రాహుల్ గాంధీని షెహజాదా (యువరాజు) గా పిలవడంపై అభ్యంతరం చెప్పిన కాంగ్రెసువాళ్లకు సమాధానం చెపుతూ మోదీ 'వారసత్వ రాజకీయం ద్వారా వెలుగులోకి వచ్చాడు కాబట్టి అలా అనవలసి వస్తోంది' అని వివరణ యిచ్చారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తే షెహజాదాలు కాని వారు చాలా తక్కువమంది వున్నట్టు తోస్తోంది. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో చూడబోతే – మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ (25) కితం ఏడాది రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి నియోజకవర్గంలో ప్రజల మధ్యకు వచ్చాడు. డూన్ స్కూలులో, ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో చదివి, కన్సల్టెంటుగా పనిచేసి యూత్ కాంగ్రెసుద్వారా వచ్చాడు. ఇప్పుడు టిక్కెట్టు ఆశిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌ను చాలాకాలం పాలించిన అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. కేంద్రమంత్రిగా పని చేసిన మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య యిప్పుడు కేంద్రమంత్రి. అతను యీ మధ్యే తన 16 ఏళ్ల కొడుకు మహానార్యామాన్ను ఓటర్లకు పరిచయం చేశాడు. కేంద్రమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ యిన్నాళ్లూ వ్యాపారం చూసుకుంటూ తండ్రి నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని వున్నాడు. ఈ సారి ఎసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్టు ఆశిస్తున్నాడు. మాజీ ఉపముఖ్యమంత్రి సుభాష్ యాదవ్ తన కుమారుడు అరుణ్‌ను ఎంపీగా చేసి మన్మోహన్ మంత్రివర్గంలో సీటు యిప్పించాడు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యకక్షురాలిగా చేసి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా వున్న ఊర్మిళా సింగ్ తన కుమారుడు ధర్మేంద్రను రాజకీయాల్లోకి తెద్దామని చూస్తోంది.
ఇది చూసి కాంగ్రెసులో మాత్రమే వారసత్వం వుందని అనుకోకూడదు. మోదీ పార్టీ ఐన బిజెపిలో కూడా యిదే నడుస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజెపి నాయకుడు మదన్‌లాల్ ఖురానా కుమారుడు విమల్ అతని స్థానంలో వద్దామనుకుంటున్నాడు. ఇంకో బిజెపి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ కూడా అదే పనిలో వున్నాడు. మరో బిజెపి నాయకుడు ఓపి బబ్బర్ తన కొడుకు రాజీవ్‌కు తిలక్ నగర్ నుండి టిక్కెట్టు యిప్పిద్దామని చూస్తున్నాడు. రాజస్థాన్‌లో రాష్ట్ర బిజెపి మాజీ అధ్యకక్షుడు ఘనశ్యామ్ తివారి తన కొడుకు అశీశ్ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తుండగా బిజెపి మాజీ కేంద్రమంత్రి జశ్వంత్ సింగ్ కొడుకు మానవేంద్ర జైసల్మేర్ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.
తమాషా ఏమిటంటే వీళ్లందరూ బాగా చదువుకున్నవారే. ఏమిటీ రాచరికపు పోకడలు అని అడిగితే వాళ్లు చెప్పే సమాధానాలు యిలా వుంటున్నాయి – ''..రాజకీయాల్లో నాకు అభిరుచి వుంది కాబట్టి వస్తున్నాను. మా నాన్నగారి బలవంతం లేదు… నాకు ప్రజాసేవ అంటే ఆసక్తి. యూత్ ఆర్గనైజేషన్‌లో సభ్యుణ్ని… నా తండ్రి రాజకీయాల్లో వుండడం చేత నేను రాజకీయాల్లోకి రాకూడదనడం దుర్మార్గం.. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి యిప్పుడే వస్తున్నాను కానీ ఎప్పణ్నుంచో మా నాన్నగారి ఎన్నికల ప్రచారానికి వెన్నెముకగా వుండేవాణ్ని…'' ఈ వరస చూస్తే వారసత్వ రాజకీయాలు మనల్ని వదలవని ఖచ్చితంగా చెప్పవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్