ఆమ్ ఆద్మీ దృష్టి నీటిమీదే ఎందుకు?

ఇన్నేళ్లగా రకరకాల ఎన్నికల వాగ్దానాలు చూశాం. బియ్యం చవకగా ఇస్తామని, విద్యుత్ ఉచితంగా ఇస్తామని, కలర్ టీవీలు ఫ్రీగా ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, నగదు బదిలీ చేస్తామనీ… ఇలాంటివి విని విని వున్నాం.…

ఇన్నేళ్లగా రకరకాల ఎన్నికల వాగ్దానాలు చూశాం. బియ్యం చవకగా ఇస్తామని, విద్యుత్ ఉచితంగా ఇస్తామని, కలర్ టీవీలు ఫ్రీగా ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, నగదు బదిలీ చేస్తామనీ… ఇలాంటివి విని విని వున్నాం. కానీ ఆప్ వాళ్లు ‘అప్’ (నీటికి సంస్కృతపదం) వెనక పడ్డారు. కుటుంబానికి నెలకు 20 వేల లీటర్లు ఫ్రీగా ఇస్తామని వాగ్దానం చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్న హామీకి తోడు ఇది ఓటర్లపై బాగా పని చేసి అనూహ్యమైన ఫలితాలు తెచ్చింది. అంటే ఢిల్లీలో నీటి సమస్య అంత తీవ్రంగా వుందన్నమాట అని తెలుస్తోంది. ఆ మాటకొస్తే అన్ని నగరాల్లో నీటి ఎద్దడి వుంది. మరి ఢిల్లీ ప్రత్యేకత ఏమిటి? అంటే ఢిల్లీ జల్ బోర్డు (డిజెబి) యొక్క అధ్వాన్నపు నిర్వహణ! గత ఢిల్లీ ప్రభుత్వాలు 3% నిధులను రోడ్ల విస్తరణకు, ఫ్లయిఓవర్లు కట్టడానికి ఖర్చుపెట్టింది. 15% నిధులు పార్కింగ్ ప్రాజెక్టులపై వెచ్చించింది. అందువలననే నీటి సమస్య ఇంత తీవ్రమైంది. 

ఢిల్లీ జలబోర్డును 1998లో నెలకొల్పారు. దానిపై చాలా పెట్టుబడులు పెట్టారు. దానికి నీళ్లు వచ్చేందుకు మూడు మార్గాలున్నాయి. పశ్చిమ యమున, ఎగువ గంగా కాలువ, పంజాబ్‌లోని భాక్రా నంగల్ రిజర్వాయర్. ఈ నీటిని ఢిల్లీ బోర్డు ఏడు ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలించి, అక్కడ శుద్ధి చేసి కాలనీలకు, వాణిజ్య కేంద్రాలకు సరఫరా చేస్తుంది. నీటికోసం అది వసూలు చేసే చార్జిలో కొంత భాగం నీటివాడకానికి, మరికొంత సీవేజ్ ట్రీట్‌మెంట్ (మురికినీరు శుద్ధి)కి పోతుంది. ఢిల్లీ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల కెపాసిటీ దేశంలోనే అత్యధికం. కానీ అవి శక్తిమేరకు పని చేయడం లేదు. ఎందుకంటే వాటి మేన్‌టెనెన్స్ సరిగ్గా లేదు. చాలా చోట్ల ఆ పైపులను డ్రయినేజి పైపులకు కలిపేశారు. వాటిని తీసుకెళ్లి యమునా నదిలో వదిలేస్తున్నారు. ఆ పైపులు మూసుకుపోవడం వలన సామర్థ్యం తగ్గిపోతోంది. లెక్కప్రకారం బోర్డు రోజుకి 320 కోట్ల లీటర్ల నీళ్లు సేకరించి, పంపిణీ చేస్తోంది. దానిలో 32% నీటిపై మాత్రమే ఆదాయం వస్తోందని, 6% నీరు ఎలా పోతోందో తెలియటం లేదని బోర్డు అంటోంది. ఎందుకంటే నీటి శుద్ధి కేంద్రాల వద్ద మీటర్లు పని చేయడం లేదు. అంతేకాదు, పంపిణీ చేసే క్రమంలో 40% నీరు వృథా అవుతోందని బోర్డే స్వయంగా చెపుతోంది. భూగర్భజలాలు తప్ప ఢిల్లీకి దగ్గరలో నీటి వనరులు లేవు. పక్కనే యమునా నది వున్నా అది కాలుష్య భరితం. ఇలాంటి పరిస్థితుల్లో 40% వృథా అంటే ఎంత ఘోరమో చూడండి. 

220 లక్షల మంది జనాభా ఉన్న ఢిల్లీ మహానగరంలో మొత్తం వాటరు మీటర్ల సంఖ్య 16 లక్షలు మాత్రమే! వాటిలో సగానికి సగం పని చేయవట. నీటివాడకంలో కూడా వ్యత్యాసాలున్నాయి. దక్షిణ, మధ్య ఢిల్లీలోని ధనిక ప్రాంతాలలో ఒక మనిషికి 500 లీటర్లు ఖర్చవుతోంది. (ఇప్పుడు ఆప్ పెట్టిన స్కీములో మనిషికి 140 లీటర్ల లోపు ఇస్తున్నారు). ఢిల్లీ శివార్లలో వున్న కాలనీలకు జలబోర్డు పైపులు వేయలేదు. ట్యాంకర్ల ద్వారా సప్లయి చేయాలని కానీ తగినన్ని ట్యాంకర్లు లేవు, ఉన్నవి రిపేర్లలో వున్నాయి. అందువలన శివార్ల జనాలు మోటర్లు, బూస్టర్లు పెట్టి భూ జలాలలను తోడేస్తున్నారు. బూస్టర్లు పెట్టడం చట్టవిరుద్ధం కానీ దాన్ని అమలు చేసేవారు లేరు. వీటిని జలబోర్డు సక్షన్ పైపులకు కనక్ట్ చేసేస్తున్నారు. దాంతో వాటిలో ఒత్తిడి పెరిగిపోయి పగిలిపోతున్నాయి. దానిలో వున్న నీరు కలుషితం అవుతోంది. భూగర్భజలాలు ఇలా వాడేస్తున్నారు కాబట్టి ఇంకుడు గుంతలను ప్రోత్సహిస్తే మంచిది. జలబోర్డు వాటి గురించి ప్రకటనలు ఇచ్చి ఊరుకుంటుంది తప్ప ప్రోత్సాహకాలేమీ ఇవ్వదు. 

తమ వ్యవహారాలు ఇంత చెత్తగా వున్నా జలబోర్డు తమకు నీళ్లు చాలటం లేదని, ప్రభుత్వం హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి 416 కోట్ల లీటర్ల సేకరించి ఇవ్వాలని డిమాండ్ చేసింది. షీలా దీక్షిత్ ప్రభుత్వం వాటర్ ఆడిట్ జరిపించకుండా, జలబోర్డు పనితీరు మెరుగుపరచడం మానేసి, వారు చెప్పినట్టే ఆ రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంది. జలబోర్డు ఇంకో డిమాండ్ కూడా చేసింది. ‘మాకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కాబట్టి నీటి పంపిణీని ప్రయివేటు వ్యాపారులకు అప్పగించాల’ని కోరింది. ఢిల్లీలోని అన్ని సంస్థల కంటె అత్యంత అవినీతి భరిత, అసమర్థ వ్యవస్థ జలబోర్డుదేనని అందరూ అంటారు. అరవింద్ కేజ్రీవాల్ పదవిలోకి వస్తూనే చేసిన పని – జలబోర్డులో 800 మంది ఉద్యోగులను బదిలీ చేయడం. అంతేకాదు బోర్డు సిఇఓను మార్చేశాడు. వీళ్ల గురించి ఏం తెలుసని అతనలా చేశాడు  అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అతను 2007లో ‘పరివర్తన్’ అనే సామాజిక సంస్థ పెట్టినపుడు ఈ జలబోర్డుపైనే పోరాటం సాగించాడు. అప్పట్లో అది ప్రపంచబ్యాంకు నుండి భారీ ఋణం తీసుకుని నిర్వహణను ప్రయివేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నంలో వుంది. ఇతని పోరాటం కారణంగా ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ పూర్వానుభవంతోనే అరవింద్ నీటి పంపిణీని ఎన్నికల అంశంగా పెట్టడం, అధికారం దక్కగానే బోర్డును ప్రక్షాళన చేయడానికి పూనుకోవడం జరిగాయి. 

అయితే కుటుంబానికి  లైఫ్‌లైన్ వాటర్ – అంటే బతకడానికి అత్యవసరమైన నీరు ఇన్ని లీటర్లు కావాలి అని ఏ ప్రాతిపదికపై తేల్చారు? దీనిలో రెండు సిద్ధాంతాలున్నాయి. పర్యావరణ మంత్రిత్వశాఖ మనిషికి రోజుకి 6 లీటర్లు సరిపోతుంది అంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు నగరవాసికి రోజుకి 145 లీటర్లు కావాలని, దానిలో 45 లీటర్లు ఫ్లష్ చేయడానికే పోతుందని తేల్చారు. కుటుంబంలో 5గురు వ్యక్తులుంటే తలా 145 లీటర్ల చొప్పున 725 లీటర్లు ఖర్చవుతుంది. అయితే ఆప్ రెండో ప్రాతిపదికను ఆమోదిస్తూనే ఫ్లష్ చేసే నీరు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రోజుకి 667 లీటర్ల పరిమితి పెట్టారు. ఇప్పటిదాకా బోర్డు స్లాబుల ప్రకారం వసూలు చేస్తోంది. ఇప్పుడు ఆప్ మొదటి రెండు స్లాబులకు ఉచితం అంది.  దీనివలన 9 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతుందని అంచనా. దీనివలన ఢిల్లీ ప్రభుత్వానికి ఏడాదికి రూ.140 కోట్లు ఖర్చు అవుతుంది. దీనిలో కొంతభాగం పూడ్చుకోవడానికి తక్కినవాళ్లకు 10% ధర పెంచారు.

ఆప్‌లోనుండి బయటకు వచ్చిన వినోద్ బిన్నీ ఆరోపిస్తున్నదేమిటంటే – ‘ఈ స్కీములో ఉచితంగా ఇచ్చే 20 వేల లీటర్ల గురించే ఎన్నికల సమయంలో చెప్పారు కానీ, ఆ పరిమితి దాటిన వాళ్లకు, అంటే 22 వేల లీటర్లు వాడినవాళ్లకు మొదటి లీటరు నుండి చార్జి చేస్తామన్న విషయం స్పష్టంగా చెప్పలేదు. ‘20 వేల లీటర్ల దాకా ఎవరూ డబ్బు కట్టనక్కరలేదు, ఆ పైన వాడే 2 వేల లీటర్లు, మూడు వేల లీటర్లకు కడితే చాలు’ అనే అభిప్రాయం ఓటర్లలో కలిగించారు. ఇది దగా’ అంటాడాయన. అరవింద్ ‘ఇలాంటి నియమం పెట్టడం వలన 22 వేల లీటర్లు వాడేవాళ్లు 2 వేల లీటర్లు ఆదా చేసి 20 వేల లీటర్లలోపుకి వచ్చేసి ఉచిత సౌకర్యం పొందుతాడు. ఆ విధంగా నీరు ఆదా అవుతుంది.’ అంటారు. చాలా కాలనీలలో మీటర్లు పెట్టుకోలేదు, వాళ్లకు ఈ పథకం వలన లాభమేమిటి? అని కొందరు అడిగారు. ‘ఈ సౌకర్యం కోసమేనా మీటర్లు పెట్టుకుంటారు కదా. ఆ విధంగా నీళ్ల్లు ఎలా ఖర్చవుతున్నాయో తెలుస్తుంది కదా’ అన్నాడు అరవింద్. నిజమే కదా! 

– ఎమ్బీయస్ ప్రసాద్

[email protected]