ఎమ్బీయస్‌ : టైపురైటర్లయితే సురక్షితమా?

కంప్యూటరు యుగంలో సమాచారం అతి సులభంగా లీక్‌ అయిపోతోంది. బళ్లకొద్దీ ఫైళ్లల్లో వుండే సమాచారాన్ని చిన్న చిప్‌లో పెట్టి ఆఫీసులోనుండి బయటకు పట్టుకుని పోవచ్చు. ఇలాటి సౌకర్యమే లేకపోతే వికీలీక్స్‌కి రహస్యసమాచారం చిక్కేదే కాదు.…

కంప్యూటరు యుగంలో సమాచారం అతి సులభంగా లీక్‌ అయిపోతోంది. బళ్లకొద్దీ ఫైళ్లల్లో వుండే సమాచారాన్ని చిన్న చిప్‌లో పెట్టి ఆఫీసులోనుండి బయటకు పట్టుకుని పోవచ్చు. ఇలాటి సౌకర్యమే లేకపోతే వికీలీక్స్‌కి రహస్యసమాచారం చిక్కేదే కాదు. రాయబార కార్యాలయం నుండి ఫైళ్లు చంకలో పట్టుకెళ్లడం సాధ్యమా? అదే కంప్యూటరులో నిక్షిప్తమైన సమాచారమైతే యుఎస్‌బి స్టిక్‌లోనో పెన్‌డ్రైవ్‌లోనో స్టోర్‌ చేసి బూట్లలో పెట్టి బయటకు తెచ్చేయవచ్చు. కంప్యూటరుతో ఎంత సౌలభ్యం వున్నా రహస్యపత్రాలతో వ్యవహరించే రాయబార కార్యాలయాల్లో సేఫ్టీ కోసం పాతకాలం తరహాలో టైపురైటర్లు వాడితే మంచిదేమో అన్న సూచనలు కూడా వస్తున్నాయట. ఎందుకంటే దానిలో స్టోరింగ్‌ సౌకర్యం వుండదు. పేపరుపై టైపు చేసి రహస్య ఫైలులో పెట్టుకుంటే పక్కవాడికి ఏమీ తెలియదు. కానీ… టైపు రైటర్లు వాడే కాలంలో రహస్యాలు నిజంగా భద్రంగా వుండేవా? చూదాం. 

టైపు మెషిన్‌లో కాపీలు కావాలంటే కార్బన్‌ పేపర్లు వాడేవారు. కాపీ నీట్‌గా రావాలని కొత్త కార్బన్‌ వాడారంటే దానిలో ప్రమాదం వుంది. వాడేసిన కార్బన్‌ను చెత్తబుట్టలో పడేయడం ప్రమాదం. దాన్ని పట్టుకెళ్లి అద్దంలో చూస్తే విషయం తెలిసిపోతుంది. రిబ్బన్‌తో కూడా ప్రమాదం వుంటుందని గూఢచారి సంస్థలు కనుగొన్నాయి. సిబిఐలో ఆఫీసరుగా పని చేస్తూ రష్యా గూఢచారి సంస్థ కెజిబికి డబుల్‌ ఏజంటుగా పని చేసిన ఆల్‌డ్రిక్‌ ఏమెస్‌ పై ఎఫ్‌బిఐకు అనుమానం వచ్చింది. వాళ్లు అతని ఆఫీసు టైపు రైటరులో కొత్త రిబ్బన్‌ పెట్టారు. రిబ్బన్‌ ఒక స్పూల్‌ నుండి మరొక స్పూల్‌కు వెళుతుంది. దానిపై సీసపు అక్షరాలు కొడితే కాగితంపై ఆ రిబ్బన్‌ యింకులో అక్షరాలు పడతాయి. కెజిబి వాళ్లను వెనిజులాలో కలవడానికి ప్లాను చేసుకున్న ఏమెస్‌ దానికి సంబంధించిన ఉత్తరాన్ని టైపు చేసుకున్నాడు. మర్నాడు ఎఫ్‌బిఐ వాళ్లు రిబ్బన్‌ బయటకు లాగి దానిపై కొట్టిన అక్షరాలను చదువుకున్నారు. వెనిజులా సమావేశం సంగతి తెలిసిపోయింది. అతన్ని పట్టుకున్నారు.

మాస్కోలోని అమెరికన్‌ ఎంబసీ ఆఫీసులో కెజిబి వారు టైపురైటర్ల నుండి సమాచారాన్ని ఎలా సేకరించేవారో 1985లో సిబిఎస్‌ న్యూస్‌ సర్వీసు బయటపెట్టింది. టైపురైటరు లోపల ఒక గుండ్రటి బంతిలాటి దాన్ని దాచారు. దాని ఉపరితలంపై అంకెలు, అక్షరాలు వుండేవి. టైపు చేసిన అక్షరం లేదా అంకె బట్టి ఆ బంతి అటూ యిటూ కదిలేది. దాన్ని కదలికలను కార్యాలయం గోడల్లోని ఏంటెనాలు గ్రహించి ఆ సంకేతాలను రష్యా గూఢచారి ఆఫీసుకు చేరవేసేవి. ఇలా 16 టైపు రైటర్లలో వాళ్లు బగ్స్‌ అమర్చారట. 8 సంవత్సరాల పాటు యిది ఎవరికీ తెలియకుండా సాగింది. చివరకు వాటిని అమెరికాకు తిప్పి పంపించేటప్పుడు అమెరికన్‌ కస్టమ్స్‌ వాళ్లు తనిఖీ చేస్తే లోపల వున్న యీ పరికరాలు బయటపడ్డాయి! 

నీతి ఏమిటంటే – తెలివితేటలుండాలి కానీ ఏదీ గూఢచర్యానికి అతీతం కాదు.  

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]