మనుషుల ఆర్థిక స్థితి గతులని బట్టి ధనిక, పేద, మధ్య తరగతి శ్రేణులున్నట్టే… సినిమాల్లోను ఈ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా, సదరు హీరోలకి ఉన్న మార్కెట్ పరంగా సినిమాలనీ లో, హై, మీడియం అంటూ డివైడ్ చేసుకోవచ్చు. అంతే కాదు కథల పరంగా, ఎంచుకునే జోనర్స్ పరంగాను సినిమాల్ని ఏ క్లాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసారనేది చెప్తుంటారు.
ఇది మాస్ సినిమా, ఇది క్లాస్ సినిమా అని అంటుంటారు కదా… అసలు దాని మీనింగ్ ఏంటి? మాస్ అంటే దిగువ శ్రేణి ప్రేక్షకుల అభిరుచులు, వారి ఇష్టాలకి అనుగుణంగా తీసిన సినిమా అన్నమాట. వీటిలో ఫైట్లు, డాన్సులు, ఓవర్ ది టాప్ హీరోయిజమ్, లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్, ఐటెమ్ సాంగ్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్… ఇలాంటివన్నీ ఉంటాయి. మాస్ సినిమాల్లో ఇంటిల్లిజెన్స్ కంటే మసాలా ఎలిమెంట్స్ డామినేట్ చేస్తుంటాయి. అందుకే ఈ చిత్రాలు క్రిటిక్స్‌తో అక్షింతలు వేయించుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతుంటాయి. ఇక క్లాస్ సినిమాలంటే పైన చెప్పుకున్న అంశాలేమీ లేకుండా స్లోగా, స్మూత్‌గా, టచింగ్‌గా ఉంటాయన్నమాట. ఇవి సహజంగా మాస్ ఆడియన్స్‌కి ఎక్కవు. ఇలాంటి సినిమాలు సిటీస్‌లో ఎక్కువ ఆడతుంటాయి.
ఇవేమీ కాకుండా ఒకప్పుడు మిడిల్ క్లాస్ సినిమాలుండేవి. ఇటు క్లాస్‌కి, అటు మాస్‌కి అప్పీలింగ్‌గా ఉండే అలాంటి చిత్రాలు అధికంగా ఫ్యామిలీ డ్రామాతో, సెంటిమెంట్‌తో, దైనందిన జీవితాల్ని ప్రతిబింబించేలా ఉండేవి. ఇలాంటి సినిమాలు తీయడానికి అప్పట్లో ముత్యాల సుబ్బయ్య, ఎస్వీ కృష్ణారెడ్డి తదితర దర్శకులుండేవారు. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్ తదితర హీరోలు ఇలాంటి సినిమాలతోనే హిట్లు కొడుతుండేవారు. స్టార్ హీరోల సినిమాలు, క్లాస్ లవ్‌స్టోరీల మధ్య ఈ చిత్రాలకి కూడా గిరాకీ బాగుండేది. ఎప్పుడూ కొత్త కొత్త సినిమాల రిలీజ్‌లతో పరిశ్రమ కళకళలాడుతుండేది. రాన్రానూ మిడిల్ క్లాస్ సినిమాలు అంతరించి పోయాయి. ఆ కోవలోకి వచ్చే హీరోలకీ పని లేకుండా పోయింది.
టీవీ సీరియల్స్ కారణంగా ఫ్యామిలీ డ్రామాలకి డిమాండ్ పడిపోయింది. టీవీని వదిలి మహిళలు, మధ్య తరగతి ప్రేక్షకులు థియేటర్లకి రావడం తగ్గిపోవడంతోనే మిడిల్ క్లాస్ సినిమాలకి కోలుకోలేని దెబ్బ పడిరది. టికెట్ ధరలు పెరగడంతో సినిమా కాస్ట్‌లీ వ్యవహారమైంది. రెండు సినిమాల టికెట్ ధర పెడితే నెలంతా కేబుల్ టీవీ కనెక్షన్‌తో కావాల్సినంత కాలక్షేపం జరిగిపోతోంది. ఛానెల్స్ పెరిగిపోవడంతో కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల్లోనే టీవీలో ప్రసారమైపోతున్నాయి. దీంతో ‘కొన్నాళ్లాగితే టీవీలోనే ఫ్రీగా చూడొచ్చులే’ అనే ఫీలింగ్ చాలా మందిలో కలగడం వల్ల మిడిల్ క్లాస్ సినిమాలే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి.
స్టార్ హీరోల సినిమాల్ని ఎంత త్వరగా చూసేస్తే అంత క్రేజు. సో అండ్ సో హీరో సినిమా ఫస్ట్ డే చూసామని చెప్పుకోవడం గ్రేటు. పాపం మిడిల్ క్లాస్ హీరోల సినిమాలకి ఈ సౌకర్యం ఉండదు. ‘ఆ సినిమా థియేటర్లో చూసారా మీరు?’ అని పుసుక్కున అనేస్తుంటారు. ఎప్పుడైతే మిడిల్ క్లాస్ సినిమాలకి డిమాండ్ పడిపోయిందో సినిమా కూడా సీజనల్ బిజినెస్ అయిపోయింది. ఏడాది అంతటా కొత్త సినిమాలతో కాసుల కళ కళ లేదిప్పుడు. పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లని టార్గెట్ చేస్తున్నాయి. మిగతా టైమ్‌లో చిన్న సినిమాలే వచ్చి పోతున్నాయి. దీంతో ఏడాదిలో కొన్ని నెలల్లో అస్సలు బిజినెస్ జరగక సినీ వ్యాపారంలో ఉన్న వారు అల్లాడిపోవాల్సి వస్తోంది.
స్టార్ హీరోలని పెట్టి నలభై కోట్లకి పైగా ఖర్చుతో తీసే పెద్ద సినిమాలు, లేదా రెండు కోట్ల బడ్జెట్‌తో తీసే చిన్న సినిమాలే ఇప్పుడు సినిమా వ్యాపారాన్ని నిలబెడుతున్నాయి. పది, పదిహేను కోట్ల వ్యయంతో రూపొందే మధ్య తరగతి సినిమాలు కూడా కొన్ని వస్తుంటాయి కానీ వీటికి డిమాండ్ అండ్ సప్లయ్ బాగా తక్కువ. ఫెయిల్యూర్ రేట్ అంతే ఎక్కువ. ఈ చిత్రాలకీ, వీటి హీరోలకి మినిమం గ్యారెంటీ లేదిప్పుడు. పూర్తిగా ఆడియన్స్ మూడ్ మీద డిపెండ్ అయి రన్ అవ్వాల్సిందే తప్ప సదరు హీరోల సినిమాలొస్తే చూసేద్దామంటూ థియేటర్లకి ఎవరూ రారు. అందుకే సిద్ధార్థ్, వరుణ్ సందేశ్, నాని తదితర హీరోల మార్కెట్ గణనీయంగా పడిపోయింది. గతంలో శ్రీకాంత్, జగపతిబాబు, వడ్డే నవీన్‌లాంటి హీరోల సినిమాలకీ ఓపెనింగ్స్ బాగుండేవి. వారి సినిమాలు చూడ్డానికీ ప్రేక్షకులు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు యావరేజ్‌గా ఉందంటే చాలు… ఇక ఆ సినిమాని భగవంతుడు కూడా కాపాడలేడు.
ఎంతో బాగుందని టాక్ వస్తే తప్ప మీడియం బడ్జెట్ సినిమాలు, మిడిల్ రేంజ్ హీరోల బండి నడవడం లేదు. అల్లరి నరేష్, గోపీచంద్ తదితర హీరోల మార్కెట్ చాలా వేగంగా పడిపోవడం గమనించే ఉంటారు. ఒకవైపు స్టార్ హీరోల యావరేజ్ సినిమాలు నలభై, యాభై కోట్ల రేంజ్ దాటిపోతోంటే… ఇంకోవైపు కోటి రూపాయల బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలు కూడా పది, పదిహేను కోట్లు ఆర్జిస్తూ సర్‌ప్రైజ్ హిట్స్ అవుతోంటే… మీడియం రేంజ్ సినిమాలు మాత్రం ‘గాలివాటం’ సినిమాలైపోతున్నాయి. పెద్ద హీరో ఉన్నప్పుడు దర్శకుడు కాస్త అలసత్వం ప్రదర్శించినా ఫర్వాలేదు. సదరు హీరో పెద్దగా కేర్ తీసుకోకపోయినా నష్టం లేదు. అలాగే చిన్న సినిమాలు ఫ్లాపయితే పోయేది పెద్దగా ఏమీ ఉండదు. ఎటు తిరిగీ కోలుకోలేకపోతున్నది మీడియం రేంజ్ చిత్రాలే కనుక వీరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కథల ఎంపికలోనే కాకుండా ప్రేక్షకుల్ని థియేటర్లకి ఎలా రాబట్టాలనే విషయంలో కూడా కసరత్తు కంపల్సరీ. హిందీలో ఇప్పుడు చాలా సినిమాలు మార్కెటింగ్‌తోనే ఆడుతున్నాయి. ఆకర్షణీయమైన పబ్లిసిటీ చేసిన సినిమాలు కొన్ని మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఇక్కడా కనిపిస్తూనే ఉంది. పబ్లిసిటీతో ఆకట్టుకునే మార్గాలు అన్వేషించడమే కాకుండా… తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే అంశాలతో సినిమాని తెరకెక్కించినట్టయితే ఈ రేంజ్ సినిమాలు తప్పకుండా ఆదరణ పొందుతాయి. డెయిలీ బేటాకి పని చేసే వ్యక్తి దిలాసాగా బతికేస్తాడు. ధనవంతుడికి ఏ లోటూ ఉండదు. మధ్య తరగతి వాడే సకల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే బతుకు బండి సాగదు. సినిమా పరిస్థితీ అచ్చంగా ఇదే. హై బడ్జెట్ సినిమా ప్రొడ్యూసర్ ఎలాగో గట్టెక్కేస్తాడు. ఆ హీరోలకి ఎన్ని ఫ్లాపులొచ్చినా ఫషరక్ పడదు. చిన్న సినిమాల హీరోలకీ, ఆ నిర్మాతలకీ ఫ్లాపవడం వల్ల వచ్చే సమస్యేం లేదు. ఎటొచ్చీ మధ్యలో ఉన్న వాళ్లే కేర్‌ఫుల్‌గా ఉండాలి. వారు కనుక దీనిని సమీక్షించుకుని ఆచి తూచి అడుగులేస్తే మళ్లీ ‘మిడిల్ క్లాస్’ సినిమాకి మంచి రోజులొస్తాయి. సినిమా వ్యాపారం సీజనల్ బిజినెస్‌గా కాకుండా ఏడాది మొత్తం కాసుల గలగలలతో పచ్చగా ఉంటుంది.
– గణేష్ రావూరి