టాలీవుడ్ లో అందరూ మహానటులే. కేవలం నటులు మాత్రమే కాదు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లూ అందరూ మహానటులే. పైకి టాలీవుడ్ అంతా ఒక కుటుంబం..తమది కళాకారుల కుటుంబం అంటూ అద్భుతమైన భావోద్వేగాలు కురిపిస్తారు. కానీ ఆఫ్ లైన్ లో చూడాలి వీరి నటన.
ఒకరి సినిమా మరొకరికి నచ్చదు. నచ్చింది అంటే ఒక గ్రూప్ అయి వుండాలి. ఒక్కో దర్శకుడికి కొంతమందితో సయోధ్య వుంటుంది. వాళ్లు అతగాడి సినిమా ఎలా వున్నా నెత్తిన పెట్టుకుంటారు. వీరు కాకుండా మిగిలిన వాళ్లు ఆ సినిమా ఎలా వున్నా పెదవి విరుస్తారు. ఎవరి సర్కిళ్లలో వారు నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి చూస్తారు.
గతంలో ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా ఇంటర్వెల్ కార్డ్ పడిన దగ్గర నుంచి రెండు రకాల అభిప్రాయాలు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు తెల్లవారుఝామున రివ్యూలు, స్పాయిల్ ఫ్రీ (?) అప్ డేట్ లు ఇందుకు మరింత సహకరిస్తున్నాయి. నెగిటివ్ కావాల్సిన వారికి కావాల్సినంత సరుకు ముందే దొరుకుతోంది. వాట్సాప్ గ్రూప్ ల్లో ఇవి యధాశక్తి అటు ఇటు షేర్ అయిపోతుంటాయి.
ఓ నిర్మాతకు ఫెయిల్యూర్ వస్తే మరో నిర్మాతకు ఆనందం. ఆ నిర్మాతతో సినిమా చేయడానికి అవకాశం రాని దర్శకులకు ఆనందం. అలాగే ఓ దర్శకుడికి ఫెయిల్యూర్ వస్తే వేరే దర్శకులకు ఆనందం. ఆ దర్శకుడితో సినిమా చేసే అవకాశం రాని నిర్మాతలకు ఆనందం. ఆ దర్శకుడు అవకాశం ఇవ్వని హీరోలకు సంతోషం.
కొన్ని సినిమాలకు సెట్ మీద నుంచే నెగిటివ్ లు స్ప్రెడ్ కావడం ప్రారంభం అవుతుంది. మరి కొన్ని సినిమాలు ఎడిటింగ్ టేబుల్ మీదకు వచ్చాక ఇదే వ్యవహారం మొదలవుతుంది. అక్కడి నుంచి కూడా ఆ సినిమా తప్పించుకుంటే సెన్సారు అయిన మర్నాటి నుంచీ వ్యవహారం మొదలవుతుంది. ఇలా వుంది..ట…అలా వుంది…ట అంటూ నెగిటివిటీ స్ప్రెడ్ కావడం ప్రారంభం అవుతుంది. నెగిటివిటీ నుంచి మాత్రం సినిమా తప్పించుకోవడం అసాధ్యం.
డిస్ట్రిబ్యూషన్, నిర్మాతలు, దర్శకులు, ఇలా ఒకటేమిటి కీలకమైన చాలా విభాగాల్లో ఎవరి అసంతృప్తులు వారికి వుంటాయి. ఎవరి శక్తి మేరకు వారు ఫీలర్లు వదలడం ఙరుగుతూనే వుంటుంది. అభిమానుల్లో పోటీ, మీడియాలో పోటీ అన్నది వీరందరికీ అద్భుతమైన అవకాశం. ఇలా వదిలిన ఫీలర్ అలా వైరల్ అయిపోతుంది.
దీనికి తోడు కుల రాజకీయాలు, పార్టీ రాజకీయాలు కూడా సినిమాల మీద ప్రభావం ఓ రేంజ్ లో చూపిస్తున్నాయి. పెద్ద సినిమాలు వీటి నుంచి తప్పించుకోవడం అసాధ్యం అవుతోంది. అస్సలు బాలేని కంటెంట్ వున్న సినిమాను ఎవ్వరూ కాపాడలేరు. పెంచలేరు. కానీ యావరేజ్ కంటెంట్ వున్న సినిమాలు మాత్రం ఇలాంటి వాటికి బలైపోతుంటాయి.
యావరేజ్ కంటెంట్ వున్న సినిమాలపై నెగిటివ్ పబ్లిసిటీ భయంకరంగా ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రచారానికి సోషల్ మీడియా, వాట్సాప్ అన్నది టూల్ గా మారిపోతోంది. మర్నాటి నుంచే సినిమా డౌన్ అయిపోతోంది. అదే యావరేజ్ సినిమాకు మద్దతుగా నిల్చుంటే కాస్త నిలబడుతోంది. ఇలా మద్దతు లభిస్తుందా? నెగిటివ్ తోడవుతుందా అన్నది ఆ సినిమా నిర్మాత, హీరో, దర్శకుడు, వాళ్ల ఎఫిలియేషన్లు, బంధాలు, బాంధవ్యాలు తదితర విషయాలపై ఆధారపడి వుంటుంది.
మొత్తం మీద తెలుగు సినిమా భవిష్యత్ అంత అద్భుతంగా అయితే లేదు.
-జోశ్యుల శ్రీనాధ్