బిజెపి సమావేశంలో రాజనాథ్ సింగ్‌పై సుష్మ మండిపడ్డారట. పార్లమెంటరీ బోర్డును సంప్రదించకుండానే అభ్యర్థులను ప్రకటించడం వంటి అనేక నిర్ణయాలను ప్రకటిస్తున్నారని, యెడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించడం వాటిలో ఒకటని దులిపేశారట. యెడ్యూరప్ప అవినీతిపరుడని బిజెపియే చాటి చెప్పింది. 2011 ఆగస్టులో పదవి నుండి దింపేసింది. 2012 ఎన్నికలలో అతను స్థాపించిన కర్ణాటక జనతా పక్షను అవినీతిలో పుట్టిన పార్టీ అంటూ దుమ్మెత్తిపోసింది. మోదీ ప్రధాని అభ్యర్థిగా వెలుగులోకి వచ్చాక సీను మారింది. యెడ్యూరప్ప యీ జనవరిలో తన పార్టీని బిజెపిలో విలీనం చేశారు. చివరకు ఫిబ్రవరి 18 న దావణగెరెలో లక్షమంది పాల్గొన్న సమావేశంలో మోదీతో బాటు యెడ్యూరప్ప వేదిక పంచుకున్నారు. యెడ్యూరప్పను వెనక్కి తీసుకోవడంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ''ఆ ముఖ్యమంత్రి, జైలుకి వెళ్లిన ఆయన 12 మంది మంత్రులు చేసిన అవినీతి మోదీకి కనబడదా?'' అని ఎద్దేవా చేశారు. దానికి దావణగెరె సమావేశంలో మోదీ జవాబిచ్చారు – ''కాంగ్రెసు, అవినీతి కవలపిల్లలు. కర్ణాటక గురించి మాట్లాడేముందు రాహుల్ రాజస్థాన్, హరియాణాలలో జైలుకి వెళ్లిన మంత్రులెందరో చెప్పాలి.'' అంటూ. ఇలా యీ యిద్దరు నాయకులకూ దూరంగా ఎదుటి పార్టీలో అవినీతే తప్ప దగ్గరగా తమ పార్టీలో అవినీతి కనబడడం మానేసింది.
ఆ సభలో ''యెడ్యూరప్ప చాలా గొప్పవాడు. వ్యవసాయంకోసం ప్రత్యేకంగా బజెట్ సమర్పించాడు.'' అంటూ మోదీ మెచ్చుకున్నాడు. యెడ్యూరప్ప తక్కువ తినలేదు. ''మోదీగారు చాలా గొప్పవారు. ఆయన తమ రాష్ట్రంలో నదులు అనుసంధానం చేశారు. ఆ కథ మాకు చెప్పి తరింపచేయాలి.'' అని సభాముఖంగా వేడుకున్నాడు. ఉబ్బితబ్బిబ్బయిన మోదీ ''అవునవును. మేం 20 నదులను అనుసంధానించాం. నర్మదా జలాలు తెచ్చి సబర్మతి నది పొంగిపారేట్లు చేశాం. దాంతో వ్యవసాయం 10 శాతం పెరిగింది.'' అని చెప్పారు. ఇదంతా విని వేదికపైనే వున్న అనంత్‌కుమార్ మొహం చిట్లించారు. ఎందుకంటే ఆయనకు యెడ్యూరప్ప అంటే పడదు. కానీ మోదీకి ఎదురు చెప్పలేడు. బిజెపి అవినీతిని ఎన్నికల అంశంగా మలచుకోగలదా లేదా అన్నది సందేహమే. ఎందుకంటే రాజనాథ్ సింగ్‌ను నిలదీస్తూ సుష్మ అడిగారట – ''నేను గాలి సోదరులకు సన్నిహితురాలినని, వాళ్ల కొమ్ము కాస్తున్నానని నాపై పార్టీలో కొందరు ప్రచారం చేస్తున్నారు. గాలి సోదరుల సొమ్ము తినని బిజెపి నాయకుడు ఎవరైనా వున్నారా?'' అని.
– ఎమ్బీయస్ ప్రసాద్