ఎమ్బీయస్‌ : జీసస్‌ క్రైస్తు మతప్రవక్తా? తిరుగుబాటుదారుడా?

మరణానంతరమే క్రీస్తుకి యిప్పుడున్న స్థాయి వచ్చిందని అందరికీ తెలుసు. ఇప్పుడున్నంత పాప్యులారిటీ జీవించి వుండగా వుండి వుంటే ఆయన్ని వదిలేసి బరబ్బాస్‌నే కొరత వేసేవారు. క్రైస్తు మరణించిన కొన్ని శతాబ్దాలకు క్రైస్తవమతం రూపుదిద్దుకుని ప్రజాదరణ…

మరణానంతరమే క్రీస్తుకి యిప్పుడున్న స్థాయి వచ్చిందని అందరికీ తెలుసు. ఇప్పుడున్నంత పాప్యులారిటీ జీవించి వుండగా వుండి వుంటే ఆయన్ని వదిలేసి బరబ్బాస్‌నే కొరత వేసేవారు. క్రైస్తు మరణించిన కొన్ని శతాబ్దాలకు క్రైస్తవమతం రూపుదిద్దుకుని ప్రజాదరణ పొందింది. ఒకసారి దైవసుతుడిగా పేరుబడ్డాక ఆయన చుట్టూ అనేక కథలు పుట్టుకుని వచ్చాయి – నీటిని మద్యంగా మార్చాడనీ, స్పర్శ మాత్రాన రోగాలు నయం చేశాడనీ… యిలాటివి. ఈ పొరలు తీసి చూస్తే జీసస్‌ రోమన్‌ సామ్రాజ్యంపై తిరగబడిన విప్లవకారుడిగా కనబడతాడని ప్రతిపాదిస్తూ యిటీవల ఒక పుస్తకం వచ్చింది. న్యూయార్క్‌ టైమ్స్‌, అమెజాన్‌ల టాప్‌ లిస్టులో వున్న దీని పేరు ''జీలట్‌-ద లైఫ్‌ అండ్‌ టైమ్స్‌ ఆఫ్‌ జీసస్‌ ఆఫ్‌ నజరెత్‌''. రాసినది రెజా అస్లాన్‌ అనే పరిశోధకుడు. అతను హార్వార్డ్‌ డివినిటీ స్కూల్‌లో థియలాజికల్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ చేశాడు. సోషియాలజీ ఆఫ్‌ రెలిజియన్స్‌లో డాక్టరేటు పొందాడు. బైబిల్‌లో వుపయోగించిన గ్రీకు భాషలో నిష్ణాతుడు. క్రైస్తవమతం పుట్టుకపై అధ్యయనం చేశాడు. 

అతని ప్రకారం జీసస్‌ క్రైస్తు ఒక చారిత్రాత్మక వ్యక్తి. పాలస్తీనాలో క్రీ.పూ. 4 సం|| నుండి క్రీ.శ. 33 వరకు సజీవంగా నడయాడాడు. అప్పట్లో పాలస్తీనా రోమన్‌ సామ్రాజ్యపు వలసరాజ్యంగా వుండేది. జీసస్‌ చేతిపనివాడు. దానితో బాటు యూదుల ఆలయంలో మతబోధకుడు కూడా. ''ప్రస్తుతం బానిసత్వంలో వున్నా త్వరలోనే దేవుడి రాజ్యం ఏర్పడి యీ నియంతృత్వ ప్రభుత్వం పోతుంది. వారితో బాటు వారికి మద్దతు యిస్తున్న మన మతగురువులు, వ్యాపారవర్గాలు కూడా అణచివేయబడతాయి.'' అని ప్రచారం చేసేవాడు. అతి పవిత్రంగా భావించే యూదుల ప్రధాన ఆలయాన్ని క్షాళన చేయాలంటూ జీసస్‌ పేదసాదలను, కార్మికులను వెంటబెట్టుకుని దానిలో ప్రవేశించాడు. దీనితో ఉలిక్కిపడిన మతపెద్దలు యిక లాభం లేదని అతన్ని అరెస్టు చేయించి, విచారణ జరిపించి, దోషిగా నిర్ధారించి శిలువ నెక్కించారు. జీసస్‌ జీవితాన్ని కక్షుణ్ణంగా పరిశీలించిన అస్లాన్‌ అనేదేమిటంటే – జీసస్‌ కొత్త మతాన్ని ప్రారంభించాలని ఎన్నడూ అనుకోలేదు. అతడు రాజకీయ విప్లవం లేవదీశాడు. ఆలయపెద్దలతో అతను ''సీజర్‌ ఆస్తిని సీజర్‌కు యిచ్చేయండి, దేవుడి ఆస్తిని దేవుడికి యిచ్చేయండి'' అనడంలో అర్థం, సీజర్‌ను తరిమేసి స్వతంత్ర ఇజ్రాయేలు ఏర్పరచాలనే! 

జీసస్‌ మరీ అంత శాంతికాముకుడేమీ కాదంటాడు అస్లాన్‌. ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించమని అనలేదట. రోమన్లు జీసస్‌ శిష్యులు లేవనెత్తిన విప్లవాన్ని క్రీ.శ. 70లో పూర్తిగా అణిచేసి, ఆలయాన్ని కూల్చేశారు. హింసాత్మక మార్గం లాభం లేదని, మన గాంధీగారు ఆంగ్లేయులను ఎదిరించడానికి అహింసామార్గాన్ని వాడుకున్న రీతిలో వాళ్లు జీసస్‌ను శాంతిదూతగా ప్రచారం చేశారు. అది రోమన్‌ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల వారికే కాక, యితర దేశాల వారికీ ఆమోదయోగ్యంగా కనబడింది. క్రైస్తవం వృద్ధి చెందింది. అస్లాన్‌ సిద్ధాంతం నిజమే అయితే జీసస్‌ కశ్మీర్‌లో మరణించాడన్న వాదన తప్పు. అస్లాన్‌ ప్రకారం అతను గెలీలోనే వున్నాడు. జీసస్‌ మరణానంతరం కేరళ వచ్చిన అతని శిష్యుడు సెయింట్‌ థామస్‌ యిన్నాళ్లూ మతప్రచారానికి వచ్చాడనుకుంటున్నాం. ఈ పుస్తకం చదివితే అతను రాజకీయ ఆశ్రయం కోరి వచ్చాడని అనుకోవాలి. 
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌