జపాన్‌తో మనకు ఎన్నడూ శత్రుత్వం లేదు. సుభాష్ చంద్ర బోస్ కారణంగా, మనదేశంలో బౌద్ధ విహారాలు వున్న కారణంగా కాస్త స్నేహం కూడా వుంది. అయితే 1960లలో మనం రష్యాకు చేరువ కావడం వలన రష్యాతో సరిహద్దు వివాదం వున్న జపాన్ మనకు దూరమైంది. ఇందిరా గాంధీ తన కొడుకు సంజయ్ గాంధీ చిన్న కారు తయారుచేయాలని కలలు కని విఫలమయ్యాడు. అతని మరణానంతరం అతనికి గుర్తుగా ఇందిరా గాంధీ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకిని మన దేశంలో కార్లు తయారుచేయడానికి అనుమతించింది. అప్పట్లో విదేశీ పెట్టుబడులను ఓ పట్టాన రానిచ్చే”వారు కాదు. ఇందిరా గాంధీ వీరికి మినహాయింపు యిస్తూనే మారుతి అనే పేరును జోడించాలని షరతు విధించింది. తక్కిన అన్ని దేశాల్లోనూ సుజుకి పేరుతో కార్లు అమ్మే ఆ కంపెనీ మన దేశం విషయంలో మాత్రం మారుతి పేరు జోడించడానికి ఒప్పుకుంది. ఆ విధంగా మారుతి-సుజుకి కొత్త శకానికి నాంది పలికింది.
1986 నాటికి పరిస్థితి మరింత మెరుగుపడి జపాన్ మనకు ఉదారంగా సాయం చేయడం కూడా మొదలుపెట్టింది. అయితే 1998లో పోఖ్రాన్ 2 న్యూక్లియార్ పరీక్షలు చేయడంతో జపాన్ ఆగ్రహించింది. అణ్వస్త్రాల వలన ఘోరంగా నష్టపోయిన దేశంగా వాటి నిరోధానికి నిరంతరం కృషి చేసే జపాన్ మనదేశంపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. ఇంకో రెండేళ్లు పోయాక 2000 సం||రంలో ప్రధాని వాజపేయి వెళ్లి వారికి నచ్చచెప్పి ఆంక్షలు ఎత్తివేయించారు. అప్పటినుండి ఆర్థికబంధం బలపడుతూ వచ్చింది. మనదేశంలో రిజిస్టరయిన జపాన్ కంపెనీల సంఖ్య 2012లో 924 కాగా 2013లో 16% పెరిగాయి.
2011 ఆగస్టులో భారత్, జపాన్ల మధ్య సమగ్ర ఆర్థికాభివృద్ధి ఒప్పందం (సిఇపిఏ) కుదిరింది. దీనిలో వస్తువ్యాపారం మాత్రమే కాదు, వాణిజ్యసేవలు, పెట్టుబడులు, మేధోహక్కులు, టారిఫ్‌ల రద్దు వగైరా అనేక అంశాలున్నాయి. నిజానికి యింతటి సమగ్రమైన ఒప్పందం మనదేశం వేరే ఏ దేశంతోనూ కుదుర్చుకోలేదు. 2012 నాటికి భారతదేశానికి ఆర్థికసాయం అందించే దేశాల్లో అగ్రస్థానం జపాన్‌ది అయింది. అంతేకాదు, మన దేశంలో అత్యధికంగా పెట్టుబడి పెట్టిన విదేశం జపానే! అంతకుముందు అమెరికా వుండేది. 2.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో జపాన్ అగ్రస్థానం అందుకుంది. దీనికి కారణం జపాన్ ప్రధాని షింజో ఆబే. జపాన్ను ఆర్థిక వ్యవస్థను ఎంతో మెరుగుపరిచిన ఆబే భారతదేశంపై తన దృష్టి నిలిపారు.
ఈ ఒప్పందం తర్వాత జపాన్ కంపెనీలు మనదేశంలో ఆఫీసులు తెరిచి వ్యాపారం చేయసాగాయి. వాటి సంఖ్య ఒక్క ఏడాదిలో 41% పెరిగి 2013లో 2542 అయ్యాయి. జపాన్-భారత్ ద్వైపాక్షిక వ్యాపారం ఒక్క ఏడాదిలోనే 34% పెరిగి 18.5 బిలియన్ డాలర్లు అయింది. 2014లో 25 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మన్మోహన్ సింగ్ 2013 మేలో టోక్యో వెళ్లి వచ్చారు. ఆ తర్వాత జపాన్ చక్రవర్తి తన సతీమణితో సహా భారతదేశాన్ని డిసెంబరులో ఒక వారంపాటు సందర్శించారు. ఇది చాలా అరుదైన పర్యటన. ఆ తర్వాత జనవరి 9 న జపాన్ రక్షణమంత్రి వచ్చారు. జనవరి 26 రిపబ్లిక్ వేడుకలకు జపాన్ ప్రధానమంత్రే విచ్చేశారు.
మిలటరీ ఆపరేషన్స్‌లో యిప్పటికే జపాన్-భారత్ నౌకాసేనలు కలిసి పనిచేస్తున్నాయి. వైమానిక దళాలు కూడా కలిసి పనిచేసే విషయంలో చర్చలు సాగుతున్నాయి. నౌకాదళాలు వుపయోగించే షిన్మాయ్వా యుఎస్-52 అనే విమానాన్ని జపాన్ యిప్పటివరకు ఎవరికీ ఎగుమతి చేయలేదు. ఇప్పుడు మన దేశానికి ఎగుమతి చేసే విషయం పరిశీలిస్తానంటోంది. దాన్ని సంయుక్తంగా డెవలప్ చేసే ఆలోచన కూడా వుంది. ఇండియన్ మిలటరీ షిప్‌యార్డులు ఆధునీకరించి, వాటి సామగ్రిని తయారుచేసేందుకు జపాన్ టెక్నాలజీని, ఆర్థికసాయాన్ని కూడా యిస్తానంటోంది. జపాన్ ప్రధాని పర్యటన సందర్భంగా ఒక భారీ ఒప్పందం కుదిరింది. 90 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఢిల్లీ నుండి ముంబయివరకు వేస్తున్న 1483 కి.మీల. ఇండస్ట్రియల్ కారిడార్ వ్యయంలో సగం అప్పుగా యివ్వడానికి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజన్సీ ఒప్పుకుంది. దీనితో బాటు చెన్నయ్-బెంగుళూరు, బెంగుళూరు-ముంబయిలకు కూడా ఇండస్ట్రియల్ కారిడార్లు వేయడానికి ప్రణాళికలు వేస్తోంది.
పాకిస్తాన్‌తో, శ్రీలంకతో, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలతో మన దేశానికి సంబంధబాంధవ్యాలు సరిగ్గా లేవు. వీరి విషయాల్లో అధ్వాన్నంగా వున్న మన విదేశాంగ నీతి జపాన్ విషయంలో మాత్రం విజయవంతం కావడానికి కారణం ఏమిటి? అంటే మనిద్దరికీ వున్న ఉమ్మడి శత్రువు – చైనా. చైనాకు మనకు 3000 కి.మీ.ల పొడుగున సరిహద్దు వివాదం నడుస్తోంది. ఓ పక్క మనతో వ్యాపారం చేస్తూనే, మరో పక్క అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పేచీ పెడుతోంది. జపాన్‌కు పొరుగుదేశాలైన ఉత్తర కొరియా, చైనాలతో వివాదాలు నడుస్తున్నాయి. 2013 నవంబరులో చైనా జపాన్‌వైపు వున్న తన తూర్పు భాగాన్ని 'ఎయిర్ డిఫెన్స్ ఐటెండిఫికేషన్ జోన్'గా ప్రకటించింది. ఇప్పుడు తన దక్షిణంవైపు అంటే హిందూమహా సముద్రంవైపు కూడా యిలాటి జోన్ ప్రకటించి రాకపోకలను నియంత్రించేందుకు సన్నాహాలు చేస్తోంది. అది జరిగితే జపాన్‌కు చాలా యిబ్బంది. జపాన్‌కు వచ్చే ఆయిల్ సరఫరాల్లో 90% ఆ మార్గాన వచ్చేవే.
అందువలన హిందూమహా సముద్రంలో వున్న దేశాలతో స్నేహం పెంచుకోవాలని జపాన్ చూస్తోంది. అమెరికా సహాయంతో చైనా ఆసియాలో బలమైన దేశంగా ఎదిగి, యిరుగుపొరుగు దేశాలపై ఆధిపత్యం వహించే ప్రమాదం పొంచి వుంది. అలా జరగకుండా చేయాలంటే ముందే మేల్కొనాలనుకుని జపాన్, భారత్ యీ అడుగులు వేశాయి. జపాన్, భారత్ సంయుక్తంగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. జపాన్‌కు పెట్టుబడి పెట్టే సామర్థ్యం వుంది, వారి జనాభాలో వయసు మీద పడినవారు ఎక్కువ. ఇండియాలో పెట్టుబడి తక్కువ, చౌకగా లభించే కార్మికులు ఎక్కువ. జనాభాలో యువత శాతం ఎక్కువ. ఈ వైరుధ్యం వలన యీ రెండు దేశాలూ పరస్పర పూరకాలు. ఇద్దరూ చేతులు కలిపితే ప్రయోజనం రెట్టింపు అవుతుంది. భవిష్యత్తు బాగా వుంటుందని ఆశిద్దాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)