ఎమ్బీయస్‌ : రెండు కళ్ల కబోది

ఇతర రాష్ట్రాలలో 'రెండు కళ్లు' అంటే ఎవరికీ ఏమీ స్ఫురించకపోవచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం 'రెండు కళ్లు' అన్నా, 'కొబ్బరిచిప్పలు' అన్నా, వెంటనే తట్టేది చంద్రబాబు పేరే. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండూ…

ఇతర రాష్ట్రాలలో 'రెండు కళ్లు' అంటే ఎవరికీ ఏమీ స్ఫురించకపోవచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం 'రెండు కళ్లు' అన్నా, 'కొబ్బరిచిప్పలు' అన్నా, వెంటనే తట్టేది చంద్రబాబు పేరే. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండూ నాకు రెండు కళ్లు అన్న ఆయన కొటేషన్‌ చాలా పాప్యులర్‌ అయిపోయింది. ఈ సందర్భంలో జనార్దన మహర్షి కవిత గుర్తుకు వస్తుంది 'మా అమ్మా, మా ఆవిడా నాకు రెండు కళ్లు… రెండూ ఒకట్నొకటి చూసుకోవు' అని! టిడిపిలో ఆంధ్ర, తెలంగాణ నాయకులు కూడా ఒకరినొకరు చూసుకునే పరిస్థితిలో లేరు. ఈ సంగతి తెలిసికూడా బాబు ఏవేవో మాట్లాడతారు. కిరణ్‌, జగన్‌ సోనియా యింటి దగ్గర ధర్నా చేయాలట. '…అలా చేస్తే విభజన బిల్లు ఆగుతుందా? అలా ఆగాలనే మీరు కోరుకుంటున్నారా?' అని అడిగితే మళ్లీ యీయన సమాధానం చెప్పలేడు సరికదా 'నీ కెంతమంది పిల్లలు?' అని మనల్ని అడుగుతాడు. 'పెళ్లే కాలేదు స్వామీ' అంటే 'అయితే పెళ్లి చేసుకుని యిద్దరు పిల్లల్ని కని అప్పుడు రా. ఒకణ్ని కని, మధ్యలో రావద్దు' అని అంటాడు. 

కిరణ్‌, జగన్‌ కట్టకట్టుకుని సోనియా యింటిముందు కూర్చుంటే ఏమవుతుంది? ఆంధ్రా భవన్‌లో కిరణ్‌ ఎక్కిన బస్సుకి అడ్డుపడిన తెలంగాణ మంత్రులకు ఏమైందో అదే జరుగుతుంది. ఢిల్లీ పోలీసులకు అందరూ ఒక్కటే, యీడ్చి పారేస్తారు. ఆ తర్వాత తెలుగుమీడియా దగ్గరకు వచ్చి లబోదిబోమని ఏడవాలి. ఆడకూతుళ్లు ఏడ్చారంటే భరించగలం. మగవాళ్లు ఏడిస్తే చూడలేం. అయినా సోనియా యింటి ఎదురుగా ఎందుకు? బాబు పార్టీలోని యిరుప్రాంతాల వారూ 'మీరు సమైక్యవాదో, కాదో స్పష్టంగా చెప్పండి' అని ఆయన యింటి వద్ద ధర్నా చేస్తే ఏం చేస్తాడు? ఆయనా పోలీసులను బతిమాలి వాళ్లని లాగించేస్తాడు. తను సమైక్యవాదో కాదో సోమవారం చెప్తానని ఊరించిన బాబు ఆ తర్వాత నాకు మాట్లాడే అవకాశం యివ్వలేదని ఫిర్యాదు చేయడం మహా జోక్‌! జోక్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అనేద్దును కానీ, యీ ఏడాదిలో ఆయనే మరెన్ని జోకులు పేలుస్తారో తెలియక తమాయించుకున్నాను. సోమవారం నుండి అసెంబ్లీ అల్లకల్లోలం అవుతుందని ముందే తెలిసినట్లు, ఆయన తన మనసులో మాటను సోమవారానికి వాయిదా వేశాడు. వాయిదా వేసి తీరాలని సభానాయకుడుకాని, సభాపతికాని అడిగారా? ఇప్పుడు మాట్లాడితే డొక్క చించుతాం అన్నారా? అసలు ఆయన పెదవి ఎప్పుడు విప్పుతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. 

ఒకటి గమనించారా? రాష్ట్రంలో నాయకులందరూ విభజన గురించి తమ అభిప్రాయాలను వెల్లడించేశారు. ఎవరు సమైక్యవాదో, ఎవరు విభజనవాదో మనకి పూర్తిగా తెలుసు. కాంగ్రెసు, టిడిపి, బిజెపిలు పార్టీల పరంగా రెండు గొంతుకలతో మాట్లాడుతూ వుండవచ్చు. కానీ దానిలోని నాయకులు వ్యక్తిగతంగా తమకు ఏం కావాలో చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులందరూ విభజన కోరుతుండగా, సీమాంధ్ర కాంగ్రెసు నాయకులలో కొందరు ఎట్టిపరిస్థితుల్లోనూ సమైక్యంగా వుండాలని అంటూండగా, మరి కొందరు హైదరాబాదును యూటీ చేస్తే విభజనకు ఒప్పుకుంటాం అంటున్నారు. ఇంకొందరు రాయల తెలంగాణ యిస్తే విభజనకు ఒప్పుకుంటాం అంటున్నారు. మరి కొందరు హైదరాబాదు ఆదాయం, విద్య, ఉపాధి అవకాశాల్లో వాటా అంటున్నారు. సీమాంధ్ర బిజెపి వాళ్లు కూడా షరతులతో కూడిన విభజనకు ఒప్పుకుంటున్నారు. సీమాంధ్ర టిడిపి వారు బేషరతుగా విభజనను వ్యతిరేకిస్తూ వుంటే తెలంగాణ టిడిపివారు విభజన బిల్లును ఆహ్వానిస్తున్నారు. 

రాష్ట్రం మొత్తం మీద విభజన గురించి స్పష్టంగా చెప్పని ఏకైక నాయకుడు – చంద్రబాబు! 'నా కన్న అనుభవం వున్న నాయకుడున్నాడా? తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిని, పదేళ్ల ప్రతిపక్ష నాయకుణ్ని. నాకు మించి యీ రాష్ట్రం గురించి తెలిసినవారెవరు? దినదినం బలపడిపోతున్న నన్ను దెబ్బ తీయడానికే కాంగ్రెసు పార్టీ యింత కసరత్తు చేస్తోంది' అని గొప్పలు చెప్పుకుంటున్న బాబు యింతటి ముఖ్యమైన విషయంపై నోరు విప్పకపోవడం ఎంత హాస్యాస్పదం! అయినా తనకు రెండు కళ్లు వున్నాయని చెప్పుకుంటూనే ఆ రెండూ మూసుకున్న కబోది ఆయన అన్నమాట! గుడ్డివాడికి దారి తోచక కాస్సేపు అటూ, కాస్సేపు యిటూ వెళతాడు. ఈయనా అలాగే కాస్సేపు సీమాంధ్ర నాయకుల వెంట, కాస్సేపు టి-నాయకుల వెంట వెళుతూంటాడు. బాబుకి దృష్టి లోపించడమే కాదు, దీర్ఘదృష్టి కూడా లోపించింది. ఏదో ఒక విధానాన్ని నమ్ముకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారన్న యింగితం లేకుండా పోయింది. రెండు పక్కలా మాట్లాడి చాలా తెలివి ప్రదర్శిస్తున్నానని ఆయన అనుకుంటున్నారు కానీ, 'ఇన్నేళ్లూ ఎలాగో అలాగ గడిచిపోయింది. ఇప్పుడు కథ క్లయిమాక్సుకి వచ్చింది. ఇప్పుడు కూడా చౌరస్తాలో నిలబడితే ఎలా? ఏదో ఒకటి చెప్పకపోతే యిది తెలివనుకోవాలా? అతితెలివి అనుకోవాలా?' అని సామాన్యప్రజలు కూడా ఆశ్చర్యపడే థ వచ్చింది. బాబు సందిగ్ధత కారణంగా టిడిపి పార్టీలో ప్రతి కార్యకర్త సంజాయిషీ చెప్పుకోలేని స్థితి వచ్చింది.
మూసుకుని పోయిన కళ్లు కాస్త తెరిచి చూసినా బాబుకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ ఎన్నికలలో తెలంగాణలో టిడిపికి సీట్లు  పెద్దగా ఎటూ రావు. సీమాంధ్రలో సమైక్యవాదానికి బలం నానాటికీ పెరుగుతోంది. జులై 30కి ముందు కిరణ్‌ కుమార్‌ స్థాయికి, యిప్పటి స్థాయికి పోలిక లేదు. ఈ త్రివిక్రమత్వానికి కారణం – అతను సమైక్యవాదాన్ని బలంగా నమ్ముకోవడం. కిరణ్‌ సొంతంగా పార్టీ పెడితే చేరతామంటూ అనేకమంది నాయకులు పబ్లిగ్గా ఆఫర్లు యిస్తున్నారు. పెడతాడా లేదా, పెడితే ఏమవుతుంది అనేది తర్వాతి విషయం. ప్రస్తుతానికి కిరణ్‌ పేరు రాష్ట్రంలో అందరి పెదవులపై ఆడుతోంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పాప్యులారిటీతో పోలిస్తే కిరణ్‌ పాప్యులారిటీ ఎంత తక్కువగా వుండేది! ఇప్పుడు చూడండి. సమైక్యం అనే సిద్ధాంతాన్ని నమ్ముకోవడం వలన, లేదా నమ్ముకున్నట్టు చూపుకోవడం వలన కిరణ్‌ యింతటివాడయ్యాడని బాబు గుర్తిస్తే చాలు, ఏం చేయాలో ఆయనకే బోధపడుతుంది. కిరణ్‌ గ్రాఫ్‌ పెరిగిందని కనబడిన బాబుకి దాని వెనక్కాల కారణం చూడలేకుండా వున్నారంటే – ఆయన కళ్లున్న కబోదే! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014) 

[email protected]