భగత్‌సింగ్‌తో పోలిక ఎలా కుదురుతుంది?

లగడపాటి రాజగోపాల్‌ను కొందరు ఆంధ్రా భగత్‌ సింగ్‌గా కీర్తించడం మొదలుపెట్టారు. భగత్‌ సింగ్‌ కాదు అఫ్జల్‌ గురు అంటున్నారు అతని వ్యతిరేకులు. పేరు ఏదైతేనేం, యిద్దరూ ఉరికంబం ఎక్కారుగా అంటూ గుర్తు చేశారు మరి…

లగడపాటి రాజగోపాల్‌ను కొందరు ఆంధ్రా భగత్‌ సింగ్‌గా కీర్తించడం మొదలుపెట్టారు. భగత్‌ సింగ్‌ కాదు అఫ్జల్‌ గురు అంటున్నారు అతని వ్యతిరేకులు. పేరు ఏదైతేనేం, యిద్దరూ ఉరికంబం ఎక్కారుగా అంటూ గుర్తు చేశారు మరి కొందరు. భగత్‌ సింగ్‌ అంటే ఎక్కువనీ, అఫ్జల్‌ అంటే తక్కువనీ భారతీయులం అనుకుంటాం. అఫ్జల్‌ అంటేనే ఘనత అని పాకిస్తానీలు అనుకుంటారు. భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజులపై మనకున్న గౌరవం ఇంగ్లీషువాళ్లకు వుండదు. వాళ్ల దృష్టిలో వీళ్లు పెద్ద న్యూసెన్సు మేకర్స్‌. ఔరంగజేబు దృష్టిలో శివాజీ కొండ ఎలుక, కమెండో. శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవాడు. మరాఠీల దృష్టిలో అతడు ఛత్రపతి, శివుని అవతారం వగైరా. ఇంగ్లీషు వాళ్ల పాలనను ఎదిరించడానికి గాంధీగారు పన్నులు కట్టవద్దని అంటే  అది స్వాతంత్య్రపోరాటం. బాబు హయాంలో కరంటు బిల్లులు కట్టవద్దని వైయస్‌, వైయస్‌ హయాంలో బిల్లులు కట్టవద్దని బాబు అంటే – అది అరాచకం అంటున్నాం. బ్రిటిషు కాలంలో పట్టాలు పీకేసి రైళ్లు పడగొట్టినవారు, వంతెనలు కూల్చేసినవారు దేశభక్తులు. భారతీయుల పాలనా కాలంలో అలా చేసినవారు నక్సలైట్లు. ప్రస్తుతానికి నక్సలైట్లను విధ్వంసవాదులుగా చూస్తున్నాం. కొన్నేళ్లకి వాళ్ల రాజ్యం వస్తే పాఠ్యపుస్తకాల్లో యివన్నీ విముక్తిపోరాటంలో తొలి అడుగులుగా కీర్తిస్తూ రాస్తారు. 

తమిళ ఈలం యిప్పటిదాకా ఏర్పడలేదు కాబట్టి ప్రభాకరన్‌ శ్రీలంక వాసుల దృష్టిలో, సభ్యసమాజం దృష్టిలో ఉగ్రవాది, తీవ్రవాది. ఈలం ఏర్పడి వుంటే అతను జాతిపిత. అతను చేసిన స్మగ్లింగ్‌ వ్యాపారం, మాదకద్రవ్యాల రవాణా, యితర దేశాధినేతల హత్యలు అన్నీ పోరాటంలో భాగం, సాహసకృత్యాలు. కామిక్స్‌ బుక్స్‌లో బొమ్మలతో సహా పిల్లల చేత చదివిస్తారు. ఇక్కడే యింకో మాట కూడా చెప్పుకోవాలి. భగత్‌ సింగ్‌ను, అల్లూరిని, మరో చంథ్రేఖర ఆజాద్‌ను సమకాలికులలో చాలామంది మెచ్చలేదు. 'ఇంగ్లీషువాళ్లు ఏదో పాలిస్తున్నారు కదా, రైళ్లు వేశారు కదా, తపాలా సౌకర్యం కల్పించారు కదా, అందరికీ విద్య సమకూర్చారు కదా. వీళ్లు యిలా గొడవ చేయడం దేనికి?' అని ప్రజల్లో అధికాంశం మంది ఫీలయ్యారు. ఆంగ్లేయుల దోపిడీ గురించి సమగ్రపరిజ్ఞానం లేక కొందరు అలా అనుకుంటే, ఏదో ఒకటి శాంతియుతంగా వుండి సరిపెట్టుకుంటే పోలేదా, వీళ్లు కోరే మార్పు వచ్చాక ఎలా వుంటుందో ఎవరికి తెలుసు అని అనేకులు అనుకున్నారు. 

సిలబస్‌లో పెట్టే చరిత్ర పుస్తకాలు చదివితే మనకు యావన్మంది భారతీయులు ఆ 90 ఏళ్లు (1857-1947) ఊహూ పోరాడేస్తూన్నట్లు ఊహ కలుగుతుంది. పరిస్థితి అలా ఏమీ లేదు. అదే పీరియడ్‌లో చాలామంది స్కూళ్లకు వెళ్లారు. కాలేజీల్లో చదువుకున్నారు. ప్రభుత్వోద్యోగాలు, ప్రయివేటు ఉద్యోగాలు చేశారు. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీలలో, కోర్టుల్లో పనులు చేశారు. పోలీసు ఉద్యోగులుగా చేరి ఉద్యమకారులను తన్నారు. ఆర్మీలో చేరి ఆంగ్లప్రభుత్వం తరఫున మన దేశంలోనే కాదు, యితర దేశాల్లోనూ యుద్ధం చేశారు. అంతేకాదు వ్యాపారాలు పెట్టారు, వస్తువులు అమ్మారు, సర్కారుకి పన్నులు కట్టారు, లాయర్లుగా సివిల్‌ క్రిమినల్‌ కేసులు వాదించారు, డాక్టర్లుగా వైద్యం చేశారు, నాటకాలాడారు, సినిమాలు తీశారు, పరిశ్రమలు పెట్టారు, యుద్ధసమయంలో ప్రభుత్వం ఎక్కువ ఉత్పత్తి చేయమంటే చేసి యిచ్చారు. బిర్లా, టాటా వంటి బిజినెస్‌ హౌసెస్‌ అయితే ఓ పక్క ప్రభుత్వానికి మద్దతు యిస్తూ, వారి నుండి లైసెన్సులు తెచ్చుకుని వ్యాపారం వృద్ధి చేసుకుంటూ, మరో పక్క స్వాతంత్య్రయోధులకు విరాళాలు యిస్తూ వుండేవారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు వాటిని బ్లాక్‌ లిస్టు చేయకుండా లైసెన్సు యిచ్చి ప్రోత్సహించాయి. ఏదో ఒకలా జీవితం గడుస్తూ వుంటే మధ్యలో ఈ విప్లవకారులు వచ్చి సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్నారేమిటని వీరంతా విసుక్కున్నారు. కుటుంబంలో ఎవరైనా ఉద్యమంలో చేరి జైలుకి వెళితే ఎందుకొచ్చిన గొడవ అని అందరూ తిట్టిపోసేవారు. కొంతమందైతే ప్రాయశ్చిత్తాలు చేయించేవారు. 

పుష్కరంగా తెలంగాణ ఉద్యమం సాగుతూ వచ్చింది. 'ఇది వచ్చేదీ కాదు, చచ్చేదీ కాదు, మధ్యలో పిల్లలు ఛస్తున్నారు. బంద్‌లనీ, సమ్మెలనీ పిల్లల చదువులు పోగొట్టారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా పోయాయి. ఉద్యోగాలు తగ్గాయి. రియల్‌ ఎస్టేటు మూలపడింది. ఎందుకీ గోల, శాంతంగా వుంటే పోయేది కదా.' అని చాలామంది విసుక్కున్నారు. కానీ కెసియార్‌ పట్టుదలనండి, కాంగ్రెసు అంతర్గత కలహాల వలన అనండి, తెలంగాణ కల సాకారం అవుతుందని యీ రోజు అనిపిస్తోంది. ఈ రోజు పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు చేస్తున్నదాని గురించి కూడా కొందరు అలాగే అనుకోవచ్చు. 'అంతా అయిపోయింది. తెలంగాణ యివాళో, రేపో యిచ్చేస్తూ వుంటే యింకా యీ సమైక్య గోల ఎందుకు? ఇలా చేసి సీమాంధ్రకు చెడ్డపేరు తెస్తున్నారు. నోరు మూసుకుని కూర్చుంటే వాళ్లు యింత ముష్టి విదిలిస్తారు. అధమం విదిలిస్తామన్న హామీ పడేస్తారు. సోనియా కళ్లెర్ర చేయగానే వెళ్లి సీట్లో కూర్చుంటే ఆవిడ మెచ్చి టిక్కెట్టు బిస్కట్టు పడేస్తుంది, లేకపోతే సిబిఐను ఉసికొల్పుతుంది. వీళ్లు యిలా చేసి పెద్ద హీరోలవుదామని చూస్తున్నారు. జైలుకి పంపేస్తే అప్పుడు తెలిసివస్తుంది.' అని విభజనవాదులు విసుక్కుంటున్నారు, మందలిస్తున్నారు. 

ఇవన్నీ ప్రస్తుత విషయాలు. ఒక్కసారి టైమ్‌ మెషిన్‌లో 2034కి  వెళ్లి చూస్తే చరిత్రలో వీళ్ల చర్యలను, చేష్టలను ఎలా అభివర్ణించారో తెలుస్తుంది. మిరియపు జల్లు జల్లిన లగడపాటి హీరో అవుతారా, ఆయన్ని కిందపడేసి కాళ్లతో మర్దించిన ఎంపీలు హీరోలవుతారా చూడాలి. ప్రాంతం బట్టి ఒక చోట హీరోలుగా, మరొక చోట విలన్లుగా చూపవచ్చు. కన్నడవాళ్లు కృష్ణదేవరాయలు సినిమా తీస్తే అతని చేతిలో ఓడిన ఒడియా గజపతి రాజులు విలన్లు. ఒడియావాళ్లు గజపతి రాజులు సినిమా తీస్తే కృష్ణదేవరాయలు మోసంతో ఓడించాడనీ, అతను ధూర్తుడనీ విలన్‌గా చూపిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధపు సినిమాలన్నిటిలో మిత్రపక్షాల విజయమే క్లయిమాక్స్‌. యుద్ధంలో అనేక థల్లో జర్మన్లు, జపానీయులు గెలిచారు. ఆ ఘట్టాల గురించి ఇంగ్లీషులో సినిమాలు రావు. లగడపాటి, పొన్నం ప్రభాకర్‌లు కొండొకచో భగత్‌ సింగ్‌గా, కొండొకచో అఫ్జల్‌ గురుగా భాసించవచ్చు. 

ఎవరు ఏమన్నా లగడపాటిని భగత్‌ సింగ్‌తో పోల్చడం ఏ మాత్రం తగదు. ఎందుకంటే లగడపాటి చెప్తున్నదేమిటి – మిరియపు జల్లు ఆత్మరక్షణకై ఉపయోగించానని. భగత్‌ సింగ్‌ విసిరిన బాంబులు ఆత్మరక్షణకు కాదు. తనబోటి వాళ్లు ఆంగ్లేయుల పాలన పట్ల అసంతృప్తితో వున్నారని యావత్‌ ప్రపంచానికి చాటడానికి పార్లమెంటు వేదికగా ఉపయోగించుకోవడానికి బాంబులు వేశాడు. దాని వలన ఆత్మరక్షణ కాదు కదా, ఆత్మహాని జరిగింది. జైలు శిక్ష పడింది. అప్పట్లో ప్రచారసాధనాలు యింతగా లేవు కాబట్టి భగత్‌ సింగ్‌ అంత త్యాగం చేయవలసి వచ్చింది. లగడపాటి కాలానికి ఆ అవస్థ లేదు. జంతర్‌ మంతర్‌ వద్ద రెండు గంటలు కూర్చుంటే చాలు ప్రపంచమంతా నిమిషాల్లో పబ్లిసిటీ వచ్చేస్తుంది. లగడపాటి అవసరం – పబ్లిసిటీ కాదు, ప్రాణరక్షణ ప్లస్‌ ఆత్మరక్షణ. గజేంద్రుణ్ని కాపాడడానికి విష్ణువు పరుగులు పెట్టుకుంటూ వచ్చినపుడు చక్రం మరచి వచ్చాడు. వేణుగోపాలరెడ్డిని కాపాడడానికి  మరో గోపాలుడు – రాజగోపాల్‌ విష్ణువంత తెలివితక్కువగా కాకుండా ఆయుధసహితుడై వచ్చాడు. ఎప్పుడు ఏ గజేంద్రుడు పిలుస్తాడో అని చాలాకాలంగా ఆ స్ప్రేను జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడట.

విత్తుముందా? చెట్టుముందా? అన్నట్టు పడేసి కొట్టడం చేత జల్లు కురిపించాడా, జల్లు కురిపించడం చేత పడేసి కొట్టారా? అన్నది వివాదం చేస్తున్నారు. లోకసభ కెమెరాలు మొహం చాటేయడం చేత, కాంగ్రెసువారినే అనుమానించ వలసి వస్తోంది. మేం కొట్టివుంటే   రాజగోపాల్‌కు రక్తం కారేది కదా, గాయాలుండాలి కదా అని కోమటిరెడ్డి వంటి వారు వాదిస్తున్నారు. గాయాలను కోర్టులో సాక్ష్యాలుగా చూపించలేనట్టు కొట్టే నేర్పు పోలీసులకు తర్ఫీదు యిస్తారు. ఒకప్పటి సబ్‌ యిన్‌స్పెక్టరు షిండే కాంగ్రెసు ఎంపీలకు స్వయంగా శిక్షణ యిచ్చి వుండవచ్చు. సిగ్గుచేటయిన విషయం ఏమిటంటే తెలుగువాళ్ల చేత తెలుగువాళ్లను కొట్టించడమే కాక, ఉత్తరాది వాళ్ల చేత కూడా కొట్టించారు. అంతా గూడుపుఠాణీ చేసి, ప్రీ మెడిటేడెడ్‌ క్రైమ్‌లా చేశారు. అందుకే సమయానికి కెమెరాలు అటు తిప్పించి ఒక యువ ఎంపీపై ఫోకస్‌ చేశారు. అతను తొణక్కుండా అలా చూస్తూ వున్నాడు. కనీసం ఒక్కసారి కూడా ముక్కు మూసుకునే ప్రయత్నం చేయలేదు. దాన్ని బట్టే తెలుస్తుంది – మిరియపు ఘాటు ఎక్కువ మేరకు వ్యాపించలేదని! 

రాజగోపాల్‌ టియర్‌ గ్యాస్‌ వదిలారని, స్పీకరు కళ్లలో కొట్టారనీ, వందలాది ఎంపీలకు ప్రాణం మీదకు తెచ్చాడనీ – అతిశయోక్తులు చెపుతున్న అతని ప్రత్యర్థులే అనుకోకుండా భగత్‌ సింగ్‌ కలరింగు యిస్తున్నారు. మీరా కుమార్‌ కళ్లల్లోకి కొట్టి వుంటే ఆవిడ పొన్నంలా విలవిలలాడేది. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని, అందరూ అంగీకరించారని ప్రకటించే సమయంలో ఆవిడ తొణక్కుండానే వుంది. ఆ తర్వాత దగ్గు, కళ్లమంటలు ఏమీ కనబరచలేదు. పార్లమెంటు హాల్లోంచి బయటకు వచ్చి, మీడియాతో మాట్లాడినపుడు కూడా కాస్త దగ్గింది తప్ప కళ్లు ఎఱ్ఱబడలేదు. తన మీద పడిన వాళ్లపై మిరియపు స్ప్రే చేయవచ్చా లేదా అన్నది పార్లమెంటు పుస్తకాల్లో ఏం రాశారో చూడాలి. అప్పుడు రాజగోపాల్‌కు శిక్ష వేస్తారో లేదో తెలుస్తుంది. పార్లమెంటులో వెల్‌లోకి వెళ్లడం, నినాదాలు యివ్వడం, మంత్రి చేతుల్లోంచి కాగితాలు లాక్కోవడం, మైకులు లాగడం – యిలాటివి ఎన్నో ఏళ్లగా చూస్తున్నాం. తెలంగాణ ఎంపీలే యిలాటివి బోల్డు సార్లు చేశారు. అప్పుడు సీమాంధ్రులు ఎవరూ అడ్డుకోలేదు, పడేసి తన్నలేదు. ఇప్పుడు తెలంగాణ ఎంపీలు అలాటి పని ఎందుకు చేయాలి? కాంగ్రెసు అధిష్టానం చెప్పింది కాబట్టి చేసేయడమేనా? రేపు యింకో బిల్లు విషయంలో సీమాంధ్ర ఎంపీలు వీళ్లని తంతే వీళ్లు పెప్పర్‌ స్ప్రే చల్లుతారా? హైదరాబాదీ అత్తరు చల్లుతారా? 

భగత్‌ సింగ్‌ పార్లమెంటులో బాంబులు విసిరినపుడు మీడియా అంతా ఆంగ్లేయుల చేతిలో వుంది. వారు ఇలాటి అనాగరిక, అరాచక చేష్టల్ని ఖండించారు. ఇప్పుడు రాజగోపాల్‌ను కూడా పార్లమెంటు రౌడీగా బ్రాండ్‌ చేసి జాతీయ మీడియా నీతిబోధలు చేస్తోంది. ఏ పరిస్థితిలో ఆయన అలా చేశాడో పార్లమెంటు టేపులు సంపాదిస్తే అప్పుడు ఆ చేష్ట సబబో, బేసబబో తేలిపోతుంది. ఈ స్టింగ్‌ ఆపరేషన్ల టీవీ ఛానెల్స్‌ ఆ పని చేయడానికి ముందే తీర్పులు యిచ్చేస్తున్నాయి. ఈ గూండాగిరీ ప్లాన్‌ చేసిన కాంగ్రెసు ముఠా అన్ని ఏర్పాట్లూ చేసింది. ముందురోజు ఘటనలకే హృదయం బద్దలైందన్న మన్‌మోహన్‌ను యిది చూస్తే గుండె ఠారు మంటుంది, తట్టుకోలేవు రావద్దంది. మాస్టర్‌ మైండ్‌ సోనియా, యువరాజు రాహుల్‌ అందరూ తమతమ డెన్‌లలో వుండి కథ నడిపారు. సుష్మా స్వరాజ్‌ వచ్చి సీట్లో కూర్చోబోతూ వుండగా మార్షల్స్‌ వచ్చి 'గొడవ జరగబోతోంది, వెళ్లిపోండి' అని చెప్పారు. ఆవిడ లేకుండా గొడవ చేసి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేద్దామని ప్లాను. అయితే ఆవిడ వెళ్లనంది. వెళ్లకుండా కూర్చోబట్టే టి-బిల్లు ప్రవేశపెట్టలేదని వాదించడానికి వీలు చిక్కింది. 

పార్లమెంటు కెమెరాలు బయటపెట్టేవరకూ కొట్టడం ముందా, జల్లడం ముందా అన్నది తేలదు. కొట్టారు కాబట్టి జల్లానంటే దానిలో తప్పు కనబడదు. కాదు కొట్టడానికి ముందే జల్లాడంటే అది తప్పే అవుతుంది. సీమాంధ్ర నాయకులు – పార్లమెంటులో ఆత్మాహుతి చేసుకుంటాం, కనీ విని ఎరుగనిది జరుగుతుంది, పార్లమెంటుకు నిప్పు పెట్టేస్తాం వంటి ప్రకటనలు ముందుగా చేయడం వలన వారిని అందరూ అనుమానించే స్థితి వచ్చింది. వారిని ఎవరూ అడ్డుకోకపోయినా కావాలని ఎంపీలందర్నీ హింసించారని అనుకోవలసి వచ్చింది. టేపులు నిజాన్ని చెప్తాయి – ఎడిట్‌ చేస్తే తప్ప! యుపిఏ ప్రభుత్వం టేపులను దాచిందంటే దాని అర్థం – తప్పు వాళ్లదేననీ, బంగ్లాదేశ్‌ స్పీకరును, ఎంపీలను అతిథులుగా రప్పించి స్పెషల్‌ గ్యాలరీలో కూర్చోబెట్టి 'మీ దగ్గర కూడా పాలకపక్షం మాట ఎదిరించిన ఎంపీలను యిలా తన్నించి మీ దారికి తెచ్చుకోవాలి' అని ప్రత్యక్షరామాయణం ద్వారా కోచింగ్‌ యిచ్చారనీ..! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)

[email protected]