ప‌డిప‌డి నవ్వుకోవాల్సిందే!

సీరియ‌స్ రాజ‌కీయాలు న‌డుస్తుండ‌గా కేఏ పాల్ ఎంట్రీ అదుర్స్‌. తెలంగాణ‌లో మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి ర‌గులుకుంది. బీజేపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ఏదో ఒక పేరుతో…

సీరియ‌స్ రాజ‌కీయాలు న‌డుస్తుండ‌గా కేఏ పాల్ ఎంట్రీ అదుర్స్‌. తెలంగాణ‌లో మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి ర‌గులుకుంది. బీజేపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ఏదో ఒక పేరుతో స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ… ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాహుల్‌గాంధీ స‌మావేశాన్ని విజ‌య‌వంతం చేసేందుకు కాంగ్రెస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో కేఏ పాల్ ఎంట్రీ కామెడీ సీన్‌ను త‌ల‌పిస్తోంది. హ‌నుమ‌కొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో స‌భ నిర్వ‌హించ‌డానికి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డంపై కేఏ పాల్ సీరియ‌స్ కామెంట్స్‌తో న‌వ్వు పుట్టించారు. ఇదే ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడైన కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ భ‌లే స‌ర‌దా విష‌యాలు చెప్పారు.

ఈ నెల 6న స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల కోసం ఉద్య‌మం చేస్తున్నందుకే సీఎం కేసీఆర్ భ‌య‌ప‌డి హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్ల‌ను బెదిరించి అనుమ‌తి ఇవ్వ‌కుండా అడ్డుకున్నార‌ని జోక్ పేల్చారు. త‌న స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌కుండా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ స‌భ‌కు అనుమ‌తి ఇచ్చార‌ని మండిప‌డ్డారు. త‌న‌కెందుకు ఇవ్వ‌ర‌ని ప్ర‌శ్నించారు.

రాహుల్‌గాంధీకి ఓటు బ్యాంక్ లేక‌పోవ‌డం వ‌ల్లే స‌భ‌కు అనుమ‌తి ఇచ్చార‌ని మ‌రో జోక్ పేల్చి సీరియ‌స్ వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌బ‌రిచారు. త‌న స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే, రాహుల్ స‌భ‌ను కూడా ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం జోక్ నంబ‌ర్ త్రీగా అభివ‌ర్ణించొచ్చు. 

ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, నిరుద్యోగుల కోసం పోరాడుతాన‌ని ఆయ‌న తేల్చి చెప్ప‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలో పాఠ‌కుల ఇష్టం. మొత్తానికి కేఏ పాల్ సీరియ‌స్‌గా చెప్పే జోక్స్ వింటే మాత్రం… ఎవ‌రైనా ప‌డిప‌డి న‌వ్వుకోవాల్సిందే!