తరుణ్ చాప్యం – తెహల్కా విలవిల

తన కూతురు వయసున్న జర్నలిస్టుతో సరసమాడిన తరుణ్ తేజ్‌పాల్ తన తెహల్కా సంస్థేక ముప్పు తెచ్చిపెట్టాడు. తెహల్కా అంటే చాలాకాలం పాటు జర్నలిస్టులకు చాలా అభిమానం వుండేది. వేరే చోట ఆమోదించని కథనాలను తెహల్కా…

తన కూతురు వయసున్న జర్నలిస్టుతో సరసమాడిన తరుణ్ తేజ్‌పాల్ తన తెహల్కా సంస్థేక ముప్పు తెచ్చిపెట్టాడు. తెహల్కా అంటే చాలాకాలం పాటు జర్నలిస్టులకు చాలా అభిమానం వుండేది. వేరే చోట ఆమోదించని కథనాలను తెహల్కా ఏ అభ్యంతరాలూ లేకుండా స్వీకరించేది. సమాంలో వున్న కుళ్లును కడిగేసి, దాన్ని ఉద్ధరిస్తున్నామనే గర్వంతో వుండేవారు ఆ సంస్థలోని సిబ్బంది. అందుకే ఆఫీసులోనే నేలమీద పడుకుని, రాత్రింబగళ్లు పని చేస్తూ, జీతం సరిగ్గా ముట్టకపోయినా పట్టించుకునేవారు కారు. అనేక పత్రికలు వ్యవసాయం గురించి, స్త్రీల సమస్యల గురించి రాస్తామంటే ఒప్పుకోవు, మరి కొన్ని పత్రికలు ఈశాన్య రాష్ట్రాల గురించి రాస్తామంటే వద్దంటాయి. ఎవరూ చదవరు పొమ్మంటాయి. అలాంటివి రాద్దామనుకున్నవాళ్లు తెహల్కాకు వస్తే తేజ్‌పాల్ ఆహ్వానించేవాడు. మీకు తోచినది రాయండి అనేవాడు. తేజ్‌పాల్ – తెహల్కా ఒకరితో ఒకరు మమేకం కావడం వలన ఇద్దరూ త్వరత్వరగా అభివృద్ధి చెందాయి. కానీ కొన్నాళ్లకు తేజ్‌పాల్ కుటుంబసభ్యులు పత్రిక వ్యవహారాల్లోకి చొరబడసాగారు. తేజ్‌పాల్ సోదరి నీనా చీఫ్ మేనేజర్. అతని సోదరుడు మింటీ తన స్నేహితులందరినీ కీలకమైన పదవుల్లో నియమించుకున్నాడు. వ్యాపారాన్ని విస్తరించుకోవాలనే తహతహలో ఆదర్శాలు పలచబడసాగాయి. దాంతో చెప్పేదొకటీ, చేసేదొకటీగా తయారైంది. పేరు వస్తున్నకొద్దీ తేజ్‌పాల్ తనను తాను గొప్పవాడిగా అనుకుని తక్కినవాళ్లను తక్కువగా చూడసాగాడు. తన ఎడిటర్లలో ఇద్దరిని మాత్రమే విశ్వసించేవాడు. క్రమేపీ అది ఒక్కరికే పరిమితమై పోయింది. ఆ వ్యక్తి – మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి!

తేజ్‌పాల్ పత్రికను నష్టాల్లో చూపించేవాడు. సిబ్బందికి జీతాలు సరిగ్గా ఇచ్చేవాడు కాడు. మీరంతా త్యాగాలు చేయాలని ఉద్బోధించేవాడు. అతను పత్రిక పెట్టి పదేళ్లయింది. ఆరేళ్ల క్రితం వారపత్రికగా మార్చాడు. ఇలా విస్తరించాడు కానీ సిబ్బంది కోసం హెచ్‌ఆర్ డిపార్టుమెంటు పెట్టలేదు – ఇస్తే వాళ్లకు జీతభత్యాలు పెరుగుతాయన్న భయంతో! చివరకు 2010లో పెట్టాడు. అయినా ప్రావిడెంటు ఫండ్‌ను ఏర్పాటు చేయలేదు. సీనియర్ జర్నలిస్టులు కూడా తమ ఫోను ఖర్చులు, ప్రయాణఖర్చులు తమే పెట్టుకోవాలి. చాలామంది వ్యాసకర్తలకు పారితోషికం ఇవ్వలేదు. మనం చేస్తున్నది ఉద్యోగం కాదు, ఉద్యమం అనే భ్రమ కల్పిస్తూనే అదే సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి అనేక కంపెనీలు పెట్టాడు. జర్నలిజంతో సంబంధం లేని వ్యాపారాలవి. రిసార్టులు, కొండల్లో కాటేజీలు.. ఇలాంటివి. ఈ శృంగార చేష్ట బయటకు వచ్చాకనే తేజ్‌పాల్ కంపెనీల వ్యవహారాలు ఫస్ట్‌పోస్ట్‌లో బయటకు వచ్చాయి. అవి చూసే తెహల్కా సిబ్బంది తెల్లబోయారు. ఇంత డబ్బు ఈయనకు ఎక్కడిదా అని. ఆ వ్యాపారాల్లో తేజ్‌పాల్ కుటుంబసభ్యులతో బాటు సోమా చౌదరికి కూడా వాటాలున్నాయి. అందుకే ఆమె తేజ్‌పాల్‌ను వెనేకసుకుని వచ్చింది. మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఇచ్చాక అయిదురోజుల పాటు ఏమీచేయకుండా వుండి, ఆ తర్వాత ఓ లాయర్ని సంప్రదించింది.  ఆ తర్వాత తేజ్‌పాల్ స్వచ్ఛంద పదవీ విరమణ నాటకం ఆడితే దానికి సహకరించింది. అయితే కేసు పెద్దది కావడంతో తనే రాజీనామా చేసింది. 

తేజ్‌పాల్ ఒక బిజినెస్ న్యూస్ పేపరు పెట్టాడు. కొన్ని రోజుల్లోనే మూసేశాడు. కారణం తెలియదు. ఏదో ఒక వ్యాపారవేత్తకో, రాజకీయవేత్తకో దొంగడబ్బు విషయంలో సాయపడడానికే అది జరిగి వుంటుందని కొందరి అనుమానం. బిజెపి అధ్యక్షుడిగా వున్న బంగారు లక్ష్మణ్ పై స్టింగ్ ఆపరేషన్ చేసి అతని పదవీచ్యుతికి కారణభూతుడైన తేజ్‌పాల్ మరి యుపిఏ 1, 2లలో ఇన్ని కుంభకోణాలు జరిగితే వాటిలో ఒక్కదాన్నీ బయటప్టెలేదేం? అని అందరూ అడుగుతున్నారు. అతను కాంగ్రెసు పక్షపాతి అనే భావం ఎల్లెడలా వ్యాపించింది. అందుకే ఈ కేసు బయటకు రాగానే బిజెపి అత్యుత్సాహంతో అతనిపై దాడి చేస్తోంది. అధికారంలో వున్న యుపిఏ మద్దతు, సమాజసంస్కర్త అనే పేరు రావడం – వీటితో పోను పోను తేజ్‌పాల్‌కు తనెక్కణ్నించో దిగి వచ్చానన్న ఫీలింగు వచ్చేసింది. తనతో డిన్నర్లు చేసిన వివిఐపిలు తనకు సాయపడతారన్న భ్రమలో వుండేవాడు. (ఈ కేసు వచ్చాక వాళ్లందరూ పోవోయ్ అనేశారట) సమాజపు కట్టుబాట్లు తనకు వర్తించవనుకునేవాడు. వికార చేష్టలు మొదలుపెట్టాడు. ‘ఒకరితోనే కాపురం చేయడం పెద్ద బోర్’ ‘ఎప్పుడూ టీనేజరులా వుండాలి, సాహసాలు చేయాలి’ వంటి స్టేటుమెంట్లు ఇచ్చేవాడు. సంపాదక సిబ్బందితో అప్పుడప్పుడు రిసార్టుల్లో ఎడిటర్ల విశ్రాంతి సమావేశాలు (రిట్రీట్ అంటారు) జరిగినపుడు మహిళా జర్నలిస్టులను తనే స్వయంగా స్విమ్మింగ్ పూల్‌లో తోస్తూండేవాడు. చివరకు గోవాలో అతనిచ్చిన ఉపన్యాసం చూడండి – ‘ఇది గోవా. తాగండి, తినండి. ఎవరితో కావాలంటే వారితో పడుకోండి..’ అని గొప్ప సందేశం ఇచ్చాడు. ఇప్పుడు గోవా జైల్లో మాదకద్రవ్యాల సరఫరాదారుతో కలిసి పడుకుంటున్నాడు. అతని పత్రిక నుండి అనేకమంది జర్నలిస్టులు తప్పుకుంటున్నారు. పత్రిక, దాన్ని ఆధారం చేసుకుని అతను నిర్మించుకున్న వ్యాపారసామ్రాజ్యం ఏమవుతాయో ఎవరికీ తెలియదు. 

ఎమ్బీయస్ ప్రసాద్ 

[email protected]