టీ20.. కిక్కే లేదప్పా.!

ట్వంటీ ట్వంటీ.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరగాల్సిన క్రికెట్‌ ఫార్మాట్‌ ఇది. ఏకపక్షంగా టీ20 మ్యాచ్‌లు జరగడం అనేది చాలా అరుదు. వరల్డ్‌ టీ20 సిరీస్‌ అంటే ఎలా వుండాలి.? చివరి బంతికి…

ట్వంటీ ట్వంటీ.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరగాల్సిన క్రికెట్‌ ఫార్మాట్‌ ఇది. ఏకపక్షంగా టీ20 మ్యాచ్‌లు జరగడం అనేది చాలా అరుదు. వరల్డ్‌ టీ20 సిరీస్‌ అంటే ఎలా వుండాలి.? చివరి బంతికి ఏమవుతుందోనన్న టెన్షన్‌ ఆడుతున్న ఇరు జట్ల మధ్యా వుండాలి.. మ్యాచ్‌ని చూస్తోన్నవారిలోనూ ఆ ఆటెన్షన్‌ వుండాలి. కానీ, అవేవీ ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో కన్పించడంలేదు.

మరీ ముఖ్యంగా ఇండియా ఆడుతోన్న మ్యాచ్‌లు అస్సలేమాత్రం పస లేకుండా సాగుతున్నాయి. టీమిండియా గెలుస్తున్నా, భారత అభిమానుల్లోనే ఆనందం కన్పించడంలేదు. ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌లూ ఏకపక్షంగానే సాగాయి. ఒకటి పాకిస్తాన్‌, ఇంకోటి వెస్టిండీస్‌తో. ప్రత్యర్థి ఎవరైనా, మైదానంలో సేమ్‌ సీన్‌. అద్భుతమైన డైవ్‌లు లేవు.. బీభత్సమైన రన్‌ ఛేజ్‌ లేదు.. వికెట్లు టపటపా రాలుతున్న పరిస్థితులు అసలే కన్పించడంలేదు.

నెక్స్‌ట్‌ ఆస్ట్రేలియాతో అసలు సిసలు పోరుంది టీమిండియాకి. పాకిస్తాన్‌, వెస్టిండీస్‌లను కట్టడి చేసినట్లుగా, ఆస్ట్రేలియాని టీమిండియా కట్టడి చేస్తుందో లేదోగానీ, 130 పరుగుల టార్గెట్‌ని ఛేదించడానిక్కూడా, చివరి ఓవర్‌ వరకూ ఎదురుచూడాల్సి వస్తోంది టీమిండియాకి. మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తోన్నవారు క్యాచ్‌లు వదిలేయడమే కాదు, బ్యాటింగ్‌ చేస్తున్నవారేమో పలుమార్లు ఔట్‌ నుంచి తప్పించుకుంటూ.. ఆటగాళ్ళు ఆటని బోర్‌ కొట్టించేస్తున్నారు.

మొత్తంగా చూస్తే, ఇప్పటిదాకా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లన్నిటితో పోల్చితే ఈ సిరీస్‌ అత్యంత చప్పగా సాగుతోందన్నది నిర్వివాదాంశం. ఆస్ట్రేలియా – పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఒకింత రంజుగా జరిగిందని చెప్పుకోవచ్చేమో.