మోహన మకరందం: ఉపరాష్ట్రపతి – ‘చెప్పు’కోక తప్పలేదు!

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement ఉపరాష్ట్రపతి – 'చెప్పు'కోక తప్పలేదు!  ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా గారి వద్ద సెక్రటరీగా పనిచేసే రోజుల్లో (1981-83) ఫార్మల్‌ ఫంక్షన్‌లు లేనప్పుడు నా అలవాటు కొద్దీ…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

ఉపరాష్ట్రపతి – 'చెప్పు'కోక తప్పలేదు! 

ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా గారి వద్ద సెక్రటరీగా పనిచేసే రోజుల్లో (1981-83) ఫార్మల్‌ ఫంక్షన్‌లు లేనప్పుడు నా అలవాటు కొద్దీ ఆఫీసుకి చెప్పులతోనే వెళ్లేవాణ్ని.  

ఆయన ఓ రోజు నన్ను పిలిచి ''మోహన్‌, మనిద్దరం బజారు కెళదాం. కళ్లజోడు కొనాలి.'' అన్నారు.

''సరే'' అన్నాను హుషారుగా.

కానీ ఆయన నా అంత హుషారుగా లేరు. కాస్త యిబ్బందిగా అటూ యిటూ కదిలారు. నన్ను ఎగాదిగా చూశారు. చెప్దామా వద్దా అని సందేహిస్తున్నారు. ఆయనది చాలా పద్ధతి ప్రకారం పెరిగిన అరిస్టోక్రాటిక్‌ నేపథ్యం. పైగా కేంబ్రిజ్‌లో చదివారు. ఆ పైన సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ చేశారు. వేషభాషలన్నీ చాలా ఫార్మల్‌గా, సంప్రదాయబద్ధంగా వుంటాయి. 

ఆయన బాధేమిటో నా కర్థం కాలేదు. బయటకు వెళ్లడానికి సిద్ధపడుతున్నాను.

ఆయన తెగించి చెప్పేశారు. చెప్పక తప్పలేదు పాపం-  

''మోహన్‌, ఏమీ అనుకోకపోతే.. అహఁ .. వీలైతే సుమా.. కాస్త  ఇంటికి వెళ్లి, చెప్పులు తీసేసి కాస్త షూస్‌ వేసుకుని వస్తావా? నాకు ఉపకారమే అనుకో..'' అన్నారు. 

నాకు నవ్వు రాబోయి ఆగిపోయింది. 

వెంట నేను చెప్పులతో వస్తే పరువు పోతుందని భయపడ్డట్టున్నారు ! పాపం పెద్దాయన! ఏమంటాం? 

గతంలో యిలాగే సూటూబూటూ వేసుకుని వెళ్లి శారదా ముఖర్జీగారి దగ్గర యిరుక్కుపోయాను. ఆ విషయం ఎలా చెప్పగలను?

ఇంటికెళ్లి బుద్ధిగా షూస్‌ వేసుకుని ఆయనతో వెళ్లాను !

xxxxxx

ఉద్యోగవిధుల నిర్వహణలో వేషధారణ ఎలా వుండాలి? బ్రిటిషు కాలంలో డ్రస్సు విషయంలో చాలా పట్టింపులు వుండేవి. సూటు, షూ, టై అన్నీ వేసుకుని వచ్చేవారు. స్వాతంత్య్రం వచ్చాక కొన్ని సడలింపులు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మరీ స్వేచ్ఛ వచ్చింది. తల దువ్వుకోకుండా వచ్చినా, గడ్డం గీసుకోకుండా వచ్చినా, స్లిప్పర్స్‌ వేసుకుని వచ్చినా అడిగే పరిస్థితి పోయింది. బయటనుండి వచ్చినవాడికి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఉద్యోగో, లేక కుర్చీ ఖాళీగా వుంటే వచ్చి కూర్చున్న బయటవ్యక్తో తెలియకుండా పోతోంది. 

కార్పోరేట్స్‌లో డ్రస్‌ కోడ్‌ వుంటోంది. ముఖ్యంగా మార్కెటింగ్‌ విభాగాల్లో. వారాంతాలలో తప్ప టీ షర్టు వేసుకోవద్దంటున్నారు. ప్రభుత్వానికే సంబంధించినా, టూరిజం కార్పోరేషన్‌ వంటి వాటిల్లో వస్త్రధారణపై శ్రద్ధ పెడుతున్నారు. కొత్తగా ముంచెత్తిన ఐటీ రంగంలో సడలింపు వుంది. అక్కడ ఏం వేసుకుని వచ్చినా పట్టించుకోవటం లేదు. పని ముఖ్యం తప్ప, యివన్నీ పట్టించుకోనక్కరలేదంటున్నారు. 

ఆఫీసుల్లో దుస్తుల గురించి నిబంధనలు విధించాలా? మనిషికి వస్త్రధారణ ఎంత అవసరం? అని నన్ను అడుగుతూంటారు. తమిళంలో 'ఆళ్‌ పాది, అడై పాది' అని సామెత. మనిషికి  సగం విలువ, ఉడుపులకు మిగతా సగం విలువ అని అర్థం. అంటే చక్కని దుస్తులు ధరిస్తే ఒక మనిషి తన ఫేస్‌ వేల్యూని రెట్టింపు చేసుకోవచ్చన్నమాట.ఒక ఉన్నతాధికారి ఇంట్లో లుంగీ కట్టుకునో, పైజమా వేసుకునో వుంటాడు. కానీ ఆఫీసుకి వచ్చినపుడు సూటులో వస్తేనే కాస్త దర్పంగా, గంభీరంగా అనిపిస్తుంది. ఇతరులకంటె యీయన వేరు, వారిపై యీయన పై అధికారి అని చెప్పకనే చెప్పినట్టవుతుంది. 

అయితే స్వాతంత్య్రానంతరం దేశంలో వచ్చిన మార్పులలో ప్రజానాయకుల దుస్తుల్లో కూడా మార్పు వచ్చింది. పాకిస్తాన్‌ ప్రధానులు సూటు లేదా కుర్తా షేర్వాణీ వేసుకుంటారు కానీ భారతదేశంలోని నాయకులు, కుర్తా పైజమా లేదా ధోవతి ధరించే సంప్రదాయం వచ్చింది. రాజీవ్‌ గాంధీ వంటి ఆధునిక దుస్తులు వేసుకునే వ్యక్తి కూడా రాజకీయాల్లోకి వచ్చేసరికి గల్లాబంద్‌ వేసుకోవడం మొదలుపెట్టారు. నిరంతరం వీరి పక్కన కనబడవలసిన ఐయేయస్‌ అధికారులు ఫుల్‌ సూటులో వుంటే వారి దుస్తుల్లో వ్యత్యాసం కొట్టవచ్చినట్టు కనబడసాగింది. అది కాస్త ఎబ్బెట్టుగా తోచిందేమో సెక్రటరీలు సఫారీలు వేసుకోవడం పెరిగింది. 

నా డ్రస్‌ సెన్సు గురించి చెప్పాలంటే – మా నాన్నగారు చిన్నప్పుడే చెప్పారు – డ్రస్సు విషయంలో 'డు నాట్‌ స్టాండ్‌ ఔట్‌ ఈదర్‌ వే' అని. అంటే మరీ ఎక్కువగా డ్రస్‌ వేసుకుని గానీ, మరీ తక్కువగా వేసుకుని కానీ కొట్టవచ్చినట్టు కనబడవద్దని ఆయన భావం.  నేను అదే అనుసరించాను. అన్ని రకాల డ్రస్సులూ వేసుకున్నాను. సింపుల్‌ పాంట్‌, షర్టు దగ్గర్నుంచి, సూట్‌లు, గల్లా బంద్‌లు.. అన్నీ అవసరానికి తగ్గ డ్రస్‌ వేసుకున్నాను. 'బెస్ట్‌ డ్రస్‌డ్‌ ఎగ్జిక్యూటివ్‌' అనే నా కెవ్వరూ కితాబు యివ్వరు కానీ 'సూటబ్లీ డ్రెస్‌డ్‌' అనవచ్చు. ఇదేమిటి యిలా వేసుకుని వచ్చాడు! అని ఎవరూ ఆశ్చర్యపడే రీతిలో ఎప్పుడూ లేను. డ్రస్సు అనేది 'రెస్పెక్ట్‌ టు ద కంపెనీ' (చుట్టూ వున్నవాళ్లకు మనం యిచ్చే గౌరవం) అని నా వుద్దేశం. సాధారణంగా అయితే మనకు ఏది సౌకర్యంగా వుంటుందో అదే వేసుకుంటాం. అయితే సందర్భం బట్టి, పాల్గొనే కార్యక్రమం బట్టి కాస్త విభిన్నంగా డ్రస్‌ చేసుకోవడం – యితరుల కోసం మనం యిచ్చే మినహాయింపు అన్నమాట.

నాకు తరచుగా తిరుపతికి వెళ్లి తలనీలాలు యిచ్చే అలవాటు వుంది. వెళ్లినప్పుడల్లా యిస్తాను. ఎమ్మెస్సీ రోజులనుండి అది నాకు అలవాటు. నడిచి కొండెక్కడం, జుట్టు యిచ్చేసి రావడం. నేను ఏ పదవిలో వున్నా ఏ మొహమాటమూ లేకుండా ఆ అలవాటు అలాగే కొనసాగించాను. చీఫ్‌ సెక్రటరీగారు గుండుతో కనబడడమేమిటి, ఎబ్బెట్టుగా అని ఎవరైనా అనుకుంటారేమో అన్న ఆలోచనే రానీయలేదు. ఎందుకంటే యీ పదవులూ అవీ మన మనుష్యుల మధ్య వ్యవహారం. దేవుడి వద్ద యీ హెచ్చుతగ్గులు ఏమీ లేవు. 

ఫంక్షన్‌లవీ లేనప్పుడు ఆఫీసుకి సింపుల్‌గానే వెళతాను. ఈ సింప్లిసిటీ పాదరక్షల విషయంలో బాగా కనబడుతుంది. మద్రాసులో చిన్నపుడు చెప్పులు లేకుండా తిరిగేవాణ్ని. ఓ సారి కడుపులో నెప్పి వచ్చింది. డాక్టరు పాముల కారణంగా అన్నాడు. పాములు వచ్చినది చెప్పులు వేసుకోని కారణంగా అన్నాడు. ఇక అప్పణ్నుంచి ఎప్పుడూ చెప్పులేసుకుని తిరిగేవాణ్ని. గుంటూరు వచ్చేసరికి అలవాటు తప్పిపోయింది. స్కూల్లో ఎవరూ వేసుకునేవారు కారు, వాళ్లని చూసి నేనూ మానేసినట్టున్నాను. పాములు మళ్లీ పడలేదన్న ధైర్యమో ఏమో!

ఆ తర్వాత హైదరాబాదు వచ్చాక మారేడుపల్లిలో వున్నప్పుడు మెహబూబ్‌ కాలేజీ హైస్కూల్‌లో చేరాను.  చెప్పుల్లేకుండా క్లాసుకి వెళితే అక్కడంతా నవ్వారు. ''వీడికి చెప్పుల్లేవురోయ్‌'' అని. అప్పుడు తెలిసి వచ్చింది, పాముల పాలబడినా పడకపోయినా, చెప్పులేసుకోవడం అనేది ఒక సాంఘిక మర్యాద అని. అది కూడా డ్రస్సు వేసుకోవడంలో ఓ భాగం, చెప్పులు కనుక వేసుకోకపోతే నీవు బట్టలు విప్పుకుని నడిచినట్లే అని తల కెక్కింది. అప్పణ్నుంచి చెప్పులు క్రమం తప్పకుండా వేసుకునేవాణ్ని. 

ఢిల్లీలో  బి యస్సీ చదువుతూ కాలేజీకి చెప్పులు వేసుకుని వెళితే నవ్వారు. ''చెప్పులు యింట్లో వేసుకుంటారు కానీ కాలేజీకి వేసుకొస్తారా?'' అని. అందరితో బాటు నేనూ షూస్‌ వేసుకుని వెళ్లేవాణ్ని.

కాజువల్‌గా డ్రస్‌ చేసుకుని హిదాయతుల్లా గారి చేత చెప్పించుకున్న సందర్భం చెప్పాను కదా, అత్యంత ఫార్మల్‌గా డ్రస్‌ చేసుకుని దెబ్బ తినేసిన సందర్భమూ చెప్తాను.

అది 1977. శారదా ముఖర్జీగారు ఆంధ్రప్రదేశ్‌ గవర్నరుగా వచ్చిన రోజులు. ఆవిడది కులీనవంశం. ఓ పక్కనుంచి నెహ్రూగారితో మరో పక్కనుండి చిత్తరంజన్‌ దాస్‌ గారితో  చుట్టరికం.. మంచి విద్యావంతురాలు. ఆమె భర్త సుబ్రతో ముఖర్జీ. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌గా పనిచేసిన మొట్టమొదటి భారతీయుడు. రష్యాలో పనిచేస్తూ భోజనంలో చేపముల్లు గొంతులో గుచ్చుకుని చనిపోయారు. కేంద్రం లోని జనతా ప్రభుత్వం గవర్నరు పదవిద్వారా కాస్త హంగు ప్రదర్శించాలని కాంగ్రెస్‌ ప్రతిపక్షం ఏలుతున్న ఆంధ్రప్రదేశ్‌కి ఈవిడని గవర్నరుగా వేసింది. 

ఆవిడ వస్తూనే నాకు మంచి ఐయేయస్‌ ఆఫీసరు సెక్రటరీగా కావాలి అని మొదలుపెట్టింది. గవర్నరు వద్ద నడిచేవి ఏవో మొక్కుబడిగా, అలంకారప్రాయంగా నడిచే వ్యవహారాలే కదమ్మా అని  చెప్పినా ఈవిడ వినటం లేదు. ఆ టైములో నాగార్జున సాగర్‌ పర్యటనకు వచ్చారావిడ. నాగార్జున సాగర్‌ నల్గొండ జిల్లాలో వుంది కాబట్టి నల్గొండ జిల్లా కలక్టరు ఆవిడతో వచ్చారు. ఆవిడ పాటు కారులో వస్తూండగా ఆయనకు కునుకు పట్టేసింది.

ఇలా నిద్రపోవడం సహజమే. ఎందుకంటే ప్రముఖులు ఎవరైనా వస్తున్నారంటే మామూలుగా లేచే వేళ కంటె పెందరాళే లేచి, తెమిలి వచ్చేయాల్సి వస్తుంది. అందువలన కాస్త విశ్రాంతి దొరకగానే రెప్పలు వాలడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పైగా ఆయన వయసు పెద్దది. మిలటరీవాళ్ల మధ్య చాలా ఏళ్లగా ఉండి, మిలటరీ డిసిప్లిన్‌ వంటబట్టించుకున్న ఆవిడకు మాత్రం ఆ కలక్టరుపై నాగార్జున 'కొండ'త కోపం వచ్చింది. ఆయన్ని కారులోంచి దింపేసి, రుసరుసలాడుతూనే నాగార్జునకొండ మ్యూజియం చూడడానికి వచ్చింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నల్గొండ జిల్లా పరిధిలోకి వచ్చినా, మ్యూజియం మాత్రం గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. 

నేను అప్పుడు గుంటూరు జిల్లాకు కలక్టర్‌గా వున్నాను. 32 యేళ్లు. సూటూ, బూటూ వేసుకుని కనబడ్డాను. నేను ఇంగ్లీషులో మాట్లాడినతీరు ఆవిడకు బాగా నచ్చినట్టుగా వుంది. 'నా ఆఫీసులో మోహన్‌ కందాయే సెక్రటరీగా కావాల'ని ప్రభుత్వాన్ని కోరింది. దాంతో నేను బిక్కమొహం వేశాను. అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌నుండి గుంటూరు కలక్టరుగా వచ్చి నాలుగు నెలలే కదా అయింది. ఈ  స్టేజిలో గవర్నరుకి సెక్రటరీగా వెళితే నా కెరియర్‌ ఏం కాను? నాకు అక్కడ పనేం వుంటుంది? అని చీఫ్‌ సెక్రటరీతో మొత్తుకున్నాను. ''ఏం లాభం లేదయ్యా, ఆవిడ పట్టుబడుతోంది. వెళ్లాల్సిందే! అయినా అంత చేటుగా ఇంప్రెస్‌ చేసేయమని ఎవడు చెప్పాడు?'' అని ఆయన వెక్కిరించారు.

కొసమెరుపు – నాకు శారదా ముఖర్జీ గారి దగ్గర పోస్టింగ్‌ అయిందని తెలియగానే మా నాన్నా, అమ్మా మర్యాదపూర్వకంగా  ఆవిడని కలిసి '' మా వాణ్నే ఎందుకు అడిగారు? ఇక్కడ ఎంతకాలం వుంచుతారు?'' అంటూ చాలా ప్రశ్నలు వేశారు. ఆవిడ ''నేను యింతమందిని ఇంటర్వ్యూ చేశాను కానీ నన్నీ రకంగా యింటర్వ్యూ చేసినవాళ్లెవరూ లేరు.''అని వాపోయారు. ''పోనీలెండి, నేను ఇంటర్వ్యూలో అనేకమందిని ఫెయిలు చేసినా, వాళ్ల ఇంటర్వ్యూలో మాత్రం సెలక్టయ్యాను. వాళ్లబ్బాయిని నా దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నారు'' అన్నారు నవ్వుతూ.

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version