ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ జిల్లాలో నెగ్గాలంటే అజిత్ జోగితో సయోధ్య చేసుకోక తప్పదని గ్రహించిన కాంగ్రెసు అతని కొడుకు అమిత్‌కు మర్వాహి అసెంబ్లీ టిక్కెట్టు యిచ్చారు. ఓ పక్క రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి నేరస్తులు రాకూడదంటూ స్పీచులు దంచుతున్నాడు. ఇంకో పక్క అమిత్లాటి వాళ్లకు టిక్కెట్టు యిప్పించాడు. ఈ అమిత్‌పై గతంలోనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు కొత్తగా కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఎన్‌సిపి లీడరైన రామ్ అవతార్ జగ్గి అనే అతన్ని చంపడానికి కొందరితో కలిసి కుట్ర పన్నాడని గతంలోనే ఆరోపణ వుంది. సెషన్స్ కోర్టుకు వాళ్లు కేవలం రూ.5000 బెయిల్ తీసుకుని అతన్ని వదిలేశారు. దానిపై రామ్ అవతార్ కొడుకు సతీష్ హైకోర్టుకి వెళ్లి రివిజన్ పిటిషన్ వేశాడు. కేసు హై కోర్టులో పెండింగులో వుంది.
2003 ఛత్తీస్‌గఢ్ ఎన్నికల తర్వాత కాంగ్రెసు ఓడిపోయి, అజిత్ జోగి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వుండి, బిజెపికి అధికారం అప్పగించవలసిన తరుణంలో కొందరు బిజెపి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశాడు. ఆ పనిలో అమిత్ సాయపడ్డాడు. సిబిఐ కేసు బుక్ చేసింది. అయితే 'అవినీతి నిరోధక చట్టంలో ముఖ్యమంత్రి శిక్షార్హుడు అని వుంది కానీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురించి ఏమీ రాయలేదు, అందుకని విచారణ ఆపేయండి' అని న్యాయశాఖ సలహా యివ్వడంతో సిబిఐ విచారణ ఆపేసింది. దాంతో సహనిందితుడుగా వున్న అమిత్ బయటపడ్డాడు. కానీ ఈ లంచం వ్యవహారాన్ని బయటపెట్టిన వీరేంద్ర పాండే సిబిఐ కేసు మూసేయకూడదంటూ సిబిఐ కోర్టులో ఛాలెంజ్ చేశాడు. కేసు నడుస్తోంది. ఇంకో బిజెపి మంత్రి దిలీప్ సింగ్ జుడావ్ లంచం తీసుకుంటూండగా ఓ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. దానిలో అమిత్ కెమెరాలకు చిక్కాడు.
ఇవన్నీ అందరికీ ఎప్పణ్నుంచో తెలుసు. ఇప్పుడు కొత్తగా పత్రికలు కూపీ లాగిన సమాచారం ఏమిటంటే – శ్రీ అమిత్ జోగిగారు అవతార పురుషుడు. ఒకే జన్మలో మూడు చోట్ల, మూడు విభిన్న ప్రాంతాల్లో జన్మించారు. భారతీయ పౌరసత్వానికై 2001 లో అప్లయి చేస్తూ తను 1977, ఆగస్టు 7 న డాలస్‌లో పుట్టానని ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. ఇంకో ఏడాది పోయాక వాళ్ల తండ్రి ముఖ్యమంత్రిగా వుండగా ఛత్తీస్‌గఢ్‌లో పౌరసత్వం కోరుతూ దాఖలు చేసిన అఫిడవిట్లో 1978 ఆగస్టు 7 న బిలాస్పూర్లో పుట్టానని తెలియపరచాడు. దానికి అనుబంధంగా యిచ్చిన కాగితాల్లో తను బిలాస్పూర్ జిల్లాలోని పెండ్రా గ్రామంలో పుట్టినట్టు రాశాడు. జిల్లా కలక్టరుగారు యిలాటివి ఏమీ పట్టించుకోకుండా సర్టిఫికెట్టు దయచేయించారు. 2004లో బిజెపి ప్రభుత్వం నడుస్తూండగా అమిత్ తన షెడ్యూల్ ట్రైబ్ క్రింద వస్తానంటూ ఎస్టి సర్టిఫికెట్టుకై అప్లయి చేశాడు. దానిలో తను 1977 ఆగస్టు 7న పెండ్రా రోడ్‌లోని గౌరేలాలో పుట్టినట్టు అప్లికేషన్లో రాశాడు. దానికి మద్దతుగా యిచ్చిన డాక్యుమెంట్లలో యితను పెండ్రా రోడ్ తహసీల్‌లోని సాబహారా గ్రామంలో పుట్టినట్లు పట్వారీ యిచ్చిన సర్టిఫికెట్టును జోడించాడు.
అమిత్గారి అమితమైన జన్మస్థలాలు, జన్మదినాల మాట ఎలా వున్నా యీయనకు ఎస్టి హోదా యివ్వనక్కరలేదటూ షెడ్యూల్ ట్రైబ్స్ జాతీయ కమిషన్ అభ్యంతరపెట్టింది. ఒక వ్యక్తి కులంగురించి ఆచూకీ తీసే హక్కు కమిషన్‌కు లేదని అమిత్ తండ్రి అజిత్ జోగి ఆ కమిషన్‌పై మండిపడ్డాడు. వివాదం ముదిరి యితని కులం గురించి తేల్చమని సుప్రీం కోర్టు 2011లో విచారణకు ఆదేశించింది. విచారణ రిపోర్టు యింకా వెలుగు చూడలేదు. ఆర్డినెన్సును నాన్సెన్సు అన్న యువరాజావారికి అమిత్ నేరాలు కనబడటం లేదు పాపం.
– ఎమ్బీయస్ ప్రసాద్