ప్రియమైన కేటీఆర్ గారికి,
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా అప్రకటిత అధికార వైభవం, గౌరవం అనుభవిస్తున్నమీకు అభినందనలు. రాజకీయాల్లో తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు అని మొండి పట్టుదలకు వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉంటారు. తమ వల్లనే పొరబాటు జరిగిందని తెలిసినా కూడా.. దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించేవాళ్లే ఎక్కువ. అలాంటిది మీరు పొరబాటుగా ఏదో ఆవేశంలో, మిమ్మల్ని, మీ ఆలోచనల్ని పెడతోవ పట్టించే ‘మిత్రుల’ మాట విని అసందర్భ, అసమంజస, అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కానీ చాలా హుందాగా వ్యవహరించి ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఈ మాత్రం హుందాతనం పాటించినందుకు కూడా అభినందనలు. కాబట్టి ఆ వ్యాఖ్యల జోలికి వెళ్లకూడదు. కానీ.. ఈ నేపథ్యంలో ఒక విషయం మీ దృష్టికి తీసుకురావడం అవసరం అనుకుంటున్నాను.
మీరు హేళనాపూర్వకరమైన వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ గురించి కాదనే అనుకుందాం. అసలు ఏపీకి సంబంధం లేదనే అనుకుందాం. మీకు రాజకీయ ప్రయోజనం లేని ఒక పొరుగురాష్ట్రం గురించి ఆ రకంగా చులకనగా మాట్లాడడానికి మీకు మనసెలా ఒప్పింది? మీ మిత్రులు మిమ్మల్ని అంతగా ప్రభావితం చేశారా? అనే అనుమానం కలుగుతోంది. కాదు కాదు.. ఇంతటి రాజకీయ సునిశిత పరిజ్ఞానంతో తెలంగాణ ను శాసిస్తున్న మీరు.. అలాంటి మిత్రుల మాటలకు ప్రభావితం అవుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
ఒక రాష్ట్రంలో మీకు రాజకీయ ప్రయోజనాలు ఉంటే.. అక్కడి పార్టీల గురించి ఉన్నవీ లేనివీ మాట్లాడినా ఎవరూ తప్పు పట్టరు. అక్కడి పాలనను ఎన్ని రకాలుగా నిందించినా ఎవరూ పట్టించుకోరు? తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఒక పార్టీ నాయకుడు మీరు! మీ పొరుగున ఏపీ కాకుండా.. ఏదో పేద రాష్ట్రం ఉన్నదే అనుకుందాం. ఎలాంటి వనరులు, ఆర్థిక సంపద లేని దారిద్ర్యం తాండవిస్తున్న రాష్ట్రమే ఉన్నదని అనుకుందాం.
అలాంటి పరిస్థితుల్లో .. మీరు మీ రాష్ట్రానికి ఆహ్వానించదలచుకున్న పెట్టుబడిదారుల వద్దకు వెళ్లినప్పుడు ఏం చేస్తారు? మీ రాష్ట్రానికి వస్తే ఎంతగా వసతులు కల్పిస్తారో.. వారికి ఎడ్వాంటేజెస్ ఉంటాయో చెప్పడం బాగుంటుంది. పనిలో పనిగా.. మీ పొరుగున్న ఉన్న పేద రాష్ట్రాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తే, వారి పేదరికాన్ని పరిహసిస్తే అది ఎంత ఘోరంగా ఉంటుంది? విజ్ఞులైన మీరే ఆలోచించాలి.
ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ అన్నది ప్రస్తుత తెలంగాణలాగా సంపదలతో తులతూగుతున్న రాష్ట్రం కాదు. సహజ వనరులు ఉన్న రాష్ట్రమే అయినా.. అవి అన్నీ ఇంకా పూర్తిగా సంపదగా మార్పు చెందే పరిస్థితికి దూరంగా కునారిల్లుతున్న రాష్ట్రంగానే మనం చూడాలి. అందుకు గల అనేక కారణాలలో, మీ భావోద్వేగాలను రెచ్చగొట్టేదే అయినప్పటికీ, రాష్ట్ర విభజన కూడా ఒక ప్రధాన కారణం. ఆ తర్వాత తొలిపాలకుల అసమర్థ పాలన విధానాలు రాష్ట్రాన్ని ఎంతగా అయోమయంలోకి నెట్టేసాయో అందరికీ తెలుసు. అలాంటి దుర్భర స్థితినుంచి స్వయం చాలితంగా నిలదొక్కుకోడానికి ఏపీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. మీలాంటి వారు చులకనగా హేళనగా మాట్లాడితే ఎలా?
ఆచితూచి, పద్ధతి ప్రకారం మాట్లాడతారని మీకు పేరుంది. అలాంటి మీరే.. అదుపు తప్పి.. అనుచితంగా పొరుగు రాష్ట్రం గురించి చులకనగా మాట్లాడుతూ.. తెలంగాణతో మానసికంగా, సామాజికంగా, ఆత్మికంగా సోదరబంధాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను నొప్పించారు. మీరు అన్న మాటలు కేవలం జగన్ మోహన్ రెడ్డి అభిమానుల్ని మాత్రమే కాదు, ఏపీలోని ప్రజలందరినీ, తెలంగాణలో స్థిరపడిన ఆ ప్రాంతపు వారిని కూడా బాధిస్తాయి.
మీరు ఆ మాటల గురించి నొచ్చుకుంటూ ట్వీట్ కూడా పెట్టారు. కాబట్టి ఈ లేఖ ఆ మాటల పట్ల ఖండన కాదు. కానీ.. అలాంటి మాటలు మీ నోటమ్మట వచ్చలా మిమ్మల్ని ప్రభావితం చేసిన మిత్రుల ఉచ్చులోంచి బయటకు రావాలనే విన్నపంతో మీకు రాస్తున్న లేఖ మాత్రమే.
.. సామాన్యుడు