Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: భద్రమ్‌

సినిమా రివ్యూ: భద్రమ్‌

రివ్యూ: భద్రమ్‌
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: శ్రేయాస్‌ మీడియా, పుష్యమి ఫిలిం మేకర్స్‌, ఉమా అసోసియేట్స్‌, గుడ్‌ ఫ్రెండ్స్‌
తారాగణం: అశోక్‌ సెల్వన్‌, జనని అయ్యర్‌, కాళి, జయప్రకాష్‌, జయకుమార్‌ తదితరులు
సంగీతం: నివాస్‌ కె. ప్రసన్న
కూర్పు: లియో జాన్‌ పాల్‌
ఛాయాగ్రహణం: దినేష్‌ కృష్ణన్‌
నిర్మాతలు: గుడ్‌ఫ్రెండ్స్‌ మరియు బి. రామకృష్ణారెడ్డి
కథ, కథనం, దర్శకత్వం: పి. రమేష్‌
విడుదల తేదీ: మార్చి 21, 2014

తమిళంలో విజయవంతమైన ‘తెగిడి’ చిత్రానికి తెలుగు అనువాదం ఈ ‘భద్రమ్‌’. తమిళ విమర్శకుల ప్రశంసలు అందుకున్న మర్డర్‌ మిస్టరీ కథ ‘తెగిడి’లో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే లక్షణాలెన్ని ఉన్నాయో, బాక్సాఫీస్‌ని భద్రమ్‌గా దాటేసే సత్తా ఏమాత్రముందో చూద్దాం.

కథేంటి?

వేణు (అశోక్‌) ఒక డిటెక్టివ్‌ ఏజెన్సీలో జాయిన్‌ అవుతాడు. వివిధ వ్యక్తుల జీవన శైలి, అలవాట్లు వారికి తెలియకుండా సేకరించడం అతని పని. అందులో భాగంగానే అతనికి మధుశ్రీ (జనని) గురించి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఆమెని స్టడీ చేసే నేపథ్యంలో అతను ఆమెతో ప్రేమలో పడతాడు. తన వృత్తికి విరుద్ధమైనా కానీ మధుకి దగ్గర అవుతాడు. తను ఇన్వెస్టిగేట్‌ చేసిన వ్యక్తులందరూ అనుమానాస్పదంగా చనిపోతూ ఉండడంతో మధు కూడా ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు వేణు. ఆమెని కాపాడుకోవాలంటే ఆ హత్యలకి కారణం తెలుసుకోవాలి కనుక ఆ మిస్టరీని ఛేధించే ప్రయత్నం మొదలు పెడతాడు. వివరాలు తెలుసుకోమని తనకి అప్పగించిన వ్యక్తులందరూ కూడా బంధువులు ఎవరూ లేని అనాధలు కావడంతో ఆ కోణంలో చూసిన వేణుకి కొన్ని నిజాలు తెలుస్తాయి. 

కళాకారుల పనితీరు!

అశోక్‌ సెల్వన్‌ ఫర్వాలేదనిపించాడు. తన కంటే మంచి నటుడు అయితే ఈ పాత్రకి మరింత న్యాయం చేసి ఉండేవాడేమో. మరీ ఎక్కువ అండర్‌ ప్లే చేయడం వల్ల కొన్ని సీన్స్‌లో అశోక్‌ తేలిపోయాడు. జనని అయ్యర్‌ ఓకే. హీరోయిన్‌ మెటీరియల్‌ కాదు కానీ పాత్రకి తగినట్టు ఉంది. జయప్రకాష్‌, జయకుమార్‌ బాగానే నటించారు. హీరో స్నేహితుడైన వంటవాడి పాత్రలో కాళి కాస్త వినోదం అందించాడు. కీలకమైన ప్రొఫెసర్‌ క్యారెక్టర్‌ చేసిన నటుడు అతి ముఖ్యమైన సన్నివేశంలో పేలవమైన నటన ప్రదర్శించాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:

నివాస్‌ స్వరపరిచిన పాటలు తమిళంలో ఎలా ఉన్నాయో కానీ అనువాద సాహిత్యంతో దారుణంగా విసిగించాయి. అనువాద చిత్రాల్ని అందించే నిర్మాతలు సాహిత్య విలువలపై దృష్టి పెట్టాలి. పాట ఉండడం తప్పనిసరి అయినప్పుడు అది వినడానికి బాగుందా లేదా అని చూసుకోవడం కూడా కంపల్సరీ. నేపథ్య సంగీతం బానే ఉంది. వేగంగా కదలాల్సిన చోట కూడా నిదానమే ప్రధానమ్‌ అన్నట్టుగా సాగిన ‘భద్రమ్‌’ విషయంలో ఎడిటర్‌ కాస్త కఠినమ్‌గా ఉండాల్సింది. కెమెరా వర్క్‌ ఓకే. 

రమేష్‌ కూడా చాలా మంది యువ తమిళ దర్శకులలా కొత్తగా తీయాలనే ప్రయత్నం చేసాడు. అతను ఎంచుకున్న కథ కూడా బాగుంది. అయితే తెర మీదకి వచ్చేసరికి దానికి చాలా ఇబ్బందులొచ్చాయి. మిస్టరీ సినిమాలు నిదానంగా సాగుతాయనేది నిజమే అయినా కానీ ట్విస్టులు వచ్చినపుడు, అసలు నిజాలు ఛేధించేటపుడు కూడా ఆ నీరసం పనికి రాదు. ఇంటర్వెల్‌ ముందు ఒక పావుగంట పాటు పరుగులు పెట్టించిన దర్శకుడు అదే జోరుని ఇక ఎక్కడా చూపించలేకపోయాడు. 

హైలైట్స్‌:

  • ఇంటర్వెల్‌ ముందు పదిహేను నిముషాలు
  • సస్పెన్స్‌ ఎలిమెంట్‌

డ్రాబ్యాక్స్‌:

  • పాటలు
  • హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌
  • పతాక సన్నివేశాలు
  • మందకొడి కథనం

విశ్లేషణ:

ప్రశంసించదగ్గ ప్రయత్నమే కానీ మెచ్చుకోతగ్గ చిత్రమైతే కాదిది. ఇలాంటి సినిమాలకి రెండు గంటల నిడివి అవసరం లేదు. ఆ పావుగంట, ఇరవై నిముషాలు కుదించుకుని ఉంటే మరింత ప్యాక్‌డ్‌గా ఉండేది. ఒకవేళ రెండు గంటల సినిమా అవసరం అనుకుంటే, మిస్టరీతో పాటు లవ్‌స్టోరీ కూడా కంపల్సరీ అనుకుంటే ఆ సన్నివేశాలు బోర్‌ కొట్టకుండా ఆకట్టుకునేలా చిత్రీకరించి తీరాలి. ఫస్ట్‌ గేర్‌ నుంచి నెక్స్‌ట్‌ గేర్‌కి షిఫ్ట్‌ అవడానికి ‘భద్రమ్‌’ చాలా టైమ్‌ తీసుకుంటుంది. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించాక కానీ గేర్‌ మార్చకపోవడంతో ఆరంభంలో నలభై నిముషాల పాటు బాగా విసిగిస్తుంది. 

సడన్‌గా డైరెక్టర్‌ టాప్‌ గేర్‌లోకి వెళ్లి ఇంటర్వెల్‌ ముందు కాసేపు ఎదురే లేకుండా దూసుకుపోయాడు. కథానుసారం... ‘బ్రేక్‌’ తర్వాత కూడా అదే స్పీడ్‌ మెయింటైన్‌ అవుతుందనే కాన్ఫిడెన్స్‌ వస్తుంది. ఎంత మామూలుగా చూద్దామన్నా కానీ తమిళంలో ఈ చిత్రానికి విపరీతమైన ప్రశంసలు దక్కాయనేది కూడా మైండ్‌లో ప్లే అవుతూ ఉంటుంది కనుక ఎక్స్‌పెక్టేషన్స్‌ తగ్గించుకుని చూడడం ఒకింత కష్టమవుతుంది. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకున్నా కానీ ద్వితీయార్థంలో సమస్యని సాల్వ్‌ చేసిన విధానం ఏమాత్రం ఆకట్టుకోదు. విలన్స్‌ పాసివ్‌ మోడ్‌లోకి వెళ్లిపోవడం వల్ల హీరో యాక్టివ్‌గా ఉండడానికి స్కోప్‌ దక్కలేదు. అక్కడక్కడా టెన్స్‌ మోమెంట్స్‌ ఉన్నాయి కానీ అరెస్టింగ్‌ స్క్రీన్‌ప్లే అయితే ఖచ్చితంగా లేదు. 

మిస్టరీ ఛేధన కూడా చాలా సింపుల్‌గా జరిగిపోతుంది. ఎంతో ప్లాన్డ్‌గా స్కెచ్‌ వేసిన విలన్స్‌ చాలా సింపుల్‌గా దొరికేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మర్డర్స్‌కి కారణం ఏదైతే ఉందో అది సీనియర్‌ డైరెక్టర్‌ వంశీ తీసిన ‘కొంచెం టచ్‌లో ఉంటే చెపుతాను’ కథాంశంతో పోలి ఉంది. మరీ ఆ సినిమాలా నాటుగా కాకుండా ఈ చిత్రంలో దర్శకుడు కాస్త ట్రెండీగా తీసాడంతే. కాకపోతే ఇదంతా చేయడానికి ఇప్పించిన ‘వివరణ’ ఏదైతే ఉందో అది తేలిపోయింది. అక్కడ ఉండాల్సిన ఇంటెన్సిటీ మిస్‌ అవడంతో ఇంపాక్ట్‌ లేకుండా పోయింది. 

కీలక సమయాల్లో హీరో రియాక్షన్స్‌ కూడా బాలేదు. చాలా లేట్‌గా రెస్పాండ్‌ అవుతూ కొన్ని తప్పులకి తనే కారణమవుతాడు. హీరోయిన్‌ నెక్స్‌ట్‌ టార్గెట్‌ కనుక ఆమెపై కొన్ని ఎటాక్స్‌ జరుగుతూ ఉన్నట్టయితే ఈ థ్రిల్లర్‌ కాస్త థ్రిల్లింగా తయారై ఉండేది. సీక్వెల్‌ తీయడానికి స్కోప్‌ ఉంచి ఎండ్‌ చేయడం కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా లేదు. ఓవరాల్‌గా ఇది జస్ట్‌ ఓకే అనిపించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఈ జోనర్‌ సినిమాలతో బాగా పరిచయం ఉన్నవారికి, ఇలాంటివి అనేకం చూసిన వారికి ఇది చాలా మామూలుగా అనిపిస్తుంది. బాగా తీయడానికి స్కోప్‌ ఉండి కూడా సింపుల్‌గా తేల్చేయడం, అవసరానికి మించి నిదానం పాటించడం దీని బలహీనతలు. 

బోటమ్‌ లైన్‌: సాదా సీదా థ్రిల్లర్‌ చిత్రమ్‌!

-జి.కె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?