ఎమ్బీయస్‌ : తప్పు ఒప్పుకుంటే తప్పా?

పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన బుద్ధదేవ్‌ భట్టాచార్య యీ మధ్య పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాలో మాట్లాడుతూ 2009లో తమ పార్టీ చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నాడు. అలా ఒప్పుకోవడం చాలా పొరబాటని సిపిఎం…

పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన బుద్ధదేవ్‌ భట్టాచార్య యీ మధ్య పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాలో మాట్లాడుతూ 2009లో తమ పార్టీ చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నాడు. అలా ఒప్పుకోవడం చాలా పొరబాటని సిపిఎం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. బుద్ధదేవ్‌ పాలించే రోజుల్లో బెంగాల్‌కు పరిశ్రమలు తేవాలని చాలా ప్రయత్నించి, తన పార్టీలోని ఛాందసుల చేత నింద పడ్డాడు. సింగూరు, నందిగ్రామ్‌లో భూమి సేకరణ విషయాన్ని వివాదాస్పదం చేసిన మమతా బెనర్జీ తర్వాత వచ్చిన ఎన్నికలలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఓడించింది. ఓటమి తర్వాత సింహావలోకనం చేసుకున్న బుద్ధదేవ్‌ తమ పరాజయానికి మూడు రకాల కారణాలు వున్నాయని విశ్లేషించాడు – సింగూరు, నందిగ్రామ్‌ ఆందోళనలను అణచివేయాలని చూడడం వంటివి పరిపాలనా పరమైన తప్పులన్నాడు, యుపిఏ 1 ప్రభుత్వానికి చివరిలో అణు ఒప్పందం కారణంగా లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఉపసంహరించి బెంగాల్‌ ప్రజలకు నిరాశ కలిగించడం రాజకీయపరమైన తప్పులన్నాడు, ఇక సంస్థాగతంగా చాలా తప్పులే జరిగాయన్నాడు. మొదటి రెండూ సరిదిద్దుకోలేనివి కానీ పార్టీవ్యవస్థను క్షాళన చేయడం మన చేతిలో వున్న పని కదా, చేద్దాం అన్నాడు. గత రెండేళ్లగా అదే పనిలో వున్నాడు. పార్టీ క్యాడర్‌లో బద్ధకస్తులు, రౌడీలు, అవినీతిపరులు యిలాటివాళ్లను తప్పించాల్సిందే అంటూ లక్ష్మణ్‌ చంద్‌ సేఠ్‌ అనే అతని అక్రమాల గురించి త్రిసభ్య కమిటీ వేశాడు. వాళ్లు సేఠ్‌ నియోజకవర్గమైన హల్దియాకు వెళితే అక్కడ సేఠ్‌ అనుచరులు కమిటీ సభ్యులను అడ్డగించారు. సేఠ్‌  క్షమాపణ చెప్పినా బుద్ధదేవ్‌ అతన్నీ, నంది అనే మరో నాయకుణ్ని రాష్ట్ర కమిటీ నుండి తప్పించి, వారి స్థానంలో యువకులను నియమించాడు. 

ప్రజల్లో తమ పార్టీ గురించి విశ్వాసాన్ని పెంచడానికి తాము చేసిన తప్పుల్ని తామే ఒప్పుకుంటే మంచిదన్న ఫిలాసఫీ బుద్ధదేవ్‌ది. తక్కిన నాయకులది వేరే దృక్పథం. సింగూరు విషయంలో తప్పు చేశామని బుద్ధదేవ్‌ 2009లో ప్రకటిస్తే అలా చెప్పడం తప్పు అని తక్కినవాళ్లు అన్నారు. ఇప్పుడు పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాలోని నెటాయి గ్రామంలో 2009లో జరిగిన ఘటన గురించి బుద్ధదేవ్‌ ప్రస్తావించాడు. అప్పట్లో అది మావోయిస్టులకు నెలవుగా వుండేది. మావోయిస్టులు తృణమూల్‌ సహాయంతో సిపిఎం కార్యకర్తలను చంపుతూండేవారు. వాళ్లని అడ్డుకోవడానికి సిపిఎం పార్టీ నాయకులు అనధికారికంగా ప్రయివేటు సైన్యం తయారు చేయాలని నిశ్చయించుకున్నారు. సిపిఎ నాయకుడు రతీన్‌ దండపతే యింట్లో కొందరు గ్రామస్తులను పోగు చేశారు. అప్పుడు గ్రామంలోని కొందరు దీనిని నిరసిస్తూ అతని యింటివద్ద ప్రదర్శనలు నిర్వహించారు. రతీన్‌ మనుష్యులు వారిపై తుపాకులతో దాడి చేశారు. ఆ కాల్పుల్లో 9 మంది పోయారు. వారిలో స్త్రీలు, పిల్లలు కూడా వున్నారు. దాని వలన పార్టీకి చాలా చెడ్డపేరు వచ్చింది. బుద్ధదేవ్‌ యిప్పుడు ఆ సంఘటనను గురించి మాట్లాడి దానికి క్షమాపణ వేడాడు. 

''అలా ఎలా చేయగలడు? దాని గురించి పార్టీలో చర్చ జరగలేదు. అందరం కలిసి ఒక విధానం ఏర్పరచుకోలేదు. తను వ్యక్తిగతంగా ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని పబ్లిగ్గా ఎలా చెప్పగలడు?'' అని పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆయనకు మంచి స్నేహితుడైన సోమనాథ్‌ చటర్జీ కూడా బుద్ధదేవ్‌ను విమర్శించాడు. ఇవన్నీ చూసిన బుద్ధదేవ్‌ ఏమనుకున్నాడో ఏమో ఫిబ్రవరి 9న కలకత్తాలోని బ్రిగేడ్‌ పెరేడ్‌లో జరిగిన ర్యాలీలో కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే మాట్లాడాడు – అది కూడా ఏవో పాత విషయాలపై మాత్రమే!   

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]