సంక్రాంతికి రాబోతున్న భారీ చిత్రాలపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 1 నేనొక్కడినే చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టేస్తామని మహేష్ అభిమానులు చెబుతోంటే, బాబాయ్ నెలకొల్పిన రికార్డులని అబ్బాయే తిరగరాస్తాడని చరణ్ అభిమానులు తొడలు కొడుతున్నారు. ఈ రెండు చిత్రాలపై పాజిటివ్ బజ్ అయితే ఉంది.
కాకపోతే రెండిటికీ కొన్ని నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయనేది ఇన్సైడ్ టాక్. ‘1 నేనొక్కడినే’ చిత్రం మరీ స్లోగా ఉంటుందని, కామెడీ, ఎంటర్టైన్మెంట్ లేకుండా సీరియస్ టోన్‌లో సాగుతుందని, దర్శకుడు మరీ తెలివిగా డీల్ చేయడం వల్ల మాస్ ప్రేక్షకులకి అర్థం కాదేమోనని… చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ చిత్రానికి మహేష్‌బాబు అండగా ఉన్నాడు కాబట్టి, అతని దూకుడు తీవ్రంగా ఉంది కాబట్టి… మరీ డిజాస్టర్ కంటెంట్ ఉంటే తప్ప ‘నేనొక్కడినే’ జోరు తగ్గడం అసంభవం.
ఇక ఎవడులో అయితే వయొలెన్స్ తీవ్రంగా ఉంటుందని, సినిమాలో కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదని, ఈ సినిమా కూడా దీని ముందు రాబోతున్న ‘నేనొక్కడినే’ తరహాలోనే విలన్ కోసం హీరో వెతుకులాడడం గురించి కనుక దానిలానే ఉందనే విమర్శలు రావొచ్చునని గుసగుసలాడుతున్నారు. అయితే కమర్షియల్ ఫార్మేట్లో ఉండడం, మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలుండడం, చరణ్ తన డాన్స్‌లతో ఒక వైపు కొమ్ము కాయడం వల్ల ఎవడు చిత్రం పండక్కి తగ్గ సినిమా అనిపించుకుంటుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఏతావాతా చెప్పేదేమిటంటే గత ఏడాది మహేష్, చరణ్ ఇద్దరూ సంక్రాంతికి హిట్లు ఇచ్చినట్టే ఈసారి కూడా ఆ ఫీట్ రిపీట్ చేసి ఈ ఏడాదిని ఘనంగా ఆరంభిస్తారని. అదే జరుగుతుందని ఆశిద్దాం.