వర్ణసంకరం అనే మాట ఎలా పుట్టిందో ఆంత్రోపాలజిస్టుల్ని అడగాలి. మనుషుల్ని ‘రంగులు’గా విడగొట్టి జాతులకు వర్ణాలని పేరు పెట్టిన దుర్మార్గపు మన సమాజంలో.. రాజకీయ రంగంలో అసలు సిసలైన వర్ణ సంకరం జరుగుతోంది ఇప్పుడు. పార్టీల రంగులు ఇప్పుడు సంకరీకరింపబడుతున్నాయి. మూడురంగుల పార్టీ వొచ్చి ఇప్పుడు పసుపుపచ్చలో కలుస్తోంది. ఒక పసుపుపచ్చ పార్టీ ఒక మూడు రంగుల పార్టీని తనలో కలిపేసుకునే ప్రయత్నంలో పసుపుపచ్చ కాంగ్రెస్‌గా మారుతోంది.
అగమ్యగోచరంగా కూడలి స్థానం వద్ద నిలుచున్న తెలుగుదేశానికి తమను చూసి ఎగబడి వస్తున్న కాంగ్రెస్ నాయకుల వెల్లువ విస్తుగొలుపుతూ ఉండవచ్చు. అయితే కామెడీ ఏంటంటే.. ఇదంతా తమ పార్టీ ప్రభ వెలుగొందుతూ ఉన్నదనడానికి నిదర్శనం అని ఆపార్టీ నాయకత్వం అనుకుంటోంది. ఆ భ్రమలో తాము తెగ బలిసిపోయాం అని భుజాలు చరుచుకుంటూ.. రొమ్ము విరుచుకుంటోంది.
అయితే పొంచి ఉన్న ప్రమాదాలను ఆ పార్టీ పసిగట్టగలుగుతోందా? వలసల వరదలో తమ పార్టీ ఏ తీరానికి చేరుతుందో వారికి స్పష్టత ఉందా? నాయకుడు చంద్రబాబు- వలసల్ని ప్రోత్సహిస్తున్నంతగా, పార్టీని బలోపేతంగా ఉంచడంపై దృష్టి పెడుతున్నట్లు లేదు. వలసలు అన్నీ విటమిన్లు కాదు..! ఆసంగతి చంద్రబాబు గుర్తిస్తే పార్టీకి శ్రేయస్కరం.
తెలుగుదేశమా… ఏదీ ఎక్కడ?
తెలుగుదేశం పార్టీ మరి కొన్ని రోజులు గడిచేసరికెల్లా.. దాని వాస్తవమైన రూపురేఖలను కాలగర్భంలో తనంతగా కలిపేసుకునేలా కనిపిస్తోంది. కొన్నాళ్లు గడిచేసరికి తెలుగుదేశం పార్టీ అంటే అందులో అసలు తెలుగుతమ్ముళ్లు ఎక్కడున్నారో కాగడాపట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు.
అంచనాకు చూద్దాం.. మాజీ మంత్రులు బోలెడు మంది, ఇంకా వారి అనుచరగణాలతో కూడిన బోలెడు మంది ఎమ్మెల్యేలు .. కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకులు లెక్కకు మిక్కిలిగా తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇంకా అనేక మంది చేరడానికి సిద్ధంగా క్యూలైన్లో ఉన్నారని కూడా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఎన్నికల సమయం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి సుమారు 55 మంది వరకు ఉంటారుట! మొత్తం 175 స్థానాల సీమాంధ్రలో మూడింట రెండో వంతు సీట్లను కాంగ్రెసు వారు ఆక్రమించేస్తారన్నమాట. సీట్ల మీద ఆశచూపించకుండా చంద్రబాబు వారిని చేర్చుకోవడం కూడా జరగదులెమ్మని అనుకుంటే గనుక.. వారికందరికీ సీట్లు దక్కితే.. ఇక తెలుగుదేశం అంటూ మిగిలేది మూడింట రెండొంతులు మాత్రమే.
గతిలేని కూటమికి రెడ్కార్పెట్లా?
అయితే పార్టీలో లోపల మాత్రం అనేక సందేహాలు రేగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి తెలుగుదేశంలో చేరుతూ.. ‘సీమాంధ్ర పునర్నిర్మాణం జరగాలంటే గనుక.. స్వచ్ఛమైన పాలన అందాలంటే గనుక.. అది కేవలం చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమని స్తోత్రపాఠాలు వల్లిస్తోంటే చంద్రబాబు మురిసిపోతున్నారు. కానీ నిజానికి కాంగ్రెసులో తమ భవిష్యత్తుకు ఠికానా లేదని భయపడుతున్న వాళ్లు.. ఇతరత్రా పార్టీల్లోకి అడుగుపెట్టడానికి గత్యంతరం లేని వాళ్లు మాత్రమే.. తెలుగుదేశంలోకి వస్తున్నారనే సంగతి వారికి తెలియని సంగతి కాదు. అయితే.. అంతటి గతిలేని వారికి కూడా చంద్రబాబు రెడ్కార్పెట్లు పరచి వీఐపీ స్వాగతాలు పలకడం వారికి మంటగా ఉంది.
వీళ్లతో ఏం ఉద్ధరించగలరని?
చంద్రబాబు ఇన్నాళ్లూ కాంగ్రెస్ దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టినా ఆ కాంగ్రెస్ సర్కారులోని సగం మందిని తానే అక్కున చేర్చుకుంటున్నాడు. వీరితో మళ్లీ తాను ఎలాంటి పాలన అందించాలని అనుకుంటున్నాడు. ఈ విషయంలో సీమాంధ్ర తెలుగు ప్రజలకు చంద్రబాబు జవాబు చెప్పగల స్థితిలో ఉన్నారా? పార్టీలు ఫిరాయించినప్పుడు అప్పటిదాకా తిట్టుకున్న వాళ్లు తిరిగి పొగడ్తలు కురిపించుకోవడం సహజం. కానీ.. ఇంతగా ‘తెదేపాలో సగం’ అన్నట్లు ఇన్నాళ్ల ‘దుష్టపాలన’ (చంద్రబాబు భాషలో) ప్రతినిధుల్ని తెచ్చిన నెత్తిన పెట్టుకుంటే వారి సహకారంతో రేపు పొద్దున్న చంద్రబాబు ఉద్ధరించగలిగేది ఏముంటుంది. ఇదొక మిలియన్ డాలర్ ప్రశ్న.
కొరివితో తల గోక్కోవడమే!
పచ్చి చిత్తూరు జిల్లా బాషలో చెప్పాలంటే.. ఈ చేరికలన్నీ చూసుకుంటున్న చంద్రబాబుకు మహ ‘కుశాల’గా ఉండడంలో ఆశ్చర్యం లేదు. మొన్నటికి మొన్న ఒకప్పట్లో తనకు సన్నిహిత రాజకీయ నాయకురాలు అయిన కుతూహలమ్మ ఇవాళ మళ్లీ తన పార్టీలోకి వచ్చి చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చిన జనం ముందు చంద్రబాబు ఆ కుశాలనే ప్రదర్శించారు. ఈ జనాన్ని ఈ స్పందనను చూస్తోంటే.. ఆల్రెడీ నేను సీఎం అయిపోయినట్టే అనిపిస్తోందంటూ ఆయన తన పక్కన ఉన్న వారితో వ్యాఖ్యానించారట కూడా బాగానే ఉంది!
అయితే విచ్చలవిడిగా చేరికలు అనేవి చంద్రబాబుకు రెండు రోజులు గడిచేసరికెల్లా కొరివితో తలగోక్కోవడంలా మారుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశాన్ని నమ్ముకుని ఆ పార్టీ పదేళ్లుగా ప్రతిపక్ష స్థానంలో కొట్టుకుంటున్నప్పటికీ ఆ పార్టీని వీడకుండా.. నియోజకవర్గాల్లో ఉండే క్యాడర్ కట్టు తప్పి పోకుండా కాపాడుకుంటూ వస్తున్న నాయకులు ఎందరో ఉన్నారు. స్థాయీభేదాలు ఉండవచ్చు గానీ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇలాంటి నాయకుడు ఒకరుంటారు. ఇప్పుడు కాంగ్రెసునుంచి సిటింగులు గెంతుకుంటూ వచ్చి చేరుతుండవచ్చు గాక.. కానీ వారు గెలిచే అవకాశం ఎంతమాత్రమూ లేని.. ఓటమి మినహా గత్యంతరం లేక వస్తున్న వారు మాత్రమే!
సిసలైన నాయకుడే అయితే గనుక…
చంద్రబాబునాయుడు రాజకీయ చాణక్యుడే కావొచ్చు గాక.. కానీ అసలు సిసలైన ‘నాయకుడు’ అయితే గనుక.. ఆయన తన ప్రధాన ప్రాధాన్యం పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతిని పోకుండా కాపాడుకోవడం అని గుర్తించాలి. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. ఆ కష్టాలను తాము పంచుకుంటూ.. ఇన్నాళ్లు కాలం గడిపిన తమ్ముళ్లలో ఆత్మన్యూనత అనే భావన రాకుండా కాపాడుకోవడం చంద్రబాబు విధి. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా ఇప్పుడు వలసలు వస్తున్న వారి మీద తెగ మోజు పడుతున్నారు.
కానీ చంద్రబాబు సిసలైన నాయకుడే అయితే గనుక.. పార్టీని నమ్ముకుని ఎప్పటినుంచో ఉన్న వారి ఆత్మవిశ్వాసం కొత్తనీటి ఉధృతిలో పాతనీరు కొట్టుకుపోకుండా జాగ్రత్త తీసుకోవడం నాయకుడిగా చంద్రబాబు బాధ్యత. చంద్రబాబుకు నిజమైన నాయకత్వ లక్షణాలు ఉంటే.. నిక్చచ్చిగా వ్యవహరించగల ధైర్యం ఉంటే.. కొత్తగా కాంగ్రెసునుంచి వలసవచ్చిన సిటింగులకు పోలోమని టికెట్లు కేటాయించకుండా.. స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో తమ సొంత పార్టీ నుంచి అభ్యంతరాలు లేనప్పుడు మాత్రమే పరిగణించాలి. వచ్చిన వారంతా గతిలేక వచ్చిన వారే గనుక.. వారి దాపున .. ఉన్నవారిని బలిపెట్టడం సరికాదని ఆయన తెలుసుకోవాలి. వలస వచ్చిన వారికి కావలిస్తే.. వలచినట్టి ఇతర పదవులు కట్టబెడతానని ఆశ చూపించాలి. అంతే తప్ప… ఏదో మాయ జరుగుతున్నట్లుగా.. వచ్చినోళ్లందరికీ పెద్దపీట వేసి.. తాను ఎక్కిన పల్లకీకి బోయీలుగా ఇన్నాళ్లూ పార్టీని మోస్తూ వచ్చిన సొంత కార్యకర్తలను, కేడర్‌ను ఇనుప పాదాల కింద తొక్కివేయడం జరిగితే గనుక… ఆయన నాయకుడు అనిపించుకోరు.
వైకాపాతో ఉండే వ్యత్యాసం గుర్తించాలి!
వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి కూడా జంప్ జిలానీలు కాంగ్రెస్‌నుంచి అనేకమంది చేరుతున్నారు కదా! మరి ఇలాంటి సమస్యలన్నీ వైకాపా కు కూడా ఉంటాయి కదా! తెలుగుదేశంలో చేరికల గురించి మాత్రమే ఇంతగా రాద్ధాంతం చేయడం అనేది కిట్టని వారి, ఓర్వలేని వారి కుట్ర అని యాగీ చేసేవారు కూడా అనేకులు ఉంటారు. కానీ పోల్చిచూసినప్పుడు ఆ వ్యత్యాసం మనకు తెలుస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అనేది నిండా నాలుగేళ్ల వయస్సున్న పార్టీ.. పైగా ఆ పార్టీ పుట్టినదే కాంగ్రెసు మీద తిరుగుబాటు చేయడం ద్వారా. ఇప్పుడు అదే క్రమంలో కాంగ్రెసు మీద తిరుగుబాటు చేస్తున్న ఇతర నాయకులు ఆ పార్టీని ఆశ్రయంగా ఎంచుకోవడం అనే ప్రక్రియ సహజాతంగా ఉంటుంది. కొత్తగా కాంగ్రెస్ వారు చేరడం వలన వారి నియోజకవర్గాల్లో.. టికెట్ మీద ఆశలు పెట్టుకున్న వారిలో కొంత అసంతృప్తి ఉండొచ్చు. కానీ కార్యకర్తలందరికీ పార్టీ బలోపేతం అయిందనే భావనే వస్తుంది.
కానీ తెలుగుదేశం పరిస్థితి అది కాదు. నిన్నటిదాకా.. (నాలుగేళ్లుగా కాదు, 30 ఏళ్లుగా) వారు కాంగ్రెస్ శక్తులతో బీభత్సంగా పోరాడుతున్నారు. వారి మధ్య ద్వేషాగ్నులు ప్రబలి ఉన్నాయి. నిన్నటిదాకా సర్కారులో ఉన్నాం కదా అని తమను హేళనగా చూస్తూ… కొన్ని చోట్ల తమ మీద కత్తులు దూస్తూ, కేసుల్లో ఇరికిస్తూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ పళ్లికిలిస్తూ.. కేండిడేట్ల రూపంలో తమ మీదనం పెత్తనం చేయడానికి వస్తే వారు సహించడం అంత సులభం కాదు. అందువల్ల వైకాపాతో పోల్చుకుని.. ‘అక్కడ చేరిక, ఇక్కడ చేరిక ఒకటే కదా’ అని వ్యాఖ్యానిస్తే ఆత్మవంచన చేసుకోవడమే.
కొత్తొకవింత పాతొక రోత… అని సామెత!
వాతావరణం చూడబోతే అలాగే కనిపిస్తున్నది. ముందే చెప్పుకున్నట్లు చంద్రబాబు ఒక్కొక్క చేరికతో మహా కుశాలగా కనిపిస్తున్నారు. ఆయన చేరికలను కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెసునుంచి క్రమం తప్పకుండా ఒక్కొక్క వీఐపీ ఒక్కొక్క రోజు చేరుతున్నట్లయితే.. మీడియాలో క్రమం తప్పకుండా పబ్లిసిటీ ఉంటుందనేది ఆయన స్కెచ్. తదనుగుణంగానే ఇప్పుడు చేరికలు చోటు చేసుకుంటున్నాయి. తళతళలాడే కొత్త ఖద్దరు చొక్కాలు తొడుక్కుని వచ్చిన నాయకులు పచ్చటి కండువాలు కప్పించుకుంటూ ఉంటే చంద్రబాబు మురిసిపోతూ ఉండవచ్చు. అంతమాత్రాన రంగు వెలిసిపోయిన తన పాత పసుపుపచ్చ చొక్కాల తమ్ముళ్లు.. తీసికట్టు అనుకుంటే ప్రమాదం. కొత్తొక వింత పాతొకరోత అన్నట్లుగా శైలి మారిందంటే అది ఆత్మహత్యాసదృశమే! ఈ సామెత చాలా సబబు అని, రుచికరమైనదని చంద్రబాబు నాయుడు భావిస్తే మాత్రం.. ఆ ‘పాత’- పాము పడగగా మారి.. ఆక్రోశం పెల్లుబికగా తిరిగి కోలుకోలేని కాటు వేస్తుంది. తస్మాత్ జాగ్రత!