ఇది చాలనట్టు, సోమవారం నాడు తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తుందంటూ తెలంగాణవాదులను ఊరించడం దేనికి? ఫైనల్‌గా ఉసూరుమనిపించడం దేనికి? వెర్రాడి పెళ్లాం వాడకంతా వదిన అన్నట్టు తెలుగువాడంటే అందరికీ లోకువై పోయింది. ఢిల్లీ నుండి ఏం వాగినా చెల్లిపోతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయనిపుణులను సంప్రదించినట్టుగానైనా చూపించుకోవాలా వద్దా? ఇవన్నీ రేపు చరిత్రలో మిగిలిపోయే ఘట్టాలు. ఇందిరా గాంధీ పంపిన ఎమర్జన్సీ బిల్లు గబగబా సంతకం పెట్టి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఎంతో అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. అప్పట్లో ఆబూ అబ్రహాం కార్టూన్ వేశాడు కూడా – 'ఇందిర నుండి ఏదో బిల్లు వస్తే ఫక్రుద్దీన్ బాత్ టబ్‌లో వుండగానే సంతకం పెట్టాడని!' ప్రణబ్‌కు అలాటి పేరు తెచ్చుకోవడం యిష్టం లేదు. పైగా సోనియా, ఇందిరా గాంధీ కాదు. నిన్నటి అసెంబ్లీ ఫలితాలు చూశాక సోనియా లెవెల్ మరింత పడిపోయింది. ఆవిడ మాటలు పట్టించుకోకపోయినా ఫర్వాలేదు, ఈవిడ ప్రభుత్వం యింకెన్నాళ్లుంటుంది, యీ భాగ్యానికి ఆవిడ చెప్పినట్టు ఆడనక్కరలేదు – అనుకోవచ్చాయన. దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చాక చూదాం అనేశాడాయన.
అసెంబ్లీకి పంపించినపుడు మూడు రోజులే టైమిస్తాడు, వారం రోజులే యిస్తాడు అంటూ ఆశపడేవాళ్లు కూడా కాస్త తమాయించుకోవాలి. డిసెంబరు 9 నాటికి సోనియా జన్మదిన కానుకగా తెలంగాణ అన్నది జరగలేదు. జనవరి 1 కల్లా తెలంగాణ బిల్లు పాస్ అవుతుంది అన్నది జరుగుతుందో లేదో తెలియదు. ఈ ఎన్నికల ఫలితాలు చూశాక బిజెపి వాళ్లు 'ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, వెంటనే రిజైన్ చేయాలి' అంటూ గొడవ చేస్తారు కొన్ని రోజులు, తథ్యం. ఎన్నాళ్లు పార్లమెంటు సాగుతుందో, ఆ లోపుగా బిల్లు చర్చకు వస్తుందో రాదో తెలియదు. వచ్చినా యీ ఎన్నికల ఫలితాల వూపులో వున్న బిజెపి వాళ్లు 'కాంగ్రెసు వాళ్లు తెలంగాణ యిచ్చినట్టు, వాళ్లకు మనం వంతపాడినట్టు ఎందుకు వుండాలి? మనమే హీరో పాత్ర వేద్దాం. మనం వచ్చాకే యిచ్చి తెలంగాణలో కాస్త బలం పుంజుకుందాం, తెలంగాణ యివ్వడం అనేదాన్ని ఎన్నికల అంశంగా చేసి లాభపడదాం' అని ఆలోచిస్తే ఏవేవో పుల్లలు వేయవచ్చు.
సోనియా, రాహుల్ ఆత్మపరిశీలన చేసుకుంటాం అని మాట యిచ్చారు. ఆ పరిశీలనలో విభజన సవ్యంగా చేయాలి అనే అంశం కూడా వుందో లేదో తెలియదు. ఇప్పుడు చేస్తున్న పద్ధతి యిరుప్రాంతాలలోనూ అసంతృప్తి కలిగిస్తోంది. ఇద్దరి మధ్య కలహం పెట్టి మధ్యలో కేంద్రం లాభపడదామని చూస్తోందని తెలంగాణవాదులు కూడా గ్రహించారు. విభజన చేసినపుడు గొడవలు లేకుండా సవ్యంగా చేసి యిస్తే ప్రత్యేకవాదులు సంతోషిస్తారు. ప్రస్తుతానికి తెలంగాణ వారి పని రైల్లో రిజర్వేషన్ దొరికినవాళ్లలా వుంది. వాళ్లు సుఖంగా ప్రయాణం చేయాలంటే జనరల్ బోగీల వాళ్లకు కూడా కాసిన్ని సౌకర్యాలివ్వాలి. ఓ నాలుగు బోగీలు ఎక్కువ వేయాలి. అవేమీ లేకపోతే రిజర్వేషన్ లేనివాళ్లు కూడా రిజర్వ్‌డ్ కంపార్టుమెంటులో ఎక్కేస్తారు. ఎక్కడమే కాదు, చాలా వయోలెంట్‌గా వుంటారు. దిగిపొమ్మంటే తీవ్రంగా పోట్లాడతారు. 'మేం మీలా సౌఖ్యం కోసం కాదు, మనుగడ కోసం పోరాడుతున్నాం. ఇక్కడ కూడా వుండనివ్వకపోతే ఎక్కడికి పోతాం' అంటూ కొట్లాడి బోగీని అక్రమంగా ఆక్రమిస్తారు.
అదేవిధంగా సీమాంధ్రులకు వారి ప్రాంతంలో సుఖంగా బతకడానికి ఏర్పాటు చేయకపోతే హైదరాబాదులో, తెలంగాణ యితర ప్రాంతాల్లో వారు సక్రమంగానో, అక్రమంగానో చొరబడి తెగింపుతో బతుకుతారు. ఇలాటి పరిస్థితి తెలంగాణ వారికీ తలనొప్పే. ఇలాటి విషయాలన్నీ సార్ట్ అవుట్ చేసి తమకు ప్రత్యేకరాష్ట్రం యిస్తేనే వాళ్లు ఆనందిస్తారు. 2009 డిసెంబరు 9 నుండి నాలుగేళ్లపాటు సోనియా ఏమీ చేయలేదు. కనీసం కృష్ణ కమిటీ రిపోర్టు చేతికి అందిన తర్వాతనైనా ఏదో ఒక ఆప్షన్ అమలు చేసేందుకు ప్రయత్నించాల్సింది. హీనపక్షం జులై 30 తర్వాతైనా ఏదో ఒక కసరత్తు చేసి వుండాల్సింది. ఏమీ చేయకుండా ఎవర్నీ అడక్కుండా, ఆంటోనీ నివేదిక పట్టించుకోకుండా, యివన్నీ టేబుల్ ఐటెమ్స్‌గా ప్రవేశపెడుతూ లీకులతో, పుకార్లతో వ్యవహారం నడుపుతూ గందరగోళంగా ప్రత్యేకరాష్ట్రం ఆవిర్భవిస్తే ఏం లాభం? బిల్లును తరచి చూసిన కొద్దీ కెసియార్‌కు ఎన్నో అభ్యంతరాలు కనబడుతున్నాయి. సవరణలు ప్రతిపాదిస్తామంటున్నారు. శాసనసభలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు నోరు విప్పకపోయినా తెరాస గొంతెత్తి మాట్లాడేట్లు వుంది.
ఈ పరిస్థితుల్లో సోనియాకు తెరాస జస్ట్ థ్యాంక్స్ చెప్తోంది తప్ప ఆకాశానికి ఎత్తేయడం లేదు. టి-కాంగ్రెసు వాళ్లు మాత్రమే దేవత, దేవత అంటున్నారు. ప్రజలు నమ్ముతారో లేదో తెలియదు. ఎవరైనా సరే, ఉదయించే సూర్యుడికే మొక్కుతారు, అస్తమించే సూర్యుణ్ని పట్టించుకోరు. ఈ ఘోరపరాజయం తర్వాత సోనియాను ఎదిరించినా ఫర్వాలేదని రాష్ట్ర కాంగ్రెసు నాయకులకు అనిపించడం ఖాయం. ప్రజలకు కాంగ్రెసుపై మోజు తీరిపోయిందని, మనం వేరే కొమ్మ వెతుక్కుంటే మంచిదనీ తోచవచ్చు. మునిగే ఓడను వదిలిపెట్టడానికే అందరూ ప్రయత్నిస్తారు. తెలంగాణ కాంగ్రెసు వాళ్లు కూడా తెలంగాణ ఏర్పాటు ముచ్చట జరిగిపోగానే తెరాసలో చేరవచ్చు. ఎందుకంటే తెలంగాణ యిచ్చినా ఆ క్రెడిట్ తెరాసకే దక్కుతుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్టు టీవీ చర్చలో ఒక విషయాన్ని ఎత్తి చూపించారు – ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం నాడు పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండలు వేస్తున్నాం కానీ, అసలు ఉమ్మడి రాష్ట్రం నుండి విడదీసి రాష్ట్రం యిచ్చిన జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యగార్ల విగ్రహాలకు దండలు వేయడం లేదు. అలాగే తెలంగాణకోసం 'ప్రాణత్యాగానికి సిద్ధపడిన' (ఇవాళంతా టి-ఛానెల్ సెలైన్‌తో వున్న కెసియార్ బొమ్మ చూపిస్తూనే వుంది – విజయ దివస్ పేరుతో) కెసియార్ పార్టీకి ఓట్లేస్తారు తప్ప యిచ్చింది కదాని సోనియాకు మొక్కరు. గతిలేక యిచ్చింది, యివ్వాలన్న బుద్ధి వుంటే ఎప్పుడో యిచ్చేది, తన కొడుకు కోసం యిచ్చింది అని ఎన్నికలలో కాంగ్రెసేతర పక్షాలు ప్రచారం చేయడం, దానికి ఎందరో కొందరు నమ్మడం ఖాయం. ఉత్తరభారతంలో కాంగ్రెసు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తూన్నపుడు వాటి ప్రభావం మన రాష్ట్రంపై బొత్తిగా లేకుండా పోవు.
ఈ ఆలోచనలన్నీ చుట్టుముట్టినపుడు సోనియాకు బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలని ఏం అనిపిస్తుంది? అందుకే మండేలా పేరు చెప్పి వేడుకలు రద్దు చేసింది. ఒకవేళ మండేలా చనిపోకుండా వుంటే ఏం చేసేదా అని ఆలోచించాను. బహుశా ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పేరు చెప్పేదేమో! 'నేను ఏడిపిస్తున్న తెలుగువాళ్లని నవ్వించిన మహానుభావుడాయన. ఆయన మృతికి సంతాపసూచకంగా సెలబ్రేషన్స్ కాన్సిల్' అనేదేమో! (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)