అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
కమిటీ వేయడం కాలయాపనకేనా?
'జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ' (ఎన్‌డిఎమ్‌ఏ) ఏర్పరచడానికి కూర్చిన కమిటీ ప్రథమ సమావేశం.
అధ్యక్షత వహించినది ఆర్మీ చీఫ్‌గా పని చేసి రిటైరయిన జనరల్ విజ్‌గారు.
అర్జంటు పనైతే రూల్సు కూడా పట్టించుకోనక్కరలేదని నమ్మే ధైర్యానికి, చకచకా పనులు చేయించడానికీ పెట్టింది పేరు.
ప్రారంభోపన్యాసంలోనే చెప్పారు – ''హోం మంత్రి శివరాజ్ పాటిల్ గారు డిసాస్టర్ మేనేజ్‌మెంట్ పై మూడు రోజుల్లో నేషనల్ పాలసీ ఒకటి ఫ్రేమ్ చేసి ఇచ్చేయమన్నారు. ఇచ్చేద్దాం'' అని.
హోం శాఖ వద్ద పాలసీ స్టేటుమెంటు, ఎప్పుడో తయారుచేసిన ఒక బేస్ స్టడీ రిపోర్టు అప్పటికే వున్నాయి. అదీ వాళ్ల ధీమా.
''అలాగే యిచ్చేద్దాం, దాని కేముంది?'' అంటున్నారు తక్కిన సభ్యులు. అందరూ ఉన్నతాధికారులే!
అక్కడితో అసలు విషయం అయిపోయింది అన్న ఫీలింగుతో మరో టాపిక్ ఏదో మొదలు పెట్టారు.
అక్కడ కూర్చున్న నాకు బుర్ర తిరిగిపోయింది. ''మాయాబజార్''లో చిన్నమయ్య ''ఆఁ, అః..'' మంత్రం పఠిస్తున్న ఘట్టం కళ్లముందు మెదిలింది.
మూడు రోజులనుకున్న ఆ రిపోర్టు తయారు కావడానికి దాదాపు మూడేళ్లు పట్టింది!
xxxxxx
సాధారణ ప్రజానీకంలో ఓ అభిప్రాయం వుంటుంది – ప్రభుత్వం చేసే పనులన్నీ అనవసరంగా జాప్యం అవుతాయి అని. ఏదైనా విషయం మీద కమిటీ వేశారు అంటే ఇక అంతేసంగతులు అనుకుంటారు. ఏదైనా చేయకుండా వుండడానికి – చేయడమేమిటి, నిర్ణయం తీసుకోకుండా వుండడానికి గవర్నమెంటు తరచుగా ఉపయోగించే ఆయుధం కమిటీ అని అనుకుంటారు.
ఇది నిజమేనా? అని ప్రభుత్వంతో సంబంధం లేని నా మిత్రులు అడుగుతూ వుంటారు. సమాధానంగా నేను మొన్నటిదాకా సేవలందించిన డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సంస్థ గురించి, నేషనల్ పాలసీని తయారుచేయడానికి వేసిన కమిటీ గురించి, అప్పుడు జరిగిన ప్రక్రియ గురించి చెప్తాను. అంతా వింటే మీకే అర్థమౌతుంది.
వరదలు, భూకంపాలు వంటి విపత్తుల నిర్వహణకై కేంద్రప్రభుత్వం ఢిల్లీలో ఏర్పరచిన సంస్థ నేషనల్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎమ్‌ఏ). దానికి చైర్మన్ ప్రధానమంత్రి. వైస్ చైర్మన్, ఇంకో ఏడుగురు సభ్యులు వుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు చీఫ్ సెక్రటరీగా చేసి రిటైరయ్యాక నన్ను ఆ సంస్థలో సభ్యుడిగా నియమించారు. అది కేంద్రంలో సహాయమంత్రి హోదా. వైస్ చైర్మన్‌ది కాబినెట్ ర్యాంక్. (ఇప్పుడు మర్రి శశిధర రెడ్డిగారు ఆ పదవిలో వున్నారు).
2005 డిసెంబరు 27 న ప్రథమ సమావేశం జరిగింది. '30 వ తారీకు కల్లా డిసాస్టర్ మేనేజ్‌మెంట్‌పై ఒక జాతీయ విధానం తయారు చేసి యిమ్మనమని హోం మంత్రిగారు చెప్పార'ని వైస్ చైర్మన్‌గారు ఆ సమావేశంలోనే మాకు చెప్పారు. అంటే మూడు రోజులలో తయారవ్వాలన్నమాట. కానీ నిజంగా నేషనల్ పాలసీ తయారుచేసి హోం మంత్రిగారికి యిచ్చేసరికి మూడు సంవత్సరాలయింది. అవును, అక్షరాలా మూడు సంవత్సరాలు. అనగా అనుకున్న సమయానికి 365 రెట్లన్నమాట!
'అవును మరి ప్రభుత్వం పనులంటే యిలాగే వుంటాయి' అని పెదవి విరిచేముందు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి.
మాతోనే ఆ సంస్థ ప్రారంభమైంది. అందువలన కృత్యాద్యవస్థల్లాటి అవస్థలు చాలా పడ్డాం. అసలు ఈ సంస్థకు ఏం చేయాలి? ఎలా చేయాలి? దీనికి వుండవలసిన విధివిధానాలేమిటి? అన్నవి కూడా మేమే ఏర్పరచుకోవడం జరిగింది. మొదటి మీటింగు జరిగేనాటికి మా సంస్థకు ఒక ఆఫీసు లేదు. సభ్యులకు కార్లు, టెలిఫోన్లు ఏవీ ఏర్పాటు కాలేదు. పిఎలను, పిఎస్‌లను ఇంకా ఎవ్వరూ నియమించుకోలేదు. అంతా కలిసి సమావేశం కావడానికి ఢిల్లీలో సెంటార్ హోటల్‌లో ఓ గదిలో మీటింగు అని పెట్టుకున్నాం. ఆఫీసు బల్ల, కుర్చీ లాటివి ఏవీ లేవు. ఏమైనా కావలిస్తే కాలింగ్ బెల్ కొట్టి అటెండెర్‌ని పిలిచే సౌకర్యమే లేదు. అసలు బెల్లే పనిచేయలేదు.
మా సమావేశానికి అధ్యక్షత వహించినది మా వైస్ చైర్మన్ జనరల్ విజ్‌గారు. ఆయన ఆర్మీ చీఫ్‌గా పని చేసి రిటైరయ్యారు. చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని, దేశానికి అవసరం అనుకుంటే ప్రభుత్వం అనుమతులకోసం వేచి చూడకుండా అమలు చేయడంలో పేరుబడ్డారు. సభ్యుల్లో ఒకాయన ప్రొఫెసర్. మరో ఆయన ఆర్మ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్‌లో డైరక్టరు జనరల్‌గా చేసి రిటైరయ్యారు. మరో రిటైర్‌డ్ పోలీసు ఆఫీసరు, శశిధర్ రెడ్డిగారు, నేను – మొత్తం ఆరుగురం.
మా వైస్ చైర్మన్‌గారు సమావేశం ప్రారంభించారు. ఆర్మీవాళ్ల లోకమే వేరు. కావాలనే వాళ్లను లౌకిక ప్రపంచానికి దూరంగా వుంచుతారు. లేకపోతే వాళ్లూ మన సివిలియన్స్ లాగానే రాగద్వేషాలకు లోనవుతారన్న భయమో ఏమో! ప్రపంచమంతా యిదే సిద్ధాంతం అవలంబిస్తారు. అందువలన మిలటరీవాళ్లు తమ స్వభావం నిలుపుకోవాలంటే తమ ప్రపంచంలోనే వుండాలి. వాళ్లు ఎంతో ఎత్తుకి ఎదుగుతారు – తమ పరిసరాల్లో. కానీ బయటి వాస్తవాలతో వాళ్లకు ముఖపరిచయం కూడా వుండదు. సమాజంతో బాంధవ్యం వున్నట్టు తోచదు. మిలటరీ సెటప్‌లో ఒక్క కమాండ్ వేస్తే చకచకా పనులు జరుగుతాయి. బయట అలా ఏమీ జరగదు. అందువలన సాధ్యాసాధ్యాల విషయంలో వాళ్ల అంచనాలు ఎప్పుడూ తప్పుతూ వుంటాయి.
ఆయనే చెప్పాడు ''హోం మంత్రి శివరాజ్ పాటిల్ గారు మూడు రోజుల్లో నేషనల్ పాలసీ ఒకటి ఫ్రేమ్ చేసి ఇచ్చేయమన్నారు. ఇచ్చేద్దాం'' అని. హోం శాఖ వద్ద పాలసీ స్టేటుమెంటు, ఎప్పుడో తయారుచేసిన ఒక బేస్ స్టడీ రిపోర్టు అప్పటికే వున్నాయి. అదీ వాళ్ల ధీమా.
''అలాగే యిచ్చేద్దాం, దాని కేముంది?'' అంటున్నారు తక్కిన సభ్యులు. అక్కడితో అసలు విషయం అయిపోయింది అన్న ఫీలింగుతో మరో టాపిక్ ఏదో మొదలు పెట్టారు. అక్కడ కూర్చున్న నాకు బుర్ర తిరిగిపోయింది. ఇది కలా? నిజమా? అన్నంత సందేహం వచ్చింది.
అసలు నేషనల్ పాలసీ అంటే ఏమిటి? అది ఎలా తయారు చెయ్యాలి? దానిలో ఏముండాలి? ఏ యే కోణాల్లో దాన్ని పరిశీలించాలి? చిత్తు ప్రతినుండి సాపు ప్రతి వరకు ఎన్నిసార్లు పుఠం వేయాలి, ఎన్ని మెరుగులు దిద్దాలి, ఎన్ని నగిషీలు చెక్కాలి? అంతిమంగా తయారయ్యేటప్పటికి దాని రూపురేఖలు ఎలా వుండాలి? వీటి గురించి వీళ్లెవరికీ అస్సలు ఐడియా లేదన్న సంగతి తెలిసిపోతోంది. ఇంత పని వుందని కూడా వీళ్ల ఊహకు అందటం లేదన్నది సుస్పష్టం.
చెప్పాలా వద్దా? చెపితే వినిపించుకుంటారా? ఎందుకంటే 'మాకు తెలియని విషయం లేదు' అన్న అభిప్రాయం కూడా చాలామందిలో వుంటుంది. వీళ్లలో కూడా అలాటి అభిప్రాయమే వుందా? కొత్త కదా, వాళ్ల స్వభావాలు నాకు తెలియదు.
ఏమీ తెలియనివాడికి 'ఓస్, ఇంతే కదా, అసలు దీనిలో సమస్యేముంది కనుక?' అనిపిస్తుంది.
తెలిసినవాడికే సమస్య లోతుపాతులు కాస్త అర్థమవుతాయి. అప్పుడు దానికి పరిష్కారం కనుగొంటారు.
అందువలన మొదట చేయవలసిన పని వీళ్లకు 'ఇది యింత త్వరగా జరగదు' (రావు గోపాలరావు మాటల్లో నయితే 'ఇదంత అర్రీబుర్రీగా తేలే యవ్వారం కాదు') అని అర్థమయ్యేట్లా చెప్పడం అనిపించింది.
నేను గొంతు సవరించుకున్నాను – ''నేను చెప్పినది రెండు నిమిషాలు వినండి. ఫలానా టైముకి యిచ్చేస్తామని తొందరపడి హోం మంత్రి గారికి మాట యిచ్చేసేముందు నాకు ఒక్కరోజు టైము యివ్వండి. నేను రేపు మీ అందరితో నా ఆలోచనలు పంచుకుంటాను.'' అన్నాను.
వాళ్లు నా కేసి జాలిపడి చూసినట్టు అనుమానం. ఏమనుకున్నారో ఏమో ''ఒక్కరోజే కదా, ఓఖే'' అన్నారు.
అప్పుడు నేను ఎ.పి.భవన్‌లో వున్నాను. చెప్పానుగా మా కెవ్వరికీ క్వార్టర్సు యివ్వలేదు. అక్కడే మూడు నెలలున్నాను. ఆ రాత్రి జంధ్యాల హరినారాయణను నా గదికి రమ్మన్నాను. హరినారాయణ నా తర్వాత మన రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేశారు. రిటైరయ్యాక యిప్పుడు ఇన్సూరెన్సు రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్మన్ గా వున్నారు. నాకు అతనన్నా, అతని తెలివితేటలన్నా, కొత్త కొత్త ఐడియాలు యివ్వగలిగే అతని చురుకుదనమన్నా, ఆలోచనలు స్పష్టంగా, తేటతెల్లంగా వెల్లడి చేయగలిగిన అతని కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నా – చాలా గౌరవం.
అతను వచ్చాక చెప్పా – ''చూడు, మా వాళ్లు యిలా అంటున్నారు. వాళ్లకేం తెలియదన్న సంగతి నాకు తెలుస్తోంది. ఇక వాళ్లకు తెలియచెప్పడమే మిగిలింది. చాలా ఉత్సాహంగా ఉరకలు వేస్తూ వున్నారు. జాతీయవిధానం అంటే ఏమిటి? మార్గదర్శక సూత్రాలు (గైడ్‌లైన్స్) ఎలా ఏర్పరచాలి? దానికి వేయవలసిన ప్రణాళికలు ఏమిటి? యిలాటి వాటిమీద వాళ్లకు అవగాహన ఏర్పరిస్తే యీ పనిలో వున్న క్లిష్టత ఏమిటో వాళ్లకు అర్థమౌతుంది. ఇంటర్నెట్‌లో అన్నీ వుంటాయి కాబోలు, డౌన్‌లోడ్ చేసేసి, అవసరమైనచోట పేర్లు మార్చేసి ప్రింటవుట్ తీసుకుంటే చాలు అన్న అభిప్రాయంలో వున్నారు వాళ్లు. వాళ్లను భూమి మీదకు దింపాలి. ఇగ్నోరెన్సు యీజ్ బ్లిస్ (అజ్ఞానమే ఆనందం) అంటారు కదా, అలాటి చిదానందంలో వున్నారు వాళ్లు. ఇవన్నీ చెపితే గందరగోళానికి గురవుతారు. అయినా తప్పు లేదు. మనం ఏమేం చేయాలో ఓ కాగితం మీద రాద్దాం పట్టు.'' అని.
కాసిని కాగితాలు ముందు పడేసుకుని మొదలు పెట్టాం. జాతీయవిధానం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అది అన్నిటికి మూలమైన 'మదర్ డాక్యుమెంట్'. తర్వాత తర్వాత పరిస్థితులు మారితే వాటికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయవచ్చు కానీ అసలంటూ ఒక మూలపదార్థం వుండాలి. అది అప్పటికి సమగ్రంగా, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని వుండాలి.
ముఖ్యంగా దాన్ని మనం యింట్లో కూర్చుని కాస్త ఖాళీ దొరికినప్పుడు రాసిపడేయకూడదు. దాని గురించి చెప్పవలసినది మనం కాదు. మనం వినవలసినవాళ్లం. చెప్పవలసినది – సైంటిస్టులు, ఎకడమిషియన్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిథులు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జిఓ), రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రతినిథులు, వ్యాపారస్తులు, కార్పోరేట్ రంగం వాళ్లు, మేనేజ్‌మెంట్ రంగంలో అనుభవజ్ఞులు, పాత్రికేయులు…
ఎందుకంటే ఈ సంస్థ లక్ష్యాలు చాలా వున్నాయి. ప్రకృతి వలన సంభవించే విపత్తులు – అనావృష్టి వలన కలిగే కరువులు, అతివృష్టి వలన కలిగే వరదలు, తుపానులు, భూకంపాలు, కొండ చరియ విరిగి పడడాలు, హిమపాతాలు, సునామీలు…. – యిలా ఎన్నిటినో లెక్కలోకి తీసుకోవాలి.
ఇవి సంభవించకుండా చూడడం ఎలా అన్నది మొదటి అంశం. సంభవించాక అప్పటికప్పుడు ఎదుర్కొనడం ఎలా, తక్షణ సహాయక చర్యలు చేపట్టడం ఎలా అన్నది రెండో అంశం. మన చర్యల వలన కాని, తనంతట తాను కానీ ఉపద్రవం ఉపశమించాక చేయవలసిన పనులు తర్వాతి అంశం – అంటే మళ్లీ ఎవరిని వాళ్ల నివాసస్థలాలకు చేర్చడం, పోగొట్టుకున్న ప్రాణనష్టం, ఆస్తినష్టంకు నష్టపరిహారాలు, భవిష్యత్తులో యిటువంటివి మళ్లీ జరిగితే అప్పుడు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు సూచనలు, ఆదేశాలు, ఆ ఆదేశాలు మన్నించడం వలన కలిగే మంచి గురించి ప్రజలకు అవగాహన కలిగించడం – యిది మూడో అంశం.
ఉదాహరణకి ఏదైనా దేశంలో ఎక్కడైనా ఒక భవంతి కట్టినప్పుడు అక్కడ భూకంపం వచ్చే అవకాశాలను పరిశీలించి, దానికి తగ్గ జాగ్రత్తలు నిర్మాణసమయంలోనే తీసుకునేలా బిల్డర్లను ఒప్పించాలి. అగ్నిప్రమాద వేళల్లో భవనాలలో వున్నవాళ్లు బయటకు పరిగెత్తుకుని రావడానికి గాను 'ఫైర్ ఎస్కేప్' కట్టమంటేనే అదనపు ఖర్చు అంటూ తప్పించుకునే బిల్డర్లను దీనికై ఒప్పించాలంటే వాళ్లను కూడా సంప్రదించాలి. అంతేకాదు ఇంటీరియర్ డిజైనర్స్‌ను కూడా యీ ప్రక్రియలో భాగం చేయాలి. ఎందుకంటే భూకంప వేళ అధికప్రాణనష్టం జరిగేది భూమి క్రుంగి, భవంతి బీటలు తీయడం వలన కాదు, ఇంట్లో మనం పెట్టుకున్న వస్తువుల చేత! అంటే బీరువామీద పెట్టిన పెట్టె హఠాత్తుగా నెత్తిన పడి తలకాయ బద్దలవడం వంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటాయి.
అలాగే వరదలు వచ్చినప్పుడు ఊరిప్రజలంతా రక్షణకోసం ఎత్తయిన ప్రదేశంలో కట్టించిన షెల్టర్లను తక్కిన సమయాల్లో భద్రంగా చూసుకోవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలది. కొండప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలు వేరు, సముద్రప్రాంతాల్లో వుండే ప్రజల ఎదుర్కొనే ప్రమాదాలు వేరు, అడవి ప్రాంతాల్లో జరిగే ఉపద్రవాలు వేరు, ఎడారి ప్రాంతంలో సంభవించే విపత్తులు వేరు.
ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మేము సంప్రదించవలసిన ప్రజలు, నిపుణులు, నిర్ణయాలు తీసుకోవలసినవారు – ఎన్ని స్థాయిల్లో, ఎన్ని రంగాల్లో, ఎన్ని ప్రాంతాల్లో వున్నారో తెలిసివచ్చి కళ్లు తిరుగుతాయి.
అందువలన వీళ్లందరికీ ఇలా ఒక సంస్థను ఏర్పరచబోతున్నామని ఉత్తరాలు రాసి, పత్రికా ప్రకటనలు యిచ్చి అందర్నీ కలగలుపుకుని సలహాలు తీసుకుని, ఒక డ్రాఫ్ట్ తయారుచేసి, దానికి శుద్ధ ప్రతి చేసుకుని, మళ్లీ వాళ్లందరికీ పంపించి, వారి అభిప్రాయాలు, స్పందనలు, విమర్శలు స్వీకరించి, వాటినన్నిటినీ యిమిడ్చి మళ్లీ ఒక ఫార్మల్ డాక్యుమెంట్ తయారుచేయాలి. దాన్ని ప్రభుత్వానికి పంపి, వాళ్ల అభిప్రాయాలు, సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిపాక, దాన్ని కుదించి…..
హరినారాయణ, నేనూ తయారు చేసిన కాగితాల ఆధారంగా మర్నాడు 'ఇలా యింత పని వుంది బాబూ' అని చెప్పి వాళ్లకు చెప్పాను.
ఆంధ్రా 1968 ఐయేయస్ బ్యాచ్ కి చెందిన మంచి మిత్రుడు డా|| అగ్నిహోత్రి (ఇప్పుడు సెక్రటరీ జనరల్, రాజ్యసభ) ఢిల్లీ ఐఐటిలో పాలసీ ఫార్ములేషన్ (టెక్స్‌టైల్) లో డాక్టరేటు తీసుకున్నాడు. ఆ థీసిస్ పై అతని చేత మా వాళ్లకు ప్రవర్ పాయింటు ప్రజెంటేషన్ యిప్పించాను.
అంతా చూశారు. వాళ్లు కళ్లెగరేశారు. సరే, కానీ అన్నారు, ఏమనాలో తెలియక.
పని మొదలుపెట్టాం. ఒక్కొక్కదానికి ఎంత సేపు పడుతోందో వాళ్లు కళ్లారా చూశారు. జరుగుతున్న 'ఆలస్యానికి' కిమ్మనలేదు. అభ్యంతర పెట్టడం అన్న మాటే లేదు.
చివరకు 2008 అక్టోబరులో చైర్మన్ అయిన ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ జాతీయవిధానంపై ఆమోదముద్ర పడింది.
అంటే రెండు నెలలు తక్కువగా మూడేళ్లన్నమాట!
ఇంతకాలం పడుతుంది అని వాచ్యా నేను మొదటిరోజే చెప్పి వుంటే మా విజ్ గారు నన్ను షూట్ చేసేసి వుండేవాడు. 'మీ గవర్నమెంటు పనులన్నీ ఇలాగే వుంటాయి' అంటూ.
అందుకే పెద్దలంటారు – దిగేదాకా లోతు తెలియదు అని.
xxxxxx
'వినాయకుడు – కుమారస్వామి – గణాధిపత్యం' కథలో వినాయకుడుకి ట్రిక్కులు తెలుసు కాబట్టి మూడు ప్రదక్షిణాలు చేసేసి, గణాధిపత్యం చేజిక్కించుకున్నాడు. అందరూ వినాయకులు కాలేరు. మనమంతా కుమారస్వామి లాటి వాళ్లమే. పొలోమని లోకాలన్నీ తిరగాలి. తీర్థాలన్నిటిలో మునగాలి. కుమారస్వామి తనకు అర్హత లేనిదానికోసం పోటీ పడ్డాడు కాబట్టి దెబ్బ తిన్నాడు. మనకా ప్రాబ్లెమ్ లేదు కాబట్టి మనం పద్ధతి ప్రకారం అన్నీ చేస్తే తప్పక విజయం సాధిస్తాం.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version