అసలు పవన్‌ ఏం చేస్తాడు?

పవన్‌కళ్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం ప్రస్తుతం పెద్ద టాపిక్‌ అయి కూర్చుంది. ఏ టీవీ ఛానల్‌ పెట్టినా, ఏ వెబ్‌సైట్‌ చూసినా… పవన్‌ పార్టీ గురించే చర్చ.. రచ్చ!! ఇంతవరకు అయితే పవన్‌ దీనిపై…

పవన్‌కళ్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం ప్రస్తుతం పెద్ద టాపిక్‌ అయి కూర్చుంది. ఏ టీవీ ఛానల్‌ పెట్టినా, ఏ వెబ్‌సైట్‌ చూసినా… పవన్‌ పార్టీ గురించే చర్చ.. రచ్చ!! ఇంతవరకు అయితే పవన్‌ దీనిపై పెదవి విప్పలేదు. తాను పార్టీ పెడతాడో లేక ఎవరితో అయినా కలుస్తాడో… లేక కేవలం ప్రజల్ని జాగృతం చేయడానికి కంకణం కట్టుకుని ‘ప్రశ్నలతో’ రాజకీయ నాయకులని నిలదీస్తాడో… ఏదీ ఎవరికీ తెలియదు.. పవన్‌కీ, తన సన్నిహితులకీ తప్ప. 

ఎన్నికలేమో కూతవేటు దూరంలో ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఆల్రెడీ సమర సన్నాహాల్లో పడ్డాయి. ఇప్పుడొచ్చి వాకిలి తుడిచి, కళ్లాపి జల్లి, ముగ్గు పెట్టి… ఎప్పుడు తన పార్టీకి స్వాగతం బోర్డు తగిలిస్తాడో… ఇంకా పుట్టను కూడా పుట్టని బిడ్డకి ఏ పేరు పెడతాడో, ఎప్పుడు నిలబెడతాడో, ఎలా నడిపిస్తాడో ఏమాత్రం అర్థం కావడం లేదు. పవన్‌కళ్యాణ్‌కి ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే అలవాటుంది. గతంలో అది పబ్లిగ్గానే చూసాం. 

ఇదీ ఒక అనాలోచిత, ఆవేశ పూరిత నిర్ణయమా? లేక ఈసారి పవన్‌ ఏదైనా మెచ్యూరిటీ చూపిస్తున్నాడా…? నవ్వుల పాలు కాకుండా రాజకీయ పార్టీ పెట్టి… ఇక్కడ మనగలడా? ఒకవేళ తనపై పెద్ద బాధ్యతల్ని ప్రజలు పెట్టినట్టయితే అవి నిర్వర్తించడానికి పవన్‌ సినిమాలు వదిలేసుకుని రాగలడా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు… అంతులేని అనుమానాలు పవన్‌ రాజకీయ ప్రవేశం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అసలు పవన్‌ ఏం చేస్తాడు? ఏ విధంగా ఇక్కడ నెగ్గుకొస్తాడు? మెగాస్టార్‌ అంతటోడ్ని కీలుబొమ్మని చేసి ఆడించిన చోట… ఆ నీడలో ఎదిగిన ఈ పవర్‌స్టార్‌ ఎలా వెళ్లి ఎవరి జుట్టయినా పట్టుకుంటాడు? ‘బంగారం’ వచ్చి తన బండారం బయటపెడితే తప్ప దీనిగురించి విశ్లేషించడం, దీనిని తర్కించుకోవడం అసాధ్యం సుమా!!