''ముత్యాలముగ్గు''లో రావు గోపాలరావు డైలాగు వుంది – ''చచ్చి ఋణం తీర్చుకున్నావు నారాయుడూ'' అని! అలాగే నెల్సన్ మండేలా సమయానికి చనిపోయి సోనియాకు సాయపడ్డారు.
ఇవాళ సోనియా పుట్టినరోజు. తెలంగాణ యిచ్చి, దేవతగా నీరాజనాలు అందుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో యీ పుట్టినరోజు ఘనంగా జరపడానికి సకల ఏర్పాట్లు జరిగాయి. శంకరరావుగారు గుడికి కూడా యివాళే పునాది వేస్తున్న యీ రోజునే ఆమె రాజకీయ సమాధి తయారైంది. నాలుగు రాష్ట్రాలలో చావుదెబ్బ తిని మొహం వేలాడేసింది. పుట్టినరోజు చేసుకోవాలనే మూడ్ ఎలా వుంటుంది? కార్యకర్తలు వచ్చి 'ఏదో హంగామా చేయకపోతే బాగుండదు మేడమ్, మీరే డీలా పడిపోయారని తెలిస్తే మనవాళ్లందరూ నీరసిస్తారు. మా పాటికి మేము నాలుగు టపాకాయలు కాలుస్తాం, వద్దనకండి' అని బతిమాలితే వద్దని చెప్పడం ఎలా? అని ఆలోచిస్తూ వుంటే సోనియాకు హఠాత్తుగా మండేలా గుర్తుకు వచ్చాడు. 'ఆయన పోయాడు కాబట్టి నా పుట్టినరోజు వేడుకలు రద్దు' అని ప్రకటించి హమ్మయ్య అనుకుంది. నిజానికి ఆయన పోయినది ఆదివారమో, సోమవారమో కాదు. అంత్యక్రియలు కూడా మంగళవారం! మధ్యలో సోమవారం నాడు యీ వేడుకలు రద్దు చేయడమేమిటి?
ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలలో మణిపూర్ గురించి ఎవరూ పట్టించుకోరు. ఈశాన్యరాష్ట్రం కావటం వలన దాని రాజకీయాలు పెద్దగా పట్టించుకోం. పైగా చిన్న రాష్ట్రం. కాంగ్రెసు సాధారణంగా గెలుస్తూ వుంటుంది. నిన్న ఫలితాలు వచ్చిన 4 రాష్ట్రాలే కీలకం ఎందుకంటే అవి హిందీ బెల్టులో వున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే వెంటనంటి వచ్చే పార్లమెంటు ఫలితాలను ప్రభావితం చేస్తాయని యిప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. 10% సీట్లు ఎక్కువ కూడా వస్తాయని సెఫాలజిస్టులు చెపుతున్నారు. కాంగ్రెసుకు తూర్పున బెంగాల్లో, బిహార్, ఒడిశాలలో పార్లమెంటు సీట్లు వచ్చే స్కోపు లేదు. పశ్చిమాన గుజరాత్లో లేదు. మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాలలో కొద్దో గొప్పో వుంది. దక్షిణాదిన కేరళలో వారి నేతృత్వంలో ప్రభుత్వం వున్నా దానిలో వారి వాటా ఎప్పుడూ తక్కువే. తమిళనాడులో బేస్ పోయి చాలాకాలమైంది. ఆంధ్రప్రదేశ్లో సంగతి చూడబోతే సర్వేలు చెప్పనక్కరలేకుండానే ఆంధ్రలో బాగా దెబ్బ తిందని, తెలంగాణలో తెరాస తర్వాతి స్థానమేననీ మనకు ఎలాగూ తెలుసు. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి ఓట్లను ఎడ్యూరప్ప చీల్చడం వలన నెగ్గిందన్న విషయం బిజెపి గ్రహించి ఎడ్యూరప్పను వెనక్కి తీసుకొస్తోందనీ వార్తలు వస్తున్నాయి. అది జరిగితే పార్లమెంటు ఎన్నికలలో ఫలితాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే. ఇలాటి పరిస్థితుల్లో హిందీ హార్ట్ ల్యాండ్లో ఎన్నికలు చాలా కీలకం అని పరిశీలకులందరికీ తెలుసు.
మరి ఫలితాలు వెలువడ్డాక చూస్తే మొత్తం సీట్లలో 70% బిజెపి గెలుచుకోగా, కాంగ్రెసు 20% గెలుచుకుంది. ఇద్దరి మధ్య 50% తేడా అంటే చాలా ఎక్కువ. మోదీ వ్యాఖ్యానించినట్లు నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెసు తెచ్చుకున్న అసెంబ్లీ ఓట్లు ఒక్క రాష్ట్రంలో బిజెపి తెచ్చుకున్నదానికి సరిపోలవు. పరాజయానికి కారణాలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వుంది కాంగ్రెస్. ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ-ఎస్టాబ్లిష్మెంట్) అందామంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో కనబడకుండా కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలోనే కనబడడమేమిటి? పైగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్లలో బిజెపి మూడోసారి ఎన్నికవడమేమిటి? అక్కడ అధికధరలు లేవా? యుపిఏ అవినీతి వలన కలిగే దుష్ఫలితాలు లేవా? ఉన్నాయి. అయినా వాటికై వాళ్లు స్థానిక ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. కేంద్ర కాంగ్రెసును, రాష్ట్ర కాంగ్రెసును బాధ్యులను చేశారు. కాంగ్రెసు పందికొక్కు కనబడిన చోటల్లా బిజెపి దుడ్డుకర్రతో బాదేశారు. ఢిల్లీలో కాంగ్రెసు, బిజెపిలకు ప్రత్యామ్నాయం కనబడగానే ఆమ్ ఆద్మీ దుడ్డుకర్ర వాడారు. ఇక్కడే బిజెపి కూడా పాఠాలు నేర్చుకోవాలి. రాజకీయాలకోసం ప్రజలను పట్టించుకోకుండా విధానాలు ఏర్పరచుకుంటే బిజెపిని కూడా ఉతికేస్తారు – మూడో ప్రత్యామ్నాయం కనబడితే! దక్షిణాది ఓటర్లకు అలాటి ప్రత్యామ్నాయాలు ప్రాంతీయ పార్టీల రూపంలో లభ్యమైనపుడు బిజెపికి కూడా గుండు సున్నే! తమిళనాట డిఎంకె, అన్నా డిఎంకెలు వున్నాయి, కర్ణాటకలో జెడిఎస్ వుంది. తెలుగునాట టిడిపి, వైకాపా, తెరాసలున్నాయి.
ఫలితాలు వచ్చాక సోనియా, రాహుల్ ప్రజలు తమ పట్ల కచ్చితంగా అసంతృప్తిగా వున్నారని అంగీకరించారు. ప్రజలే కాదు, వాళ్ల కార్యకర్తలూ , నాయకులూ అసంతృప్తిగా వున్నారని గ్రహిస్తే మంచిది. సోనియా, ఆమె సుపుత్రుడి వ్యవహారశైలి అలా ఏడ్చింది. మన రాష్ట్రం సంగతే చూడండి. విభజన విషయంలో సరైన సమయంలో, సరైన నిర్ణయం అంటూ జాగు చేసి చేసి యిన్నాళ్లకు యిలా నిర్ణయం యిన్నాళ్లకు తీసుకున్నారు. (ఇప్పుడు ప్రధాని అభ్యర్థిని 'సరైన' సమయంలో ప్రకటిస్తాం అని సోనియా చెప్పగానే వులిక్కి పడ్డాను. అది కూడా యింత 'సరైన' సమయమేనా? అని) ఎవరినీ సంప్రదించలేదు. అంతా సస్పెన్సు. బిల్లు స్వరూపం ఎలా వుంటుందో తెలంగాణ నాయకులకూ తెలియదు, తమ కిచ్చే ప్యాకేజి ఏమిటో సీమాంధ్ర నాయకులకూ తెలియదు. వెళ్లి ప్రజలకు ఏం చెప్పి మానసికంగా సిద్ధం చేయాలో రాష్ట్ర నాయకులకే కాదు, ఢిల్లీలో వున్న రాష్ట్రవ్యవహారాల యిన్చార్జిలకూ తెలియదు. కోర్ కమిటీ వాళ్లకూ తెలియదు. ఆంటోనీ కమిటీ సభ్యులకూ తెలియదు, మంత్రుల ముఠాకూ తెలియదు. 'సోనియా తెలంగాణ యిమ్మన్నారు, యివ్వాలి' అన్న మాట తప్ప వేరొకటి వారికి తెలియదు. అందువలన బిల్లు ఎలా రూపొందించాలి, ఎలా పాస్ చేయించాలి, ఎసెంబ్లీకి ఎన్నిసార్లు పంపాలి, యుటీయా మరోటా… యిలా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఎవడికి తోచింది వాడు చెప్పేయడం, తర్వాత నాలిక కరుచుకోవడం. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)