తానేటి వనిత చెప్పిన దాంట్లో తప్పుందా…?

ఆమె రాష్ట్రానికి హోం మంత్రి. అంతకు ముందు కూడా ఆమె లెక్చరర్ గా పనిచేశారు. ఉన్నత విద్యావంతురాలు. ఇక జగన్ క్యాబినెట్ లో గతంలో మూడేళ్ల పాటు స్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను…

ఆమె రాష్ట్రానికి హోం మంత్రి. అంతకు ముందు కూడా ఆమె లెక్చరర్ గా పనిచేశారు. ఉన్నత విద్యావంతురాలు. ఇక జగన్ క్యాబినెట్ లో గతంలో మూడేళ్ల పాటు స్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను కూడా చూశారు. ఆమె విశాఖ టూర్ లో కొన్ని కామెంట్స్ చేశారు.

అది కూడా మీడియా అడిగిన దానికే ఆమె జవాబు చెప్పారు. ప్రతీ విషయాన్ని ప్రభుత్వాన్ని, పోలీసులను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు అన్న దాని మీదనే ఆమె మాట్లాడారు. సమాజంలో పోలీసింగ్ అన్నది ఒక మేరకు మాత్రమే  ఉంటుంది. కోట్లాది మంది ప్రజలు ఉంటే ఆ నిష్పత్తిలో పోలీసులు ఎంత మంది ఉంటారు అన్నది కూడా ఇక్కడ చూడాలి.

మహిళాల మీద వరసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే దానికి సమాజంలో మార్పులు రావాలి. అదే విధంగా కుటుంబంలోనూ వ్యక్తిగతంగానూ ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవడం కూడా అవసరమే కదా. అందుకే తల్లుల పాత్ర గురించి హోం మంత్రి వనిత మాట్లాడారు.

తల్లిదండ్రులు మరింత ఎక్కువ బాధ్యతగా ఉండాలన్నదే రాష్ట్ర పోలీస్ మంత్రిణిగా ఆమె భావన. అంత మాత్రం చేత ప్రభుత్వాలు, పోలీసులు కాడె వదిలేస్తాయని కాదు, ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా కూడా పోలీసులు పరుగులు తెస్తున్నారు. నేరస్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

అయితే ముందుగా పోలీసింగ్ అనేది ప్రతీ ఇంటిలో ప్రతీ మనిషిలో ఉంటే ఇంకా ఎక్కువ బాధ్యత పెరుగుతుంది అన్నదే హోం మంత్రి వనిత అభిప్రాయం. తల్లులు తమ పాత్ర సక్రమంగా పోషించాలి. అలాగే తండ్రులు కూడా పోషించాలి. ఎవరి కుటుంబంలో వారు చూసుకోవడం అన్నది సులువు. ఈ మాటను ఒక్క మన హోం మంత్రి మాత్రమే కాదు, మేధావులు చాలా సార్లు చెప్పారు. ఇపుడు కాలం మారింది. స్వేచ్చ పేరిట విచ్చలవిడితం కూడా పెరిగింది. దాంతో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ప్రతీ కుటుంబానికి ఒక పోలీసుని పెట్టినా నేరాలు అదుపు లోకి వస్తాయా అన్నది  డౌటే. ఉన్నత విద్యాధికురాలిగా, హోం మంత్రిగా  వనిత మంచి మాటలు చెబితే దానికి పెడార్ధాలు తీస్తూ విపక్షం రెచ్చిపోవడమే ఇక్కడ విడ్డూరం. పోనీ గత పాలకులు వారికి ముందు పాలకుల ఏలుబడిలో అయినా ఏపీలో నేరాలు జీరో నంబర్ ఎపుడైనా న‌మోదు అయ్యాయా. 

ఇది సమాజంలో రావాల్సిన మార్పు. ఆ మాట ఒప్పుకోకుండా ప్రతీ ఒక్కరూ రాజకీయం చేయాలనుకుంటే ఈ సామాజిక రుగ్మత మనతోనే ఎప్పుడూ ఉంటుంది.