అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
ఒక్కోప్పుడు చిన్న చిన్న విషయాలే తట్టవ్…
విజ్ఞానం పెరుగుతున్నకొద్దీ లోకజ్ఞానం తగ్గిపోతూ వుంది. కావాలసినదాని కంటె ఎక్కువ సమాచారం లభ్యం కావడంతో మనం గందరగోళపడి, డొంకతిరుగుడుగా ఎక్కువ ఆలోచిస్తున్నాం. సూటిగా ఆలోచించడం మానేసి, కళ్లకు ఎదురుగా కనబడే చిన్నవిషయాలను విస్మరిస్తున్నాం. సాధారణజ్ఞానం (కామన్ సెన్స్) అత్యంత అరుదైన వస్తువు అయిపోతోంది. పెద్దపెద్దవాళ్లు కూడా యిలాటి విషయంలో తొట్రుపడతారనడానికి ఓ ఉదాహరణ చెప్తాను.
ఫాన్ నాయ్‌మెన్ (ఙళిదీ శ్రీలితిళీబిబిదీ) అని పెద్ద ఫిజిక్స్ ప్రొఫెసర్ వున్నారు. ఆయన ఎటమిక్ ఎనర్జీలో తొలితరం సైంటిస్టు. ఆయనను ఒక పార్టీలో ఒక అందమైన యువతి కలిసి మిమ్మల్నో చిక్కుప్రశ్న అడుగుతాను చెప్తారా? అందిట. ఆ అమ్మాయి అందం చూసి మురిసిన ప్రొఫెసర్‌గారు ''అడుగు'' అన్నారు. అప్పుడు ఆ అమ్మాయి అడిగింది – ''ఇద్దరు సైక్లిస్టులు 30 కి.మీ.ల దూరంలో వున్న రెండు ప్రదేశాలనుండి ఎదురుబొదురుగా సైకిళ్లు తొక్కుకుంటూ వస్తున్నారు. వాళ్ల వేగం గంటకు 15 కి.మీ. ఒక గంట పోయాక యిద్దరూ ఒక చోట కలుస్తారు. అంతే కదా! అయితే వీళ్లు సరిగ్గా స్టార్ట్ అయ్యే సమయంలో ఒక ఈగ గంటకు 20 కి.మీ.ల వేగంతో ఎగురుకుంటూ ఒక సైక్లిస్టును ముట్టుకుని, మళ్లీ అవతలివాడి దగ్గరకు వెళ్లి వాణ్నీ ముట్టుకుని, మళ్లీ యిటువైపు వచ్చి యివతలివాణ్ని ముట్టుకుని.. యిలా వాళ్లిద్దరూ కలిసే సమయందాకా చేస్తూ వచ్చింది. ఆ ఈగ అటూ యిటూ మొత్తం ఎంత దూరం ప్రయాణించింది?'' అని.
xxxxx
ఇలాటిది లెక్క కట్టడం చాలా క్లిష్టమైన విషయం. ఎందుకంటే యిక్కడ మనుష్యులు స్థిరంగా లేరు. కదులుతున్నారు. అదీ ఎదురెదురు దిక్కుల్లో. సమయం గడిచేకొద్దీ వాళ్ల మధ్య దూరం తగ్గిపోతూ వుంటుంది. దానితో బాటు ఈగ ప్రయాణించవలసిన దూరమూ తగ్గిపోతుంది. ప్రతీసారీ ప్రోగ్రెషన్‌లో తగ్గిస్తూ లెక్కవేస్తూ రావాలి. దాన్ని ఇన్‌ఫినిట్ సీరీస్‌లో సమాధానం కనుక్కునే పద్ధతి అంటారు. ప్రొఫెసర్‌గారు అర నిమిషంలో ఆ అమ్మాయికి సమాధానం చెప్పేశారు – ''ఆ ఈగ ప్రయాణించిన దూరం 20 కి.మీ.లు'' అని.
ఆ అమ్మాయి యీయన యిచ్చిన సమాధానానికి మురిసిపోయి చప్పట్లు కొట్టింది. ఎందుకంటే పొడుపుకథ లాటి యీ సమస్యలో చిన్న ట్రిక్ వుంది. మొదటే చెప్పేసింది ఈగ గంటకు 20 కి.మీ.ల స్పీడుతో ఎగురుతూ… అని. సైక్లిస్టులు యిద్దరూ ప్రయాణించిన మొత్తం సమయం గంట. అంటే ఈగ ఎగిరిన సమయం కూడా గంటే. గంటకు 20 కి.మీ.ల స్పీడు కాబట్టి అది ప్రయాణించిన దూరం 20 కి.మీ.లే అవుతుంది ! ఈ లోపున అది ఎందర్ని ముట్టుకున్నా, ఎటువైపు వెళ్లినా మనకు అనవసరం. కదిలే వస్తువుని ముట్టుకోవడం, ఈగ అటూ యిటూ ప్రయాణించడం యివన్నీ అదనంగా చేర్చి గందరగోళ పరుద్దామని చూసింది ఆ పిల్ల.
''మీరు బోల్తా పడి ఇన్‌ఫినిట్ సీరీస్ మెథడ్‌లో సమస్య పరిష్కరిస్తూ చాలా సేపు తీసుకుంటారనుకున్నాను. కానీ ట్రిక్కు యిట్టే పట్టేశారే!'' అంది ఆమె మెచ్చుకుంటూ.
చిరునవ్వుతో ఆమె అభినందనలు స్వీకరించడానికి కాస్త వొంగబోయిన ప్రొఫెసర్‌గారు గతుక్కుమన్నారు. ''నేను ఇన్‌ఫినిట్ సీరీస్ మెథడ్‌లోనే సమస్య పరిష్కరించాను. అది కాక వేరే మెథడ్ ఏమైనా వుందా?'' అని అడిగారు ఉత్సుకతగా.
ఆయనది చాలా చురుకైన బుర్ర కాబట్టి తక్కినవాళ్లకు పావుగంట పట్టే సమస్యను అరనిమిషంలో సాల్వ్ చేశాడు. అంతవరకూ బాగానే వుంది కానీ అంతమాత్రం లెక్క కూడా వేయనక్కరలేదని, ప్రశ్నలోనే సమాధానం దాగి వుందని ఆయన గుర్తించలేకపోయారు. సమస్యను సింపుల్‌గా చూడకుండా కాంప్లికేటెడ్‌గా చూడడంలోనే వస్తుంది యీ యిబ్బంది.
xxxxxx
జీనియస్‌లకు యిలాటి యిబ్బందులు తప్పవు. ఒకసారి ఐన్‌స్టీన్ ఓ బస్సెక్కితే కండక్టర్‌తో చిల్లర వద్ద పేచీ వచ్చింది. ఇంత రావాలంటే, కాదు యింతే రావాలని యిద్దరూ వాదించుకున్నారు. చిత్రాతిచిత్రం ఏమిటంటే – ఫైనల్‌గా చూస్తే కండక్టర్ చెప్పినదే రైటు, మహామేధావి ఐన్‌స్టీన్ చెప్పింది తప్పు ! నమ్మగలమా? కానీ నిజంగా జరిగింది యిది… నమ్మి తీరాలి.
మన ఉన్నతాధికారులు కూడా యిలాటి పొరపాట్లు చేస్తూ వుంటారు. చాలా పెద్ద పెద్ద పథకాలు వేస్తూ వుంటారు. అవి ఆచరణలో విఫలమవుతాయి. వాళ్ల కంటె రోడ్డు మీద తిరిగే మామూలు మనిషి చురుగ్గా, సరిగ్గా ఆలోచించిన ఘట్టాలు వుంటాయి. సామాన్యపౌరుడికి అర్థం కావడానికి ప్రాంతీయభాషలోనే కరస్పాండెన్సు వుండాలి అని ఎంతో కసరత్తు చేస్తారు. ఏవేవో కొత్త మాటలు కనిబెడతారు. చివరకు వాటికంటె ఇంగ్లీషు పదాలే మేలనిపిస్తాయి. నాలుకకు ఏవి సౌలభ్యంగా వుంటాయో అవే పలుకుతారు జనం. కొంతకాలం క్రితం పరిపాలనలో వాడే ఇంగ్లీషు పదాలకు పర్యాయంగా వాడడానికి తెలుగు పదాలుండాలి అని ఓ నిఘంటువు తయారుచేశారు.
ట్యాక్స్ అనే పదానికి 'రాజస్వము' అని పెట్టినట్టు గుర్తు. పన్ను అనే పదం అందరికీ తెలుసు. ట్యాక్స్ అన్నా సులభంగా అర్థమౌతుంది. రోడ్డు, హోటలు, రైలు.. యీ పదాలన్నీ తెలుగు కాదంటే తెల్లబోయి చూసే రోజులు వచ్చినపుడు రాజస్వము వంటి సంస్కృతభూయిష్ట పదాలు ఎందుకో తెలియదు.
వైజాగ్ పోర్టులో డ్రెడ్జర్ వచ్చిన కొత్తల్లో కార్మికులకు ఈ ఇంగ్లీషు పదం పలకడం కష్టం. వాళ్లకోసం దీనికి ఓ తెలుగు పదం కనిపెట్టాలని పెద్దపెద్ద అధికారులు సమావేశాలు పెట్టుకుని తెగ చర్చించారట. వారం, పది రోజులైనా చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈ లోపున పనివాళ్లే దానికి పేరు పెట్టేసుకున్నారు – 'తవ్వోడ' అని. డ్రెడ్జింగ్ అంటే తవ్వడం, అది ఓడలా వుంది. తవ్వే ఓడ కాబట్టి పలుకుబడిలో 'తవ్వోడ' అనేశారు. ఈ పాటి కామన్‌సెన్సు ఆ పెద్దలెవరికీ తట్టలేదు. అదీ తమాషా!
ఇవన్నీ చెపుతూ మా సర్వీసెస్‌లో వున్నవాళ్ల గురించి ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పానుగా, ఒక్కొక్కపుడు మేము కూడా నేల విడిచి సాము చేస్తూంటాం. అలాటి సంఘటన ఒకటి చెప్తాను. ఇది నాకు చెప్పినది చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఎస్.వి.ప్రసాద్. అతని సెన్సాఫ్ హ్యూమర్ విశేషంగా చెప్పుకోదగ్గది. ఎటువంటి పరిస్థితుల్లో నైనా సరే తాను పెద్దగా నవ్వకుండా వింటున్న మనం నవ్వుతో ఉక్కిరిబిక్కిరయిపోయి కిందపడిపోయేటంత యిదిగా జోకులు వేయగలిగిన ప్రతిభ వున్న సరసుడతను. ఒకాయన ఓ సందర్భంలో ఆదమరచి ప్రశ్నల వరదలో ఎలా కొట్టుకుపోయారో అతను చెప్తూ వుంటాడు.
xxxxxx
ఆయన అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు. నక్సలైట్ సమస్య గురించి చూస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారులను పిలిపించి దాని గురించి సమీక్షించి, వాళ్లను పట్టుకునే ఉపాయాల గురించి ముఖ్యమంత్రికి నివేదించాలని అనుకున్నారు. సమావేశానికి డిజి ఆఫ్ పోలీస్, డిఐజి ఇన్ చార్జ్ ఆఫ్ నక్సలైట్స్, చీఫ్ సెక్రటరీ, పొలిటికల్ సెక్రటరీ అందరూ వచ్చారు. ''మ్యాపులు అవీ తీసుకుని వచ్చారా? ముఖ్యమంత్రిగారికి అర్థమయ్యేట్లు విశదీకరించాలి కదా'' అన్నారీయన. వాళ్లు సమీక్ష అంటే ఏవో రిపోర్టులు అవీ యిస్తే సరిపోతుందనుకున్నారు కానీ మ్యాపులు అవీ అనుకోలేదు. లేవండీ అన్నారు.
''అయితే అవి తయారు చేసుకుని రండి'' అన్నారీయన. వాళ్లు వెళ్లిపోయి మళ్లీ కొన్ని రోజులకు వచ్చారు.
అవి చూసి ''అదేంటి, మ్యాపు అంటే యిలా వట్టి గీతలు గీతలుగా వుంటే ఎలా? రంగులదీ వుండాలి కదా! ఇలా చూస్తే ఏది ఏమిటో ఏం తెలుస్తుంది? అడవి ఏదో, గ్రామం ఏదో, ఆ గ్రామంలో ఆసుపత్రి ఏదో, బడి ఏదో ఎలా తెలుస్తుంది? చక్కగా రంగులు వేసుకుని రండి.'' అన్నారు.
వాళ్లు దేవుడానుకుని ఆ రంగులవీ వేసుకుని వచ్చారు. అవి చూసి మళ్లీ యీయన పెదవి విరిచారు. ''ఎబ్బెబ్బే! ఇన్ని రంగులూ అవీ కంగాళీగా వుంది. చక్కగా పిన్నులు పెట్టకపోయారా? ఎఱ్ఱపిన్ను వుంటే హాస్పటలనీ, నీలం పిన్ను వుంటే స్కూలనీ విడివిడిగా తెలుస్తుంది కదా. లేకపోతే సిఎం గారికి యివన్నీ ఎలా బోధపడతాయి? వివరంగా చెప్పకపోతే ఎలా..?'' అని ఊహు యిదై పోయారు.
అప్పటి ముఖ్యమంత్రికి అవగాహనాశక్తి చాలా ఎక్కువ. ఈ మ్యాపులూ, యీ గుండుసూదులూ, సరంజామా ఏమీ అక్కరలేదు. నోటితో చెప్పేసినా చాలు గ్రహించేయగలరు. అయినా ఈయనేదో కాస్త కలర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేద్దామని అనుకున్నారు. ఆ విషయం అర్థమై మళ్లీ వెళ్లి గుండుసూదులు గుచ్చుకుని వచ్చారు. ఈయన సంతోషించినట్టు కనబడ్డారు. ''గుడ్, చూశారా ఇప్పుడన్నీ క్లియర్‌గా తెలుస్తున్నాయి. ఇది ముందే చేసి వుంటే బాగుండేది. సరే, యిప్పటికైనా చేశారు సంతోషం. ఇప్పుడు చెప్పండి బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ వాళ్లు ఎక్కడున్నారు?'' అనగానే యిదిగో యీ పిన్ను అంటూ చూపించారు.
''మరి, లోకల్ పోలీస్ ఎక్కడ?'' – చూపించారు.
''సరే, సి.ఆర్.పి.వాళ్లు ఎక్కడ?'' – చూపించారు.
''మరి, మనం అడవిలోకి వెళ్లాలంటే తోవ ఏది?'' అదీ చూపించారు.
''బాగుంది బాగుంది, యింతకీ వాళ్లెక్కడ?''
''ఎవరు?'' అంటూ వాళ్లు తెల్లమొహం వేశారు.
''అదేనయ్యా, అసలువాళ్లు..?'' ఈయన చికాగ్గా అడిగారు.
''మాయాబజారు'' సినిమాలో శాస్త్రి, శర్మలు ''అన్ని వంటకాలూ వున్నాయి కానీ అసలు వంటకం ఏదీ?'' అని గోంగూర గురించి నిలదీస్తే లంబూ, జంబూ తెల్లమొహాలు వేసినట్టు వాళ్లు తెల్లమొహం వేశారు.
''..అసలు వాళ్లంటే..?'' ధైర్యం చేసి ఎవరో అడిగారు.
''..అబ్బ, నక్సలైట్లయ్యా? వాళ్లెక్కడున్నారో పిన్నులు పెట్టి చూపించలేదేం?'' నెత్తికొట్టుకుంటూ అడిగారాయన.
హాల్లో సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దం. ఈయన తప్ప అందరూ కొయ్యబారిపోయారు. నక్సలైట్లు ఎక్కడున్నారో తెలిస్తే యింత తతంగం దేనికి? వెళ్లి హాయిగా పట్టేసుకుందురు కదా! ఎక్కడున్నారో తెలియకనే కదా, యీ మ్యాపులు, యీ కూంబింగ్‌లు, యీ బలగాలూ అన్నీ..!
ఎవరో ధైర్యం చేసి ఆ ముక్క అనేశారు కూడా – వెంటనే ఆయనకూ తట్టింది – అన్ని ప్రశ్నలడగ రావలసి రావడంతో చికాకులో తన ప్రశ్నల పరంపరలో తనే గందరగోళపడి అంత చిన్న లాజిక్, చిన్న కామన్‌సెన్సు పాయింటు మర్చిపోయానని ! వెంటనే ఫక్కున నవ్వారు. ఆయనతో బాటు అందరూనూ….
అందుకే అంటాను – వివరాలు ఎక్కువైన కొద్దీ కామన్‌సెన్సు మరుగున పడుతుందని !
xxxxxx
కొసమెరుపు – నేను ఐయేయస్ ఇంటర్వ్యూకి వెళ్లినపుడు హేమాహేమీలను ఎదుర్కోవలసి వచ్చింది. సర్వీసెస్‌కు వచ్చినవాళ్ల నిగ్గు తేల్చేవాళ్లు సహజంగానే ఉద్దండ పిండాలుంటారు. వాళ్లలో మరీ ఘటికులను చైర్మన్‌గా వేస్తారు. నన్ను యింటర్వ్యూ చేసిన బోర్డు చైర్మన్ మిసెస్ కొంగుమన్ అనే ఆవిడ.
అప్పట్లో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాను. ఆవిడ అడిగింది ''నువ్వు ఎమ్మెస్సీ మాథమేటిక్స్ చదివావు. బ్యాంక్‌లో పనిచేస్తున్నావు. నీ మేథమేటిక్స్ బాంక్ జాబ్‌లో బాగా ఉపయోగపడుతోంది కదా'' అని.
''బాంక్ ఉద్యోగానికి అవసరమైనది అరిథ్మెటిక్ తప్ప మేథమాటిక్స్ కాదు మేడమ్'' అని జవాబిచ్చాను.
నా జవాబు వినగానే ఆవిడకు తన ప్రశ్నలో తెలివితక్కువతనం గుర్తుకు వచ్చింది. అరిథ్మెటిక్‌కు, మాథమ్యాటిక్స్‌కు తేడా వుందన్న చిన్న విషయం తోచనందుకు చిరునవ్వు నవ్వుకుంది.
మీ సూచనలు [email protected] ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version