ఆచార్యకు గుణపాఠం.. టాలీవుడ్ కు పెద్ద పాఠం

టికెట్ రేట్ల పెంపు విషయంలో 'మెగా' చొరవ గురించి అందరికీ తెలిసిందే. అటు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి రేట్లు పెరిగేలా చేశారు. ఇటు ఏపీ ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపారు. చిరంజీవి తగ్గారని,…

టికెట్ రేట్ల పెంపు విషయంలో 'మెగా' చొరవ గురించి అందరికీ తెలిసిందే. అటు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి రేట్లు పెరిగేలా చేశారు. ఇటు ఏపీ ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపారు. చిరంజీవి తగ్గారని, జగన్ ముందు చేతులు జోడించారని చాలా ఎత్తిపొడుపు మాటలు వచ్చాయి. కానీ వాటన్నిటినీ భరించారు చిరంజీవి. 

ఇండస్ట్రీ కోసం తాను తగ్గాననిపించుకున్నా చివరకు నెగ్గారు. ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచారు. కానీ ఈ పెంపు వల్ల ఒరిగిందేంటి..? సినిమా టికెట్ రేట్లు పెరిగితే ఇండస్ట్రీకి, నిర్మాతకు లాభమా, నష్టమా అనే తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. తొలి దెబ్బ ఆచార్యపైనే పడింది.

టికెట్ రేట్లు పెరిగితే ఏమవుతుంది..?

ఆచార్య సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీనికితోడు టికెట్ రేట్ల పెంపు ఒకటి. దీంతో సినిమా చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించలేదు. ఆ ప్రభావం ఈరోజు స్పష్టంగా కనిపించింది. చాలా చోట్ల బుక్ చేసిన టికెట్లు సైతం కాన్సిల్ చేసుకుంటున్నారు.

టికెట్ రేటు తక్కువగా ఉంటే 'ఓసారి చూద్దాంలే' అనుకునే బ్యాచ్ కూడా థియేటర్లకు వచ్చేది. ఇప్పుడు ఆ టైప్ ఆడియన్స్ ని ఆచార్య కోల్పోయింది. చిక్కుల్లో పడింది. 'కచ్చితంగా చూడాల్సిందే' అనే బ్యాచ్ మాత్రమే వస్తోంది. ఇలాంటి వాళ్లంతా మొదటి 3 రోజులకే పరిమితమనే విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2.. సినిమాల విషయంలో రేట్ల పెంపు పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆర్ఆర్ఆర్ ని ప్రేక్షకులు ఎగబడి చూశారు. కేజీఎఫ్-2కు ఓ మోస్తరుగా మాత్రమే పెంచడం, మొదటి ఆటకే హిట్ టాక్ రావడంతో.. ఈ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆచార్య విషయానికొచ్చేసరికి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు టికెట్ పై రూ.30 అదనంగా తీసుకున్నారు. ఏపీలో మొదటి 10 రోజుల పాటు టికెట్ పై రూ.50 పెంచారు.

ఈ టాక్ తో సాధారణ టికెట్ రేట్లు ఉంటే..?

ఏపీలో ఈ పెంపు ప్రభావం సినిమా రిజల్ట్ పై పడింది. సినిమా బాగుంటే, టికెట్ తెగితే, అసలు రేటుపై అదనంగా రూ.50 వచ్చి ఉండేది. కానీ సినిమా టాక్ తో ఈరోజు పెద్దగా టికెట్లు తెగలేదు. దీంతో అదనంగా వచ్చే 50 రూపాయల సంగతి పక్కనపెడితే, నికరంగా రావాల్సిన టికెట్ డబ్బులు కూడా రాలేదు. పెంచిన టికెట్ రేట్లతో ఆచార్యను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా మొగ్గుచూపడం లేదు. ఆ తర్వాత ఎలాగూ ఆసక్తి చచ్చిపోతుంది కాబట్టి ఫలితం లేదు.

అదే టికెట్ రేటు సాధారణంగా ఉంటే మూవీ బాగోలేకపోయినా కనీసం మెగాస్టార్ సినిమా కాబట్టి ఓసారి చూద్దాం అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడా సింపతీ కోల్పోయారు చిరంజీవి. ఒక రకంగా టికెట్ రేట్ల విషయంలో చిరంజీవి చూపిన చొరవే ఇప్పుడాయనకు ఇబ్బందిగా మారింది.

టికెట్ రేటు ఎక్కువ ఉంటే నిర్మాతలకు ఎక్కువ లాభం అనుకోవడం వట్టి అపోహ అని ఆచార్యతో తేలిపోయింది. ఏ వస్తువు రేటైనా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఫలితం ఉంటుంది. అదే పనిగా అవకాశం ఉంది కదా అని రేట్లు పెంచితే మొదటికే ముప్పు. ఈ విషయం టాలీవుడ్ కి ఆచార్య ద్వారా చాలా తొందరగా బోధపడింది. అలా ఆచార్య తను గుణపాఠం నేర్చుకొని, టాలీవుడ్ కు ఓ పాఠం చెప్పాడు.