తెలంగాణ క్రెడిట్ ఎవరి ఖాతాలో పడుతుంది అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారివి. సీమాంధ్రను బలివేసైనా సరే తెలంగాణ యిచ్చితీరాలన్న తెగింపు సోనియా చూపకపోతే వందమంది కెసియార్‌లు వెయ్యేళ్లు ఉద్యమం చేసినా తెలంగాణ వచ్చేదా? అని టి-కాంగ్రెసు వాళ్లు అడుగుతున్నారు. 'కాంగ్రెసు తలచుకుంటే మాత్రం మేం అడ్డుపుల్ల వేస్తే ఆగిపోయేది కాదా, సీమాంధ్రలో ప్రస్తుతం మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నా, ఎప్పుడో యిచ్చినమాటకు కట్టుబడి బిల్లులో అవకతవకలు తెలిసి కూడా, మేం అధికారంలోకి వచ్చి అవన్నీ సవరిస్తాం అనే ధీమాతో కాంగ్రెసుకు సై అన్న చిన్నమ్మలం మేం' అంటోంది బిజెపి. 'తెలంగాణ యిచ్చినది, తెచ్చినది మేమే, అవునా కాదా?' అని హైదరాబాదు సభలో రాజనాథ్ సింగ్ ప్రజలను అడిగి వాళ్లు 'అవును మహాప్రభో' అనేదాకా వదలలేదు. ప్రాంతీయపార్టీల వలన ఏమవుతుంది, మా వంటి జాతీయపార్టీ పూనుకుంది కాబట్టే పనైంది అని బిజెపి, కాంగ్రెసులు యిద్దరూ తెరాస పాత్రను తగ్గించి మాట్లాడుతున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా టిడిపి 'మేం లేఖ యిచ్చాం కాబట్టే, తెలంగాణ వచ్చింది' అని తెలంగాణలో చెప్పుకుంటోంది. మళ్లీ ఆ మాట సీమాంధ్రలో గట్టిగా అనటం లేదు. కానీ పార్లమెంటులో టి-టిడిపి ఎంపీలు తమ పార్టీ సీమాంధ్ర ఎంపీనే చావగొట్టి చెవులు మూసి బిల్లు సాధించారని తెలుసు. రాజ్యసభలో సీమాంధ్ర టిడిపి ఎంపీలు వెల్‌లోంచి కదలకుండా నిలబడి బిల్లు మూజువాణీ ఓటుతో పాస్ అయ్యేట్టు సహకరించారు. అయినా టిడిపికి తెలంగాణ సాధించిన ఘనత దక్కేట్టు లేదు. టి-టిడిపి నాయకులు గెలిస్తే అది వేరే కారణాల వలన గెలవాలి తప్ప రాష్ట్రసాధన కారణంగా కాకపోవచ్చు.
ఝార్‌ఖండ్‌లో ఏం జరిగింది?
అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న పార్టీ – తెరాసయే. పుష్కరంపాటు ఉద్యమం చేసి సాధించింది కాబట్టి అందరూ దానికే ఓటేస్తారనే భావనతో అంచనాలు సాగుతున్నాయి. 28 వ రాష్ట్రమైన ఝార్‌ఖండ్ 2000 ఎన్నికల తర్వాత బిహార్‌నుంచి చీల్చబడింది. 81 అసెంబ్లీ స్థానాలున్న ఆ ప్రాంతంలో రాష్ట్ర ఏర్పాటుకై ఉద్యమించిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) కు 12 ఎమ్మెల్యేలు మాత్రమే వున్నారు. బిజెపికి 33 మంది వున్నారు. ఎన్‌డిఏను సమర్థించిన జెఎంఎం నాయకుడు శిబు సొరేన్ ముఖ్యమంత్రి పదవి ఆశించాడు. కానీ బిజెపి తన పార్టీకి చెందిన బాబూలాల్ మరాండికి అధికారం కట్టబెడదామనుకుంది. శిబు బిజెపితో సంబంధాలు తెంపుకుని లాలూని ఆశ్రయించాడు. తనకు ముఖ్యమంత్రి పదవి రాలేదని ఆశాభంగం చెందిన బిజెపి లీడరు కరియా ముండాను తన వైపు లాగుదామని చూశాడు. కానీ కరియా ముండా నిరాకరించాడు. పోనీ కాంగ్రెసు ఏమైనా సహాయం చేస్తుందా అంటే ఝార్‌ఖండ్‌లో ఎవర్నీ సపోర్టు చేయం అనేసింది. ఎలాగోలా ఒప్పించినా 45 మంది వున్న ఎన్‌డిఏ వ్యతిరేక కూటమికి 36 మంది కంటె ఎక్కువ పోగుపడలేదు. ఆ విధంగా ఝార్‌ఖండ్ ఏర్పడినపుడు అధికారంలోకి వచ్చినది బిజెపి! జెఎంఎం కాదు. పోనీ తర్వాత వచ్చిన 2005 ఎన్నికలలోనైనా జెఎంఎంను ఆదరించారా అంటే 49 స్థానాల్లో పోటీ చేస్తే 17 వచ్చాయి. బిజెపి 63 స్థానాల్లో పోటీ చేసి 30 తెచ్చుకుంది. శిబు ఎలాగోలా ముఖ్యమంత్రి గద్దె నెక్కి తన మెజారిటీ నిరూపించుకోలేక పది రోజుల్లో పదవీభ్రష్టుడయ్యాడు. 29 వ రాష్ట్రమైన తెలంగాణలో ఏం జరుగుతుందో కొన్ని నెలల్లో తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే కెసియార్ కొండెక్కి (సిటింగ్ ఆన్ హై హార్స్) కూర్చున్నారు. 'తెలంగాణ యిచ్చేస్తే మాకు యిక పని వుండదు, పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేస్తాం, ఆంధ్ర, తెలంగాణ రెండు చోట్లా వాళ్లే ఏలుకోవచ్చు, మాకేం చింత లేదు' అని ఆయన ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించి కాంగ్రెసును వూరించారు. అది టి-కాంగ్రెసువాళ్లకు హాయిగా అనిపించింది. కాంగ్రెసు నీడ, కెసియార్ సారథ్యం వుంటే యిక తమ గెలుపు ఖాయం అనుకుని విలీనంకై ఉవ్విళ్లూరారు. ఢిల్లీ హై కమాండ్ వద్దకు వెళ్లి నమ్మబలికారు – తెలంగాణ యిచ్చి చూడండి, కెసియార్‌ను పట్టుకుచ్చి మీ చెంత కూర్చోబెడతాం' అని హామీలు గుప్పించారు. నిజానికి కెసియార్‌ను నమ్మాలా వద్దా అన్న సందేహం వాళ్లకు వుండే వుంటుంది. అయినా, పార్టీ నడిపేటంత ఓపిక కెసియార్‌కు లేదనే అంచనాతోనే వాళ్లున్నారు. ఆ క్రమంలో హరీశ్‌ను లెక్కలోకి తీసుకోవడం మర్చిపోయారు. కెసియార్ మాటలతో సరిపెట్టినా, హరీశ్ చేతల మనిషి కూడా. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు వుందని ఆశిస్తున్నవాడు. కాంగ్రెసులో విలీనం చేస్తే చిరంజీవి లాగే అవుతుందని అతని భయం.
చిరంజీవి నమూనా
చిరంజీవిని చూడండి – కిరణ్ దిగిపోయిన తర్వాత కూడా సిఎం కాదు, పిసిసి అధ్యక్షుడు కాదు, ప్రచార కమిటీ చైర్మన్ చేశారు. కనీసం తెలంగాణలో పెట్టినట్టు వర్కింగ్ ప్రెసిడెంటు పోస్టు పెట్టి దాన్నయినా యిచ్చారు కాదు. ఆ రోజు చిరంజీవి తన పార్టీని విలీనం చేయకపోతే కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయి వుండేది. అంత చేసినా యీ రోజు ఆయనకు దక్కినది – ప్రచార కమిటీ పేర వూరూరా తిరగడం. 'పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడో అక్కడికే నువ్వు కూడా వెళ్లు' అని ఢిల్లీ ఆదేశిస్తే ఆయన యిరుకున పడ్డట్టే. ఇద్దరూ ప్రజారాజ్యం పార్టీలో వున్నపుడే పవన్ ఉపన్యాసాల్లో కనబడిన ఫయర్ చిరంజీవి ఉపన్యాసాల్లో కనబడలేదు. పవన్ ఫీలయి డైలాగులు చెపితే, చిరంజీవి ప్రాంప్టింగుతో చెప్పినట్లు చెప్పారు. ఇప్పుడు పవన్ అన్నగారి ఛాయల్లోంచి బయటపడి, సొంత ఆలోచనలతో వస్తున్నా అంటే యింకా ధాటీగా మాట్లాడతాడు. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాబట్టి, అన్ని పార్టీలనూ ఉతకవచ్చు, సంజాయిషీ చెప్పుకోవలసిన పని లేదు – వ్యక్తిగతమైన ప్రశ్నలు వస్తే తప్ప! చిరంజీవికైతే విభజన గురించి, హైదరాబాదుకి యుటీ హోదా సంపాదించ లేకపోవడం గురించి, సామాజిక తెలంగాణ గురించి, కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఒరగబెట్టిన దాని గురించి.. యిలా అనేక అంశాల గురించి సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుంది. ఏదో ఒక నియోజకవర్గం అయితే ఫరవాలేదు, ప్రచారానికి వెళ్లిన ప్రతీ వూళ్లోనూ ప్రశ్నలు ఎదుర్కోవాలి. గత ఎన్నికలలోనే చిరంజీవి ఎక్కువగా తిరగలేక నీరసించారు. ఐదేళ్ల తర్వాత ఓపిక యింకా తగ్గి వుంటుంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు యిచ్చిన పోస్టు చూడండి.
కాంగ్రెసులో విలీనం అయితే కెసియార్‌కైనా, హరీశ్‌కైనా జరిగేది యిలాటి సత్కారమే! అందుకే హరీశ్ అభ్యంతరాలు చెపుతూనే వున్నారు. తెరాసను కెసియార్ విలీనం చేసి వుంటే, హరీశ్ విడిగా వచ్చేసి యువతెరాస వంటి పార్టీ పెట్టేవారేమో! ఆ ప్రమాదాన్ని కెసియార్ వూహించి కాబోలు, విలీనం మాట వదిలేశారు. అసలు ఆయన మనసులో ఎప్పుడైనా విలీనం ఊహ వుందో లేదో, తెలంగాణ వచ్చేవరకు మాత్రమే తగ్గి వున్నారు. వచ్చాక 'విలీనం లేదు సరికదా, పొత్తుల గురించి మా కమిటీతో మాట్లాడండి' అంటున్నారు. మొన్నటిదాకా కెసియార్‌తో భుజాలు రాసుకుంటూ తిరిగిన జయపాల్ రెడ్డి కూడా విలీనం గురించి యీ రోజు చేతులెత్తేశారు.
తెచ్చినవారికా.. ఇచ్చినవారికా.. ఎవరికి పట్టం?
సోనియా తెలంగాణ యిచ్చింది కదా, విలీనం చేయడం మీ నైతికబాధ్యత కదా అని కెసియార్‌తో అంటే 'తెలంగాణ పునర్నిర్మాణం పని మేమే బాగా చేయగలమని ప్రజల నమ్మకం. పార్టీ క్యాడర్ కూడా అదే అంటోంది. వారి మాట కాదనలేం కదా' అని ప్రజల మీదకు, క్యాడర్‌మీదకు నెట్టేశారు. 'తెలంగాణ యిచ్చినందుకు ఓటర్లు సోనియాకు ఓటేస్తారేమో…?' అంటే ఆయన 'స్వాతంత్య్రం యిచ్చారు కదాని ఎలిజిబెత్ రాణికి, చర్చిల్‌కు భారతీయులు ఓటేశారా?' అని అడిగారు. ఇక్కడ చిన్న సవరణ ఏమిటంటే – స్వాతంత్య్రం యిచ్చినపుడు బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ. కానీ మనవాళ్లందరికీ చర్చిల్ పేరే నాలిక చివర ఆడుతుంది. ఆయన అప్పుడు ప్రతిపక్షంలో వుండి వీలైనని అడ్డంకులు పెట్టాడు. పేర్ల విషయం పక్కన పెట్టినా స్పిరిట్ ఆఫ్ ద స్టేట్‌మెంట్ తీసుకుని చూస్తే – స్వాతంత్య్రం యిచ్చిన వారికి కాదు, తెచ్చినవారికి ఓట్లేశారు, ఇక్కడ తెలంగాణ విషయమూ అంతే అని కెసియార్ వాదన.
ఇక్కడ ఆయన మర్చిపోయినది ఏమిటంటే – స్వతంత్ర భారతంలో ఎలిజిబెత్ రాణి గాని, చర్చిల్ గాని, అట్లీ గాని ఎన్నికలలో పోటీ చేయలేదు. మేమే యిచ్చాం అని ప్రచారం చేసుకోలేదు. అంతేకాదు, గాంధీగారు ఎలిజిబెత్ రాణి యింటికి తన పిల్లలతో, మనుమలతో వెళ్లి ఫోటో దిగి 'అంతా మీ వల్లనే తల్లీ' అని కృతజ్ఞతలు చెప్పుకుని రాలేదు. కెసియార్ సోనియా యింటికి వెళ్లి ధన్యవాదాలు చెప్పుకుని వచ్చాకనే యిక్కడ వూరేగారు. అందువలన తెలంగాణ సాధనలో సోనియా పాత్రను ఆయనే చాటిచెప్పారు. ఇప్పుడు సోనియా, ఆమె అనుచరులు ఎన్నికలలో పోటీ చేసి 'మా వల్లనే తెలంగాణ వచ్చింది' అంటే 'అదేం కాదు' అని యీయన అనగలరా? కాంగ్రెసులో ఎందుకు విలీనం చేయరు అంటే 'విజయశాంతిని చేర్చుకోవడం వలన..' అంటున్నారు తెరాస వాళ్లు. మీరేమో పార్టీ నుండి బహిష్కరిస్తిరి, ఇక ఆమె ఎటు పోవాలి? అది కూడా మీరే నిర్ణయిస్తారా? కాంగ్రెసు నుండి, టిడిపి నుండి తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తూ వచ్చిన తెరాస విజయశాంతి కారణంగా కాంగ్రెసును తప్పుపట్టగలదా? విజయశాంతి అడిగారు – 'నేను కాంగ్రెసులో నుండి తప్పుకుంటే విలీనం చేస్తారా?' అని. దానికి సమాధానం లేదు. విలీనం కాదు కదా, ఆశ్చర్యకరంగా పొత్తు కూడా సందేహాస్పదం అయిపోయింది. తెరాసకు పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదు కాబట్టి పొత్తు పెట్టుకుంటుందని, తర్వాత పొత్తు సరిగ్గా నడవదనీ అనుకుంటూ వచ్చాను. తీరా చూస్తే పొత్తు పొడిచేట్లు లేదు.
ఎంతమందికి టిక్కెట్లు యివ్వగలరు?
కారణం సులభంగానే వూహించవచ్చు. పొత్తు పెట్టుకుంటే దాదాపు 50 సీట్లు సిటింగ్ కాంగ్రెసు వాళ్లకే పోతాయి. కొద్ది మార్జిన్‌లో ఓడిపోయినవాళ్లను కూడా కన్సిడర్ చేయాలి అనుకుంటే 60 సీట్లు …అంటే సగానికి సగం కాంగ్రెసుకే యిచ్చేయాలి. పాతబస్తీలో పది సీట్లు మజ్లిసార్పణం. తక్కిన 50లో తెరాసలో మొదటినుండీ వున్నవాళ్లకు, పార్టీ ఫిరాయించి వచ్చినవాళ్లకు, ఆర్థికసహాయం చేసిన ఎన్నారైలకు, పారిశ్రామికవేత్తలకు – యింతమందికి సర్దాలి. వీళ్లందరూ సేఫ్ సీట్లే అడుగుతారు. హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం యిత్యాది జిల్లాలలో యిస్తే అలుగుతారు. వీళ్లు చాలనట్లు జాక్ వాళ్లు టిక్కెట్లు అడుగుతున్నారు. ఉద్యమం గెలిచిదంటే మా పాటలే కారణమని గాయకులు, మా వ్యాసాలని జర్నలిస్టులు, మా కథలని రచయితలు, మా ప్రదర్శనలని న్యాయవాదులు, డాక్టర్లు, అందర్నీ మించి ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు.. యిలా యీ వర్గాల్లో కనీసం పాతిక, ముప్ఫయిమంది ఆశావహులు తేల్తారు. కెసియార్ కొంతమందిని ఎకామడేట్ చేద్దామని చూస్తున్నారు. కానీ తన పార్టీలో చేరితేనే.. అంటున్నారు. వీళ్లకు టిక్కెట్టు యివ్వడం వలన ఎప్పణ్నుంచో రిస్కులు తీసుకుంటూ రాజకీయాల్లో వున్నవారికి బాధగా వుంటోంది. మెహబూబ్‌నగర్ నియోజకవర్గంలో చూశాం. ఉద్యోగి సంఘాల నాయకుడు శ్రీనివాస గౌడ్‌కు యివ్వగానే స్థానిక తెరాస నేత తిరగబడ్డాడు. ఎమ్మెల్సీ యిస్తామని చెప్పి వూరుకోబెట్టవలసి వచ్చింది. విద్యార్థి నాయకుడు పిడమర్తి రవిని తీసుకున్నారు. మరి మా సంగతి ఏమిటి అని కనీసం అరడజను మంది విద్యార్థినాయకులు అడగకమానరు. ఈ జాక్ వాళ్లతో పడలేం అని వదిలేస్తే వాళ్లను కాంగ్రెసు ఆకర్షించేట్లు వుంది.
జాక్‌లు ఒకటే కాదు, అమరవీరులతోనో చిక్కు వచ్చిపడింది. శ్రీకాంతాచారి తల్లి వచ్చి టిక్కెట్టు యిస్తారా? మా అబ్బాయిలా ఆత్మహత్య చేసుకోనా అని బెదిరిస్తోందిట. ధనసహాయం చేయలేదన్న కారణంగా అమరవీరుల కుటుంబాలు తెరాసపై ఆగ్రహంతో వున్నాయి. వారికి కొన్ని టిక్కెట్లు యిచ్చి వూరుకోబెట్టకపోతే గతంలోలా తెరాస భవనంపైకి దాడికి వస్తారు. ఇంతమంది ఆశావహులు వుండగా ఎందరికి టిక్కెట్లు దక్కుతాయో తెలియదు. దక్కనివాళ్లు రెబెల్ కాండిడేట్స్‌గా నిలబడితే ఓట్లు చీలిపోయే ప్రమాదం వుంది. ఇంతమందిని కేవలం 50 సీట్లలో సర్దడం ఎంత కష్టం? కెసియార్ కుటుంబసభ్యులకే నాలుగు కావాలి. ఇలాటి పరిస్థితుల్లో కాంగ్రెసుతో పొత్తు పొసగే ఛాన్సు కనబడటం లేదు. కెసియార్‌కు కొందరు కాంగ్రెసు నాయకులపై స్వంత కక్షలున్నాయి. అవి తీర్చుకోవాలంటే కాంగ్రెసుతో పొత్తు పనికిరాదు. ఉదాహరణకి డికె అరుణ వ్యవహారం. పొత్తు గురించి ఓ పక్క మాటలు సాగుతూండగానే కొంపలు మునిగిపోయినట్లు ఆవిడ నియోజకవర్గం కాండిడేటును ప్రకటించేశారు. ఇక ఆవిడ మండిపడింది – ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతీయవాదం తెచ్చింది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ అంటూ విభజన తెచ్చిపెట్టారు. ఇక యిది కూడానా..!? ఇంత త్వరగానా..?? అనిపించింది. చీల్చడం అంటూ మొదలెట్టాలే కానీ సమాజాన్ని ఎలాగైనా చీల్చవచ్చు. దొరల తెలంగాణ వెర్సస్ దళిత తెలంగాణ ఒరిజినల్ తెలంగాణవాసులు వెర్సస్ సీమాంధ్రమూలాల తెలంగాణవాసులు… యిలా !
ఎవరికి వారే మూసీతీరే…
తెలంగాణవాదులమంతా ఒక్కటే అన్న నినాదంతో యిన్నాళ్లూ అందరు ఎత్తిన చేతులు కలుపుకుంటూ ఫోటోలు తీయించుకున్నారు. తెలంగాణ వచ్చేదాకా సైలంటుగా వున్నారు. వచ్చేశాక పార్టీల పరంగా చీలిపోయి కొట్లాడుకుంటున్నారు. ఎవరూ వేరేవారితో కలిసేట్లు కనబడటం లేదు. ఇది చాలనట్లు పార్టీలో కూడా పోట్లాటలు జరుగుతున్నాయి. టిడిపిలో ఎర్రబెల్లి అలిగారు. కాంగ్రెసులో జానారెడ్డి అలిగారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఎవరు ఏ పార్టీలో దూకుతారో తెలియదు. గతంలో అయితే కాంగ్రెసు, కమ్యూనిస్టు అంటూ సిద్ధాంతపరంగా భిన్నమైన రెండు మార్గాలుండేవి. ఆ తర్వాత బిజెపికి మరో సిద్ధాంతం. ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి వెళ్లేవారు కారు. ఇప్పుడున్న పార్టీల్లో ఒకదానిలోంచి మరొక దానిలోకి సులభంగా మారిపోవచ్చు. సిద్ధాంతవైరుధ్యం ఏమీ లేదు. ఎలా గెలుస్తాం అన్నదే ఏకైక సిద్ధాంతం. రెండు, మూడేళ్లగా జాతీయ మీడియా చెప్తూ వచ్చింది – తెలంగాణను తెరాస, సీమాంధ్రను వైకాపా స్వీప్ చేస్తాయని! ఎన్నికలు దగ్గరపడి స్పష్టత వచ్చేవరకు యిలాటివి చెప్పలేమని నా దృఢవిశ్వాసం. ఇప్పుడు చూడండి – స్వీప్ చేస్తాయని గట్టిగా చెప్పగలమా? విభజన జరగకుండా వుంటే సెంటిమెంటుతో తెరాసకు పడేవేమో! అయిపోయాక తెరాసతో పనేముంది అనుకోవచ్చు. 'నదీజలాలు, శాంతిభద్రతలతో సహా అన్నీ కేంద్రం చేతిలో పెట్టేశారు కదా, తెలంగాణ పునర్నిర్మాణం కావాలంటే రాయితీలు కావాలి, ప్రత్యేక హోదా కావాలి, ఉమ్మడి రాజధాని గడువు, హైదరాబాదులో విద్యావకాశాల గడువు పెంచకుండా చూడాలి, ఇవన్నీ కేంద్రంలో పాలించే జాతీయపార్టీ వలన అవుతుంది తప్ప ప్రాంతీయపార్టీల వలన ఏమవుతుంది?' అన్న నినాదంతో కాంగ్రెసు, బిజెపిలు ప్రచారం చేస్తాయి. అప్పుడు తెరాసకు మెజారిటీ సీట్లు వస్తాయన్న గ్యారంటీ ఏముంది?
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)