మన్‌మోహన్‌గారు యీ రోజు మధ్యాహ్నం బిజెపివారికి విందు యిస్తున్నారు. విందులో వీరు ఏం వడ్డిస్తారో, వారికి అది రుచిస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే కాంగ్రెసు స్ట్రాటజీ చూడబోతే 'చిత్ తుమ్ హారా, పట్ మై జీతా' అన్నట్టుంది. బొమ్మయినా, బొరుసైనా నాకే లాభం అంటే బిజెపి వాళ్లు ఒప్పుకుంటారా? తెలంగాణ బిల్లు గట్టెక్కేట్టు కనబడటం లేదు కాబట్టి, ఆ వైఫల్యానికి కారణం నువ్వంటే నువ్వని యిద్దరూ త్రో బాల్ ఆడేస్తున్నారు.
బిల్లుకు మద్దతు యివ్వాలంటే… అంటూ బిజెపి కొన్ని కోర్కెలు కోరింది. మీ పార్టీవాళ్లను అదుపు చేయాలి. అలా అని అదుపు అంటే పార్లమెంటులో సస్పెండు చేయడం కాదు.. వగైరా. తమపై అవిశ్వాసతీర్మానం యిచ్చిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను కాంగ్రెసు నిన్న సస్పెండు చేసింది. ఇవాళ పార్లమెంటు నుంచి కూడా చేయవచ్చు. ఒకవేళ సీమాంధ్ర కేంద్ర మంత్రులు కూడా నినాదాలు యిస్తే? లేక వెల్‌లోకి దూసుకుని వస్తే..? వాళ్లు వాజమ్మలు, రారు అనుకున్నా సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలకు ఏ అభ్యంతరమూ లేదు కదా. శివప్రసాద్ యివాళ ఏ ఎలుకలు పట్టేవాడి వేషమో (ఈ వేషం ఆల్‌రెడీ వేసేశాడేమో గుర్తు లేదు. వేసి వుంటే పందులు పట్టేవాడిగా సవరించుకో గోర్తాను) వేసుకుని దిగడచ్చు కదా. వాళ్లను సస్పెండ్ చేస్తామంటే బిజెపి ఒప్పుతుందా? టిడిపి-బిజెపి పొత్తు కుదరబోతున్న యీ క్షణాల్లో…!? వారు కాబోయే పొత్తుదారులనుకుంటే యిప్పటికే ఎన్‌డిఏ కూటమిలో వుంటూ విభజన వ్యతిరేకిస్తున్న అకాలీదళ్, శివసేన కూడా వెల్‌లోకి వచ్చి అల్లరి చేస్తే..? ఈ లిస్టు యింకా వుంది – సమాజ్‌వాదీ, తృణమూల్, ఎడిఎంకె గట్రా. ఈ సెషన్‌లో ఫైనాన్సు బిల్లులు తప్ప వేరేదీ వద్దని చెప్పినా వినకుండా మొండివైఖరి అవలంబిస్తున్న కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాం అంటే వారి నియోజకవర్గాల్లో ఓట్లేమైనా పోతాయా?
ముందు మీ యిల్లు చక్కదిద్దుకుని అప్పుడు మాట్లాడండి అని బిజెపి అంది కాబట్టి ఆరుగుర్ని సస్పెండ్ చేసిందనుకుంటే – ఇంకా వినిపిస్తున్న అనేక ధిక్కారస్వరాల మాటేమిటి? పురంధరేశ్వరి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాను అని బహిరంగంగా ప్రకటించారు. కెవిపి రాజ్యసభలో వూరంత ప్లకార్డు పట్టుకుని కురియన్‌కు వీపు పెట్టి టీవీ కెమెరాలకు పోజిచ్చారు. ఇలాటాయనకు రాజ్యసభ మెంబరు మళ్లీ ఛాన్సిచ్చారేం? అని అడిగితే కాంగ్రెసు అధిష్టానం వద్ద సమాధానం ఏమిటి? అందర్నీ మించి కిరణ్ మాటేమిటి? 'కిరణ్ ఏ తప్పూ చేయలేదు' అంటూ కితాబులివ్వడమేమిటి? ఆయన చేసేవన్నీ తప్పులే అని కాంగ్రెసు పార్టీ తెలంగాణ యూనిట్‌లో యావన్మందీ గగ్గోలు పెడుతున్నారే మరి! లోకసభను అడ్డుకుంటున్నందుకు సస్పెండ్ చేయాలన్న సిద్ధాంతానికి కట్టుబడితే అవిశ్వాస తీర్మానం చేపట్టినప్పుడల్లా కమలనాథ్ కనుసైగతో వెల్‌లోకి దూకే టి-ఎంపీలను కూడా సస్పెండ్ చేయాలిగా! చేస్తారా?
ఇదే కాకుండా కాంగ్రెసు తను రాజకీయప్రయోజనాల కోసమే యిదంతా చేస్తున్నాను అని బాహాటంగా తెలియబరుస్తోంది. ఏదో కొంప మునిగిపోయినట్టు సోనియా యిప్పుడే కెసియార్‌తో మంతనాలాడాలా? 'విలీనం చేస్తే లోకసభలో బిల్లు పెడతాం, లేకపోతే రాజ్యసభలో పెట్టి చేతులు దులుపుకుంటాం' అని సోనియా అన్నట్టు వార్తలు వచ్చాయి. తెరాసను కలుపుకుని తెలంగాణలో ఓట్లు కొల్లగొడదామని చూస్తున్నాం అని మైకు పెట్టి చాటుకున్నట్టు యిలా ప్రవర్తిస్తే బిజెపికి అనుమానం రాదా? ఇప్పటికే ఢిల్లీలో, తెలంగాణలో కాంగ్రెసు వాళ్లు బిజెపిని తిట్టనారంభించారు – చిత్తశుద్ధి లేదు అంటూ. తెరాసవాళ్లు మరీను. బిజెపిని చావగొడతామంటున్నారు. టిడిపిని తంతే వాళ్లకు బుద్ధి వస్తుందన్న లెక్క వేసి, టిడిపి ఆఫీసుపై దాడులు జరుగుతున్నాయి. టిడిపితో పొత్తు కోసమే బిజెపి వెనక్కి వెళుతోందన్న ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ఇతర పార్టీ నాయకులే కాదు, యెన్నం శ్రీనివాస రెడ్డి వంటి తెలంగాణ బిజెపి నాయకుడే తమ జాతీయ నాయకుడైన వెంకయ్యనాయుడిపై నింద వేశారు. బాబు వెంకయ్యకు ఏదో ఆఫర్ చేసి మ్యానేజ్ చేశారని హరీశ్ అన్నారు. రేపు బిల్లు పాస్ అయ్యాక 'బిజెపి శల్యసారథ్యం చేసినా మేం వారితో కొట్లాడి, బెదిరించి సమ్మతించేట్లు చేశాం. తెలంగాణ ప్రజల ధాటికి బిజెపి వణికింది.' అని టి-వాదులు క్లెయిమ్ చేయవచ్చు. ఇక బిల్లు సమర్థించి బిజెపి బావుకునేది ఏముంది?
బిజెపి కూడా కాంగ్రెసు పరిస్థితికే వచ్చేసింది. జులై 30 వరకు బిజెపి హాయిగా వుంది – కాంగ్రెసును తిడుతూ. ఇప్పుడు తరుణం సమీపించేసరికి గుబులు పుట్టింది. అడ్డగోలు తెలంగాణ బిల్లు సమర్థించి సీమాంధ్రలో తిట్టించుకోవడం తప్ప కలిసివచ్చేది ఏముంది అన్న పునరాలోచన నాయకులందరూ చేస్తున్నారు. అడ్వాణీ, మోదీకి చాలా విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నా యీ విషయంలో మాత్రం ఒకటే అభిప్రాయం. అడ్వాణీ టి-టిడిపి నాయకులతో బిల్లు సమర్థించం అని నిక్కచ్చిగా చెప్పారో లేదో ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు కానీ బిల్లు అవకతవకగా వుండటం పట్ల ఆయన అసహనంగా వుండడం మాత్రం అందరికీ తెలిసినదే. 'బిల్లు ఎలా వున్నా సరే ప్రస్తుత సమావేశాల్లో ఆమోదించేసి, తాము అధికారంలోకి వచ్చాక సవరణలు చేస్తామని బిజెపి అధిష్టానం చెప్పాల'ని టి-బిజెపి నాయకుల ఆకాంక్ష. అంటే ఎన్నికల్లో లాభం కోసం తప్పులు చేసేది కాంగ్రెసు ఐతే, సవరించవలసిన బాధ్యత బిజెపి వహిస్తుందా? సవరించడం మాటలా? ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యిప్పుడున్న మూడ్ వుంటుందా? 'హైదరాబాదు మాది, ఇక్కడ పదేళ్లు కాదు కదా, పది నెలలు కూడా సీమాంధ్రులకు విద్యావకాశాలు కల్పించం. వాళ్లంతా పెట్టుబడిదారులు, దోపిడిదారులు, కావాలంటే చెన్నయో, బెంగుళూరో వెళ్లి డొనేషన్లు కట్టి చదువుకోమనండి' అంటారు. సీమాంధ్రకు ఆర్థికసాయం చేస్తామంటేనే 'ఇన్నాళ్లూ నష్టపోయినది మేమని ఒప్పుకుని కదా మీరు ప్రత్యేకరాష్ట్రం యిచ్చారు. నష్టపోయినవారికి కాకుండా దోపిడీదొంగలకు డబ్బివ్వడమేమిటి?' అంటూ అడ్డుకుంటారు.
సవరణలు చేస్తే గీస్తే యిప్పుడే చేయాలి తప్ప వచ్చే సెషన్‌లో చూసుకుందాం అంటే అది బొత్తిగా అన్యాయమే. కాంగ్రెసుకు బిల్లు పట్ల ఎంత అవగాహన వుందో రాజ్యసభ-లోకసభ కన్‌ఫ్యూజన్‌లోనే తెలిసింది. న్యాయశాఖ అది ద్రవ్యబిల్లు అని చెప్పినా కాదు అని మహామేధావి చిదంబరం గారు కోర్ కమిటీలో వాదించారట. నీ అతితెలివితో యిప్పటికే అవస్థపడుతున్నాం, యీసారికి కాస్త తమాయించుకో అని చెప్పి లోకసభలో పెడుతున్నారు. లోకసభలో యీ సారి పాస్ కాకపోతే యీ బిల్లుకు ఆయువు చెల్లినట్లే. బిజెపి వాళ్లు ఎలాగూ యిద్దామనుకుంటున్నారు కాబట్టి వచ్చేసారికి చూదాం అని వాయిదా వేసేందుకు అవకాశాలున్నాయి. అయితే సుష్మ స్వరాజ్ ఎట్టి పరిస్థితుల్లోను బిల్లును సమర్థిస్తాం అని తమకు చెప్పిందని టి-నాయకులు అంటున్నారు. ఆమె ఎంతవరకు మాటపై నిలబడుతుందో తెలియదు. ప్రస్తుతానికి టి-బిల్లు నుండి వెనక్కి తగ్గితే బిజెపికి వచ్చే నష్టం ఏమిటి? తెలంగాణలో రావలసినన్ని ఓట్లు రావు. కాంగ్రెసుపై వ్యతిరేకతతో, మోదీ ఇమేజితో వచ్చే ఓట్లు ఎలాగూ చెదరవు. ఇక విభజన సెంటిమెంటుతో మహా అయితే ఎన్ని పోతాయి? మోదీపై ఆదరం వున్నా తెలంగాణ యిచ్చినందుకు కృతజ్ఞతతో కాంగ్రెసు, తెరాస కూటమికి ఓట్లు వేస్తారు కాబట్టి ఓ ఐదు ఎసెంబ్లీ, ఒకటో రెండో పార్లమెంటు సీట్లు పోతాయనుకోవచ్చు. బిల్లు సమర్థిస్తే బిజెపికి జరిగే నష్టం ఏమిటి? శివసేన, అకాలీదళ్ అలుగుతాయి. ఎందుకంటే వాళ్ల రాష్ట్రాలలో కూడా విభజనో ద్యమాలున్నాయి కాబట్టి! అంతేకాదు, ఎన్‌డిఏ గెలుపు అవకాశాలు చూసి దానివైపు వద్దామనుకుంటున్న ప్రాంతీయపార్టీలు కూడా జంకుతాయి.
ఈ లెక్కలు వేసి చూస్తే బిజెపికి యీ పరిస్థితిలో బిల్లును ఓకే చేయడం కష్టం, నష్టం. 'మీలా అడ్డగోలుగా చేయం, ఇరుప్రాంతాలను ఒప్పించి, మిఠాయిలు పంచినప్పుడే విభజన చేస్తాం' అన్న స్లోగన్‌పై కాంగ్రెసును నిలవరించడానికి అవకాశం వుంది. 'తెలంగాణపై అఖిలపక్షం పిలిచినపుడు మేం అడిగిన ఆర్థికవివరాలు చేతిలో పెట్టకుండా, మాతో ఏదీ చర్చించకుండా, యిప్పుడు ఆఖరి నిమిషంలో విందుకు పిలిచేది నింద మాపై మోపడానికి మాత్రమేనా? కావాలంటే బిల్లును సెలక్టు కమిటీకి నివేదించండి.' అని అనవచ్చు. ఇప్పుడు ఏమాత్రం వెనకడుగు వేసినా కాంగ్రెసు వారిపై నింద మోపుతుందన్న భయం బిజెపికి వుందా? అంటే దీని విషయంలో కాకపోయినా సవాలక్ష విషయాల్లో బిజెపి నింద ఎలాగూ మోయాలి. రాహుల్ గాంధీగారు మహాత్మా గాంధీ హత్యదాకా వెళ్లి మోదీయే గాడ్సే చేతిలో తుపాకీ పెట్టినట్లు కలరింగు యిస్తున్నాడు. దాని గురించి ఏం చేస్తారు? నిందలకు బెదిరితే రాజకీయాల్లోకి రానే రారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)