అనుభవాలూ – జ్ఞాపకాలూ :డా|| మోహన్ కందా
నా మీద నీకు నమ్మకం లేదా? అని అడిగిన ఎన్టీయార్
రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైయిటీస్‌గా నేను, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయిస్‌గా వున్న చరణ్‌దాస్ ఆఢా లెవీ ఫ్రీ షుగర్ విషయంపై ఒక అంగీకారానికి రాలేకపోయాం. ముఖ్యమంత్రిగా వున్న రామారావుగారు రెండు వాదనలూ విని చివరకి నాకు నచ్చని ఓ నిర్ణయానికి వచ్చారు. ''సరేనండి. అయితే యీ మీటింగ్‌లో మనం అనుకున్నవి మినిట్స్ చేయిద్దాం. రాతపూర్వకంగా పెట్టేసి సంతకాలు పెట్టేద్దాం'' అన్నాను దాని వలన భవిష్యత్తులో చిక్కుల వస్తాయన్న భయం వుంది కాబట్టి..
రామారావుగారు ఆశ్చర్య పడుతూ ''అదేమిటి మోహన్ ! నాకు నీ మీద నమ్మకం వుంది'' అన్నారు.
''అబ్బే యిది మీకు నామీద వున్న నమ్మకం గురించి కాదండీ…'' అని అర్ధోక్తిలో ఆగాను.
''..అంటే, నీ ఉద్దేశం.., నా మీద నీకు నమ్మకం లేదా?'' అని అడిగారాయన !
ఆ సమయంలో నేనేం చెప్పాలి?
…అయినా అన్నీ నోటితో చెప్పాలా?
మనసులోని భావాలను మాటల్లో చెప్పడం ఒక కళ అయితే, ఆ మాటలు కూడా అక్కరలేకుండా భావాలు పలికించడం అంతకంటె గొప్ప కళ. ఆధునిక పరిభాషలో నాన్-వెర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ యిత్యాది పదాలు ఉపయోగిస్తున్నా యివన్నీ ఎప్పటినుండో వున్నాయి. 'కొసరిమాటలేలరా.. కనుసైగలే చాలురా' అని జావళీలలో కనబడుతుంది. ఇంతకంటె తమాషా అయినది మరొకటుంది. పైకి వినిపించే మాటలు వేరు, వాటి వెనుక అంతర్లీనంగా వినిపించే సందేశం వేరు.
xxxxxx
నేదురుమల్లి జనార్దనరెడ్డిగారు ముఖ్యమంత్రిగా వుండగా (1990-92) నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎక్స్ అఫీషియో సెక్రటరీగా వున్నాను. పివి నరసింహారావుగారు ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రిగారు, ఆయనతో బాటు మేమందరం ఎయిర్‌పోర్టుకి వెళ్లాం. విమానం మెట్లు ఎక్కబోతూ ఒక్కసారి ఆగి నాకోసం కలయజూశారు. స్వభావరీత్యా నేను చొచ్చుకునిపోయి ముందువరుసలో నిలబడే రకం కాదు. ఎక్కడో దూరంగా విమానం నిచ్చెనకు అటువైపు నిలబడ్డాను. ఆయన నాకోసం చూసి, నేను కనబడగానే ''ఏం మోహన్ బాగున్నావా?'' అని పలకరించి నేను తలవూపే లోపునే, మెట్లెక్కేశారు. నా నుండి సమాధానం ఏమీ ఆశించలేదు. అంతకంటె సంభాషణ పొడిగించనూ లేదు. ఇది గమనించి అందరూ ఆశ్చర్యపడ్డారు.
ఇదే ఆశ్చర్యం అనుకుంటే యిది యింకోసారి మళ్లీ యిలాగే చేయడం యింకా ఆశ్చర్యం. అప్పుడు (1993) ముఖ్యమంత్రిగా విజయభాస్కరరెడ్డిగారున్నారు. ప్రధానమంత్రి హోదాలో పివి నరసింహారావుగారు తన నియోజకవర్గం అయిన నంద్యాల పర్యటించి హైదరాబాదు మీదుగా ఢిల్లీ వెళుతున్నారు. ఇదే ఘట్టం మళ్లీ జరిగింది. నేనెక్కడో వుండడం, ఆయన మెట్లెక్కబోతూ నాకోసం అటూ యిటూ చూసి ''ఏం మోహన్ బాగున్నావా?'' అనడం, మెట్లెక్కేయడం.
ఏమిటిది? నాతో ఏమైనా మాట్లాడేది వుంటే నన్ను విడిగా పిలిచి మాట్లాడవచ్చు. అంత యిదిగా పదిమందిలోనూ నా యోగక్షేమాలు విచారించేది దేనికి? నేనేమైనా చేయాలా? చేయకుండా వుండాలా?
ఈ అనుమానాలు నాకే కాదు, నా చుట్టుపక్కల వున్నవాళ్లందరికీ కలిగాయి. కొంతమంది జనాంతిక సంభాషణల్లో పైకి వెలిబుచ్చితే మొదటిసారి జనార్దనరెడ్డిగారు, రెండోసారి విజయభాస్కరరెడ్డిగారు ఒకటే అన్నారు – ''పివి గారికి ఈ మోహన్ బాగా తెలిసుంటాడయ్యా'' అని.
''అయ్యా అటువంటిది ఏమీ లేదు, ఎప్పుడో చిన్నప్పుడు మా ఫ్యామిలీ అంతా ఆయనకు తెలుసు కానీ తర్వాత నేనసలు ఆయనను కలిసిందీ లేదు, నా గురించి ఆయనకు తెలిసున్నది అంత కంటె లేదు'' అన్నాను రెండు సార్లూ.
''… మరి!?'' అన్నారు వాళ్లు.
ఆ ప్రశ్న నాకూ వచ్చింది. ఏమిటీ మిస్టరీ అని ఆయన ధోరణి బాగా తెలిసున్నవాళ్లని అడిగాను.
''అది ఆయన పద్ధతయ్యా, మరేం లేదు. నువ్వు ఆయన దగ్గర ఆశించేదేమీ లేదు, ఆయన నీకు చేయాల్సిందేమీ లేదు, కాని నీ పరిస్థితులు ఎలా వుండి వుంటాయో ఊహించుకోగలిగిన మనిషి. మంచివాడు కనుక నువ్వు అడగకుండానే సహాయం చేద్దామని ఆలోచన. ఇలాటి పలకరింపు ఒక్కటి చాలు ముఖ్యమంత్రికి – 'ఈ మోహన్ అంటే నాకు మంచి అభిప్రాయం వుంది. కనుక అతన్ని సరైన విధంగా వాడుకుంటే సంతోషిస్తాను' అని ఆయన చేస్తున్న సూచన అని అర్థం చేసుకోవడానికి!''
ఈ విధమైన పద్ధతిలో ఆయన వాచ్యా ఏమీ చెప్పటంలేదు. కానీ అందరి ఎదుటా పలకరించి ముఖ్యమంత్రి దృష్టిలో నా స్థాయి పెంచుతున్నారు.
xxxxxx
నిజానికి యిలాటివి మేము జిల్లా స్థాయిలో చేస్తూ వుంటాం.
ఏదైనా కలక్టరు ఆఫీసులో చేరిన వారం లోపునే అక్కడి సంగతులు తెలిసిపోతాయి. ఎవరు చేసే రకం, ఎవరు దాటవేసే రకం, ఎవరు ఎగేసే రకం, ఎవరు మేసేరకం – యివన్నీ అర్థమై పోతాయి. ముందువాళ్లు కొంత చెప్తారు, ఆఫీసులో వున్నవాళ్లే కొంత చెప్తారు. పరిస్థితిని చక్కదిద్దడం ఎలా? అదేదో సినిమాలో రాజబాబులా 'అసలే చండశాసనమ్ముండావాణ్ని' అంటూ గంతులేస్తూ తిరిగే అవసరమూ లేదు, ''అవినీతిని, అసమర్థతను సహించను'' అని గంభీరోపన్యాసాలు యిచ్చే అవసరం అంతకంటె లేదు. అసలు మనం అక్కడకు వెళ్లడానికి ముందే మన సంగతి అక్కడకు చేరిపోతుంది. అందువలన జాగ్రత్త పడతారు. వెళ్లిన రెండు రోజుల్లోనే మన తీరుతెన్నులు చూసి 'నిజమేనన్నమాట' అనుకుంటారు. దానికి తగ్గట్టుగా మసలుకుంటారు.
కానీ కొన్ని మొండిఘటాలుంటాయి. వాళ్లకోసం ఒకటి రెండు సార్లు అటెండెన్సు రిజిస్టర్ పదిగంటల కల్లా మన దగ్గరకు తెప్పించేసుకుంటాం. మర్నాటినుండి అందరూ పంక్చువల్‌గా వస్తారు. అలాగే చేతులు చాచే అలవాటు వున్నవాళ్లను సీటు మారుస్తాం. సీటు మార్చగానే వాళ్లకు సంకేతం వెళ్లిపోతుంది, కలక్టరుగారు గమనిస్తున్నారని ! పిలిచి నోటితో వార్నింగ్ యివ్వవలసిన అవసరం లేదు. అలాగే బాగా పనిచేసేవాళ్లుంటారు. వాళ్లను సత్కరించడం ఎలా? జీతాలు పెంచడం మన చేతిలో లేదు.
అలాటి సందర్భాల్లో పిలిచి ఆఫీసుకి సంబంధం లేని పనులలో అతని సహాయం కోరామనుకోండి సంతోషిస్తాడు. ఉదాహరణకి, ''టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఓ వ్యాసం రాస్తున్నాను, ఆ సబ్జక్ట్‌పై నీకు మంచి గ్రిప్ వుంది కదా, కాస్త సమాచారం సేకరించి పెడతావా?' అనవచ్చు. 'అమెరికాలో మా ఫ్రెండ్‌కి మంచి తెలుగు పాటలు రికార్డు చేసి కాసెట్ పంపుదామనుకుంటున్నాను. నీకు మంచి టేస్టు వుంది కదా, కాస్త సెలక్ట్ చేసి పెడతావా?'' అనవచ్చు. అది చాలు – అతనికి 'మొరాల్ బూస్టర్'గా పనిచేయడానికి.
xxxxxx
మన కంటె పై వాళ్లతో వ్యవహరించినపుడు సంకేతాలు వుపయోగపడే తీరు గురించి 1988 నాటి ఒక ఉదంతం – నాకు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటులో కమిషనర్‌గా పోస్టింగ్ యిష్టమని తెలిసి కూడా రామారావుగారు ఎక్సయిజ్ శాఖలో వేశారు.
మర్నాడు రామారావుగారిని కలవడానికి వెళ్లాను. ఆయన అప్పటికే రుసరుసలాడుతున్నారు. పోస్టింగ్‌లు నచ్చనివాళ్లు ఆయన వద్దకు వచ్చి మొత్తుకోవడాలు, నొచ్చుకోవడాలు, నిష్ఠూరపోవడాలు, మార్చమని కోరడాలు జరుగుతున్నాయి. ఇక నేను వచ్చి కలిసినా అలాగే వాపోవడానికి వచ్చానని ఆయన అనుకునేట్టున్నారు.
''నేను వాళ్లలా కాదు, ఐ మేడ్ పీస్ విత్ మై ఫేట్. మీ నిర్ణయానికి తలవొగ్గి దైవం మీద భారం వేసి ఆ పోస్ట్‌కు వెళుతున్నాను'' అని చెప్పాలనుకున్నాను. ఆయన సెక్రటరీ ప్రసాద్‌ను పిలిచి ''ఎక్సయిజ్ కమిషనర్ మోహన్ కందాగారు వచ్చారని చెప్పు.'' అన్నాను.
అతను అలాగ చెప్పగానే రామారావుగారు విషయమంతా గ్రహించారు. ప్రసన్నులయ్యారు. నన్ను చూడగానే నా మూడ్ గమనించి ''వెరీ గుడ్ మోహన్, ఇది మంచి శాఖ. నీ మీద నాకు చాలా ఆశలున్నాయి..'' అంటూ చెప్పి పంపించివేశారు.
ఆ విధంగా నన్ను నేను పరిచయం చేసుకోవడంలోనే కొత్త నియామకానికి నా ఆమోదాన్ని తెలపడంతో ఆయనకు మనస్తాపం తగ్గింది.
xxxxxx
నేను రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైయిటీస్‌గా వున్నపుడు (1984-88) నాకు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయిస్‌గా వున్న చరణ్‌దాస్ ఆఢాకు లెవీ ఫ్రీ షుగర్ విషయంపై ఒప్పందం కుదరలేదు. నేనొకటి అంటే ఆయన మరొకటి అంటాడు. అలంకరిస్తున్న పదవి బట్టే మన వాదనలు వుంటాయని అందరికీ తెలిసినదే. మా యిద్దరి వాదనలూ విని సయోధ్య కుదురుద్దామనుకుని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుగారు ఓ భేటీ ఏర్పరచారు.
నిజానికి ఆఢా నాకు కొత్తవాడు కాదు, మా బ్యాచ్ వాడే. అతను విదేశాలలో పని చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినపుడు ఏదైనా మంచి పోస్టింగ్ దక్కితే బాగుండును అనుకున్నాను. వెళ్లి చీఫ్ సెక్రటరీ శ్రావణ్‌కుమార్ గార్ని అడిగాను – ఏమండీ అతనికి ఏం యివ్వబోతున్నారు అని!
ఆయన కళ్లెగరేశారు.
అతని గురించి యీయనకు పెద్దగా ఐడియా ఏమీ లేదేమోననుకుని నా ఆదుర్దా కొద్దీ డైరక్టుగా రామారావు గారి దగ్గరకే వెళ్లి ''ఫలానా ఆఢా అండి. మంచి సమర్థుడు. అతనికి మంచి పోస్టు యిచ్చి అతని సేవలు వినియోగించుకుంటే బాగుంటుంది'' అన్నాను.
''అలాగే మోహన్, ఏం పోస్టు యిద్దామంటావ్?'' అన్నారాయన.
''అవన్నీ చెప్పవలసినవాణ్ని నేను కాదండి. అతను మంచివాడు, సమర్థుడు అని నాకు తెలుసు. అది చెప్పగలను. ఫలానా పోస్టులో వేయండి అని చెప్పి ఔచిత్యభంగం చేసేవాణ్ని కాను. ఒకసారి మీరు అతన్ని పిల్చి మాట్లాడండి. మీకూ ఓ ఐడియా వస్తుంది. తర్వాత చీఫ్ సెక్రటరీగారితో మాట్లాడి, మీరూ మీరూ సంప్రదించుకుని అతను దేనికి తగినవాడైతే అదే యివ్వండి.'' అన్నాను నిష్పూచీగా.
రామారావుగారు అతన్ని పిలిపించారు. ఇంప్రెస్ అయ్యారు. ఆయనకు ఎంతో యిష్టమైన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం చూసే సివిల్ సప్లయిస్ శాఖ యిచ్చారు. అప్పటికి వేణుగోపాల్‌గారు వెళ్లిపోయారు. ఇతనికి యిచ్చారు. అతని శాఖ గురించి అతనికి చింత. నా కోఆపరేషన్ శాఖ గురించి నాకు చింత. ఎంత స్నేహితులమైనా శాఖాధిపతులుగా తలపడాలంటే సై అంటే సై అనుకుంటాం. అదే జరిగింది.
సరే రామారావుగారు మా యిద్దరి వాదనలూ విన్నారు. చివరకి ఓ నిర్ణయానికి వచ్చి ''సరే యిలా చేద్దాం'' అన్నారు. అది నాకు రుచించనిదీ, ఉత్తరోత్రా దానివలన చిక్కులు వస్తాయని భయపడుతున్నదీ !
''సరేనండి. అయితే యీ మీటింగ్‌లో మనం అనుకున్నవి మినిట్స్ చేయిద్దాం. రాతపూర్వకంగా పెట్టేసి సంతకాలు పెట్టేద్దాం'' అన్నాను.
రామారావుగారు నాకేసి వింతగా చూస్తూ నాకు హామీ యిస్తున్నట్టు ''అదేమిటి మోహన్ ! నాకు నీ మీద నమ్మకం వుంది'' అన్నారు.
''అబ్బే యిది మీకు నామీద వున్న నమ్మకం గురించి కాదండీ…'' అని అర్ధోక్తిలో ఆగాను.
మరో పనికై పక్కకు తిరిగి పెన్ను తీసుకుంటూ వుంటే హఠాత్తుగా ఆయనకు తట్టింది, ఆయన 'ఔదార్యాని'కి రావలసినంత స్పందన రాలేదని. వెనువెంటనే ఓ సందేహం కూడా కలిగింది. పైకి వెలిబుచ్చేశారు కూడా ''..అంటే, నీ ఉద్దేశం.., నా మీద నీకు నమ్మకం లేదా?''
నేనేమీ మాట్లాడలేదు. నేలకేసి చూస్తూ కూర్చున్నాను. ఒకవేళ నా మనసులో ఊగిసలాట వున్నా బాహాటంగా చెప్తామా ఏమన్నానా? అన్నీ వాచ్యా చెప్పాలా?
చెప్పానుగా – అక్‌ల్‌మంద్‌కో యిషారా కాఫీ హై అని. రామారావుగారు క్షణంలో నా మనసులో మెదిలే భావాలు గ్రహించారు. తన పర్శనల్ సెక్రటరీని పిలిచి ''ప్రసాద్, యిప్పుడు మనం డిస్కస్ చేసినవి వీళ్లిద్దరూ మినిట్స్ చేసి యిస్తారు. వీళ్లతో వెళ్లి తీసుకురండి. నేను సంతకం పెడతాను.'' అన్నారు.
దాని గురించి మళ్లీ ఏమైనా అనుకోవడం గాని, అనడం గానీ చేయలేదు.
నోరెత్తి పలకకుండానే కార్యం సాధించవచ్చు.
సంభాషణ అక్కరలేదు, సంకేతం చాలు.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com