ఫాలో చిరు: కమల్ ఇక రాజకీయాలు చాలించుకుంటారా?

పదవి దక్కడం కూడా పూర్తయ్యాక.. ఇక మక్కల్ నీది మయ్యం పార్టీ మీద శ్రద్ధ తగ్గుతుందనే పలువురు అంటున్నారు.

రాజకీయాలు వంటి మీడియాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు..‘సమాజం’ అనే విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు ఆశించి అడుగుపెట్టాలి. నూటికి వెయ్యిశాతం మంది ఇటువంటి లక్ష్యాలను ప్రకటిస్తూనే ప్రారంభంలో ఆర్భాటం చేస్తుంటారు. కానీ.. వారి మనసులో ఉండే హిడెన్ లక్ష్యాలు వేరే ఉంటాయి. ఆ హిడెన్ ఎజెండాలో ‘పదవి’ అనే సంకుచిత లక్ష్యం ఉన్నట్లయితే గనుక.. అలాంటి పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. దీనికి రెండు రకాల కారణాలు ఉంటాయి.

‘పదవి’ అనేది అందిన వెంటనే.. ఆ పార్టీ నడపడంలో ఉండే కిక్కు దిగిపోతుంది. అయితే దీనికి ఒక మార్గాంతరం ఉంది. ఆ పదవి ఇచ్చే కిక్కు అంతకంటె ఎక్కువగా ఉన్నప్పుడు.. ఇంకా శ్రద్ధగా పార్టీని నడుపుతారు. రెండో కారణం ఏంటంటే.. పదవి ఎప్పటికీ అందదు అనే అభిప్రాయం ఏర్పడితే గనుక.. పార్టీ కాడిని పక్కన పడేస్తారు. ఇది చాలా మంది విషయంలో జరుగుతూ ఉంటుంది.

ఏతావతా చెప్పొచ్చేదేంటంటే.. తమిళనాడు రాజకీయాల్లో చాలా భారీ ప్రకటనలు, ఆర్భాటంతో అడుగుపెట్టిన, సొంత పార్టీని ప్రారంభించిన నటుడు కమల్ హాసన్ త్వరలోనే తన రాజకీయ పార్టీ దుకాణాన్ని బంద్ చేసే అవకాశం ఉందా? అనే అనుమానాలు ప్రజల్లో పుడుతున్నాయి. రాజకీయ పార్టీ అనే సోపానాన్ని వాడుకుంటూ.. ప్రజల తీర్పు, ఆదరణతో నిమిత్తం లేని రాజ్యసభ పదవిని ఆయన ఆశిస్తుండడం పర్యవసానంగా పార్టీ ఇక అంతర్ధానం దిశగా అడుగులు పడతాయని, ఆయన మెగాస్టార్ చిరంజీవి బాటనే ఫాలో అవుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తెలుగునాట ఇలాంటి ప్రయత్నమే చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. తాను సీఎం అయిపోగలనని అనుకున్నారు. ఆయన టైమింగ్ మిస్ అవడంతో.. ఆ ప్రయోగం బ్యాక్ ఫైర్ అయింది. పార్టీని నడపడం సినిమా చేసినంత చిన్న సంగతి కాదని అర్థమైంది. పార్టీని కాంగ్రెసులో విలీనంచేశారు. ఆ పార్టీ ఆయనను రాజ్యసభ ద్వారా కేంద్రమంత్రిని చేసింది. పదవి కూడా దక్కిన, అనుభవించిన తర్వాత ఆయనకు మనం చెప్పుకున్న ఒకటో కారణం ప్రకారం కిక్కు దిగిపోయింది. ఇక ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ గడిపేస్తున్నారు.

ఇప్పుడు చాలా ఆర్భాటంగా తమిళనాట పార్టీ ప్రారంభించిన కమల్ హాసన్.. ఎన్నో ప్రగల్భాలు పలికినప్పటికీ.. చివరికి ఎన్నికలు వచ్చేసరికి డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగారు. అప్పట్లోనే పొత్తుల్లో భాగంగా తమకు ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని ఒప్పందం పెట్టుకున్నారు. ఇప్పుడు రాబోయే జులైలో డీఎంకే రాజ్యసభ సభ్యులు ఇద్దరి పదవీకాలం ముగుస్తుంది. వాటిని భర్తీ చేసే క్రమంలో ఒక సీటు కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీకి ఇవ్వనున్నారు. ఆ రూపేణా కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీ పదవిని తీసుకోబోతున్నట్టు పార్టీ ప్రకటించింది.

అమెరికాలో సినిమా షూటింగ్ అయి వచ్చిన తర్వాత జులైలో కొత్త బాధ్యతల్లోకి వెళతారట. ఆయనకు పదవి దక్కడం కూడా పూర్తయ్యాక.. ఇక మక్కల్ నీది మయ్యం పార్టీ మీద శ్రద్ధ తగ్గుతుందనే పలువురు అంటున్నారు.

3 Replies to “ఫాలో చిరు: కమల్ ఇక రాజకీయాలు చాలించుకుంటారా?”

  1. “‘పదవి’ అనేది అందిన వెంటనే.. ఆ పార్టీ నడపడంలో ఉండే కిక్కు దిగిపోతుంది.”

    Mana maaji CM laaga…?

Comments are closed.