ట్రంప్ కు అన్నీ తెలిసే చేస్తున్నాడా!

సామాన్యుల‌ను ఇక్క‌ట్ల పాల్జేయ‌డం.. జాతీయవాద పాల‌కుల ల‌క్ష‌ణాలు

త‌ను ముందే చెప్పాడు.. త‌ను మ‌ళ్లీ అమెరికా అధ్య‌క్షుడు అయితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో కూడా ట్రంప్ హెచ్చ‌రిక‌ల్లాంటివి బోలెడ‌న్ని చేశాడు! మ‌రి ఇప్పుడు ఎవ్వ‌రు ల‌బోదిబోమ‌న్నా.. ఇదంతా ముంద‌స్తు హెచ్చ‌రిక ఉన్న సునామీ కిందే ప‌రిగ‌ణించాలి.

అమెరికా సుంకాల గురించి ఇప్పుడు అమ‌లాపురంలో కూడా చ‌ర్చ జ‌రుగుతూ ఉండ‌వ‌చ్చు. దిగుమ‌తుల‌పై విప‌రీత‌మైన సుంకాలు అమెరికాను మాంద్యం దిశ‌గా తీసుకెళ్లిన‌ట్టే అని ఆర్థిక వేత్త‌లు స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు. దీని ప్ర‌భావం కేవలం అమెరికాపై మాత్ర‌మే కాద‌ని, దీని ప్ర‌భావం నిస్సందేహంగా ఇండియాపై కూడా ఉంటుంద‌ని గ‌ట్టిగా చెబుతూ ఉన్నారు! అయితే అమెరికాలో ట్రంప్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ్వాల‌ని ఇండియాలో కొంద‌రు కాషాయ‌ధారులు పూజ‌లు సైతం చేశారు పాపం! మ‌రి ఆ పూజాఫలం ఐటీ ఇండస్ట్రీపై విప‌రీతంగా ఆధార‌ప‌డిన భార‌తీయుల ఉపాధి అవ‌కాశాల‌ను హ‌రించే వ‌ర‌కూ వ‌చ్చేలా ఉంది!

మ‌రి ఇండియా సంగ‌త‌లా ఉంటే.. ట్రంప్ కు అన్నీ తెలిసే ఇలా చేస్తున్నాడా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌శ్న‌! అయితే.. ఏ విష‌యం గురించి అయినా త‌న‌కు తెలిసినంత‌గా మరెవ‌రికీ తెలియ‌ద‌న‌డం ట్రంప్ కు ఉన్న ప‌ర‌మ రొటీన్ అల‌వాటు! ఒక‌టి కాదు, రెండు కాదు.. ప్ర‌పంచంలో ఏ విష‌యం గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చినా.. దాని గురించి త‌న‌క‌న్నా ఎవరికీ ఎక్కువ తెలీదంటూ ట్రంప్ పాట పాడుతూ ఉంటాడు. ఆయ‌న ఏయే విష‌యాల గురించి ఇలా అన్నాడో.. వివిధ సంద‌ర్భాల్లోని ఆయ‌న వీడియోల‌ను తెచ్చి అమెరిక‌న్ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తూ ఉంటారు! ఇలా ఉంటుంది ట్రంప్ వ్య‌వ‌హారం!

అయితే.. ట్రంప్ వంటి అతి జాతీయ‌వాద నేత తీసుకుంటున్న నిర్ణ‌యాలు అన్నీ తెలిసే.. అనేది ఉత్తి మాట అనుకోవాలి! ఏది చేస్తే త‌న బోటి జాతీయ‌వాదుల‌కు న‌చ్చుతుందో, ఏది చేస్తే త‌న ఫాలోయ‌ర్లు ఊగిపోతారో.. ట్రంప్ అది చేస్తూ ఉన్నాడు. దాని ప‌ర్య‌వ‌స‌నాలు ఎలా ఉంటాయ‌నేది జ‌నాల ఖ‌ర్మ‌! అంత‌కు మించి ఏమీ లేదు! అర్ధ‌రాత్రి పూట న‌రేంద్ర‌మోడీ నోట్ల ర‌ద్దును ప్ర‌క‌టించ‌గానే.. కొంద‌రు ఇలానే ఊగిపోయారు! మాస్ట‌ర్ స్ట్రోక్ అన్నారు.. నిజ‌మే, అది స్ట్రోకే అయ్యింది.

సామాన్యుల పాలిట‌. వంద‌కూ రెండు వంద‌ల‌కూ క‌ష్ట‌ప‌డే వారు నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఎన‌లేని క‌ష్టాలు ప‌డ్డారు. న‌ల్ల‌ధ‌నికులు, కోటీశ్వ‌రుల‌కూ కించిత్ స‌మ‌స్య రాలేదు! వారి వ్య‌వ‌హారాల‌న్నీ సాఫీగానే సాగిపోయాయి. సాగిపోతున్నాయి. నోట్ల ర‌ద్దుతో ఇండియాలో న‌ల్ల ధ‌నం మ‌టు మాయ‌మ‌వుతుంద‌ని అప్ప‌ట్లో జాతీయ వాదులు రంకెలు వేశారు! అంటే వారి లెక్క ప్ర‌కారం ఇప్పుడు ఇండియాలో న‌ల్ల ధ‌నం లేదు, న‌ల్ల ధ‌నికులు లేరు అంతే క‌దా! ఈ మాత్రం ఒప్పుకోమంటే.. నోట్ల ర‌ద్దుకు ముందే ఒప్పుకునే వారు క‌దా అంతా! ఎటొచ్చీ నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం మాయ‌మైంద‌నేద‌నే పెద్ద కామెడీ.

ఇప్పుడు ట్రంప్ నిర్ణ‌యాలూ ఇంతే.. కొండ నాలిక‌కు మందేస్తే ఉన్న నాలిక ఊడిన‌ట్టుగా.. మొత్తం అమెరిక‌న్ ఎక‌నామీనే కుప్ప‌కూలినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు! ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు అమెరికా చేస్తున్న సాయాల‌న్నింటినీ ట్రంప్ ఆపేశాడు. పెద్ద‌న్న హోదా కోసం అలా సాయం చేస్తూ.. అమెరికా అజామాయిషీ చేస్తూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ వాటిని ఆపేశాడు. అయితే.. దాని వ‌ల్ల స‌గ‌టు అమెరిక‌న్ కు ఒరిగింది ఏమీ లేద‌నే నినాదాలు అక్క‌డే వినిపిస్తూ ఉన్నాయి. విదేశీ సాయాల‌న్నింటినీ ఆపేసినా.. స‌గ‌టు అమెరిక‌న్ కోడి గుడ్డును కొనుక్కొనేందుకు ఆలోచించాల్సిన రీతిలో.. గుడ్ల ధ‌ర‌లు ఉన్నాయంటూ ప్లకార్డులు చూపుతున్నారు అమెరిక‌న్లు!

సుంకాల సంగ‌తి కూడా ఇలాంటిదే! అమెరిక‌న్ వ్యాపార సంస్థ‌లు దిగుమ‌తుల మీద ఆధార‌ప‌డ్డాయి అంటే.. దాని వెనుక చాలా వ్యూహ‌మే ఉంటుంది వాటికి! వాటి వ్యాపార పునాదులే అలాంటి దిగుమ‌తుల మీద ఆధార‌ప‌డేలా నిర్మితం అయ్యాయి. ఉన్న ఫ‌లంగా ఇప్పుడు ఆ పునాదుల‌ను కూల గొట్టేస్తే ఏమ‌వుతుంది? పునాదులు దెబ్బ‌తింటే.. అతి ఎంత పెద్ద భ‌వ‌నం అయినా కుప్ప కూలాల్సిందే. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ప‌ని కూడా ఇలానే ఉంది.

దిగుమ‌తుల మీద ఆధార‌ప‌డొద్దు.. అన్నీ ఇక్క‌డే త‌యారు చేసుకోండి… అంటూ ఉన్న ఫ‌లంగా ఆదేశాలు ఇచ్చేస్తే.. అస‌లు ఇక్క‌డ త‌యారు చేసుకోవ‌డం సాధ్యం కాద‌నే క‌దా.. వాళ్లు దిగుమ‌తుల మీద ఆధార‌ప‌డి ఉన్న‌ది! వాటి ఉన్న‌తి అంతా.. అవి అమెరికా పాలిట త‌ల‌మానిక కంపెనీలుగా త‌యారు కావ‌డంలో అంతా.. దిగుమతుల టెక్నిక్ ఉంద‌నేది, అది వ్యాపార సూత్రం అనే బేసిక్ విష‌యం ట్రంప్ కు తెలియ‌దా! ఏ విష‌యం గురించి అయినా త‌న‌కే ఎక్కువ తెలుసు అనే ట్రంప్ కు ఈ విష‌యం తెలియ‌దా! బ‌హుశా తెలిసే ఉంటుంది. అయితే.. ఆయ‌న‌కు కావాల్సింది త‌న‌ను స‌మ‌ర్థించే వారి ఎమోష‌న్ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే! ఇదే అతి జాతీయ‌వాద నేతల తీరు.

మ‌నుషుల మీద వైష‌మ్యాల‌ను పుట్టించ‌డం, అతి జాతీయ‌వాదంతో ప్రాథ‌మిక అంశాల‌ను కూడా విస్మ‌రించ‌డం, దీని వ‌ల్ల సామాన్యుల‌ను ఇక్క‌ట్ల పాల్జేయ‌డం.. జాతీయవాద పాల‌కుల ల‌క్ష‌ణాలు! విచిత్రం ఏమిటంటే.. ప్రపంచ‌మంతా ఇప్పుడు ఇలాంటి వాళ్ల‌కే మ‌ద్ద‌తు ల‌భిస్తూ ఉంది! అయితే వీరు దించే క‌త్తులు వెన్నుల్లోకి దిగాకా కానీ.. నొప్పి తెలియ‌దు. అయితే వీరు దించే క‌త్తులు నొప్పిని కూడా ఆనందంగా భ‌రించేలా ఉంది ఇప్పుడు జాతీయ అతివాదుల తీరు!

-జీవ‌న్ రెడ్డి.బి

5 Replies to “ట్రంప్ కు అన్నీ తెలిసే చేస్తున్నాడా!”

  1. ఓసోసి ! అన్ని నాకు తెలుసు అనేవాడిని అమెరికా ఇప్పుడు చూస్తోంది ఏమో ఆంధ్రోళ్లు అలాంటి అమావాస్య చంద్రుళ్లని ఎప్పుడో సుసేసింది.

  2. నెలకు 20,000/- జీతం ఇస్తే కోట్ల మంది యువకులు కు కొదవ లేదు మన దేశంలో .. తెలంగాణలో కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్రెడ్డి అమెరికాలో ట్రంప్…. వీరి గ్రాపులు ఎప్పుడూ చంద్రమండలం దాటి పోతాయి.. సూటు కేసుకు జరగని పని లేదు…

Comments are closed.