ఢిల్లీ రాష్ట్రం 1993లో ఏర్పడింది. అప్పటినుండి 2008 వరకు జరిగిన ఎన్నికలను విశ్లేషిస్తూ 'ఛేంజింగ్ ఎలక్టొరల్ పాలిటిక్స్ ఇన్ ఢిల్లీ' అనే పుస్తకం వెలువడింది. ఢిల్లీలో సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌లో ఫెలోగా వున్న సంజయ్ కుమార్ యీ పుస్తకాన్ని రాశారు. మరే యితర రాష్ట్రం గురించైనా యిలాటి పుస్తకం రాస్తే చదువుతామో లేదో కానీ, ఢిల్లీ గురించి తప్పక చదవబుద్ధేస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం చూశాక ఆ ప్రయోగం ఢిల్లీకే పరిమితమవుతుందా, లేక దేశంలోని యితర ప్రాంతాల్లో కూడా విజయం సాధిస్తుందా అన్న విషయంలో కుతూహలం వుంది. ఈ పుస్తకంలో ఢిల్లీ ఎన్నికల గురించి కేవలం గణాంకాలు యిచ్చి వూరుకోలేదు. ఢిల్లీ నగర స్వరూపస్వభావాల గురించి విపులంగా చర్చించారు. ఢిల్లీ అనేది వలసల నగరం. దేశవిభజన జరిగినపుడు 1947లో పంజాబీ హిందువులు, సింధు హిందువులు వెల్లువలా వచ్చిపడ్డారు. తర్వాతి థాబ్దాలలో ఢిల్లీ ఆర్థికంగా బలపడుతున్నకొద్దీ ఉద్యోగావకాశాల కోసం బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుండి పేదలు వలస వచ్చారు. తమ గ్రామాల్లో రిక్షా తొక్కితే అవమానంగా భావించేవారు, యీ నగరంలో ఎవరికీ తెలియకుండా వుండవచ్చు కాబట్టి చిన్నచిన్న పనులు చేసుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలో తమ కులం గురించి కూడా పట్టించుకోవడం మానేశారు.
ప్రస్తుతం ఢిల్లీలోనే మూడు నగరాలున్నాయి – అతి గొప్పవాళ్లు, పేదవాళ్లు, మధ్యతరగతివాళ్ల నగరాలవి. ఏ నగరంలోనే యీ వ్యత్యాసాలు సహజమే కానీ ఢిల్లీలో అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ రాజకీయాలపై పంజాబీ ఖత్రిలు, బ్రాహ్మణులు, కాయస్థుల ప్రభావం వుంటోందని రాజకీయ పరిశీలకులు అంటూ వచ్చారు. ఈ పుస్తకం దాన్ని ఖండిస్తోంది. కౌ బెల్ట్‌గా పిలవబడే ఉత్తరభారత రాష్ట్రాలలో కులప్రాతిపదిక ఎస్పీ, జెడియు, బియస్పీ పార్టీలు పుంజుకోగా అక్కడ నుండి వచ్చిన ప్రజలు ఆ పార్టీలను యిక్కడ ఆదరించటం లేదని, కాంగ్రెసు బిజెపిల మధ్యనే రాజకీయాలు తిరుగాడుతున్నాయని గుర్తు చేశాడు. ఈ నగరానికి రాగానే కులం ప్రాధాన్యత తగ్గిపోయిందని చెపుతూనే మళ్లీ కులాల ప్రభావం బొత్తిగా లేకపోలేదు అంటూనే దానిలో మళ్లీ అంతస్తుల ప్రకారం విడిపోతారంటాడు రచయిత.
పంజాబీ ఖత్రీలలో పేదలు ఒక పార్టీకి ఓటేస్తే, ధనికులు మరో పార్టీకి ఓటేశారు. ధనికులైన ఖత్రీలు, ధనికులైన దళితులు ఒకే పార్టీకి ఓటేసినట్లు తేలింది. కాంగ్రెసు పేదల ఓట్లు తెచ్చుకోగా, మధ్యతరగతి బిజెపిని ఆదరిస్తూ వచ్చారు. షీలా దీక్షిత్ తన వ్యక్తిగత యిమేజితో మధ్యతరగతిని ఆకట్టుకోవడం వలన, బిజెపి సరైన ప్రత్యామ్నాయం చూపలేక పోవడం వలన షీలా నెగ్గుతూ వచ్చారని రచయిత అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ గురించి యీ పుస్తకం ప్రస్తావించలేదు. మొన్న ఎన్నికలలో అది కులాల వారీగా కాకుండా అన్ని వర్గాల నుండి ఓట్లు సంపాదించుకుంది. 70లో 28 సీట్లు గెలుచుకుంది. ఇతర రాష్ట్రాలలోని నగరాలలో ఢిల్లీ వంటి వాతావరణం వుందా? మెట్రోలలో వుండవచ్చు. కానీ యితర నగరాలలో..? పట్టణాలలో…? గ్రామాల్లో…? ఢిల్లీలో వలస వచ్చినవారు ఎక్కువగా వున్నారు కాబట్టి వారి మనస్తత్వాలలో పోలిక వుండవచ్చు. ఎప్పటినుండో ఒకే వూళ్లో పాతుకుపోయినవారు తమ స్వభావాలను మార్చుకుంటారా? వేచి చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)