తెలంగాణ పునర్నిర్మాణం ఎవరి చేతనవుతుంది?

తెలంగాణ రాష్ట్ర సాధన పూర్తయింది కాబట్టి యిక అందరూ పునర్నిర్మాణం థీమ్‌ పట్టారు. అది మాకు వచ్చంటే మాకే వచ్చని జనాల ముందుకు వస్తున్నారు. వీరిలో అందరికంటె ముందు వరసలో నిలబడినది తెరాస. పార్టీని…

తెలంగాణ రాష్ట్ర సాధన పూర్తయింది కాబట్టి యిక అందరూ పునర్నిర్మాణం థీమ్‌ పట్టారు. అది మాకు వచ్చంటే మాకే వచ్చని జనాల ముందుకు వస్తున్నారు. వీరిలో అందరికంటె ముందు వరసలో నిలబడినది తెరాస. పార్టీని సజీవంగా వుంచడానికి, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోకపోవడానికి అదే కారణం చెపుతోంది. తెలంగాణ సమస్యలు మాకే తెలుసు కాబట్టి మేమే ఆ పనికి తగినవారం అంటోంది. 'ఉద్యమం చేయడం వేరు, పాలించడం వేరు, ఉద్యమపార్టీగా తెరాసకు ఢోకా లేదు కానీ, పాలన వాళ్లకేం తెలుసు? మాకున్న అనుభవం వారి కెక్కడిది' అంటోంది కాంగ్రెసు. 'తెలంగాణ పిలక కేంద్రం చేతిలో వుంది. సీమాంధ్రను అదుపుచేసి తెలంగాణకు మేలు చేయాలంటే కేంద్రమే చేయగలదు, కేంద్రంలోకి అధికారంలోకి వచ్చేది జాతీయ పార్టీ తప్ప, ప్రాంతీయ పార్టీ కాదు. అందునా యీసారి వచ్చేది బిజెపి తప్ప అన్యులు కారు, అందువలన బిజెపికి ఓటేస్తేనే తెలంగాణకు లాభం. వాళ్లే తెలంగాణను ఓ దారిలో పెట్టగలరు' – అంటోంది బిజెపి. 'కేంద్రంలో అధికారంలోకి వచ్చేది జాతీయపార్టీయే అయినా అది సంకీర్ణప్రభుత్వం. ప్రాంతీయపార్టీలు చెప్పినట్లు ఆడాల్సిందే. ఎన్‌డిఏ కానీ, యుపిఏ కాని, మూడో ఫ్రంట్‌ కాని ఎవరు వచ్చినా వారికి మద్దతు యిస్తూ తెలంగాణ ప్రయోజనాలను సాధించుకుని వస్తాం. మాకు ఆంధ్రలో వేరే బ్రాంచ్‌ లేదు. అక్కడా యిక్కడా బ్రాంచ్‌ వున్నవాళ్లు రాజీపడిపోతారు. మాకు ఆ బాధ లేదు కాబట్టి రాజీలేకుండా పోరాడి తెలంగాణ హక్కులు కాపాడతాం, బంగరు తెలంగాణ తెస్తాం' అంటున్నారు తెరాస వారు. వైకాపా వారు యిన్ని మాటలు మాట్లాడరు. 'మమ్మల్ని గెలిపిస్తే రాజన్న రాజ్యం తెస్తాం. ఆనాటి సంక్షేమపథకాలను అమలుచేస్తాం' అన్న స్లోగన్‌ ఒక్కటే పట్టుకుంటారు. 

ఇక అందరి కంటె ఎక్కువ మాటలు మాట్లాడేది – టిడిపియే. 'లైఫ్‌ బాయ్‌ ఎక్కడ వుందో ఆరోగ్యం అక్కడ వుంది' అన్న స్టయిల్లో 'ఎక్కడ నిర్మాణం వుందో అక్కడ బాబు వుండాలి' అనే నినాదం వారిది. అది ఆంధ్రలో కొత్త నిర్మాణం కావచ్చు, తెలంగాణలో పునర్నిర్మాణం కావచ్చు – దేనికైనా రెడీ ! కావాలంటే హైటెక్‌ సిటీ చూడండి అంటూ 'కాశీపట్నం చూడర బాబూ' పాట పాడతారు. టిడిపిలో బాబు గొప్ప అందరికంటె ఎక్కువగా చెప్పేది బాబే! ఆయన వారానికోసారైనా …మర్దనానికి విరామం యిచ్చి తక్కినవాళ్లకు ఆ పని అప్పగిస్తే బాగుండుననిపిస్తుంది. కానీ ఆయన బాధలు ఆయనవి. సీమాంధ్రలో కాంగ్రెసులా, తెలంగాణలో టిడిపి ఖాళీ అవుతోంది. ఉన్నవాళ్లు ఎన్నికలలో నిలబడమంటున్నారు. అందుకే బిసి ముఖ్యమంత్రి పల్లవి ఎత్తుకున్నారాయన. 'గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం' అన్నట్టు ఎలాగూ గెలిచేది లేదు కదాన్న ధీమాతో బిసిలకు యిస్తామన్నారు. ఛాన్సు వున్న సీమాంధ్రలో బిసికి యిస్తాననటం లేదు. బిసిల పట్ల యీ ప్రాంతాలవారీ వివక్షత ఏమిటో మరి! అసలు ఆంధ్రకు బాబు, తెలంగాణకు లోకేష్‌ సిఎంలుగా ప్రయత్నిస్తారని ఓ థలో అన్నారు. లోకేష్‌ ట్విటర్‌ సహాయంతో కాస్త హంగామా చేశారు, హరీశ్‌పై సెటైర్లు కూడా వేశారు. 'బ్రింగ్‌ బాబు బ్యాక్‌' ప్రదర్శనలు మొదలుపెట్టారు. అదే సమయంలో కుప్పం నుంచి సైకిల్‌ యాత్ర కూడా అన్నారు. కానీ యివేమీ ముందుకు సాగలేదు. అంబ పలకటం లేదు కదాని బిసిలకు సిఎం అంటున్నారు. ఎన్నికల తర్వాత అలా అనడం తప్పయిందని, లోకేశ్‌ పేరు చెప్పి వుంటే యువత తమవైపు నిలిచి వుండేవారనీ బాబు అన్నా ఆశ్చర్యపడనక్కరలేదు. 

ఇంతకీ తెలంగాణ పునర్నిర్మాణం ఎవరు చేయగలరు? ప్రస్తుతపరిస్థితుల్లో అందరి కంటె ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్సు తెరాసకు వుందని అందరం అనుకుంటున్నాం. సొంతంగా 70-80 సీట్లు వస్తాయని తెరాస సమావేశంలో కెసియార్‌ అన్నారని పేపర్లలో వచ్చింది. 100 సీట్లు మా లక్ష్యం అని చెప్పినా తెరాస అన్నిచోట్లా బలంగా లేదన్న సంగతి లోకవిదితం. టిక్కెట్ల కోసం పేచీలు తీవ్రంగా నడుస్తున్నాయి. ఇతర పార్టీలను ఖాళీ చేయాలన్న లక్ష్యంతో కెసియార్‌ జోరుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. టిక్కెట్లు యివ్వకపోతే వాళ్లు రారు. వాళ్లు రావడంతో యిన్నాళ్లుగా పార్టీని అంటిపెట్టుకున్నవాళ్లకు మొండిచెయ్యి చూపించాల్సి వస్తోంది. ఎమ్మెల్సీ సీటు యిస్తాం, రాజ్యసభ సీటు యిస్తాం, కార్పోరేషన్‌ చైర్మన్‌ చేస్తాం.. అంటూ ఎంతమందిని వూరుకోబెట్టగలరు? వీళ్లందరికీ గాలం వేయడానికి బిజెపి ఎలాగూ వుంది. ఇలాటి పరిస్థితుల్లో బిజెపి-తెరాస పొత్తు కుదురుతుందా, కుదిరితే నిలుస్తుందా అనేది సందేహాస్పదం. మజ్లిస్‌తో పొత్తు మాట కూడా పేపర్లో వచ్చింది. సమైక్యవాదం వినిపిస్తూ వచ్చిన మజ్లిస్‌తో పొత్తును తెరాస క్యాడర్‌ ఎంతవరకు హర్షిస్తుందో తెలియదు. విభజనపట్ల అసహనంగా వున్న హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో ఎన్ని సీట్లు వస్తాయో తెరాస వూహించలేదు. దీనికి తోడు వివిధ వర్గాల నుండి టిక్కెట్ల కోసం క్లెయిమ్స్‌ పెరిగాయి. లాయర్లకు జిల్లాకో టిక్కెట్టు కావాలట, విద్యార్థులకు కూడా డిటో.
అమరవీరుల కుటుంబాల డిమాండ్లు చెప్పనే అక్కర్లేదు. కాంగ్రెసు అమరవీరులకు ఓ గ్రాండ్‌ ఆఫర్‌ యిచ్చింది. ఐదు ఎకరాల స్థలంలో 'షహీద్‌ బాగ్‌' కట్టిస్తుందట. 

దేనికోసమైనా పోరాడి, శత్రువులను నిర్జించి, ప్రాణాలు కోల్పోయినవారిని షహీద్‌ అంటారు. వీళ్లేమో 'శత్రువు' జోలికి పోకుండా, తెలంగాణ రాదేమోనన్న భయాందోళనలతో, పిరికితనంతో, మారుమూలకు వెళ్లి ఓ ఉత్తరం రాసిపెట్టి గుట్టుగా ఉసురు తీసుకున్నవాళ్లు. పొట్టి శ్రీరాముల్లా బహిరంగంగా ఆమరణ నిరాహారదీక్ష చేసి అసువులు బాసినవారు కారు. వీళ్లు తెలంగాణ రాష్ట్రానికి, భావితరాలకు స్ఫూర్తిదాయకం ఎలా అవుతారో తెలియదు. పైగా ఆ బాగ్‌లోని స్మారకస్తూపం వద్ద అందరి పేర్లు రాస్తారా అన్నది పెద్ద సందేహం. అసలు వాళ్ల సంఖ్య ఎంతో యింకా తేలలేదు. రాజనాథ్‌ సింగ్‌ గారు 1100 అన్నారు మొన్నటి ఉపన్యాసంలో. ఆ పార్టీ తెలంగాణ నాయకులు 1200 అంటున్నారు. ఇతర పార్టీల వాళ్లయితే 1500 దాకా వెళ్లిపోయారు. మనిషి ప్రాణమంటే లెక్కలేకుండా, యింత చులకనై పోయిందా అనిపిస్తూంటుంది. తెరాస కానీ, కాంగ్రెసు కానీ స్తూపాలు కడతాం, అధికారంలోకి వస్తే మీ కుటుంబాల వాళ్లకు ఉద్యోగాలిస్తాం అంటున్నారు తప్ప టిక్కెట్లు యిస్తామనటం లేదు. కానీ టిడిపి అంటోంది – శ్రీకాంతాచారి తల్లికి యిస్తామని బహిరంగంగా ఆఫర్‌ యిచ్చింది. వాళ్లకు అభ్యర్థులు దొరకటం కష్టంగా వున్నట్టుంది. బిసి ముఖ్యమంత్రి ఆఫర్‌లాగే యిది కూడా చెప్పుకోవడానికి మంచి ఆఫర్‌ కదా! కానీ శ్రీకాంతాచారి తల్లి స్పందించినట్టు లేదు. ఆవిడకు కూడా గెలిచే పార్టీ టిక్కెట్టు కావాలి తప్ప, ఉత్తుత్తి టిక్కెట్టు వద్దు. ఈ పాటి లోకజ్ఞానం కొడుక్కి వుండి వుంటే యింకా బతికే వుండేవాడు, ప్చ్‌!

ఎలా లెక్కవేసి చూసినా తెలంగాణలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తెరాస భాగస్వామ్యం వుంటుంది. ఒంటరిగా ప్రభుత్వం ఏర్పరుస్తుందా లేక వేరే వాళ్లతో కలిసి సంకీర్ణప్రభుత్వం ఏర్పరుస్తుందా అన్నది వేచి చూడాలి. అది సాధ్యమా అని ఆశ్చర్యపడకండి. తెరాస బలహీనంగా వున్నచోట వైకాపా తన పని తను చేసుకుని పోతోంది. వైయస్సార్‌పై అభిమానం వున్న తెలంగాణ ప్రజల్లో కొందరైనా వైకాపాకు ఓటేయక మానరు. తెరాస, వైకాపా పరస్పరం నిందించుకోవడం లేదని గుర్తిస్తే ఎన్నికల అనంతరం వాళ్లు కలిసి ప్రభుత్వం ఏర్పరచే అవకాశాన్ని తోసిపుచ్చలేం. అందువలన తెలంగాణ పునర్నిర్మాణం తెరాసపై పడుతుందని అనుకోవాలి. ఆ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తుందన్న దానిపై గట్టిగా ఆలోచించి చూడండి. వక్తగా, ఉద్యమకారుడిగా, స్ట్రాటజిస్టుగా కెసియార్‌ ప్రతిభను మర్చిపోలేం. కానీ పరిపాలనాదకక్షుడిగా కెసియార్‌ను ఎవరైనా తలచుకుంటున్నారా? ఆయన రాష్ట్రంలో 1996 నుండి మూడేళ్లపాటు టిడిపి హయాంలో ట్రాన్స్‌పోర్టు మంత్రిపదవి నిర్వహించారు. ఆ సమయంలో ఓహో అనిపించుకోలేదు. అందుకనే 1999 ఎన్నికల తర్వాత బాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్‌ పదవితో సరిపెట్టారు. ఎంత అడిగినా మంత్రిపదవి యివ్వలేదు. మీ వల్ల కాదులే అనేశారు. పార్టీ విడిచి వెళ్లిపోతానని బెదిరించినా, పోతే పొండి కానీ మంత్రిపదవికి మీరు తగరు అన్నారు. ఇది బాబు అభిప్రాయం. తర్వాత యుపిఏ నుండి బయటకు వచ్చేస్తానని అన్నపుడు మన్‌మోహన్‌ కూడా సర్లెండి అన్నారు తప్ప మీలాటి సమర్థులు వెళ్లిపోతే ఎలా అని అడ్డుపడ్డట్టు లేదు. ఆయన కేంద్రంలో 2004 నుండి రెండేళ్లపాటు లేబరు, ఎంప్లాయ్‌మెంట్‌ మినిస్టరుగా వుండి రాష్ట్రానికి ఏ మేలూ చేయలేదు. గల్ఫ్‌లో వున్న తెలుగు కార్మికులకు ఏమీ చేయలేదని మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అనే ఆంధ్రజ్యోతి విలేకరి ఎన్నోసార్లు రాశారు. 

మంత్రిగా ఏదైనా చేసి వుంటే కెసియార్‌ ఎప్పుడైనా గొప్పగా చెప్పుకునేవారు. దాని గురించి వాళ్ల వెబ్‌సైట్‌లలో కూడా కనబడదు. ఎంతసేపూ ఉద్యమకారుడిగానే కనబడుతుంది. అసలు పార్లమెంటు సభ్యుడిగా ఆయన తన నియోజకవర్గానికే ఏమీ చేయలేదు. అక్కడి సమస్యల గురించి పార్లమెంటులో అడిగినదీ లేదు. అసలు పార్లమెంటుకి వెళితే కదా. ఆయన ఢిల్లీలో వుండి తెలంగాణకై లాబీయింగ్‌ చేస్తూ వచ్చాననే చెప్పుకున్నారు తప్ప రాష్ట్రానికి ఫలానా చేశాను, నియోజకవర్గానికి ఫలానాది సాధించాను వంటి మాటలు ఎన్నడూ చెప్పలేదు. అసలు యుపిఏ 1 ఏర్పడినపుడు ఆయనకు మంచి పదవి యిచ్చారు. అది చేతిలో వుంటే రాష్ట్రానికి, పోనీ తెలంగాణకు ఎంతో చేయవచ్చు. కెసియార్‌ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. 'డిఎంకెకు చెందిన బాలుకి ఆ పదవి కావాలట, అది వెనక్కి యిచ్చేయండి, మీకు పోర్టుఫోలియో ఏదీ యివ్వం, కాబినెట్‌లో ఉత్తినే వుండండి చాలు' అంటే 'మహబాగు' అనుకుని నిశ్చింతగా వున్నారు తప్ప కాదు, ఆ బాధ్యత నిర్వర్తించి తీరతాను అని పట్టుబట్టలేదు. 
ఇలాటి నాయకుణ్ని పరిపాలనాదకక్షుడిగా వూహించడం కష్టం. ఆయనకే అంతంతమాత్రం అయినపుడు ఆయన సహచరుల మాట చెప్పేదేముంది? హరీశ్‌, విజయరామారావు యిత్యాదులు రాష్ట్ర కాబినెట్‌లో మంత్రులుగా చేశారు. వాళ్ల పెర్‌ఫామెన్సు గురించి ప్రశంసలూ రాలేదు, విమర్శలూ రాలేదు. అంతా ఆంధ్రా మీడియా కుట్ర అంటే చెప్పేదేమీ లేదు. ఇంతకుముందు దక్షత చూపలేదు కాబట్టి యికముందు కూడా యిలాగే వుంటారని లేదు. మంత్రి పదవి కూడా చేయని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా మూడేళ్ల పై చిలుకు బాగానే నెట్టుకుని వచ్చారుగా! తెరాస నాయకులు కూడా బండి నడిపించవచ్చు. వారిలో కొందరైనా సమర్థులు వుండి వుంటారు. అయితే తెలంగాణ పునర్మిర్మాణం అనే బృహత్కార్యానికి ఆ సమర్థత సరిపోతుందా లేదా అన్నదే మన బెంగ. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2014)

[email protected]