పవన్ కల్యాణ్ పార్టీ ప్రకటించారు. చాలా చక్కగా ఉంది. విధానాలు చాలా బాగున్నాయి. మహామహులు అందరూ కీర్తిస్తున్నారు. పవన్ పార్టీ విధానాలు బాగున్నాయని ప్రస్తుతిస్తున్నారు. అంతా బాగుంది. అయితే ఇక్కడే ఒక సందేహం తలెత్తుతోంది. విధానాలు బాగాలేని.. ప్రజలను క్షోభ పెట్టడం తమ ఎజెండాగా ప్రకటించిన పార్టీ ఏమిటో ఒక్కటి చెప్పండి చూద్దాం. దీనికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. మన దేశంలో ఎలాంటి నేరమూ జరగకుండా, లేదా, నేరం చేయాలనే ఆలోచన వచ్చినంతనే ఆ వ్యక్తి జడుసుకునేలా చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి.. అయితే వాటి అమలులోనే తేడాలు ఉంటాయి. అలాగే ప్రతి రాజకీయ పార్టీ యొక్క ఎజెండా కూడా పేదల సంక్షేమానికి, అమ్మాయిల మాన, ప్రాణ రక్షణకు సదా కట్టుబడే ఉంటుంది. అయితే పార్టీలు ఆయా ఎజెండాలకు ఏ మేరకు కట్టుబడి ఉంటాయనేది కాలగమనంలోగానీ తెలియని సంగతి! అందువలన పవన్‌కల్యాణ్ మాట్లాడిన మాటలు విని, ఆయన ప్రకటించిన పార్టీ మేనిఫెస్టో పనులు అన్నీ అత్యద్భుతాలని ఇప్పుడే కీర్తించేయడం కాస్త తొందరపాటు అవుతుంది.
కాస్త లోతుగా చూద్దాం…
పవన్‌కల్యాణ్ పార్టీ పెట్టారు. సామాజిక స్పందన మనసులోతుల్లో ఉన్న వ్యక్తులు.. ప్రత్యేకించి సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు.. మనకెందుకులే అనే ధోరణితో వెళ్లిపోకుండా … రాజకీయంగా క్రియాశీలంగా ఉండదలచుకోవడం అనేది మంచి పరిణామం. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అయితే ఆయన పార్టీ పెట్టిన సమయం, పార్టీ పోకడగా ప్రకటించిన కొన్ని సంగతులు అనుమానాస్పదంగా ఉన్నాయి. తన పార్టీ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందో లేదో చెప్పలేనంటూ.. పవన్ కల్యాణ్ అదేదో ఒక ప్లస్ పాయింట్‌లాగా వెల్లడిరచారు. మరి పోటీచేసే ఉద్దేశంలేని పార్టీ.. సరిగ్గా ఎన్నికల ముందు పుట్టడంలో ఆంతర్యం ఏమిటి? రంధ్రాన్వేషణ చేసే వారికి ఒకటి అనిపిస్తోంది. ఈ డైలాగు ద్వారా పవన్ కల్యాణ్.. తన పార్టీ తరఫున ఎవరికైనా మద్దతు/ వ్యతిరేకత ప్రకటిస్తానే తప్ప.. నేరుగా రంగంలో ఉండను అని సంకేతం ఇచ్చారన్నమాట. ఎవ్వరైనా సరే.. తమకు మద్దతుగా రంగంలో ఉండమంటూ ఆయనను బతిమాలితే (నిస్సిగ్గుగా చెప్పుకుంటే.. ఆయనతో బేరం పెట్టుకుంటే) వారికి అనుకూలంగా ప్రచార రంగంలో ఉంటారన్నమాట. అలాంటి ‘బతిమాలడాలు’ కుదరకపోతే గనుక.. ఇక అప్పుడు నేరుగా ఎన్నికల గోదాలోకి దిగవచ్చునన్నమాట. అలాంటి అవకాశం ఒకటి ఉంటుందన్నమాట.
మోడీతో మైత్రీబంధం సంగతేంటి?
ఎవరి అపాయింట్‌మెంట్ కోసం తాము ప్రయత్నించడం లేదని పవన్ ఆఫీసు ఒక ప్రకటన చేసిన మాట నిజం. కానీ మోడీని పవన్ కలవబోతున్నట్లుగా వార్తలు మాత్రం ఆగలేదు. నిప్పులేని పొగ రాదన్న సామెతను నమ్మే వారికి ఇందులో చాలనా ఆంతర్యం కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తన మాటల్లో కాంగ్రెస్ హఠావో నినాదాన్ని అందించారే తప్ప.. భాజపాను పల్లెత్తు మాటనలేదు. ‘కాంగ్రెస్ కో హఠానా’ పరోక్షకంగా భాజపానే గద్దె మీదకు తెస్తుందని పసిపిల్లలు కూడా చెబుతారు. ఆ రకంగా భాజపా అనుకూల నినాదం వినిపించినందుకు పవన్ మోడీ బంధాన్ని.. అంటే భవిష్య ప్రధానితో సానుకూల సుదృఢ బంధాన్ని ఏర్పరచుకుంటారా అనేది పలువురి అనుమానం. అదే తరహాలో.. భాజపా, తెలుగుదేశం పొత్తులు పెట్టుకోబోతున్న నేపథ్యంలో.. పవన్ దూకుడు పరోక్షంగా తెలుగుదేశానికి కూడా మేలు చేసేందుకే కేంద్రీకృతం అవుతుందనేది మరో సందేహం.
మిత్రుల గమనమే ప్రతీక…
‘నీ మిత్రులెవరో చెప్పు.. నీ గురించి నేను చెబుతాను’ అని ఒక సామెత ఉంది. ఆ సామెతను ఇక్కడ వర్తించుకుని చూసినట్లయితే ఇంకా అనేక సందేహాలు రేగుతాయి. పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితులని చెప్పుకునే సినీ ఇండస్ట్రీలోని కొందరు నటులు ఈ ఎన్నికల్లో పోటీకి దిగాలని ఉత్సాహపడుతున్నారు. ఉదాహరణగా ఆలీ, వేణుమాధవ్ లాంటి పేర్లను చెప్పుకోవాలి. వీరు వారికి కావాల్సిన నియోజకవర్గాలనుంచి బరిలోకి దిగుతారట. అయితే.. వారు తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో ఉంటారన్నమాట.
చాలా మందికి కలుగుతున్న సందేహం ఏంటంటే.. పవన్ కల్యాణ్ బరిలోకి దిగదలచుకున్న సీట్ల జాబితాలో.. వీరి సీట్లు లేవా? అలాగే.. పవన్ పార్టీ బరిలోకి వచ్చినా పరిమిత సీట్లలో మాత్రమే ఉంటుందని చాలా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు మద్దతన్నట్లుగా.. తనకు అధికారం అక్కర్లేదని, అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని పవన్ ధ్రువీకరించారు. వీటిని పోల్చిచూసుకుంటే.. పవన్ తన అభ్యర్థుల్ని గెలుపుకోసం మోహరించడం లేదేమో.. నిర్దిష్టంగా ఫలానా పార్టీ వారి విజయావకాశాల్ని దెబ్బతీయడం కోసం మోహరిస్తున్నారేమో అనే అనుమానం కలుగక మానదు. గెలవాలని తాను ఆశించేంతటి సన్నిహితులు తెలుగుదేశం తరఫున బరిలోకి దిగుతుండడం గమనిస్తే.. అక్రమ సంబంధం ఏమైనా ఉన్నదేమో అని కూడా అనిపిస్తుంది.
ఒకే తాను ముక్కలు…
మొత్తానికి సీమాంధ్ర బరిలో మోహరించదలచుకుంటున్న చాలా పార్టీలు ఒకే తాను ముక్కలని తమ మాటల ద్వారానే నిరూపించుకుంటున్నారు. ఒకే తరహా డైలాగులనే వారు సంధిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ భాజపా పొత్తులు పెట్టుకుంటాయనే ప్రచారం బాగా ఉంది. అలాగే, గత ఎన్నికల్లో తెదేపా నష్టానికి దారి తీసినట్లుగా కాకుండా.. లోక్‌సత్తా అధినేత పూర్తిగా వారికి ‘సహకరిస్తూ’ తన పబ్బం గడుపుకుంటారనే ప్రచారం కూడా ఉంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగా ఆయన మేం ప్రస్తుతం పరిమిత స్థానాల్లో మాత్రమే పోటీచేస్తాం అంటున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ జతయ్యాడు. ఆయన కూడా పరిమితస్థానాల మాటే వల్లిస్తున్నాడు. అవినీతి వ్యతిరేకత అనేక తారకమంత్రాన్ని జపించడం ద్వారా ఈ పార్టీలన్నీ కూడా జగన్ వ్యతిరేక శక్తుల కూటమిగా ఆవిర్భవించే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీరి మధ్య ఉండే ఒప్పందానికి పేరు పొత్తులు, అవగాహన, స్నేహపూర్వక పోటీ… ఇలా ఏమైనా కావొచ్చు గానీ.. అందరూ కలిసి జగన్ వ్యతిరేకంగా ఉద్యమించడమే ఎజెండా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఒక్క భాజపా మాత్రమే ఆచితూచి స్పందిస్తోంది. కేంద్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టుకోడానికి ఎటుపోయి ఎటువస్తుందో.. చివరి నిమిషంలో జగన్ మద్దతు అవసరమైనా కావొచ్చుననే ఉద్దేశంతో వారు తిట్లలో తెగబడకుండా అదుపు పాటిస్తున్నారు.
‘ఆ తాయిలం’ నిజమేనా?
ఇంతకూ పవ‘నిజం’ ఏమిటి? ఆయన ఇలా ఎన్నికల్లో పోటీ గురించిన స్పష్టత లేకుండా.. రాజకీయ పార్టీ పెట్టడం ఉద్యమం లా నడుపుతున్నట్లు బిల్డప్ ఇవ్వడంలో మర్మం ఏమిటి? తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కు చాలా పెద్ద మొత్తంలో డీల్ ఉన్నదని ఒక పుకారు ఉంది. ‘ఛ పవన్ అలాంటివాడా’ అని కుల, నట అభిమానం లేకపోయినా.. ఆ పుకారును కొట్టిపారేస్తున్న వారు అనేకులున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పవన్ చిత్రపరిశ్రమలోని దాదాపు అందరు హీరోలకంటె కూడా వ్యక్తిగతంగా నైతిక విలువలు ఉన్నవాడు. అందులో సందేహం లేదు. అయితే విలువలకు కూడా రేటు ఉంటుంది.
మనకు రోడ్డు మీద పది రూపాయల కాగితం దొరికితే.. పట్టుకుని.. రోడ్డమ్మట వెళ్లే ప్రతి వ్యక్తిని మీదేనా? మీదేనా? అని అడిగి మన నిజాయితీని ప్రదర్శించుకుంటాం? అదే ఒక వెయ్యి నోటు దొరికిందనుకోండి… మడిచి జేబులో పెట్టుకుని వెళ్లిపోతాం. ప్రతిమనిషిలోని నిజాయితీ, విలువలు అనేవి మెత్తబడే మెల్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. అలాగే పవన్‌లోని మెల్టింగ్ పాయింట్‌ను చంద్రబాబు చక్కగా ట్యాప్ చేసి పట్టుకున్నారని అనుకోవాలి. అంతవరకు అది ఆయన సక్సెస్. ఎన్నికల ముందు పార్టీ పుట్టడం అంటేనే.. ఎన్నికల తర్వాత మాయం కావడానికి అని చరిత్ర చెప్పే అర్థం! తాను అలా కాదని నిరూపించుకుంటే అది పవన్ కల్యాణ్ సక్సెస్!!