టీడీపీ అధినేత చంద్రబాబు అంటే సీపీఐ నాయకులకు ప్రత్యేక ఇష్టం. బీజేపీతో బాబు అంటకాగినా ఆయనపై మాత్రం మనసు పారేసుకుంటూనే వుంటారు. దేశంలోనే ఏపీ సీపీఐ నాయకులది ప్రత్యేక పంథా. ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్పై ఒంటికాలిపై లేచే సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ… చంద్రబాబు విషయానికి వచ్చే సరికి మెత్తబడతారు. వాళ్లిద్దరి మధ్య “కమ్మ”ని బంధం దాగి ఉందని నెటిజన్లు సెటైర్స్ విసురుతుంటారు.
ఇదిలా వుండగా జగన్పై తీవ్రంగానూ, కేసీఆర్కు నొప్పి కలగకుండా మాట్లాడిన నారాయణ… చంద్రబాబు దగ్గరికొచ్చే సరికి నంగి మాటలు మాట్లాడ్డం విశేషం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సీఎంలు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ఏపీ సీఎం జగన్ మాత్రం కట్టుబానిస య్యారని తీవ్రస్థాయిలో విమర్శించడాన్ని గమనించొచ్చు.
టీడీపీ అధినేత చంద్రబాబు పిసినారి అని, ఆయన్ను తానెలా నమ్ముతానని నారాయణ విమర్శించడం విశేషం. చంద్రబాబు ఏ విషయంలో పిసినారో, నమ్మనని ఎందుకోసం, ఎవరి కోసం అంటున్నారో నారాయణకే తెలియాలి. 2014లో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. దాదాపు నాలుగేళ్ల పాటు ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ బీజేపీ, టీడీపీ అధికారం పంచుకున్నాయి.
బీజేపీతో సిద్ధాంతపరంగా సీపీఐకి అసలు పొసగదు. అదేంటో గానీ బీజేపీతో ఏనాడూ పొత్తు పెట్టుకోని జగన్ అంటే సీపీఐ నేతలకు కోపం రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణ ప్రాధాన్యం ఇస్తూ, చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారనేందుకు ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు.
ప్రేమ గుడ్డిదని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఈ నిర్వచనం చంద్రబాబు, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ మధ్య అనుబంధానికి సరిగ్గా సరిపోతుంది.