గూర్ఖాల్యాండ్‌ రాజకీయాలు

'తెలంగాణ' అని యిక్కడ అనగానే వెంటనే 'గూర్ఖాల్యాండ్‌' అని డార్జిలింగ్‌ కొండల్లో ప్రతిధ్వని వినిపిస్తుంది. తెలంగాణ బిల్లు పాసవడం ఖాయం అని చెప్పుకుంటున్న యీ తరుణంలో మరి అక్కడ ఏం జరుగుతోంది?  Advertisement 2013…

'తెలంగాణ' అని యిక్కడ అనగానే వెంటనే 'గూర్ఖాల్యాండ్‌' అని డార్జిలింగ్‌ కొండల్లో ప్రతిధ్వని వినిపిస్తుంది. తెలంగాణ బిల్లు పాసవడం ఖాయం అని చెప్పుకుంటున్న యీ తరుణంలో మరి అక్కడ ఏం జరుగుతోంది? 

2013 జులైలో కేంద్రం తెలంగాణ యిస్తామని ప్రకటించగానే గూర్ఖా ప్రాంతీయ నిర్వాహక సమితి – 'గూర్ఖా టెరిటోరియల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌' (జిటిఎ) నుండి దాని సిఇఓగా వున్న వి(బి)మల్‌ గురుంగ్‌ రాజీనామా చేశారు. గూర్ఖాల్యాండ్‌కు ప్రతేక రాష్ట్ర ప్రతిపత్తి యివ్వాలని డార్జిలింగ్‌ ప్రాంతంలో సుభాష్‌ గీషింగ్‌ నాయకత్వంలో జిఎన్‌ఎల్‌ఎఫ్‌ (గూర్ఖా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌) 22 ఏళ్ల పాటు ఆందోళన చేసింది. అప్పట్లో అతని మాటే చెల్లుబాటు అయేది. అతనితో విభేదించి, విడివడిన విమల్‌ గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎమ్‌) పార్టీ స్థాపించాడు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక అతనితో ఒప్పందానికి వచ్చి, కేంద్ర ప్రభుత్వం సహకారంతో జిటిఎను ఏర్పరచి దానికి ఆ ప్రాంతాలపై పరిమితి అధికారాలతో నిర్వహణను అప్పగించింది. దానిలోని 45 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తే అన్ని సీట్లూ విమల్‌ పార్టీ ఐన జిజెఎమ్‌కే దక్కాయి. 
అప్పటిదాకా వామపక్షాలతో పోరాడిన విమల్‌ కొత్త ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్నేహహస్తం చాపాడు. సిఇఓగా ప్రమాణస్వీకారం చేస్తూ ప్రత్యేక రాష్ట్ర డిమాండును వదులుకోలేదని, దానికోసం కేంద్రప్రభుత్వంతో నిరంతరం పోరాడతామని చెప్పాడు. అంటే రాష్ట్రప్రభుత్వంతో వైరం లేనట్టేగా! జిటిఏ ఏర్పడ్డాక శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. 

ఇలా నడుస్తూండగా తెలంగాణ ప్రకటన రావడం, 'జిటిఏ ఒక విఫలప్రయత్నం, దానిలో భాగంగా వుంటే ప్రత్యేకరాష్ట్రం ఎప్పటికీ రాదు కాబట్టి వైదొలగుతున్నానని' ప్రకటించి విమల్‌ రాజీనామా చేయడం జరిగాయి. అతని స్థానంలో అతని ఆదేశాల మేరకే పార్టీ సీనియర్‌ నాయకుడు వి(బి)నయ్‌ తమాంగ్‌ సిఇఓగా ఎన్నికయ్యాడు. అయితే అప్పటినుండి నిరంతర ఘర్షణల మధ్య శాంతి, అభివృద్ధి కుంటుపడ్డాయి. పైగా ఆ ప్రాంతంలో తృణమూల్‌ బలపడసాగింది. దానికి తోడు జిఎన్‌ఎల్‌ఎఫ్‌ కూడా మళ్లీ వూపిరి పోసుకుంటూండంతో విమల్‌ కంగారు పడ్డాడు. పరిస్థితి చేజారకముందే మళ్లీ జిటిఎకు వచ్చేస్తే మంచిదనుకున్నాడు. డిసెంబరు 26 న సిఇఓ పదవి మళ్లీ చేపట్టాడు. మమతా బెనర్జీతో సఖ్యం కొనసాగిస్తూ ప్రత్యేకరాష్ట్ర డిమాండ్‌ను వెనక్కి నెట్టదలచుకున్నాడు. కెసియార్‌ గురించి యిక్కడ విమర్శలు వచ్చినట్లే అక్కడా ప్రత్యర్థులు విమల్‌ని నిందిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం గురించి ఉద్యమిస్తున్న మరో పార్టీ అయిన అఖిల భారత గూర్ఖా లీగ్‌ నాయకుడు ప్రతాప్‌ ఖతీ ''అసలు ప్రత్యేకరాష్ట్రం ఏర్పడాలన్న కోరిక విమల్‌కి లేదు. అది ఏర్పడితే తన ప్రాముఖ్యత తగ్గిపోతుందని అతని బాధ. అందుకని మమతా ఆశీస్సులతో జిటిఏను నడుపుతూ, అపరిమితమైన అధికారాలు అనుభవిస్తూ, ప్రత్యేక రాష్ట్రం గురించి అప్పుడప్పుడు వల్లిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు'' అని విమర్శించాడు.