అఫయిర్స్‌ మీకు – ఆదాయం మాకు

నోయల్‌ బైడర్‌మన్‌ అనే వ్యక్తి పన్నెండేళ్ల క్రితం ఎవిడ్‌ లైఫ్‌ మీడియా అనే కంపెనీ పెట్టి దాని ద్వారా ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించి యిబ్బడిముబ్బడిగా సంపాదించేస్తున్నాడు. ఆ వెబ్‌సైట్‌ పేరు 'ఏష్లీ మాడిసన్‌'. పెళ్లయిన…

నోయల్‌ బైడర్‌మన్‌ అనే వ్యక్తి పన్నెండేళ్ల క్రితం ఎవిడ్‌ లైఫ్‌ మీడియా అనే కంపెనీ పెట్టి దాని ద్వారా ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించి యిబ్బడిముబ్బడిగా సంపాదించేస్తున్నాడు. ఆ వెబ్‌సైట్‌ పేరు 'ఏష్లీ మాడిసన్‌'. పెళ్లయిన వ్యక్తులు ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటే ఆ వెబ్‌సైట్‌ సహకరిస్తుంది. దాని నినాదం ''లైఫ్‌ ఈజ్‌ షార్ట్‌. హేవ్‌ ఏన్‌ ఎఫైర్‌.''  ఆ వెబ్‌సైట్‌ చూపించే కమ్మర్షియల్‌లో యిద్దరు ఘాటైన శృంగారంలో మునిగి వుంటారు. కింద కాప్షన్‌ వస్తుంది – 'ఇద్దరూ పెళ్లయినవారే.. విడివిడిగా' అని. 

ఈ వెబ్‌సైట్‌లో చందా కట్టే పద్ధతి లేదు. 49 డాలర్లు పెడితే 100 క్రెడిట్‌ పాయింట్లు యిస్తారు. దాంతో 20 మంది మహిళలకు ఈమెయిల్స్‌ పంపవచ్చు. ఈ ఫీజు మగవాళ్లకే. ఆడవాళ్లకు లేదు. వాళ్లు ఫ్రీగా చాటింగ్‌ చేయవచ్చు – వివాహిత మహిళలను ఆకర్షించడమే వీరి ధ్యేయం కాబట్టి! సొంతవూళ్లో వుండగా ఎఫయిర్‌ పెట్టుకోవడం కంటె టూరు చేస్తూ పరాయివూళ్లో వున్నవారిని కలవడం సులభం. టూర్లు చేస్తున్న మగ/ఆడ వారి సమాచారం కావాలంటే 20 డాలర్లు అదనంగా కట్టాలి. 
'ప్రయారిటీ మ్యాన్‌' అనే స్కీములో డబ్బు కడితే ఎవరైనా మహిళ కంప్యూటర్‌ తెరవగానే అతని ప్రొఫైల్‌ కనబడుతుంది. బ్లాక్‌ బుక్‌ అనే యేప్‌ తీసుకుంటే అసలు ఫోన్‌ నెంబరు కాకుండా వేరే ఫోన్‌ నెంబరు కనబడుతుంది. దాని ద్వారా డీలింగ్స్‌ చేయవచ్చు. ఏవైనా బహుమతులు కొనాలన్నా వాళ్ల పేరు రాకుండా యింకో బినామీ పేరు మీద బిల్లు వస్తుంది. ఎఫయిర్‌ ముగిసిపోయిన తర్వాత జాడలు విడవకూడదనుకునేవారు 19 డాలర్లు కడితే ప్రొఫైల్‌, మెసేజ్‌లు తుడిచివేయబడతాయి. ఎఫయిర్‌ గ్యారంటీ ప్యాకేజీ అని 249 డాలర్ల స్కీము వుంది. మూణ్నెళ్లలో ఎవరూ చిక్కకపోతే డబ్బు వాపసు యిస్తారు. 

ఇదెక్కడి దిక్కుమాలిన వ్యాపారం అని అడిగితే నోయల్‌ ''భార్యకు లేదా భర్తకు తెలియకుండా అఫయిర్‌ పెట్టుకోవాలనే పాడు బుద్ధి వాళ్లకు లేకపోతే మేం ఎంత చెప్పినా వినరు. వాళ్ల జీవితం నిస్సారంగా నడుస్తోంది కాబట్టే వాళ్లు యీ మార్గం పట్టారు. వాళ్లకు మేం దారి చూపిస్తున్నామంతే. నా మట్టుకు నేను వివాహితుణ్ని. పెళ్లయి పదేళ్లగా కలిసే వున్నాం. మాకు ఇద్దరు పిల్లలున్నారు. నాకు ఏ అఫయిర్లూ లేవు. మా ఆవిడకు వుందని తెలిస్తే చాలా బాధపడతాను.'' అంటాడు. కానీ యితని వ్యాపారం చూసి చాలామంది అసహ్యించుకున్నారు. 2009లో అతను వెంచర్‌ కాపిటల్‌ కోసం ప్రయత్నిస్తే గోల్డెన్‌ ట్రీ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ అనే కంపెనీ సారీ అంది. చికాగోలో వుండే బిఎమ్‌ఓ హారిస్‌ బ్యాంక్‌ ''మేం పాటించే విలువలకు, మీ కంపెనీకి సరిపోదు'' అని చెప్పింది. 2010లో జిఎంపి కాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ కెనడాలో ఐపిఓకు అన్ని ఏర్పాట్లు చేయబోయింది. అంతలో అందరూ తిట్టిపోయడంతో వెనక్కి తగ్గింది.  ''మీది పాపపు వ్యాపారం. మీ కంపెనీ షేర్లలో మేం పెట్టుబడి పెడితే యిలాటి కంపెనీలో ఎందుకు పెట్టారని అనేక ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు మమ్మల్ని నిలదీస్తాయి'' అంటూ అనేక ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు యితన్ని దూరంగా పెట్టాయి. 

కానీ యిదంతా పాత కథ. ఈ కంపెనీకి గత ఏడాది 90 మిలియన్‌ డాలర్ల ఆదాయం, 30 మిలియన్‌ డాలర్ల లాభం రావడంతో కథ మారిపోయింది. గత ఐదేళ్లలో అమెరికాలో సభ్యుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి యిప్పుడు 1.27 కోట్లమంది అయ్యారు. 30 యితర దేశాలలో (జపాన్‌, హాంగ్‌కాంగ్‌లో ఎక్కువ) 83 లక్షలమంది సభ్యులయ్యారు. ఈ ఆదాయం చూసి అనేక పెట్టుబడి సంస్థలు అప్పులు యిస్తామని వెంటపడుతున్నాయి. న్యూయార్క్‌లో వున్న ఫోర్ట్రెస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనే 54 బిలియన్‌ డాలర్ల హెడ్జ్‌ ఫండ్‌ కంపెనీ యితని కంపెనీకి 50 మిలియన్‌ డాలర్ల ఋణం యిచ్చిందని వార్తలు వచ్చాయి. మరో న్యూయార్క్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బాంక్‌ కలిసి ఐపిఓకు వెళదామని ఆఫర్‌ యిచ్చిందట. బ్రెజిల్‌లో వున్న మరో బ్యాంకు మీ కంపెనీలో వాటా తీసుకుంటామంటూ ముందుకు వచ్చిందట. ఇదంతా చూస్తే నైతిక విలువల కంటె డబ్బుకే ఎక్కువ విలువ యిస్తున్నారా? అన్న అనుమానం వస్తుంది. ఇటీవల షికాగో యూనివర్శిటీ జరిపిన అధ్యయనంలో 21% మంది మగవాళ్లు, 15% మంది ఆడవాళ్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఒప్పుకున్నారు. ఇలాటి సమాజంలో యిటువంటి వెబ్‌సైట్‌కు డిమాండ్‌ రావడంలో ఆశ్చర్యం ఏముంది?

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌