అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్ కందా
తీపి వ్యాపారానికి చేదుమాత్ర ….
1975 నాటి మాట. కర్నూలు, అనంతపురం జిల్లాలలోని సినిమాహాళ్ల పన్ను ఎగవేత 25 లక్షల రూ.ల దాకా వుంటుందని అంచనాకు వచ్చి డిమాండ్ నోటీసు యిచ్చాం. హాలువాళ్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కుమ్మడిగా మాపై పడ్డారు – ఇంత కట్టనక్కరలేదంటూ. మీ సర్వేలు అంగీకరించం అంటూ సమ్మెకు దిగి సినిమా హాళ్లు మూసేశారు. నెల దాటినా విరమించలేదు. ప్రజలకు సినిమాలు లేవు. మేం చలించలేదు.
సమ్మె 50 రోజులు దాటేసరికి హాలు సంఘం నాయకులు హైదరాబాదులో ఫిర్యాదు చేశారు. వెంగళరావుగారు నిజానిజాలు కనుక్కుని రమ్మనమని కృష్ణస్వామిగార్ని పంపారు. కమ్మర్షియల్ టాక్సెస్ కమిషనర్ హోదాలో ఆయన కర్నూలు వచ్చి సంఘనాయకులందరినీ పిలిపించారు. వారంతా అంత పన్ను వేయడం అక్రమమనీ, పరిస్థితి యిలాగే వుంటే సమ్మె కొనసాగించి ప్రభుత్వాన్ని కాళ్లబేరానికి దించుతామనీ అలాటివి ఏవో అన్నారు.
నేను చేసినది అంత అసంజమసమైన, అన్యాయమైన పనా!? అంతకుముందు అనకాపల్లి బెల్లం వ్యాపారస్తుల విషయంలో కూడా యించుమించు యిలాటిదే చేశానుగా!
xxxxxx
రౌతు మెతకగా వుంటే గుఱ్ఱం మూడుకాళ్లపై నడుస్తుంది అని సామెత. 'వీడి మొహానికి నాలుగో కాలు వాడనక్కరలేదులే' అని దాని ధీమా. అంటే చేయాల్సిన పనిలో పాతికో వంతు ఎగ్గొడుతుందన్నమాట. బాస్ కాస్త సాఫ్ట్‌గా కనబడితే స్టాఫ్ తోక ఝాడించడం మొదలుపెడతారు. కొద్ది కాలానికి వాళ్లనుండి పని రాబట్టడమే కష్టమై పోతుంది. వాళ్ల బాధ్యత వాళ్లు పూర్తిగా మర్చిపోవడమే కాక, రూలు చూపెడితే ''ఇన్నాళ్లూ లేనిది యిప్పుడెందుకు అడుగుతున్నారు?'' అని ఎదురు తిరుగుతారు. ఆ పరిస్థితి రాకుండా వుండాలంటే సింహం మధ్యమధ్యలో లేచి గాండ్రించినట్టు యంత్రాంగం కూడా లేచి జూలు విదల్చాలి. లేకపోతే దాన్ని సింహం అనుకోవడం మానేసి ఆడించడం మొదలెడతారు. ఇది ప్రయివేటు యాజమాన్యానికే కాదు, ప్రభుత్వానికీ వర్తిస్తుంది.
అవినీతిని రూపుమాపడానికి, అధికారాన్ని ప్రదర్శించడానికి కొత్త చట్టాలు రావాలి అని కొందరు వాదిస్తూంటారు. కొత్త చట్టాలు అక్కరలేదు, ఉన్నచట్టాలనే ప్రభావవంతంగా ఉపయోగిస్తే చాలని అనేకమార్లు రుజువైంది. కానీ వచ్చిన చిక్కేమిటంటే ప్రభుత్వం ఒక విధమైన స్తబ్ధతలో వుంటుంది. తన శక్తిని తనే మర్చిపోతుంది. అందువలన ఒక్కోసారి మేలుకొని కొరడా ఝళిపించాలి.
xxxxxx
నేను విశాఖపట్టణంలో డిప్యూటీ కమిషనర్, కమ్మర్షియల్ టాక్సెస్‌గా వున్నపుడు (1974-75) అనకాపల్లిలో బెల్లం వ్యాపారస్తుల పోకడలు గమనించాను. అనకాపల్లి బెల్లం వ్యాపారానికి ముఖ్యకేంద్రం. కోట్లలో వ్యాపారం నడుస్తుంది. అందరూ పెద్ద ఆసాములే. పైగా సంఘటితంగా వుండేవారు. అందువలన అందరూ కలిసి కలిసికట్టుగా వుండి సేల్స్ టాక్స్ కట్టకుండా వుండేవారు. బకాయిలు పేరుకుపోయేవి. టాక్సువాళ్లు వెళ్లి అడిగితే ఇంత ఒకేసారి కట్టలేం, తగ్గించండి, వాయిదాలలో కట్టడానికి అనుమతించండి అని బేరం పెట్టేవారు. అందరూ కలిసి మూకుమ్మడిగా అదే పాట పాడడంతో, ప్రభుత్వం ఏం చేయలేక సరే ననేది. ఆ తర్వాతైనా ఒప్పుకున్న సొమ్ము కట్టేవారా అంటే అదీ లేదు. దానికీ వాయిదాలే. బకాయిలే.
నేను హ్యేండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌లో అడిషనల్ డైరక్టర్‌గా వుండగా కృష్ణస్వామిగారు నన్ను కమ్మర్షియల్ టాక్సెస్‌లో డిప్యూటీ కమిషనర్‌గా వేశారు. మాకు ఐయేయస్‌లకు సర్వీసులో చేరినపుడు ఏదో మొదట్లో ఇండక్షన్ ట్రెయినింగ్ వుంటుంది కానీ తర్వాత తర్వాత ఏ పోస్టింగ్ వేసినా వెళ్లి చేరిపోవడమే, తర్ఫీదు అంటూ వుండదు. కానీ కమ్మర్షియల్ టాక్సెస్‌లో మాత్రం మూడు నెలల ట్రెయినింగ్ యిచ్చి మరీ వేస్తారు. అప్పటికీ, యిప్పటికీ అమ్మకం పన్ను (కొత్తగా వ్యాట్ అని పేరు మార్చుకుందనుకోండి) రాష్ట్రానికి ప్రధానమైన ఆదాయ వనరు. ట్రెయినింగ్ అయ్యాక వైజాగ్‌లో పోస్టింగ్. విశాఖపట్టణం, అప్పటి శ్రీకాకుళం జిల్లాలు నా పరిధిలోకి వస్తాయి. విశాఖపట్టణంలో ఆయిల్ కంపెనీలు ఎక్కువ. శ్రీకాకుళంలో జీడిపప్పు పరిశ్రమ. అనకాపల్లిలో బెల్లం. వీటినుండే ఆదాయం బాగా వచ్చేది.
ఈ పోస్టుకి పంపేముందే కృష్ణస్వామిగారు నాకు హితబోధ చేశారు – 'వ్యాపారస్తుడిని దొంగగా చూడడం తప్పు. అతను సమాజంలో భాగం. ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి అతని కార్యకలాపాలు జరుపుకునే హక్కు వుంది. అతని స్థానం అతనిది. సమాజానికి అతని అవసరం వుంది. అది గుర్తెరిగి మన శాఖ పని చేయాలి. ప్రతీ వర్గంలోను మంచివాళ్లూ, చెడ్డవాళ్లూ వుంటారు. చెడ్డవాళ్లని ఏరిపారేసి, మంచి వాళ్లను రక్షించడం వ్యవస్థ యొక్క బాధ్యత. ప్రభుత్వ వ్యవస్థ అంటే వాళ్లకు గౌరవాన్ని కలిగించు, భయాన్ని, అసహ్యాన్ని కలిగించకు. వాడేదో నేరం చేసేసినట్టు, నువ్వేదో పెద్ద డిటెక్టివ్‌వి అయినట్టు ఏదో పన్నాగం పన్ని, వాడి చేత ఏదో తప్పు చేయించి, ఉచ్చులో పడేసి 'చూశావా పట్టేశాను' అని మీసం మెలేసి అతి తెలివి ప్రదర్శించకు. మొరటుతనం కూడా వద్దు. నువ్వు చేయాల్సినది యిది. చేయకపోతే నేను ఫలానాది చేయవలసి వుంటుంది' అని స్పష్టంగా, సూటిగానే… కానీ సున్నితంగా చెప్పు.'
నేను అదే విధంగా మసలుకుంటున్నాను కానీ అనకాపల్లి బెల్లం వ్యాపారస్తులు మాత్రం మొండి ఘటాల్ల్లా తయారయ్యారు. వాళ్లకు రాజకీయంగా చాలా పలుకుబడి వుందన్న పేరు ఎలాగూ వుంది. మా శాఖ వాళ్లు చూసీ చూడనట్లు వదిలేయడం, గట్టిగా అడిగితే 'వాళ్లకు పై వాళ్లతో సంబంధాలున్నాయండీ' అని సంజాయిషీలు చెప్పడం అలవాటై పోయింది. అప్పట్లో కమ్మర్షియల్ టాక్సెస్‌వాళ్ల సబార్డినేషన్ పై జోక్ ఏమిటంటే – సిటిఓకి ఒకవేళ ఛాతీలో నొప్పి వచ్చిందనుకోండి. డాక్టర్ని పిలవడట. కుటుంబ సభ్యులకూ చెప్పడట. తనకు ఎటాచ్ చేసిన స్పెషల్ ఎసిటిఓని పిలిచి డాక్టరు వద్దకు పంపుతాట్ట. 'దీనికి మాత్రం మీ సిటిఓగారు రాకతప్పదండీ' అని డాక్టర్‌గారు మొహమాట పెడితే అప్పుడు స్వయంగా వెళతాడట !
పోనీ ఏమీ చేయకుండా కాలక్షేపం చేసేద్దామా అంటే మాకు పన్నుల వసూళ్లకు మంత్లీ టార్గెట్స్ వుంటాయి. ఆ మేరకు పన్ను వసూలు కాకపోతే సంజాయిషీలు యిచ్చుకోవలసి వస్తుంది. ఒక్క అనకాపల్లి బెల్లం వ్యాపారస్తుల ధైర్యాన్ని సడలించగలిగితే చాలు. అందర్నీ అక్కరలేదు, ఒకరినో, యిద్దరినో లక్ష్యంగా పెట్టుకుని చేస్తే చాలు. అదీ వాళ్లకు కాపిటల్ పనిష్మెంట్ – పాతకాలంలో కొరడా దెబ్బలు, ఉప్పుపాతర వేయించడాలు వేయించేవారట – వేయనక్కరలేదు. మళ్లీ యిది చేయకండి అని ఓ చిన్నపాఠం నేర్పితే చాలు. దానికి పై వాళ్లు అడ్డు తగలకపోతే అంతే చాలు!
సమర్థవంతులైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వెంగళరావుగారు అప్పటి ముఖ్యమంత్రి. ఆయన గురించి ఓ సంఘటన చెప్తూ వుండేవారు – ఒకసారి ఆయన వద్దకు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి ''మా వూళ్లో పోలీసు సబ్-ఇన్‌స్పెక్టరు నా మాట వినటం లేదు. మన పార్టీవాళ్లను కూడా బైండోవర్ చేస్తున్నాడు. ఇలా అయితే మనం అంటే ఊళ్లో ఎవరికీ లెక్క లేకుండా పోతుంది. మీరోసారి వచ్చి అతనికి చెప్పాలి.'' అని మొరపెట్టుకున్నాడుట. అతని పోరు భరించలేక ఆ జిల్లా పర్యటనకు వెళ్లినపుడు వెంగళరావుగారు ఆ ఎస్సయిని పిలిపించారు. వీళ్లందరూ వెనక్కాలే వున్నారు.
''ఏమిటయ్యా సంగతి?'' అని అడిగారు ఇన్‌స్పెక్టర్ని. అతను జరిగినదేమిటో చెప్పాడు. అతను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించినట్టు సిఎం గారికి అర్థమైంది. శాంతిభద్రతలు సజావుగా వుండాలంటే ఆ మాత్రం కఠినంగా వుండాల్సిందే అనుకున్నారాయన. అతని అధికారాన్ని హరిస్తే వ్యవస్థకే దెబ్బ అనుకున్నారు. ''బాగుందయ్యా, కీపిటప్'' అని షేక్ హ్యాండ్ యిచ్చి వచ్చేశారు. వెంగళరావుగారి వ్యక్తిత్వం తెలిసినవారికి ఈ ఉదంతం ఆశ్చర్యం కలిగించదు.
xxxxxx
మేం అనకాపల్లిలో ఓ పెద్ద వ్యాపారిని ఎంచుకున్నాం. బకాయిలున్నాయి, వెంటనే కట్టేయమని నోటీసులిచ్చాం. ఆయన యిది మామూలే కదాని కదలకుండా మెదలకుండా కూర్చున్నారు. ఫలానా తారీకులోపున కట్టకపోతే యింట్లోంచి చెంబూ తప్పాలా బయటపారేస్తాం జాగ్రత్త అని హెచ్చరిక చేశాం. ఆయన యివన్నీ మామూలేలే అనుకుని వూరుకుని వుంటాడు. కానీ గడువు దాటగానే మా వాళ్లను పంపి అంతపనీ చేయించాం.
దీనికోసం ప్రత్యేక బలగాలను తెప్పించలేదు. అక్కడ ఎప్పణ్నుంచో వున్న సిబ్బంది చేతనే చేయించాం. అదీ కిందిస్థాయి వాళ్లే. నేను అక్కడికి వెళ్లి పక్కన నిలబడి ఏం ఫర్వాలేదు, ఊఁ కానీ..వంటి ప్రోత్సాహక వచనాలు చెపుతూ హీరోయిజం ప్రదర్శించలేదు. మామూలు రొటీన్‌గా చేయవలసినది చేసినట్టే చేసేశాం. ఒక వ్యవస్థలో కింది స్థాయివాళ్లను ఎంత బలోపేతం చేస్తే వ్యవస్థ అంత పటిష్టంగా వుంటుంది. ప్రతీదానికీ బాస్ దిగి వచ్చి పూనుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడులే అని వాళ్లు కాళ్లు జాపేస్తారు. ఎప్పుడైతే మామూలు ఉద్యోగే యింత సాహసానికి ఒడిగట్టాడో ఆ వ్యాపారస్తుడికి గుబులు పుట్టింది. ఇక లాభం లేదనుకుని గబగబా పన్ను బకాయిలు కట్టేశారు. ఆయనే కాదు, ఆయనతో బాటు ఆ వూళ్లో బడా బడా ఆసామీలు అందరూను…
xxxxxx
ఆగస్టు 1975లో నన్ను యిదే వుద్యోగంలో కర్నూలుకి బదిలీ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు నా పరిధిలోకి వస్తాయి. అక్కడ సినిమాహాలు వాళ్లతో యిలాటి ఘటనే జరిగింది. సినిమాహాళ్లనుండి వచ్చే వినోదపు పన్ను (ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్) మునిసిపాలిటీలకు ప్రధాన ఆదాయం. ఎందుకంటే ఆ పన్నులో 95% రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు యిచ్చేస్తుంది. మునిసిపాలిటీలు ఏమైనా పనులు చేపట్టాలంటే వినోదపు పన్ను వసూలు సవ్యంగా జరగాలి. కానీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు (సినిమా ప్రదర్శించే హాలువాళ్లు) కలిసి పన్ను ఎగ్గొట్టేవారు. మునిసిపాలిటీలు యీ విషయంగా ఫిర్యాదు చేసి చేసి దరిమిలా స్లాబ్ సిస్టమ్ వచ్చేందుకు కారణభూతులయ్యారు. 1975 నాటికి పాత పద్ధతే అమలులో వుండేది. రాయలసీమ (సినిమా వారి పరిభాషలో సీడెడ్)కు సినిమా డిస్ట్రిబ్యూటర్లందరికీ గుంతకల్లు ముఖ్యకేంద్రం. అది నేను చూసే అనంతపురం జిల్లా పరిధిలోకే వస్తుంది.
వినోదపు పన్ను ఎగవేత పట్టుకోవడంలో చట్టరీత్యా కొన్ని కష్టాలున్నాయి. ఇప్పుడు రైసుమిల్లు వాళ్లు మాకు యింతే వ్యాపారం జరిగింది అని దొంగలెక్కలు చూపి అమ్మకం పన్ను ఎగ్గొట్టారనుకోండి. నిజంగా ఎంత వ్యాపారం జరిగిందో కనిపెట్టడానికి మార్గాలున్నాయి. వే బిల్స్ చూస్తాం, కరంటు మీటరు రీడింగ్ చూస్తాం. ఇంతసేపు మిల్లు తిరిగిందంటే ఇంత ధాన్యం ఆడించి వుంటారు అని అంచనావేసి లెక్కలు వేస్తాం. గోడౌన్ తనిఖీ చేస్తాం. ఎన్ని వచ్చాయి, ఎన్ని వెళ్లాయి అని అనేక పాయింట్ల వద్ద రికార్డు అయి వుంటుంది కాబట్టి వాటితో సరిపోల్చి చూస్తాం. వీటిలో అప్పటికప్పుడు చెక్ చేయకపోయినా ఫర్వాలేదు. తర్వాతైనా దొరుకుతారు. సినిమా ప్రదర్శన విషయంలో అలా కుదరదు. ఆ షో సమయంలో చెక్ చేస్తేనే అసలైన అంకె తెలుస్తుంది. ప్రదర్శన అయిపోయిన నెల్లాళ్లకు పన్ను కట్టడానికి వస్తారు కాబట్టి ఫలానా రోజున, ఫలానా షోకి యింతమందే వచ్చారు అని హాలు వాళ్లు చెపితే మనం నమ్మాల్సిందే. కరంటు మీటరుబట్టి చూద్దామన్నా హాలులో ఐదుమంది వున్నా అదే రీడింగ్, ఐదువందలమంది వున్నా అదే రీడింగ్. డిస్ట్రిబ్యూటర్ తాలూకు రిప్రంటేజిటివ్ (ప్రతినిథి) అక్కడ వుంటాడు. అతను డిస్ట్రిబ్యూటర్ ప్రయోజనాలు కాపాడతాడు కానీ ప్రభు
త్వ ప్రతినిథి కాదుగా!
అమ్మకం పన్ను విషయంలో యిలాటి సందిగ్ధ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడానికి 'బెస్ట్ జడ్జిమెంట్ ఎసెస్‌మెంట్' అనే ఓ ప్రొవిజిన్ (వెసులుబాటు) వుంది. దాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనలేరు. కాని వినోదపుపన్ను విషయంలో ఎందుకోగాని యీ వెసులుబాటు కల్పించలేదు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో మొత్తం 150 పై చిలుకు సినిమాహాళ్లున్నాయి. ప్రభుత్వానికి ఎంతో ఆదాయం పోతోంది. ఏం చేయాలి? అని ఆలోచించి, ఓ పథకం వేశాం. సరాసరి సినిమాహాలు ఏ మేరకు నిండుతోంది, వాళ్లకు ఎంత ఆదాయం వస్తోంది ఓ సర్వే లాటిది చేద్దామనుకున్నాం. ఒక ప్రశ్నావళిపత్రం రూపొందించాం. సినిమా హాలు పేరు, వివరాలు, సీటింగ్ కెపాసిటీ, ఏ షోకు వెళ్లారు, వెళ్లినరోజు ఉజ్జాయింపుగా ఎంతమంది హాలులో వున్నారు? ఏ యే క్లాసుల్లో వున్నారు? యిలా..
ఈ ప్రశ్నావళిని కర్నూలు జిల్లా కలక్టరు కోసలరాం, అనంతపురం జిల్లా కలక్టరు కెయస్ శర్మలకు చూపించాను. వాళ్ల కలక్టరాఫీసు సిబ్బంది వేరే పని మీద ఏదైనా వూరెళితే అక్కడ యీ పత్రం పూరించి మాకు పంపమని కోరాను. వెళ్లి యిన్‌స్పెక్ట్ చేసే అధికారాలు కలక్టరాఫీసు సిబ్బందికి లేవు. అందువలన ఇన్‌స్పెక్షన్ అని పేరు పెట్టలేదు. పత్రం మీది వివరాలు ధృవీకరిస్తూ సినిమా హాలు వాళ్ల సంతకాలు పెట్టాలన్న నియమం కూడా పెట్టలేదు. వీళ్లు వెళ్లి రాసుకుంటూ వుంటే ఆ సినిమాహాలు వాళ్లు చూసినా పట్టించుకునేవారు కారు – దీనివలన ఏమౌతుందిలే అని. ఈ విషయసేకరణ 110 రోజులు సాగింది.
ఆ తర్వాత యివన్నీ ముందేసుకుని పన్ను ఎగవేత 25 లక్షల రూ.ల దాకా వుంటుందని అంచనాకు వచ్చాం. గుంతకల్లులో వున్న మొత్తం 17 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీసుల మీద దాడి చేసి రికార్డులు సరిచూశాం. 25 లక్షలకు డిమాండ్ నోటీసు యిచ్చాం. హాలువాళ్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కుమ్మడిగా మాపై పడ్డారు – ఇంత కట్టనక్కరలేదంటూ. చట్టప్రకారం అలా యిచ్చే అధికారంగాని, ఆస్కారంగాని మాకు లేదని గుర్తు చేశారు. మా సర్వేలు, అంచనాలు చూపాం. మేం అంగీకరించం అంటూ వాళ్లు సమ్మెకు దిగారు. రెండు జిల్లాలలోని సినిమా హాళ్లు మూసేశారు. మేం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాం. మాకు పై నుండి ఏ విధమైన ఒత్తిళ్లు రాలేదు. సేల్స్‌టాక్స్ చూసే మంత్రి గారి అల్లుడికి థియేటరుంది. ఆ థియేటరూ సమ్మెలో పాల్గొన్నారు. అయినా మంత్రి గారి నుండి మాకే విధమైన ఒత్తిడి రాలేదు.
నెలనెలా మా జీతాలు మాకు వచ్చేస్తున్నాయి కానీ మరి సినిమావాళ్లకు ఆదాయం రావటం లేదు కదా. సమ్మె 50 రోజులు దాటేసరికి వాళ్లకు కష్టం తోచింది. వాళ్ల సంఘం నాయకులు వెళ్లి హైదరాబాదులో మొర పెట్టుకున్నారు. వెంగళరావుగారు నిజానిజాలు కనుక్కుని రమ్మనమని కృష్ణస్వామిగార్ని పంపారు. ఆయన స్టేట్ ఎడ్మినిస్ట్రేషన్‌లో నంబర్ టూ స్థానంలో వున్నారు. ఫస్ట్ మెంబర్ ఆఫ్ రెవెన్యూ బోర్డు అనేవారు. కమ్మర్షియల్ టాక్సెస్ కమిషనర్ హోదాలో ఆయన కర్నూలు వచ్చి వీళ్లందరినీ పిలిపించారు. వీళ్లందరూ అంత పన్ను వేయడం అక్రమమనీ, పరిస్థితి యిలాగే వుంటే సమ్మె కొనసాగించి ప్రభుత్వాన్ని కాళ్లబేరానికి దించుతామనీ అలాటివి ఏవో అన్నారు.
అంతా విని ఆయన ''ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌గారు మిమ్మల్నేదో సతాయిస్తున్నాడేమో, మీ గోడు విందామని నేను వచ్చాను. చూడబోతే అదేం వున్నట్టు లేదు. ఇక మీరు యింకా సమ్మె చేస్తానంటారా. నిక్షేపంలా చేసుకోండి. మీవి ఆసుపత్రులు కావు, అత్యవసర సర్వీసులందించే పాలు, నీళ్లు, విద్యుత్ తరహా శాఖలు కావు. వినోదం అందిస్తున్నారు. కుదరకపోతే మానేయండి. ప్రజలు హరికథకో, బుర్రకథకో పోతారు.'' అని ఆయన లేచ్చక్కాపోయారు. హాలు యజమానులు హతాశులై పోయారు. వారంతట వారే సమ్మె ముగించుకున్నారు. మొత్తం 55 రోజులు నడిచినట్టుంది. అప్పటినుండి పన్నుల విషయంలో కాస్త హెచ్చెరుకగా వుండసాగారు.
దరిమిలా 'బెస్ట్ జడ్జ్‌మెంట్ ఆఫ్ ఎసెస్‌మెంట్' వెసులుబాటు వినోదపు పన్నులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో లోపాలను సరిదిద్దడానికి ఉత్తరోత్రా శ్లాబ్ సిస్టమ్ వచ్చింది. ఆ తర్వాత దానిలో చోటు చేసుకున్న లోపాలను సరిదిద్దడానికి మళ్లీ మార్పులు చేయవలసి వచ్చింది. అప్పుడు నేను చీఫ్ సెక్రటరీగా వున్నాను. అంటే 30 ఏళ్ల తర్వాత మళ్లీ అదే వినోదపు పన్ను సబ్జక్ట్‌పై – విధానం మారిపోయినా – డీల్ చేయవలసి వచ్చిందన్నమాట!
కొసమెరుపు – ఉద్యోగధర్మంగా సినిమాహాల వాళ్ల ఒత్తిళ్లు ఎంతైనా భరించవచ్చు కానీ ఫ్రెండ్స్ పోరు మాత్రం భరించలేం. నేను కర్నూలులో వుండగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కని మా ఫ్రెండు భుజంగరావు, మా మేనల్లుడు సీతారాం యేచూరి మా యింటికి వచ్చారు ''జనవరి ఫస్ట్ నాడు సరదాగా ఓ సినిమాకు వెళ్లడానికి కూడా లేకుండా సమయానికి యీ సమ్మెలు పెట్టించేవేమిట్రా బాబూ'' అని భుజంగం వేపుకు తినేశాడు. నెలన్నరగా సినిమా లేకపోయినా మా ఆవిడ కూడా అంత సతాయించలేదు. వీడి గురించి సమ్మె డిమాండ్లకు తలొగ్గలేం కదా! అందుకని వీళ్లిద్దర్నీ పొరుగు రాష్ట్రంలో వున్న బళ్లారికి లాక్కెళ్లి కన్నడ సినిమా చూపించి తరించాను.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version