ఆ కంపెనీకి సంబంధం ఏమీ లేదు. ఇక మా అబ్బాయి సంగతికి వస్తే అతను కాలేజీ చదువు కాగానే 2007-08లో ఆ కంపెనీకి ఏజంటుగా కొద్దికాలం పనిచేశాడు. అతనిలాగే వేలాదిమంది ఏజంట్లుగా పనిచేశారు. ఆ తర్వాత అతను అమెరికా వెళ్లి ఎంబిఏ చదువుకున్నాడు. ఏజంటుగా వుండగా సంపాదించిన కమిషన్‌ను ఆదాయంగా చూపించి పన్ను కట్టాడు. దానిలో దాచ వలసిన విషయం ఏమీ లేదు. ఈ ఫిర్యాదు వచ్చినా ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ కానీ, పోలీసులు కానీ ఎవరూ మమ్మల్ని విచారణకు పిలవలేదు.'' అన్నాడు.
-ఎమ్బీయస్ ప్రసాద్