సులభంగా ప్రచారం పొందడం ఎలా? అనే ప్రశ్నకు జవాబు కోసం తడుము కోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను శత్రువుగా చూసే మీడియా సంస్థలు బోలెడు. అవసరమైతే ఏం చేస్తే సులభంగా ప్రచారం లభిస్తుందో సదరు మీడియా ప్రతినిధులే చెప్పి, మరీ చేయిస్తారు. అలాంటి వాటి గురించి కథలుకథలుగా వింటున్నాం.
తిరుపతిలో అలాంటి వ్యవహారం గురించి తెలుసుకుందాం. నటనలో అధినేత పవన్‌కల్యాణ్‌కు మించి జనసేన నాయకులు ఓవర్ యాక్షన్ చేస్తుండడం ఇక్కడి ప్రత్యేకత.
కనీసం జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా గెలవలేని ప్రజాదరణ ఆ పార్టీ సొంతం. పాపం తమ అధినేతను రెండు చోట్ల మట్టి కరిపించారనే అక్కసు కాబోలు, జగన్‌పై చిత్రవిచిత్ర రీతిలో నిరసన తెలియజేస్తూ తృప్తి పొందుతున్నారు. ఈ నెల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి వస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఉచిత ప్రచారానికి ఇదే అవకాశంగా భావించిన జనసేన నాయకులు బ్యానర్‌తో వీధికెక్కారు.
‘జగన్ అన్న వస్తున్నాడు.. కార్లు జాగ్రత్త’ అంటూ ఓ బ్యానర్‌ను చేత పట్టుకుని జనసేన నాయకులు దండోరాతో నిరసనకు దిగారు. సీఎం జగన్ తిరుపతి పర్యటనకు వస్తున్నారని, కాన్వాయ్‌లకు భక్తులు, ఇతర ప్రజానీకం కార్లను ట్రాన్స్‌పోర్టు అధికారులు బలవంతంగా తీసుకెళ్తారని హెచ్చరించడం ఈ నిరసన ఉద్దేశం.
ఇటీవల ప్రకాశం జిల్లాలో ఒంగోలులో తిరుమలకు వస్తున్న భక్తుల కారును సీఎం కాన్వాయ్ కోసం తీసుకెళ్లిన నేపథ్యంలో, అదే రీతిలో తిరుపతిలో కూడా చేస్తారంటూ జనసేన నాయకులు తమ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించారు.
ఈ నెల 4, 5 తేదీల్లో తిరుపతికి వచ్చే భక్తులు కార్లలో రావద్దని జనసేన నేతలు సూచించారు. జనసేన నేతల ఇలాంటి చేష్టల వల్లే తాము పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేయాల్సి వస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.
తాము కూడా ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి రావద్దని… పవన్‌ను సాకుగా చూపితే ఎలా వుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని జనసేన నేతలకు వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు. కాస్త అతి తగ్గించుకుంటే మంచిదని అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.