ఎమ్బీయస్‌ : నిజమే పాపం..

పసిఫిక్‌ మహాసముద్రంలోని మార్షల్‌ దీవులలో నివసించే యిద్దరు వ్యక్తులకు జనవరి 30 న సముద్రతీరాన ఫైబర్‌ గ్లాస్‌తో చేసిన 22 అడుగుల బోటు ఒకటి కనబడింది. దానిలో పొడుగాటి గడ్డం, భుజాలు దాటిన జుట్టు…

పసిఫిక్‌ మహాసముద్రంలోని మార్షల్‌ దీవులలో నివసించే యిద్దరు వ్యక్తులకు జనవరి 30 న సముద్రతీరాన ఫైబర్‌ గ్లాస్‌తో చేసిన 22 అడుగుల బోటు ఒకటి కనబడింది. దానిలో పొడుగాటి గడ్డం, భుజాలు దాటిన జుట్టు వున్న ఒక మనిషి కనబడ్డాడు. చిరిగిపోయిన డ్రాయరు వేసుకున్నాడు. స్పానిష్‌ భాష మాట్లాడుతున్నాడు. నానా అవస్థలు పడితే అతని కథ కొద్దిగా బోధపడింది. అతని పేరు జోస్‌ సాల్వడార్‌ అల్వారెంగా. వయసు 37. 16 నెలల క్రితం 2012 సెప్టెంబరులో మెక్సికో నుండి ఎల్‌ సాల్వడార్‌ వెళదామని అతనూ, యింకో అతనూ బోటులో బయలుదేరారు. ఇంజన్‌ ప్రొపెల్లర్లు పనిచేయడం మానేయడంతో బోటు అదుపు తప్పి, సముద్రంలో కొట్టుకుపోసాగింది. అలా అలా అలలపై తేలుతూ 12,500 కి.మీ.ల దూరంలో వున్న యీ దీవులకు కొట్టుకుని వచ్చాడు. అతని సహచరుడు మధ్యలోనే చనిపోయాడు. ఇతను వట్టి చేతులతో సముద్రపు పకక్షులను, తాబేళ్లను పట్టి తింటూ వచ్చాడు. ద్వీపవాసులు అతన్ని డాక్టరు వద్దకు తీసుకెళ్లి చూపించారు. బ్లడ్‌ ప్రెషర్‌ తక్కువగా వుండడం, యితరుల సాయం లేకుండా నడవలేకపోవడం తప్పిస్తే అతనికి వేరే ఆరోగ్యసమస్యలు లేవు. 

2006లో ముగ్గురు మెక్సికన్లు షార్కు చేపలను వేటాడుతూ బయలుదేరి యిలాగే దారి తప్పి పసిఫిక్‌ మహాసముద్రంలో తేలియాడుతూ 9 నెలల తర్వాత మార్షల్‌ దీవుల్లో తేలారు. ఇన్నాళ్లూ ఎలా బతికారు అంటే వర్షం వచ్చినపుడు ఆ నీరు పట్టుకుని తాగాం. పచ్చి చేపలు, సముద్రపు పకక్షులు పట్టుకుని తిన్నాం అన్నారు.  ఇప్పుడు యీ ఇవాన్‌ కథ ఎంతవరకు నమ్మాలో తెలియలేదు. సముద్రంలో యిలాటి ప్రమాదాలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో నావికులకు శిక్షణ యిచ్చే క్లిఫ్‌ డౌనింగ్‌ అనే శిక్షకుడు యితని కథ నమ్మదగినదిగా లేదన్నాడు. ఇన్నాళ్ల సముద్రయానంలో బతికి వుండాలంటే వెయ్యిన్నొక్క ప్రమాదాలు ఎదురవుతాయన్నాడు. ఇవాన్‌ను వాళ్ల సొంత దేశానికి పంపించి ఎప్పణ్నుంచి అతను అక్కడ మిస్‌ అయ్యాడో తెలుసుకుంటే తప్ప వాస్తవాలు బయటకు రావు అనుకుని ఎల్‌ సాల్వడార్‌ పంపారు. అక్కడ ఆసుపత్రిలో చేర్చి డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. అతని సొంత వూరు నుండి తల్లి, తండ్రి, 14 ఏళ్ల కూతురు వచ్చారు. అతను ఊరు వదిలి 15 ఏళ్లయింది. 8 ఏళ్లగా అతని ఆనుపానులు తెలియకపోవడంతో చచ్చిపోయి వుంటాడని తలిదండ్రులు అనుకున్నారు. ఇంతకీ యితని కథ నిజమా, కాదా అని వెరిఫై చేయబోతే నిజమే అని తేలింది. మెక్సికో తీరంలో 2012 సెప్టెంబర్లో అతను తప్పిపోయాడని, అతనికోసం వెతికి ఆశ విడిచామనీ అక్కడి అధికారులు, జాలర్లు చెప్పారు. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]