కూటమి ప్రభుత్వంలో నిన్నటి వరకూ అతను కీలకశాఖలో ముఖ్య అధికారి. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆ అధికారి గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఒక ఉన్నతాధికారిగా అలా మాట్లాడ్డం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏదో ఇతను తేడాగా వుందే అని అందరూ గుసగుసలాడుకున్నారు.
సీన్ కట్ చేస్తే… అతన్ని ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేయడంపై ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలోనే అత్యంత అవినీతియమైన శాఖగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విభాగంలో కీలక అధికారిగా అతను చోటు దక్కించుకున్నారు. దీపం వుండగానే సొంత “రెవెన్యూ”ను పెంచుకోవాలని, కొంత మంది దళారుల్ని నియమించుకున్నారాయన. ఒకవైపు గత ప్రభుత్వం అధికారుల్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం భూముల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, వాటిని సంస్కరిస్తామని ప్రభుత్వం నీతులు చెబుతుంటే, మరోవైపు సదరు ఉన్నతాధికారి తన పనిని చక్కబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.
అంతటితో ఆగలేదు. అమ్మాయిలతో జల్సాలు. మహిళా అధికారులపై లైంగిక వేధింపులు. దీనికితోడు సదరు ఉన్నతాధికారికి తగ్గట్టుగానే, ఆయన శాఖకు డార్లింగ్ మినిస్టర్ నేతృత్వంలో. ఇంకేముంది… అగ్గికి వాయువు తోడైనట్టు… ఆ శాఖలో అవినీతి రాజ్యమేలుతోందన్న ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం నిఘా పెట్టింది. ఫిర్యాదులన్నీ నిజమే అని తేలింది.
ఈ నేపథ్యంలో సదరు ఉన్నతాధికారిని అక్కడి నుంచి ప్రాధాన్యంలేని శాఖకు బదిలీ చేశారు. సదరు అధికారి బదిలీకి కారణాలపై ఉద్యోగులు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంపై నోరు పారేసుకుంటే, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆయన గారి ఎత్తుగడ ఫలించలేదని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
Sisodia