అమర శిల్పి కమ్ముల

రాజమౌళి ఒక సినిమాకి రెండేళ్ల సమయం తీసుకుంటున్నాడంటే… అతను తీసే సినిమాల రేంజ్‌ అలాంటిది. సగటు మాస్‌ సినిమాలు, లవ్‌స్టోరీలు అతను తీయడం లేదు కాబట్టి, అన్నీ గ్రాఫిక్స్‌తో కూడిన భారీ చిత్రాల కనుక…

రాజమౌళి ఒక సినిమాకి రెండేళ్ల సమయం తీసుకుంటున్నాడంటే… అతను తీసే సినిమాల రేంజ్‌ అలాంటిది. సగటు మాస్‌ సినిమాలు, లవ్‌స్టోరీలు అతను తీయడం లేదు కాబట్టి, అన్నీ గ్రాఫిక్స్‌తో కూడిన భారీ చిత్రాల కనుక ఆమాత్రం టైమ్‌ పడుతుందంటే అర్థముంది. అలాగే సుకుమార్‌ సినిమాల్ని బాగా చెక్కుతాడంటే… అంతర్జాతీయ ప్రమాణాలని అందుకునే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న డిలే అది. 

అయితే తీసేవి కొత్త వాళ్లతో సాధారణ లవ్‌స్టోరీలే అయినా, ఎలాంటి టెక్నికల్‌ హంగులు లేని సాదా సీదా సినిమాలే అయినా కానీ ప్రతి చిత్రానికీ నెలలు, సంవత్సరాల తరబడి తీసుకుంటోన్న మరో దర్శకుడున్నాడు. అతనే శేఖర్‌ కమ్ముల. స్క్రిప్టుపై ఎక్కువ వర్క్‌ చేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అతని సినిమా సెట్స్‌ మీదకి వెళ్లాక కూడా ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. 

నయనతారతో ‘కహానీ’ చిత్రం రీమేక్‌ చేస్తున్నాడు. రీమేక్‌ సినిమానే కాబట్టి వేగంగానే పని పూర్తి చేస్తాడని అనుకుంటే దీనికి కూడా తన చెక్కుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడో గత జూన్‌, జులై నుంచి ఈ సినిమా త్వరలో, త్వరలో అని వినిపిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ దీని ఆచూకీ అయితే లేదు. సినిమా పూర్తయ్యే వరకు ప్రమోషన్‌ చేసే అలవాటు కూడా లేకపోవడంతో అసలు అనామిక ఎందాకా వచ్చిందనేది కూడా అర్థం కావడం లేదు.