మహిళా మంత్రుల ధైర్యం ఇలా బయటపడిందా..?

ఏపీలో వైద్య శాఖ మంత్రిగా విడదల రజిని, హోం మంత్రిగా తానేటి వనిత చార్జ్ తీసుకున్న తర్వాత వరుస ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రి ఘటన, తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన వైద్య మంత్రికి…

ఏపీలో వైద్య శాఖ మంత్రిగా విడదల రజిని, హోం మంత్రిగా తానేటి వనిత చార్జ్ తీసుకున్న తర్వాత వరుస ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రి ఘటన, తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన వైద్య మంత్రికి తలనొప్పి తేగా, మహిళలపై జరిగిన అఘాయిత్యాలు హోం మంత్రి వనితకు ఇబ్బందిగా మారాయి. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు ఎల్లో మీడియా అభాండాలు.. వీటన్నిటినీ ఇద్దరు మంత్రులు సమర్థంగా ఎదుర్కొన్నారు. పదవి చేపట్టగానే సమస్యలొచ్చినా ఎదిరించి నిలబడ్డారు.

వైద్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో వైద్య సదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రు కూడా పలు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగింది. ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే నిఘా నిద్రపోతోందా అనే విమర్శలు వినిపించాయి.

కట్ చేస్తే రుయా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన కూడా ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. అయితే వైద్య శాఖ మంత్రి విడదల రజిని ఎక్కడా భయపడలేదు, విపక్షాల మాటల తూటాలకు వెరవలేదు, వైరి వర్గం మీడియా రెచ్చగొడుతున్నా సంయమనం పాటించారు. ఆస్పత్రుల ఘటనల్లో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎక్కడా అలసత్వంతో లేదని, కేవలం వ్యక్తుల వల్ల జరిగిన తప్పిదాలను ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని ఆమె విమర్శలను తిప్పికొట్టారు.

ఇక హోంమంత్రిగా తానేటి వనిత కూడా తొలి రోజు నుంచే సవాళ్లు ఎదుర్కొన్నారు. విజయవాడలో సీఎంఓ ఆఫీస్ ముట్టడికి ఉద్యోగులు తరలిరావడం గందరగోళానికి దారితీసింది. అయితే వారిని అడ్డుకునే విషయంలో ఈసారి పోలీసులు సక్సెస్ అయ్యారు. లాఠీ ఝళిపించకుండానే గొడవ సద్దుమణిగింది. ఒంగోలులో సీఎం జగన్ కాన్వాయ్ లో వాహనం కోసం తిరుమల యాత్రికుల్ని ఇబ్బంది పెట్టిన ఘటన కూడా పోలీసులపై విమర్శలకు కారణమైంది. అయితే అక్కడ ఆర్టీఓ అత్యుత్సాహం వల్లే అదంతా జరిగిందని తేలింది. మొత్తం డిపార్ట్ మెంట్ ని ఇరుకున పెట్టాలనుకున్న వైరివర్గం పన్నాగాలు సఫలం కాలేదు.

ఇక విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి అఘాయిత్యం విషయంలోనూ పోలీసులు అలసత్వంతో వ్యవహరించారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అక్కడ పోలీసుల సత్వర స్పందన వల్లే బాధితురాలిని వెంటనే గుర్తించగలిగారనే వాదన కూడా వినిపించింది. మొత్తానికి నిందితుల్ని అరెస్ట్ చేశారు, బాధితురాలికి న్యాయం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో వివాహిత హత్య కేసులో కూడా పోలీసులనే టార్గెట్ చేయాలని ప్రతిపక్షం చూసినా వీలు కాలేదు. నిందితులిద్దర్నీ వెంటనే అరెస్ట్ చేయడంతో అక్కడ కూడా గొడవ సద్దుమణిగింది.

మహిళా మంత్రులిద్దరూ సమస్యలు వచ్చినా కూడా సంయమనంగా ఉన్నారు. ఎక్కడా భయపడలేదు, మాట జారలేదు. అధికారులు ఒక రకంగా, మంత్రులు మరో రకంగా స్పందించిన దాఖలాలు కూడా లేవు. తమ తమ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. తమ పనితీరు నిరూపించుకున్నారు.