ఏపీలో రోడ్లు బాగాలేవని, నీళ్లు-విద్యుత్ లేవని తనతో ఓ ఆంధ్రా ఫ్రెండ్ చెప్పాడంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అదే గడ్డపై నుంచి సూపర్ కౌంటర్ పడింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో పాలన చక్కగా లేనప్పుడు పొరుగు రాష్ట్రంపై పడి ఏడవడం ఎంత వరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ పాలన ఏం బాగుందని, పక్క రాష్ట్రాన్ని కేటీఆర్ విమర్శిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బహుశా.. తెలంగాణలో అరాచకాల్ని చెప్పడానికి కేటీఆర్ కు తెలంగాణ ఫ్రెండ్స్ లేరేమోనంటూ చురకలంటించారు.
“కేటీఆర్ కు తెలంగాణ ఫ్రెండ్స్ లేరు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు కేటీఆర్ కు కనిపించవు. ఎందుకంటే తెలంగాణలో ఫ్రెండ్స్ లేరు. తెలంగాణలో కొనసాగుతున్న ఆత్మహత్యలు కేటీఆర్ కు కనిపించవు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు ఫ్రెండ్స్ లేరు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఎంత గోస పడుతున్నారో కేటీఆర్ కు తెలియదు. ఎందుకంటే, తెలంగాణలో ఆయనకు ఫ్రెండ్స్ లేరు. తెలంగాణలో కేటీఆర్ కు ఫ్రెండ్స్ ఉంటే, రైతులు అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం అర్థమయ్యేది. ఉపాధి హామీ పథకం కింద పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వడం లేదని చెప్పడానికి తెలంగాణలో కేటీఆర్ కు ఫ్రెండ్స్ లేరు.”
ఇలా కేటీఆర్ వ్యాఖ్యలపై తిరుగులేని పంచ్ వేశారు షర్మిల. ప్రజాప్రస్థానంలో భాగంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్విరామంగా పర్యటిస్తున్న షర్మిల.. కేటీఆర్ వ్యాఖ్యలపై తనదైన సెటైర్లు వేశారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన కుటుంబాలు, ఉద్యమంలో పాల్గొన్న వారు కేటీఆర్ కు ఫ్రెండ్స్ కాదన్నారు.
సొంత రాష్ట్రంలో పాలన చేతకాని కేసీఆర్-కేటీఆర్.. తెలంగాణలో చేసిన దరిద్రం చాలదన్నట్టు.. ఏం పీకడానికి ఢిల్లీకి వెళ్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు షర్మిల. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన షర్మిల, పరోక్షంగా జగన్ ను సమర్షిస్తూనే, ప్రత్యక్షంగా కేసీఆర్-కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.