విస్సన్న చెప్పింది వేదమని ఒక ముతక సామెత ఉంది. ఇపుడు టీడీపీ తమ్ముళ్ళు కూడా వరసబెట్టి తెలంగాణా మంత్రి కేటీయార్ చెప్పింది వేదమే అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే కేటీయార్ ఏం తప్పు మాట్లాడారు అని వైసీపీ నేతల మీద కస్సుమంటున్నారు. ఆయన చెప్పినదంతా కరెక్టే కదా. ఎందుకు వైసీపీ మంత్రులు ఎదురుదాడి చేస్తారు అని ఆయన ఫైర్ అవుతున్నారు.
ఇక ఏపీ మంత్రులు అయితే దేనికీ పనికిరానివారుట. అదే తెలంగాణా మంత్రి కేటీయార్ కి అయితే గారు అని తగిలించి మరీ అయ్యన్న బాగానే కితాబు ఇస్తున్నారు. మరి ఇదే టీఆర్ఎస్ 2015 లో టైమ్ లో ఓటుకు నోటు కేసులో టీడీపీ మీద ఏం మాట్లాడింది, దానికి తమ్ముళ్లు ఎంతలా రెచ్చిపోయారో అయ్యన్న లాంటి వారు గుర్తు చేసుకుంటారా.
మరో వైపు చూస్తే గత టీడీపీ హయాంలో కూడా ఏపీలో పాలన మీద టీఆర్ఎస్ నేతలు అనేకసార్లు విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్లు ఇచ్చింది ఇదే టీడీపీ నేతలు. ఇపుడు మాత్రం కేటీయార్ మా చక్కగా మాట్లాడారు అని పొగుడుతున్నారు అన్నదైతే దేని కోసమో అందరికీ అర్ధమవుతోందిగా
మరో సందర్భంలో వైసీపీకి టీఆర్ఎస్ కి మధ్య సంబంధాలను కట్టి ఏపీకి వైసీపీ జగన్ ద్రోహం చేస్తున్నారు అని విమర్శలు చేసింది కూడా ఇదే తెలుగు దేశపు నాయకులు కదా అన్న సంగతి మరచిపోతే ఎలా తమ్ముళ్ళూ. ఏది ఏమైనా కేటీయార్ వైసీపీని విమర్శిస్తున్నారు. అది పరమానందంగా ఉంది. ఈ ఆనందంలో పాతవన్నీ ఎంచక్కా మరచిపోతున్న తమ్ముళ్లకు మేధావులు, చదువరుల నుంచి ఒక్కటే మనవి.
తెలంగాణా వారు ఎవరైనా నిందించినది ఒక్క పాలకులను మాత్రమే కాదు, ఆంధ్రులను కూడా. మరి అయిదు కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే శభాష్ అని ఇక్కడి వారే చప్పట్లు కొట్టడం వల్లనే ఏపీ ఈ రోజుకీ ఇలా నిస్సహాయంగా ఉండిపోయింది అన్నది అందరి మాట.