హాస్యనటుడిగా మాంఛి ఫామ్‌లో ఉండగానే హీరోగా టర్న్ అయిపోయాడు సునీల్. ఆయన హీరో అవతారం ఎత్తాక సునీల్ నుంచి నికార్సయిన కామెడీ సినిమాలు రాలేదు. సిక్స్ ప్యాక్ చూపించడం కోసం కొన్ని ఫైటింగులూ, తనలోని డాన్సింగ్ టాలెంట్ బయట పెట్టడం కోసం పాటలూ పేర్చుకోంటూ కామెడీని అశ్రద్ధ చేశాడు.
యాక్షన్ ప్యాకేజీ ఉన్న కథలు ఎంచుకొంటే.. ఒకేసారి పెద్ద హీరో అయిపోవచ్చని ప్లాన్ వేశాడు. అయితే.. ఈ ఎత్తుగడ ఫలించలేదు. సరికదా సునీల్‌లోని అసలు సిసలైన కమెడియన్ని బయటకు రానివ్వకుండా చేసింది. దాంతో ఇప్పుడు సునీల్ గేమ్ ప్లాన్ మార్చాడు. ఇక నుంచి తన సినిమాల్లో 90 శాతం వినోదం ఉండేలా చూసుకొంటున్నాడట.
యాక్షన్ సీన్స్ లేకపోయినా ఫర్లేదు – కామెడీ మాత్రం కంపల్సరీ అని తన దగ్గరకు కథలు పట్టుకొస్తున్న దర్శకులకు హింట్ ఇస్తున్నాడట. భీమవరం బుల్లోడు సినిమా నుంచే మనం మారిన సునీల్‌ని చూడొచ్చు. ఇందులో కూడా యాక్షన్ సీన్స్‌ని బాగా కుదించి కామెడీ పైనే దృష్టిపెట్టాడట. ఈ మార్పు తెచ్చే ఫలితాలతేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.