సర్కార్‌వారి పాట పోస్టర్లో మహేశ్‌బాబు చేతిలోని పెద్ద తాళాల గుత్తి ఆసక్తి కలిగిస్తోంది. చూస్తే అవన్నీ పాతకాలం నాటివిలా వున్నాయి. వాటికి హీరోకి ఏంటి సంబంధం?
కథని సరదాగా వూహించుకుంటే హీరో ఎక్కడో విదేశాల్లో వుంటాడు. హీరో తండ్రికి హైదరాబాద్‌లో ఒక ఇల్లు వుంటుంది. ఒక విలన్ అతన్ని బ్యాంక్ అప్పుల్లో ఇరికించి గవర్నమెంట్‌తో ఆ ఇంటిని వేలం వేయిస్తాడు. తండ్రి కోరిక తీర్చడానికి హీరో ఇండియా వస్తాడు. అత్తారింటికి దారేదిలో తాత కోసం పవన్ వచ్చినట్టు, నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ జగపతిబాబుపై కక్ష తీర్చుకున్నట్టు కథ యాక్షన్ ఎమోషన్‌తో కలిపి ఎండ్ అవుతుంది.
హీరోయిన్‌తో పరిచయం, ఆమె ఎవరో కాదు విలన్ కూతురని తెలిస్తే ఇంకా ట్విస్ట్. పోగొట్టుకుంది తన తండ్రి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది విలన్ మోసంతో సర్కార్ వారి పాటలో ఇళ్లను పోగొట్టుకున్నారని తెలిసి , అవి కూడా రికవరీ చేసి తాళాల గుత్తిలోని ఒక్క తాళాన్ని వాళ్లకి పంచేస్తాడు.
హీరో ఎక్కడి నుంచో రావడం అనే జానర్‌కి మనం అడిక్ట్ అయిపోయాం. హీరోలకి కూడా ఇదే నచ్చుతుంది. మామూలుగా పోస్టర్లో కత్తి, గొడ్డలి, తుపాకి పట్టుకుని కనిపిస్తారు. బోయపాటి సినిమా అయితే త్రిశూలం. పరశురామ్ ఫ్యామిలీ డైరెక్టర్ కాబట్టి తాళాల గుత్తి ఇచ్చాడు.
ఇదే పోస్టర్ తమిళం, మలయాళం సినిమాలకి కనిపిస్తే ఇంకో రకంగా ఊహించుకోవచ్చు. హీరో తాళాలు రిపేరు చేసే వ్యక్తి. అనుకోకుండా దొంగతనం కేసులో ఇరుక్కుంటాడు. దాన్నుంచి ఆ పేదవాడు ఎలా బయటపడ్డాడు? కథ నచ్చితే అక్కడి పెద్ద హీరోలు కూడా ఇట్లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తారు.
ఇక్కడైతే హీరోలు కథ చెప్పిన డైరెక్టర్ని గెటౌట్ అంటారు. ఒకవేళ పొరపాటున హీరో ఒప్పుకున్నా ఆయన అభిమానులు తాళాల గుత్తితో డైరెక్టర్ని పొడిచి చంపేస్తారు.
మలయాళంలో తాళాల రిపేరి కథ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు మనం పది కోట్లతో హక్కులు కొని రీమేక్ చేస్తాం.
-జీఆర్ మహర్షి